డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--79

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘తొందరపడవద్దు. మాతృదేశం మీద కత్తి దూయవద్దు’’
‘‘అందుకే అవసరమైతే అంటున్నాను. రాణీ! నీవు నన్ను ఎత్తిపొడవద్దు. ఎగతాళి చేయకు. అత్యున్నతాశయం కోసమే పవిత్రమైన సమరాన్ని జరిపి, శాంతి నెలకొల్పాలని నా ప్రయత్నం’’.
ఆమె వింటూ ఊరుకున్నది; ఎదురు చెప్పనందుకు ఏంటనీ సంతోషించాడు. ‘‘ఎటూ సేనలంటూ ఉండనే ఉన్నవి. పర్షియన్ దండయాత్ర తరువాత చూసుకుందాం. నేను అనుకున్నదేమంటే, మనం సైన్యాలతో సహా గ్రీస్ వెళ్దాం. అక్కడ యుద్ధపీఠాన్ని స్థాపిద్దాం.. ఇది చూసి ఆక్టోవియనే యుద్ధాన్ని ప్రకటిస్తాడు. అప్పుడు మనకు తప్పనిసరై యుద్ధాన్ని సాగిద్దాము, ఏమంటావు?’’
‘‘నేను మొదటే చెప్పాను కదా! మీ ఇష్టానుసారం చెయ్యండి. నా అభ్యంతరమేమీ లేదు. ఈజిప్టు సర్వస్వమూ మీదే’’ అన్నదామె.
‘‘అయితే మిగతా సన్నాహాలు సాగించు రాణీ’’ అన్నాడతను.
ఆమె తీవ్రంగా ఆలోచిస్తోంది. తన జీవితాశయాలు తీరే శుభ సమయం తన్నుకుంటూ ఎదురువస్తున్నదని తెలుసుకొని చాలా ఉత్సాహపడింది. కాని, ఆ ఉత్సాహాన్ని పైకి కనబరచకుండా జాగ్రత్తపడింది.
‘‘ఏమిటింకా ఆలోచిస్తున్నావు రాణీ!’’ అన్నాడతను.
ఆమె అనుమానం ఇది: ఏంటనీ గ్రీస్ వెళ్ళాక, ఇంత పెద్ద సైన్యాన్ని చూసి ఆక్టోవియన్ భయపడిపోయి సంధికి దిగినట్లయితే, తనమీద రోమ్ యుద్ధాన్ని ప్రకటించటమేగాక, ఈజిప్టును రోమన్ సామ్రాజ్యంలో కలపటం కూడా జరుగుతుంది. అందుకని తాను వెంట వుండి, ఎలాగైనా ఈ యుద్ధాన్ని ఆసాంతం నడిపించాలి. అప్పుడే ప్రపంచ సామ్రాజ్య తనకు దక్కుతుంది. లేనట్లయితే, తన రుూ జీవితమే వృధా అవుతుంది.
‘‘స్వామి! మిమ్ము విడిచి నేను ఉండలేను.. నన్ను కూడా మీతో తీసుకొని వెళ్లండి. గ్రీస్ చూడాలని తహతహలాడుతున్నాను. మీకు తెలుసు కదా- గ్రీకు యోధుడు, మహనీయుడు అలెగ్జాండరే మా వంశానికి మూల పురుషుడని! నా పూర్వీకుల దేశాన్ని దర్శించటంతో, నా వంశ చరిత్రను తెలుసుకోగలుగుతాను. మీ రాజకీయాలతో నాకు సంబంధం ఉండదు. నా ప్రంపచమల్లా మీరే కదా’’ అన్నదామె.
క్లియోపాత్రా మనసులోని అసలు ఉద్దేశాలేవీ ఏంటనీ గ్రహించలేకపొయ్యాడు; ఆమె చెప్పిన కారణాలు బాగా అతికినవి.
‘‘కాని’’ అన్నాడతను. ‘‘ఇక్కడ ఈజిప్టు పరిపాలన ఎవరు చూస్తారు?’’
‘‘సీజర్ టాలమీ ఉన్నాడుగా! వాడికి పట్ట్భాషేకం కూడా జరిపించాము. తెలివిగా పాలించగల మంత్రులున్నారు. వాడికీ పాలనంటే ఏమిటో తెలుసుకునే అవకాశన్నా ఇచ్చినట్లవుతుంది. సంవత్సరాల తరబడి అక్కడ ఉంటానా? ఎంత త్వరలో వీలైతే, అంత త్వరలో వచ్చేస్తాను కదా!’’ అన్నదామె.
ఏంటనీకి ఒప్పుకోక తప్పలేదు. పెళ్లికిపోతూ పిల్లినొకదాన్ని చంక పెట్టుకొని వెళ్తున్నాననే భావమే అతనికి కలగలేదు. క్లియోపాత్రా సమక్షంలో రుూ ప్రపంచమే అతనికి వేరు విధంగా కనిపించటమనేది కొత్త కాదు!
26
నిర్మలాకాశంలో యుద్ధమేఘాలు కమ్ముకుంటూన్నవి. అలెగ్జాండ్రియా రేవులో 500 ఓడల ఈజిప్టు పతాకాల్ని ధరించి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నవి. లక్ష కాల్బలమూ, 1200 అశ్విక దళమూ రేవు వైపు నడచినవి. భూమే దద్దరిల్లింది.
మధ్యధరా సముద్ర తీరాల వున్న రాజ్యాలన్నీ గజగజలాడివని. ఈ ప్రపంచమంతా ఒక మట్టి ముద్దగా ఉండేదన్న సిద్ధాంతాన్ని క్లియోపాత్రా రుజూచేసి చూపుతుందేమోనని ప్రజలు భయకంపితులయ్యారు. చివరకు ఈ సైన్యమంతా పశ్చిమ దిశకు కదలటంతో ప్రాచ్యదేశవాసులు కొంతవరకూ కుదుటపడ్డారు.
ఇంత పెద్ద సైన్యం జగత్ ప్రసిద్ధి చెందిన యోధుడైన అలెగ్జాండర్‌కూ లేదు. నిన్నమొన్నటి సీజర్‌కూ లేదు. ఏంటనీ ఆజ్ఞలకు లోబడిన ఈ బలగమంతా సరాసరి గ్రీస్‌కు జేరింది. అక్కడ ఏంటనీ క్లియోపాత్రా రాకకై వేచి ఉన్నాడు.
క్లియోపాత్రా ప్రయాణ సన్నాహాలు చేయించింది. పెద్దకొడుకు సీజర్‌ను పిలిచి ‘‘నాయనా! నేను దాదాపు సంవత్సరంపాటు ఇక్కడ ఉండను. నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ తమ్ముళ్ళనూ, చెల్లినీ కూడా కాపాడుకుంటూండాలి. ప్రతిరోజూ శీఘ్రగమన వార్తావహులద్వారా ఇక్కడి సంగతి సందర్భాలు గ్రీస్‌లో ఉండే నాకు తెలియపరుస్తూండాలి. రాజ్యపాలనలో సరైన తర్ఫీదు పొందేందుకు నీకు ఇదొక సదవకాశం..’’ అని చెప్పింది.
సీజర్ కూడా తనకేమీ భయంలేదనీ, తల్లిని దిగులు పడొద్దనీ అన్నాడు. నిజంగా తండ్రి పోలికలూ, ఆయన బుద్ధులూ, ధైర్య సాహసాలూ వీడి కొస్తూన్నందుకు ఆమె ఎంతో సంతోషించింది.
తరువాత మంత్రులను పిలిపించి, రాజ్యపాలన విషయంలో ఎలాంటి లోపాలు జరిగినా తాను సహించననీ, ఏ రోజు వార్తల్ని ఆ రోజు పంపమనీ, పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని హెచ్చరించింది.
అర్థరాత్రి టాలమీల ధనాగారాలు తెరువబడిని. బస్తాలలో కట్టిన బంగారం అలెగ్జాండ్రియా రేవులో ఉన్న ఓడలకు చేర్చబడింది. అంతకు పూర్వమే ధాన్యం, ఇతర ఆహార పదార్థలతో మరికొన్ని ఓడలు సిద్ధంగా ఉన్నవి. క్లియోపాత్రా ధనంతో నింపబడిన ఓడ ఎక్కింది. ఓడలు మధ్యధరా సముద్రాన్ని దాటసాగినవి.
తెల్లవారాక ఆమె ప్రశాంతంగా ఉన్న సముద్రాన్ని చూసింది. సముద్రపు గాలి మొహానికి తాకి, ఆమెను ఉల్లాసపరిచింది. కాలచక్రాన్ని కూడా లెక్కచేయని కొత్త శక్తి. ఉత్సాహం, యవ్వనం, ఆనందాలతో ఆమె గాలిలో తేలిపోతూన్నట్లు భావించ గలుగుతోంది. ఇది తన అంతిమ యుద్ధం. భూగోళానే్న కబళించేందుకు తాను వేసిన పథకం నోటికి చిక్కుతుందనీ, తాను మింగి హరాయించుకోగలననీ, ఆమె నమ్మకం!
మధ్యధరా సముద్రంలో తాను ప్రయాణం చేయటం ఇది నాలుగోసారి! మొదటిసారి తనకు ప్రణయ పాఠాలు నేర్పి, సంతానవతిని చేసిన మహనీయుడు జూలియస్ సీజర్‌ను కలుసుకునేందుకు టర్సస్‌కు వెళ్లింది. మూడోసారి తాను కవలల్ని కన్న తర్వాత తిరిగి ఏంటనీని కలుసుకునేందుకు సిరియా వెళ్లి, ఏంటనీని పెళ్లాడి, వధువుగా ఈజిప్టు చేరింది.. ఈ నాలుగోసారి- బహుశా ఇది చివరిసారే కావచ్చు. తన జీవితాశయాలన్నీ సఫలమయ్యే అవకాశాల కోసం గ్రీస్ బయలుదేరింది. తనకు ఎంతమంది సంతానమో, అన్నిసార్లు రుూ సముద్ర ప్రయాణాలు సాగినవి!
గ్రీస్- తన వంశీకుల మూలపురుషుడు అలెగ్జాండర్ ది గ్రేట్ జన్మస్థలం! ప్రపంచానికి సంస్కారం, వేదాంతం, విజ్ఞానం వెదజల్లగలిగిన దేవలోకమే అది! ఆ దేశాన్ని చూస్తే తాను తరిస్తుంది. గ్రీక్ పండితుల్ని తాను ఎంతోమందిని చూసి, ఆ దేశం ఎంత గొప్పదో తాను ఊహించుకునేది. ఐతే, ఇప్పుడు తానాదేశానికి వెళ్ళటం, లలిత కళారాధనకు కాదు, అక్కడ శాంతి భద్రతల్ని నెలకొల్పేందుకూ కాదు. చివరికి జీవిత సౌఖ్యాలు అనుభవించేందుకూ కాదు! అక్కడి భూమిని ఎర్ర రంగుతో కాంతివంతంగా ప్రకాశింపజేసేందుకు! మానవ రక్తంతో సామ్రాజ్యాన్ని కైవసం చేసుకునేందుకు. ఇది తలుచుకొని స్ర్తి సహజమైన భయంతోనూ, అసహ్యంతోనూ ఆమె వొణికిపోయి ఉండవలసింది. కాని క్లియోపాత్రా స్ర్తి జాతిలోనే అసాధారణ వ్యక్తి! తన కొరకుగాను ఇతరులు, ఎవరైతేనేమి, ఎంతమందైతేనేమీ బలయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. తన బంగారపు బస్తాల ముందు మోకరించి, తమ తలలు కోసి, తాను తలపెట్టిన ఈ యజ్ఞానికి కానుకలుగా, ఇంధనాలుగా సమర్పించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.
తన సామ్రాజ్య సౌధానికి వారి శవాలే రాళ్ళు! లోపల ఎంత భయంకరమైన పదార్థాలుంటేనేమి, చివరికి సౌధ నిర్మాణం పూర్తయ్యాక, అది ఎంతో సుందరంగా ఉంటుంది.
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు