డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--70

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెగని ఆలోచనలతో అతను సతమతమయ్యాడు. రోమ్‌లో నిజంగా ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలి. తనకక్కడ మిత్రులెందరో ఉన్నారు. అంత తేలిగ్గా తనను దేశద్రోహి చేయటమనేది ఆక్టోవియన్ తరం కాదు.
కానీ చెవుల్లో గూడుకట్టుకుని వాగుతూంటే, ప్రజలు కూడా నమ్మే అవకాశాలుంటవి. తన భావి జీవితమంతా రోమ్ మీదనే ఆధారపడి ఉన్నది. ఇక్కడ ఈజిప్టులో ఉండిపోవటం వల్ల, తన కీర్తికి ఎంత భంగం వాటిల్లిందో అర్థమవుతోంది. ఐతే, ఇక్కణ్నుంచి వెళ్లేందుకు మనస్సు అంత తేలిగ్గా అంగీకరించటం లేదు. విసుగెత్తిన జీవితానికి ఆనందాన్నివ్వగల వ్యక్తులూ, పరిసరాలూ ఇక్కడే ఉన్నవి. మరెట్లా?
చాలాసేపటి వరకూ అతను అలాగే ఉండిపోయాడు. కొత్త ఊహాలు తలలోకి రావటం లేదు... చప్పున మేల్కొన్నట్లు, క్లియోపాత్రా కోసం నలుదిక్కులా చూశాడు. ఆమె అక్కడ లేదు.
ఇప్పుడే గుర్తొస్తోంది. వ్యాకుల చిత్తంతో ఆమె తనను తన ఆలోచనలకు ఒదిలేసి వెళ్లిపోయిందని! ఆమె తన కన్నా ఎక్కువ బాధపడి ఉంటుంది.
అప్పుడే పురుషుడైన తను, స్ర్తి అయిన క్లియోపాత్రాను ఊరడించి ఉండవలసింది. తన గొడవలో తనను తానే సంబాళించుకోలేకపోతున్నాడు. క్లియోపాత్రా ఎంతో తెలివిగలది. ఇలాంటి క్లిష్ట సమస్యల్ని ఆమె బుద్దిబలంతో తేలిగ్గా పరిష్కరించగలదు. ఈ సమయంలో ఆమెతో మంతనాలు జరపటం అత్యవసరమనిపించింది. ఆలోచించినకొద్దీ తనకు పిచ్చెక్కుతున్నట్లున్నప్పుడు, ఆమె సహాయం అర్థించడం కన్నా మార్గాంతరం కూడా లేదు.
ఏంటనీ వెంటనే క్లియోపాత్రా కోసం బయలుదేరాడు. ఆమె ఉండవలసిన గదుల్లో లేదు. బహుశా తన మీద అలిగి ఉంటుందని గ్రహించాడతను. గదులన్నీ వెతికి, చివరకు అలకపాన్పు మీద ఉన్న క్లియోపాత్రాను కనుగొన్నాడు.
ఆడదానికి కోపం వస్తే ఓపిగ్గా ఆమెను సుముఖురాల్ని చేసుకోవటం, అందునా క్లియోపాత్రాలాటి జాణ విషయంలో ఎంత కష్టమో అతనికి అనుభవం ఉన్నది. తన సమస్యలతోనే తాను చస్తూంటే, ఇప్పుడు ఈమె సమస్యలు కూడా తీర్చవలసిన కొత్త బాధ్యత నెత్తిన పడింది. అయినా తప్పేది లేదు.
మెల్లిగా వెళ్లి ఆమె పక్కనే కూర్చున్నాడు. అంతకు ముందు మెత్తని తలగడాలో దాచుకున్న ముఖాన్ని ఆమె పైకెత్తింది. పద్మం లాంటి ఆమె ముఖం నిండా మంచు బిందువుల్లాంటి నీటి చుక్కలు సూర్యకాంతికి మెరిసిపోతున్నవి. తలగడా మీది తడి ఆమె హృదయ క్షోభను తెలియజెపుతున్నది. ఆమె చూపుల్లో ఈ ప్రపంచాన్ని భస్మం చేసేటంత వేడి ఉన్నది. ముఖమంతా ఒక అగ్నిగోళం వలె ఉన్నది. తాను అనుకున్నదాని కన్నా ఎక్కువగానే ఆమె మధనపడుతున్నదని ఏంటనీ గ్రహించాడు.
‘‘రాణీ!’’ అన్నాడు లాలనగా.
ఆ కంఠస్వరాన్ని బట్టి అతను ఏ ధోరణిలో మాట్లాడబోతున్నాడో అని గ్రహించింది. అయితే మరికొన్ని వాక్యాలు కూడా బైటపడేదాకా తనను తాను నిలదొక్కుకున్నది.
‘‘ఇంత మాత్రానికే ఇంత దుఃఖపడతావనుకోలేదు’’ అన్నాడు ఏంటనీ. ఆమె కళ్లు తుడిచేందుకు పైపంచ ఉన్న చేతిని ముందుకు జాపుతూ.
తోక తొక్కిన తాచుపామల్లే ఆమె లేచి నిలబడింది.
‘‘ఎంతమాత్రం’’ అన్నదామె కోపంతో వణికిపోయే కంఠస్వరంతో,. ‘‘నీకు మతి ఉన్నట్లా? లేనట్లా... ఏంటనీ!’’
ఆమెకు కోపం వచ్చినప్పుడు అతన్ని పేరున పిలుస్తుంది. సుముఖంగా, ప్రేమగా ఉన్నప్పుడు గౌరవపూర్వకంగా సంబోధిస్తుంది.
‘‘రాణీ! కోపం తగ్గించుకుంటే’’
‘‘ఏం మహాపురుషుడండీ!’’ అన్నదామె హేళనగా నవ్వుతూ. చేతికి ఉన్న బంగారుగాజుల్ని తీసి అందిస్తూ ‘‘ఇవి చేతులకు వేసుకోరాదా?’’ అన్నది.
ఏంటనీ నిర్ఘాంతపోయాడు. తనను ఆమె ఇంత అవమానిస్తుందని ఎన్నడూ అనుకోలేదు. ఐనా, తొందరపడలేదు.
‘‘రాణీ! మనం ఈ విషయాల్ని చర్చిద్దాం! ఉద్రేకాలతో ఏమవుతుంది కనుక?’’ అన్నాడతను.
‘‘కాస్త వేదాంతం కూడా నేర్చుకున్నట్లున్నావే? ఏంటనీ! సహజమైన ఈ ఉద్రేకాలే లేనట్లయితే, నేను నీకు ఏమవుతాను? నీవు నాకు ఏమవుతావు? ఈ ఉద్రేకాలిచ్చే వివిధానుభూతులే నీలోనూ, నాలోనూ, ప్రతి ప్రాణిలోనూ జీవమనే పదార్థం ఇంకా ఉన్నదని రుజువు చేస్తున్నవి. నీవు సజీవుడవే కనుక, వీటికి అతీతుడివి మాత్రం కాదని నా నమ్మకం. పోతే, వాటిని యథాతథంగా స్వీకరించేందుకు నీకు ధైర్యం లేకపోతే, అంతఃపురంలో దాక్కొని ప్రాణాన్ని రక్షించుకోవచ్చు. అంతేకానీ, మెట్ట వేదాంతాన్ని బోధించేందుకు ప్రయత్నించి, మరింత హాస్యాస్పదంగా తయారవ్వకు!’’ అన్నదామె.
ఆ మాటల్లో దాగిన దూషణతో కూడిన విమర్శనను ఏంటనీ గ్రహించకపోలేదు.
‘‘నీవు ననే్నమన్నా ఫర్వాలేదు..’’ అన్నాడు. తనను తాను సమాధానపరచుకుంటూ.
‘‘ఏంటనీ! నీవు మొనగాడివి. మహావీరుడివి. పురుషుడివి అనుకున్నాను. నేనేమన్నా ఫర్వాలేదా? కట్టుకున్న భార్యను కనుకనా? ఏకాంతంలో అన్నాను కనుకనా? పోనీ అంతవరకూ బాగానే ఉన్నది. కాని పదిమందిలో ప్రజలు ఎన్నుకున్న సర్వాధికార సభ్యుల మధ్య నిన్ను తూలనాడిన ఆక్టోవియన్ అన్నదానిక్కూడా నీకు పౌరుషం రాలేదా? కనీసం నీలో నీవు బాధపడ్డావా? సిగ్గుపడ్డావా?... నీవు పాషాణానివా? మనిషివా?’’
‘‘రాణీ! నన్ను రెచ్చగొట్టకు.’’
‘‘నిన్ను నీవే రెచ్చగొట్టుకుంటావనీ, నీ అవమానానికి ప్రతీకారాన్ని తీర్చుకుంటావనీ నేను పొరబడ్డాను. నీలో ఇంకా వేడి రక్తమే ఉన్నదని భ్రమించాను. మృత్యువాసన్నమైనప్పుడు మాట్లాడే తీరులో వాగుతావనుకోలేదు. నీలో రక్తమనేది ఎక్కడుంటుంది?... మధువు.... నీ శరీరమంతా మధువు తప్ప మరేమీ లేదు. ఈ మూడేళ్లూ మధుపానమే పరమావధిగా చూసుకున్నావు. కనుక నీ శరీరంలో దానికి తప్ప మరి దేనికీ స్థానం ఉండదు. మధువు మత్తును ప్రసాదిస్తుంది. కనుక, బతికిపోయాననుకుంటున్నావు!... కానీ, నిన్ను ఆక్టోవియన్ ఎంత నిందించాడో..’’
‘‘వాడు కుర్రవాడు’’ అని ఏంటనీ సర్దబోయాడు.
‘‘నీవు ముసలివాడివయ్యావు! అందుకే ఇంత విజ్ఞానం, శాంత స్వభావం మూర్త్భీవిస్తున్నదని పొరబడుతున్నట్లున్నావ్. నీలో ఇంగిత జ్ఞానమే ఉన్నట్లయితే, వాడు కుర్రవాడుగా కనిపిస్తాడా? రాజ్యపాలనలో నిన్ను తొలగించాలని, నిన్ను సర్వనాశనం చేయాలనే వాడి ఉద్దేశ్యం. నీకు అర్థంగాక, వాణ్ని పసివాడుగా చూసి, నీలో నీవు తృప్తిపడుచున్నావు. నీ పిచ్చి నీకు ఆనందమైతే, అది వేరొక విషయం. నీ బంధువూ, నీ దేశీయుడూ, నీ గురువుకు దత్తపుత్రుడూ అయిన ఆక్టోవియన్‌ను క్షమించి, అతని కాళ్ల దగ్గిర ఊడిగం చేసుకొనైనా సరే, బతకగలిగే విశాల హృదయం నీకుండుగాక! పసివాడు తనకు గురుతుల్యుడైన నిన్ను అవమానించినా, అదంతా నీకు ముద్దుగానే తోచవచ్చు. .. కానీ, సర్వ స్వతంత్రురాలినీ, ప్రాచ్య దేశాలన్నిటికీ మహారాణినీ, ప్రపంచంలోకల్లా ధనవంతురాలినీ, అందగత్తెనూ అయిన నాకు నీ భార్యగా ఉన్న నేరానికి ఈ అవమానకరమైన మాటలన్నిటినీ భరించాల్సిందేనా? చేతకాని దద్దమ్మ నాకు భర్తగా చలామణీ అవుతున్నారు కనుక, మూల కూర్చొని ఏడవమంటావా?’’
ఆగిందామె - ఏంటనీకి మాట్లాడేందుకు అవకాశమిస్తూ కానీ, అతను తల వేల్లాడేసి వింటున్నాడు. తన మాటల్లోని శక్తి అతని కర్ణపుటాల గుండా శరీరమంతా పాకుతున్నదని ఆమె గ్రహించగలిగింది.
- ఇంకాఉంది -

ధనికొండ హనుమంతరావు