డైలీ సీరియల్

విలువల లోగిలి-66

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశీలో అస్థికలు కలపటానికి ముందు నలుగురూ కలిసి వెళదామనుకున్నారు. కానీ ఈ పది రోజులుగా విశ్వ, చందూలు దగ్గిరగానే ఉండి ఎంత దూరంలో వున్నారో గమనించి వాళ్ళిద్దరినే పంపటం సమంజసంగా ఉంటుందని భావించారు అమృత, నరేంద్రనాథ్‌లు.
అనుకొన్నట్లుగానే సూర్యచంద్ర, విశ్వ కాశీలో అస్థికలు శాస్త్రోక్తంగా నిమజ్జనం చేశారు. అన్నపూర్ణాదేవిని దర్శించుకున్నారు.
‘విశ్వా! కాశీ ఒక్కసారి వస్తే మళ్లీ రావాలనిపిస్తుందని విన్నాను. ఇపుడు చూస్తున్నాను. ఇక్కడ ప్రశాంతతకోసం ఎన్నిసార్లయినా రావచ్చు అనిపిస్తోంది’ అంది అమ్మ కాశీకి వచ్చినపుడు.
ఎక్కడకు వెళ్లినా ఏది చూసినా అమ్మ జ్ఞాపకాలే. అమ్మ ప్రభావం తన మీద అంత ఉంది. ఇది ఆనందాన్ని కలిగించే విషయమే. భౌతికంగా ఆమె తన దగ్గిర లేకున్నా చెంత ఉన్న భావన కలుగుతోంది.
అలహాబాదు, ప్రయాగ, గయ చూసుకుని తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో అక్కడొక బామ్మ పరిచయమయింది.
‘‘బామ్మా! మీకు కాశీ అంటే అంత ఇష్టమా? ఇక్కడే ఉండిపోయారు?’’ అని అడిగింది విశ్వ.
‘‘నా కొడుకు నన్ను ఇక్కడ విడిచిపెట్టి ఇప్పుడే వస్తాను అని వెళ్లిపోయినవాడు మళ్లీ రాలేదు. భాష రాదు, ఇంటికి వెళ్లటానికి డబ్బు లేదు. ఒకవేళ ఉన్నా కాదని వదిలేసిన కొడుకు దగ్గర వెళ్ళేకంటే ఇక్కడే తిండీ తిప్పలు దొరక్కపోయి చనిపోయినా ఫర్వాలేదు అనుకున్నాను. అందుకే తిరిగి వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఎంతైనా మనకు ఆత్మగౌరవం ఎక్కువ కదమ్మా!’’’ అందావిడ నిరాశక్తంగా.
‘‘ఔరా! ఏం కొడుకులు? కని పెంచిన తల్లినే కసాయివాడికన్నా హీనంగా వదిలేసి వెళ్లిపోతారా?
కసాయివాడు కూడా శవం తనకు సంబంధించింది కాకపోయినా కట్టె సరిగ్గా కాలకపోతే వారి ఆత్మకేమవుతుందోనని మొత్తం శవం తగలబడేవరకూ అక్కడే ఉంటాడట.
బ్రతికున్నంతవరకూ ఆమె పోషణ, ప్రేమ విషయంలో ఏ లోటూ రానివ్వకూడదని ఈ కొడుకులు ఎప్పుడు తెలుసుకుంటారు?
‘‘వస్తానమ్మా!’’ అందావిడ.
‘‘బామ్మా! ఇంక మీరెక్కడికీ వెళ్ళద్దు. మిమ్మల్ని మా వైజాగ్ తీసుకువెళ్తాం. మా ఇంట్లోనే ఉందురుగానీ. మీకు ఓ కొడుకు, కోడలు, మనవడు, మనవరాలుని ఇస్తాను. నాతో వస్తాంటే’’ అన్న విశ్వతో-
‘‘చాలా సంతోషం తల్లీ. తప్పకుండా వస్తాను. ఈ తల్లిని ఆదరించే మనసున్నవాళ్ళున్నారని, నా వదిలేసిన కొడుకుకు బుద్ధిచెప్పటానికయినా మీతో వస్తాను. జీవితమంతా వాడికోసం శ్రమపడ్డాం, ఇపుడు వాడు కార్లలో తిరుగుతూ కన్నతల్లికి చెప్పులు కూడా లేని పరిస్థితిలోకి తీసుకువచ్చాడు. నా కథ కొందరికయినా కనువిప్పు తేవాలి’’ అంది ఆవేశంగా.
లావాలా ఉప్పొంగుతున్న ఆక్రోశం ఆవిడలో అలా మాట్లాడిస్తోంది. కొందరయితే ఆ స్థితిలో కూడా పెదవి విప్పరు. తమంతట తామే ఇలా వచ్చామని చెప్పి ఇంకా అలాంటి కొడుకుల కోసం తాపత్రయపడి అదే తల్లి ప్రేమ అంటారు. తల్లులకేనా ప్రేమ? పిల్లలకు అక్కర్లేదా?
ఏది ఏమైనా గానీ ప్రారంభోత్సవానికి ముందే ఒకరితో తన సేవా కార్యక్రమం మొదలవటం శుభసూచకంగా అనిపించింది.
అలా ఆ బామ్మ వారింట చోటు సంపాదించుకుంది.
వారి మనసుల్లో కూడా!
ఇపుడు ఎవరైనా వారింటికి వెళితే వాళ్ళ బామ్మే అనుకుంటారు కానీ పరాయి మనిషి అని ఎవరూ గుర్తించరు.
అదంతా వారి గొప్పతనం కాదు. వారి మనసుల గొప్పతనం.
విశ్వ ఎక్కడికి వెళ్లినా ఆమె చూపులు ఇలాంటివారికోసమే వెతుకుతూ ఉంటాయి. బామ్మతో స్టేషన్‌లో దిగగానే ఒక చిన్నబ్బాయి రైలుబండిమీద అ, ఆలు దిద్దుతున్నాడు.
రేగిపోయిన చింపిరి జుట్టు, చిరిగిన చొక్కా, పీలికలులా వున్న నిక్కరు, ఒంటినిండా దుమ్ము. ఇది వాడి అవతారం.
విశ్వకి మాత్రం వాడు ముద్దుగా కనిపించాడు.
వాడిలో అక్షరం మీద మమకారం కనిపించింది.
విశ్వ దృష్టిలో పడటం వాడి అదృష్టం. ఆమెచేతిలో పడ్డ ఏ రాయి అయినా శిల్పంలా మారాల్సిందే!
వెంటనే వాడి దగ్గరకువెళ్లి ‘నీ పేరేమిటి?’ అంది మామూలుగా.
‘‘నాకు పేరెవరు పెడతారు? అందరూ ‘ఒరేయ్’ అనే పిలుస్తారు’’
‘‘అవునా! నేను నీకు మంచి పేరు పెడతాను. స్కూల్‌లో చేర్పించి చదివిస్తాను, నాతో వస్తావా?’’
‘‘నిజమేనా? ఈ రోజుల్లో పిల్లల్ని తీసుకెళ్లి అమ్మేస్తున్నారట’’.
‘‘నేను చెప్పేది నిజమే. ఈ ఊరే మాది. నీకు అక్కడ నచ్చకపోతే మళ్లీ ఇక్కడికే వచ్చేద్దువుగానీ. నిన్ను మేం ఆపంగా’’ అంది విశ్వ వాడికి నమ్మకాన్ని చేకూరుస్తూ.
‘‘సరే. అయితే వస్తాను’’
‘‘నీలాగా ఇంకా చదువుకోవాలనుకునే స్నేహితులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళను కూడా మనతో తీసుకువెళ్దాం’’
‘‘ఉహూ.. రైలులో అడుక్కుంటే సరిపోతుంది. చదువుకోటం, పనిచేయటం వేస్ట్. మనకు తిండి గడిచిపోతుందిగా అనేవాళ్ళే. నేను మాత్రం రైల్లో పెట్టెలు తుడుస్తాను. ఎవరైనా పిలిచి డబ్బిస్తే తీసుకుంటాను. లేదంటే ఆ రోజు ఖాళీ కడుపుతో పడుకోవటమే’’.
వాడలా తన కథ చెబుతుంటే ఎంత జాలివేసిందో విశ్వకి.
‘‘నీకు ఏ పేరంటే ఇష్టం?’’
‘‘ఏమో నాకే తెలియదు’’.
‘‘నీకిష్టమైనది ఏదన్నా వుంటే అదే పెడదామనుకున్నా’’
‘‘మీరే పేరుతో పిలిచినా పలుకుతాను. మీరే నా పేరు పెట్టండి’’ అన్నాడు.
‘‘సరే! ఈ రోజు నుంచీ నీ పేరు చైతన్య. నీ ముద్దుపేరు చైతూ’’

- ఇంకా ఉంది

- యలమర్తి అనూరాధ