డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే-14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరో హిమాలయ యోగి వచ్చి మాణిక్‌చంద్‌కు ఏదో దీక్ష ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత మాణిక్‌చంద్‌లో ఏదో దివ్యశక్తులు ప్రవేశించాయి.
‘‘మాణిక్! మానవజన్మను సార్థకం చేసుకో. సమాజం సంక్షుభితమై ఉంది. అంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తిండికి లేక కొందరు, తీరుబడిలేని విలాసాలతో కొందరు అందరూ దుఃఖితులే. ఎవరికీ సుఖమూ, సంతృప్తి లేదు. నిజానికి సుఖము మనోధర్మము. అది సంతృప్తి వలన లభిస్తుంది. అందుకని మానవులు ప్రశాంత జీవనం సాగించాలంటే మనస్సు అనే గుర్రానికి మంచి ట్రైనింగ్ ఇప్పించాలి. లోకం కష్టాలల్లో ఉంటే స్వీయమోక్షం అంటూ సాధువులు, సన్యాసులు దేవుణ్ణి పట్టుకొని వ్రేలాడుతున్నారు. సర్వేజనాః సుఖినోభవన్తు సర్వేసం తు విరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మాకశ్చిత్ దుఃఖ భాక్ భవేత్’’ అని భావించినవాడే నిజమైన యోగి’’ ఇలా హిమాలయ యోగి మాణిక్‌చంద్‌కు దివ్యబోధ చేశారు. అప్పటినుండి మాణిక్‌చంద్ మహరాజ్ గౌతమబుద్ధుని వలె సమాజ కల్యాణం కోసం స్వీయసుఖం స్వీయ కుటుంబం వదలివేసి దేశవిదేశాలు పర్యటనలు చేస్తున్నాడు. విశ్వనాథ్! ఆయనయే నాకు ఆదర్శం. నేను విరాళాలు ఇస్తున్నా హుస్సేనీఆలం కమాన్‌లో వికలాంగుల పాఠశాలను స్థాపిం చినా ఇదంతా మాణిక్‌చంద్ మహరాజ్ గారి బోధనల వల్లనే’’
విశ్వనాథ్ ఇలా అన్నాడు.
‘‘ఈ భారతజాతి అమృతమయమైనది. మానవ సమాజం కుక్క తోకలాంటిది. అందుకే ఎవడో ఒక సత్పురుషుడు ఒక దివ్యవిభూతి అవతరించి ప్రపంచాన్ని సరియైన మార్గంలో పెట్టి వెళ్లిపోతాడు. ఆయన ప్రభావం ఉన్నంతవరకు ఈ కుక్కతోక సరిగ్గానే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ కుక్క తోక వంకర - మళ్లీ ఒక మహాపురుషుని ఆవిర్భావం’’
‘‘బాగా చెప్పావు గోడ్బోలే. ఇంతకూ నీవు అసలు విషయం చెప్పలేదు. సిఐడి శ్రీ్ధర్ నినె్నందుకు తీసుకుపోయాడు?’’
‘‘చెబుతాను సార్’’ నన్ను పోలీసు కంట్రోల్‌రూంకు తీసుకుపోయారు. నా పేరు ఊరు అడ్రసు అన్నీ రికార్డు చేసుకున్నారు. మీ దగ్గర ఎంతకాలం నుండి పనిచేస్తున్నానో వివరాలు నోట్ చేసుకున్నారు.
ఆ తర్వాత ఇలా అన్నారు ‘విశ్వనాథ్ గోడ్బోలే! మాకు నీ వలన ఒక సహాయం కావాలి’’
‘‘సర్ నేను చిరుద్యోగిని. నా వలన మీకేమి సహాయం లభిస్తుంది? మా యజమానిని అడగండి. మీ పోలీసు అసోసియేషన్‌కు విరాళాలు ఇవ్వగలడు’’
‘‘విరాళాలు కాదు వివరాలు కావాలి. అవి నీ వలన లభిస్తాయి’’
‘‘అడగండి’’
‘‘హైదరాబాదు, సికిందరాబాదులోని వివిధ ట్రాన్స్‌పోర్టు కంపెనీల జాబితా మా వద్ద ఉంది. వీటిల్లో దొంగ రవాణాలు జరుగు తున్నాయి. నీకు ఈ విషయంలో బాగా అవగాహన ఉంటుందని పిలిచాము’’
‘సర్! మా కంపెనీ చాలా నిజాయితీ గలది. మాకు ఆల్ ఇండియా పర్మిట్ ఉంది. మేము అటు ఢిల్లీ పఠాన్‌కోట్ నుండి ఇటు కన్యాకుమారి వరకు వివిధ వస్తువులను ఎగుమతి దిగుమతి చేస్తుంటాము’’
‘‘విశ్వనాథ్! మీకు అనుమానాస్పద వస్తువులు ఏవైనా వచ్చాయా?’’
‘‘ఏముంటాయి? ధాన్యం, పుస్తకాలు, అగ్రో ఇండస్ట్రీకి సంబంధించిన సరుకులూ ఇంకా...’’
‘‘సరే సరే! ఆ వివరాలు మాకూ తెలుసు కానీ ఈ ట్రాన్స్‌పోర్టు కంపెనీల ద్వారా తుపాకులు, గంజాయి వంటి మాదకద్రవ్యాలు ఎగుమతి, దిగుమతి జరుగుతున్నాయి. అందుకే నిన్ను పిలిచాము’’
‘‘మా దీపక్‌చంద్ కంపెనీ నిజాయితీకి పర్యాయపదం సర్’’
‘‘సరే కాని నీవు మాకు ఈ గంజాయి ఏయే కంపెనీల ద్వారా ఎగుమతి అవుతున్నదో సమాచారం సేకరించి అందించాలి. తెలిసిందా?’’
‘‘తెలిసింది సర్’’
‘‘నీవు విశ్వాసపాత్రుడివి కాబట్టి నీకీ బాధ్యత రహస్యంగా అప్పగించాము. ఈ చుట్టుపక్కల కొన్ని ప్రదేశాలలో కంది మొక్క జొన్న తోటల మధ్య గంజాయి సాగు జరుగుతున్నది. విశాఖపట్నం, పాడేరు ఏజెన్సీలోను, ఏటూరునాగారం అడవులలోను గంజాయి సాగు జరుగుతుంది. దీనిపై వచ్చే ఆదాయంతో అక్కడ ఉగ్రవాద కార్యకలాపా లకు ధనం లభిస్తున్నది. ముఖ్యంగా ఛత్తీస్‌గడ్, కాంకేర్, సుకుమా, దంతెవాడ కీకారణ్యాలలో గంజాయి సాగు విశృంఖలంగా జరుగు తున్నది. స్థానిక ప్రభుత్వాలు దీనిని అదుపు చేయలేకపోతున్నాయి తెలిసిందా?’’
‘‘తెలిసింది సార్’’
‘‘మాకు ఏవేవో రహస్య సందేశాలు వచ్చాయి. పెళ్ళి, పెళ్లికూతురు, ముహూర్తం, కట్నం ఇవన్నీ కోడ్ లాంగ్వేజ్‌లో ఉపయోగిస్తున్న పదాలు. ఇలాంటి మెస్సేజెస్ దుబాయి నుండి వచ్చాయి. వీటిలోని అంతర్యం మేము నేషనల్ లెవెల్‌లో విశే్లషిస్తాము. అదలా ఉంచు. నీవు స్టేషన్ ఘనపూర్ ప్రాంతం నుండి ఏవైనా ఎగుమతులు ఎవరైనా ట్రాన్స్‌పోర్టు కంపెనీలోనైనా బుక్ చేశారేమో కనుక్కొని వెంటనే నాకు తెలియజేయాలి. అవసరమైతే మీ హమాలీలను వారి నాయకుడు కర్తార్‌సింగ్‌ను ఉపయోగించుకో. సమాచారం క్షణాలమీద అందాలి. తెలిసిందా?’’
‘‘తెలిసింది సార్’’
అప్పుడు శ్రీ్ధర్ ఒక పాకెట్ చూపించాడు. అందులో ఎకె 47 రైఫిల్, కొన్ని బుల్లెట్లు ఉన్నాయి.
‘‘ఇవిగో ఇవి ఒక కంపెనీ నుండి బెంగాల్‌లోని మాల్దా జిల్లాకు రహస్యంగా చేరుతున్నాయి. ఈ వ్యాపారంలో మీ ట్రాన్స్‌పోర్టర్ల హస్తం కూడా ఉంది. లేకుంటే ఇలాంటివి జరుగవు.’’
‘‘నేను ప్రమాణపూర్తిగా చెబుతున్నాను. మా దీపక్‌చంద్‌గారు...’’
‘‘సరేసరే! మీ కంపెనీని అనుమానించడం లేదు. కానీ నీవు ఇతర కంపెనీలను అనుమానించవచ్చు. మాకీ సమాచారం కావాలి. ఇదే నీవు చేయవలసిన జాతీయ కార్యం’’.
ఇంతవరకూ చెప్పి విశ్వనాథ్ గోడ్బోలే ఒక్క క్షణం ఆగాడు.

- ఇంకా ఉంది

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్