డైలీ సీరియల్

విలువల లోగిలి-74

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నేను రేపే పంపిస్తాను. థ్యాంక్యూ వన్స్ అగైన్ విశ్వా’’.
‘‘ఉంటాను మేడమ్. గుడ్‌నైట్’’ అని ఫోను పెట్టేసింది విశ్వ.
ఎవరూ ఊహించని సంచలనం సృష్టించింది ఆ నవల.
ఈ కాలంలో నవలలు ఎవరూ చదవటంలేదు అనుకొనేవారి మతులు పోగొడుతూ వేలలో అమ్ముడుపోయింది.
వ్యక్తిత్వ వికాసపు పుస్తకాలకే ఇపుడు మార్కెట్ అన్నవాళ్ళంతా ముక్కుమీద వ్రేలు వేసుకున్నారు.
ప్రతి తండ్రీ తన కొడుకుకు గిఫ్ట్‌గా ఇచ్చాడా నవలను. చివరకు గర్ల్‌ఫ్రెండ్స్ కూడా తమ బాయ్‌ఫ్రెండ్‌కు ఐ లవ్‌యూ ఆ నవలని బహుమతిగా ఇచ్చి చెబుతున్నారంటే ఆ నవల తెస్తున్న క్రేజ్ ఎలా ఉందో తెలుస్తోంది.
ప్రతి కాలేజీ, ప్రతి లైబ్రరీ వాళ్ళు ఆర్డర్ చేసి మరీ తెప్పించుకుంటున్నారు.
నెలలోనే రెండవ ముద్రణ చేసారంటే ఇక ఆ నవల గురించి చెప్పేందుకేముంది?
యువతను సక్రమంగా నడిపించే మార్గాన్ని సూచించటమే నవల లక్ష్యంగా సాగింది. ఎలా వెళ్ళకూడదో కూడా తెలియజేస్తూ.
విశ్వ సేవలే ఒక సంచలనాన్ని సృష్టిస్తే ఈ నవల మరో సంచలనాన్ని తెచ్చింది.
మొత్తానికి ఇద్దరూ ఇద్దరేగా కీర్తిశిఖరాలు మీద నిలబడ్డారు ఒకేసారి.
***
విశ్వసౌధం ఆశ్రయం కోరేవాళ్ళు రకరకాల వ్యక్తులు అనేక సమస్యలతో వస్తూ ఉంటారు. సమస్య రూపం వేరవ్వచ్చు కానీ అన్నీ సామాజిక సమస్యలే. విశ్వను అవి తెగ ఆలోచింపచేస్తున్నాయి. ఈ రోజు పవిత్ర అనే ఆవిడ వచ్చింది. ఆవిడ సూటిగా తనను అడిగిన ప్రశ్న ‘ఆడవారికే కానీ మగవారికి శీలం అక్కర్లేదా?’ అని.
శీలం అనేది ఎవరికైనా ఒకటే. ఒకరికి ఉండాలి మరొకరికి ఉండకూడదని ఎలా చెబుతాం?
కానీ మగవారిని ఎలా పెంచుతున్నారు? మగవాడు తిరక్క చెడతాడు ఆడది తిరిగి చెడుతుంది అని. పని విషయంలో చెప్పిన విషయాన్ని దీనికి అన్వయించుకుని తల్లీ, బిడ్డలు ఇద్దరూ తప్పు చేస్తున్నారు. ఏ.. రాముడు ఎందుకు తప్పు చేయలేదు? సీతను వదిలేసాక అతనూ ఎవరినన్నా పెళ్లిచేసుకోవచ్చుగా. ఏకపత్నీవ్రతం అని ఎందుకు చెప్పాడు? అందరికీ ఆదర్శంగా నిలవాలని.
మరి ఇలాంటి ప్రశ్నలు ఎందుకు తలెత్తుతున్నాయి?
‘‘వాడు మగవాడు. ఏమైనా చెయ్యవచ్చు అని తల్లి ఒక తప్పుకు సపోర్టు చేస్తున్నందువల్లే. తనూ ఒక స్ర్తియే గదా. అలా చేస్తే మరో స్ర్తికి అన్యాయం చేసినట్లేగా. సవితిపోరు ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇది ఇపుడు సర్వ సామాన్యం అయిపోయింది. ఈ విషయంలో స్ర్తిలలోనే మార్పురావాలి. పిల్లలను ధర్మాన్ని అనుసరించే పద్ధతిలో పెంచాలి. ఎప్పటినుంచో ఆడవారి విషయంలో తన మనసులో యుద్ధం జరుగుతోంది. అది ఇలాంటప్పుడు బహిర్గతమవుతూ ఉంటుంది.
క్షణంలో తనను తను సర్దుకుని ‘‘అలా ఎవరన్నారు? శీలమనేది ఆడ, మగ బట్టి మారేది కాదు. ఇద్దరికీ ఉండాలి’’.
‘‘మరి మా అత్తేమిటి? మా ఆయన్ని వెనకేసుకువస్తుంది? వాడిష్టం.. వాడింకో దాన్ని తెచ్చుకున్నా తప్పులేదు. వాడు మగాడు’’ అంటుంది.
ఆవిడ అసలు మనిషేనా అనిపించింది ఆ క్షణంలో విశ్వకు.
‘‘అమ్మా! మీరు ఏమైనా అనుకోండి. నాకు ఈ విషయంలో కొన్ని స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. భార్యాభర్తలంటే ఒకరికొకరం అన్నట్లు ఉండాలి. ఒకసారి పెళ్ళయ్యాక పరాయి ఆడవాళ్ళను తల్లిలా, చెల్లిలా చూడగలగాలి. మరో ఆడదాని ఊసు ఎత్తకూడదు. అలాగే ఆమె కూడా పర పురుషుడ్ని కోరుకోకూడదు. కలకాలం అలా కలిసి ఉండాలి. అదే కదా రామాయణం మనకు చెప్పింది. మరి వీళ్ళేమంటమ్మా మేం మా ఇష్టమొచ్చినట్లు తిరుగుతాం.. నేను సంపాదిస్తున్నా.. నా ఇష్టం.. ఒకదాన్ని కాకపోతే రెండోదాన్ని ఇంకా మూడోదాన్ని తెచ్చుకుంటా అని ఎగిరెగిరి పడతారు?
‘‘రేపు మన ఊర్లోవున్న పంకజాన్ని ఇంటికి తీసుకువస్తా. నువ్వేం చేసుకుంటావో చేసుకో అని రాత్రే చెప్పేసాడు. ఎంగిలి కూడు తినే అలవాటు నాకు లేదు. అందుకే తెల్లవారు ఝామునే లేచి ఇక్కడకు ప్రయాణమై వచ్చేసా. అలాంటి మొగుడు ఉండేకన్నా లేకపోతేనే నాకిష్టం. మొగుణ్ణి వదిలేసి వచ్చిన ఆ పంకజం ఈయనతో ఎన్నాళ్ళు కాపురం చేస్తుంది? ఉన్నవన్నీ లాక్కున్నాక ఛీ పొమ్మంటుంది. అప్పుడుకానీ బుద్ధిరాదు. చెప్పమ్మా! నేను చేసింది తప్పా?’’
నేను మిగిలినవాళ్ళలా అవతలివారిని ఎలా సమర్థిస్తాను?
‘‘లేదు.. లేదు.. నువ్వు చేసింది కరెక్టే. మీ ఆయనే తప్పు చేస్తున్నాడు’’.
‘‘అయినా ఆవిడకయినా బుద్ధి ఉండక్కర్లా. పచ్చని సంసారంలో మంటలు రేపటానికి? అయినా నా మొగుడు బంగారం కానప్పుడు ఎవర్ని ఏమనుకుని ఏం లాభం? ఈవిడ కాకపోతే వేరే ఆవిడ. బుద్ధి మంచిది కానపుడు ఎవరైనా ఒకటే’’ తనకు తనే చెప్పుకుంటున్నట్లు మాట్లాడుతున్న పవిత్రను అక్కున చేర్చుకుని ఓదార్చింది విశ్వ.
‘‘ఏ తప్పూ చేయని ఆమెకు శిక్ష ఎందుకు పడాలి?’’ అంతరంగం ప్రశ్నిస్తోంది. అందుకే ఆమెకు న్యాయం చేయాలనుకుంటుంది. ఈమె భర్తలాంటివాళ్ళు జైలులో ఉండాలి- సభ్య సమాజంలో కాదు’’ అనుకుంది.
అంతే, పవిత్రతో కోర్టులో కేసు వేయించింది. తనకు విడాకులు ఇవ్వకుండా వేరే ఆవిడతో కాపురం చేస్తున్నాడని.
అతనికి జైలుశిక్ష పడేదాకా ఊరుకోలేదు విశ్వ.
***
ఆ రోజు పోస్ట్‌లో వచ్చిన ఉత్తరాలను చూస్తోంది కమలారామన్. గులాబీ రంగు కవరు ఆమెను ఆకర్షించింది. ముందుగా దానిని అందుకుని చదవటం ప్రారంభించింది.
****
నమస్తే మేడమ్! మీరు వ్రాసిన ‘యువతా! నీ పయనం ఎటు?’ చదివినప్పుడు చాలా ఏడుపొచ్చింది.

- ఇంకా ఉంది

- యలమర్తి అనూరాధ