డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--82

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనంటే ఏంటనీకి ప్రాణమనే సంగతి తానే కాకుండా ఈ ప్రపంచమంతా గ్రహించింది. తన పుత్రుడు సీజర్ టాలమీని, సీజర్‌కు వారసునిగా ఏంటనీ ఒప్పుకున్నాడు! చివరకు మరణానంతరం అస్థికల్ని, తన సమాధి పక్కనే పాతాలనే అంతిమంగా కోర్కెను అతను వెలిబుచ్చాడు. ఈ సమయంలో ఆమె ఏంటనీని ఎంత గాఢంగా ప్రేమించగలుగుతుందో అర్థమైపోయింది. ఈ ప్రపంచానికి ప్రళయమే ఆసన్నమవుగాక! తమ ప్రయాణం అమరం! తనకు జీవితంలో ఇంతకన్నా వేరేమీ అక్కర్లేదనిపించింది.
ఏంటనీని చూడగానే ఆమె అతని కాళ్ళకు పెనవేసుకుంది.
‘‘స్వామీ! మీ ప్రేమను నేను శంకించినందుకు నన్ను క్షమించండి. ఈనాడు మీ హృదయాన్ని అర్థం చేసుకున్నాను. ఎన్ని కష్టాలు రానీ, ఏమన్నా కానీ, మనిద్దరి మరణం ఒకేసారి సంభవమవాలని నేను కోరుకుంటున్నాను!’’ అన్నదామె.
ఏంటనీ కళ్ళు తడి అయినవి. క్లియోపాత్రాను లేవనెత్తి గాఢంగా కావలించుకున్నాడు.
‘‘రాణీ! ఏది ఏమైనా సరే, నీవూ నేనూ ఒక్కటే. సరిగ్గా నీవేమి కోరుకుంటున్నావో, నేనూ అదే కోరుకుంటున్నాను. జీవితం మనిద్దర్నీ కలిపి ఒకే వ్యక్తిగా చేసేసింది. మృత్యువు విడదీస్తుందనే భయం ఉండేది. కాని ఉభయులమూ ఇలాగే ఈ కౌగిలిలో ఒకేసారి మృతినొందుతే, చివరకు మృత్యుదేవత కూడా తన సహజ గుణాన్ని మార్చుకొని అచ్చెరువడి, మనను మరణ సమయంలో మరింత దగ్గరజేస్తుంది గాక!’’ అన్నాడతను.
వారిద్దరూ ఆ స్థితిలో చాలాసేపు, మాటలకు లొంగని తీయని ఊహల్లో ఉండి పొయ్యారు.
తిరిగి మామూలు మనుషులయ్యాక క్లియోపాత్రా అన్నది: ‘‘చూశారుగా స్వామీ! ఆక్టోవియన్ నామీద యుద్ధాన్ని ప్రకటించాడు!’’
‘‘పిచ్చిదానా! నీవు కేవలం నిమిత్త మాత్రురాలివి. ఆ యుద్ధం నా మీదనే సుమా! ఒకవేళ నీ మీదనే అయినప్పటికీ మనిద్దరం వేరుగాదని అందరికీ తెలుసు; అందరి సంగతి ఎలా వున్నా, మృత్యువు కూడా మనను విడదీయదని ఇంతకుముందే తేల్చుకుంన్నాం కదా! నీకింకా భయం దేనికి?’’ అన్నాడతను.
భయంకరమైన భవిష్యత్ భారంగా, ఘోరంగా పరిణమిస్తుందేమోనని దాన్ని మరిచిపొయ్యేందుకుగాను, ఈ సైనిక స్థావరంలో మధువూ, మగువలూ ఎంతో తోడ్పడ్డారు. ఇది యుద్ధ్భూమిగా ఎవరికీ తోచటంలేదు; శోభనపు మందిరాలుగా, వసంతోత్సవాలు జరుగుతూన్నట్టే కన్పట్టుతున్నది. నిజాన్ని దాచేసి, అబద్ధాలతో మానవుడు పొందగలిగే మనశ్శాంతి, ఆనందం ఎలాంటివో ఈ స్థావరాన్ని చూనట్లయితే తేలిగ్గా అర్థమవగలదు.
ఈ స్థావరంలో కనీసం వంద భాషలన్నా వినిపిస్తూన్నవి. ఆర్మీనియన్‌లు, అరబ్బులు, మెడియన్లు, గ్రీకులు, రోమన్‌లు, జ్యూలు, సిరియన్‌లు ఇలాంటి జాతులనేకం ఉన్నవి. సైనికులు కవాతు చేస్తూంటే, గ్రీస్ దేశంలో భూకంపమే వచ్చిపడినట్లుండేది. ఈ సైన్యాన్ని చూసుకొని విజయలక్ష్మి తననే వరిస్తుందని క్లియోపాత్రా మురిసిపోతున్నది. అటు చూస్తే ఈజిప్షియన్ పతాకాలు ఎగరేసుకుంటూ, సముద్రానికి కోట పెట్టినట్లు బారులు తీరిన ఓడలు! ప్రపంచాన్ని జయించటమనే ఊహకు నిజ స్వరూపమంతా తన కళ్ళెదుటే ఉన్నది కదానని ఆమె ముచ్చటపడుతూన్నది.
యుద్ధాన్ని ముందుగా ప్రకటించినవారే మొదట దెబ్బతీయడం ఆచారం. ఆ ఏర్పాట్లు కూడా రోమ్‌లో పూర్తి కావస్తున్నవని ఆమె విన్నది.
అయితే, తాను ఒక పక్క ముచ్చటపడి, మురిసిపోతున్నప్పటికీ, రెండోవైపు కీడును శంకించే సూచనలు కానవస్తూన్నవి. సరిగ్గా పనె్నండేళ్ళ క్రితం రోమ్‌లో సీజర్ ప్రతిష్ఠించిన క్లియోపాత్రా పంచలోహాల విగ్రహాన్ని ప్రజలు పడగొట్టి, ముక్కలు చేశారు. మొదటినుంచీ రోమ్ తనకు పరమ శత్రువే గనుక ఇదొక విశేషమే కానేరదు!
రోమ్‌లోని ఏంటనీ పాలరాతి విగ్రహానికి చమట పడుతూన్నదని తెలియవస్తూన్నది. కాకులూ, గద్దలూ పిలవని పేరంటంగా సైనిక స్థావరాలమీదికొచ్చి వాలుతున్నవి. ఇవన్నీ అశుభ సూచనలే!
వీటిని గమనించి ఏంటనీ తాను లెక్కచేయనట్లు నవ్వాడు.
ఆ నవ్వు - పూర్వం, సీజర్ హత్య చేయబడేందుకు ముందు ఆయన నవ్విన నవ్వును క్లియోపాత్రాకు జ్ఞప్తికి తెచ్చింది. ఆమె వౌనం వహించి లోలోన కుమిలిపోయింది ఈ యుద్ధం భూమిమీదనే జరుగుతుందో, సముద్రంమీదనే జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేని స్థ్థితిలో ఉన్నారు. గ్రీస్ వాతావరణం పడకా, సముద్రపు జ్వరంతోనూ నావికులు చాలామంది మరణించారు. చివరకు జనాభా తక్కువవవుతుందేమోనని భయపడి, ఏంటనీ గ్రీక్ యువకులనేకమందిని నావికులుగానూ, సైనికులుగానూ తీసుకున్నాడు. ఈ యువకులకు ఈ రెండూ కొత్తే! తీరా యుద్ధం ఆరంభమైతే వారెందుకూ పనికిరాక, పిరికిపడి, ముందుగా స్వప్రాణ రక్షణార్థం పరుగెత్తేందుకు ప్రయత్నిస్తారు. ఐతే, ఇప్పుడు ప్రపంచ చరిత్ర ఎటు మళ్ళవలసిందీ, ఏం జరుగుతున్నదీ నిర్ణయించేది క్లియోపాత్రాయే!
ఏంటనీని చూసినపుడల్లా, క్లియోపాత్రాకు భయం వేస్తూన్నది. పూర్వంవలె అతనిలో చురుకుదనం లేదు. నిరుత్సాహంగా, ఏదో బలాత్కారంతో, వొత్తిడితో తానీ జీవితాన్ని గడపవలసి వచ్చింది కదాననే ధోరణిలో ఉంటున్నాడు. పొట్ట పెరిగి మోకాళ్ళమీదికి జారుతోన్నదనిపిస్తోంది. వొళ్ళంతా ఉబ్బరించి, ముఖంలో జీవకళకు మారుగ, కొవ్వు తన ఇష్టానుసారంగా కమ్ముకున్నది.
ఇతను రేపు యుద్ధంలో ఏం గెలవగలడనే సందేహం ఆమెకు కలుగుతోవంది. ద్రాక్ష సారారుూ, ప్రణయమూ తప్ప రుూ భూమండలంలో మరొకటి లేదని తన నిశ్చితాభిప్రాయంగా అతను క్షణక్షణమూ రుజూచేస్తూనే వున్నాడు. ఇప్పుడతని వయస్సు 50 సంవత్సరాలు; ఈ స్థితిలో ఆమె ఏంటనీలో సీజర్‌ను చూస్తూన్నది.. కాని, సీజర్ మహాయోధుడు; యుద్ధకౌశలమంటే ఏమిటో ఆమె సీజర్‌లోనే చూసి అర్థం చేసుకున్నది. యుద్ధరంగంలో సీజర్‌కూ, ఏంటనీకి పోలికేమిటి? నక్కకూ, నాగలోకానికీ వున్నంత దూరం!
తానిప్పుడు అతి ప్రమాద స్థితిలో చిక్కుబడిపొయ్యానని ఏంటనీ గ్రహించాడు. ఆక్టోవియన్‌తో సంధి చేసుకొనే అవకాశాలేమీ లేవు. అధవా సంధి జరిగినా, తాను సామాన్య రోమన్ పౌరునివలె బతకగలగటం అసంభవం! పువ్వులనమ్మిన ఊరిలోనే కట్టెలమ్మలేడు. ప్రజలు తనను గౌరవించరు సరికదా, మొహాన ఉమ్మివేస్తారు.
ఇక తాను ఇన్నాళ్ళూ అనుభవించిన రుూ విలాస జీవితం, పొందిన సుఖ సౌఖ్యాలు గడిచిపోయిన కలలౌతవి. తాను జీవితంలో సాధించినదేమిటి? పుర్వానుభవాన్ని నెమరువేసుకుంటూ, వర్తమాన జీవితాన్ని ఖేదంతో గడపటమే గదా? కనుక తాను రోమ్‌కు శాశ్వతంగా నీళ్ళధార వొదలక తప్పదు. ఈ జన్మలో, ఈ బొందితో రోమన్ తీరాల మీద కాలుపెట్టలేడు!
అయితే, యుద్ధమన్నా భయంగానేవున్నది. దీన్ని తప్పించుకొనే మార్గం లేదు కనుక, ముందుకు సాగుదామనుకుంటున్నాడేగాని, సమరంలో తన సామర్థ్యాన్ని నమ్మి మాత్రం కాదు. పోనీ యుద్ధమైనా వెనువెంటనే సాగలేదు. ఇరుపక్షాలవారూ ఒకరిని చూసి మరొకరు ఈర్ష్యజెందుతూ, ఏర్పాట్లను ఇంకా కొనసాగించటంలోనే ఉన్నారు. ఈ విధంగా ఎంతకాలంవరకూ ఈ యుద్ధం వాయిదాపడితే, తనకు అంత మేలనే ధోరణిలోకి ఏంటనీ దిగాడు. ఎందుకంటే తన జీవితంలో క్లియోపాత్రాతో సుఖపడగలిగే రోజులు దగ్గిరపడినవని తనకు తెలుసు. ఎంత అవకాశముంటే అంతవరకన్నా ఆ సౌఖ్యాన్ని పొంది, జీవితానికి దక్కింది ఇదే కదాననే తృప్తన్నా మిగులుతుందని అతని ఆశయం. కొన్నాళ్ళుగా తన రోమన్ సేనానులు ఈ యుద్ధం వద్దని ఏంటనీకి సలహాలిస్తున్నారు. ఏంటనీలాటి దేశభక్తుడు రోమ్‌మీద కత్తిదూయటాన్ని, అందునా క్లియోపాత్రాకు సహాయంగా ఎదురాడటాన్ని రోమన్‌లు ఎవరూ హర్షించటంలేదు పైగ...
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు