డైలీ సీరియల్

జగదేకసుందరి క్లియోపాత్రా--84

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీనికి జవాబు చెప్పటం అనవసరం అన్నట్లుగా తల ఆడించి వూరుకున్నాడు ఏంటనీ.
‘‘అదంతా అలా ఉంచుదాం ఏంటనీ! ఈ యుద్ధం మానుకోవటం చాలా మంచిదని నా అభిప్రాయం. నిజానికి నీవు ఇందులో కల్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఆక్టోవియన్ ఈ యుద్ధాన్ని క్లియోపాత్రా మీద ప్రకటించాడు కాని, నీ మీద కాదు కదా?’’
‘‘క్లియోపాత్రా ఒకటి, నేనొకటీనా? ఈనాడు ఈజిప్టుతో రోమ్ విరోధపడవలసిన అవసరం ఏమున్నది? అదీగాక ప్రాచ్య దేశాల పరిపాలనను నేను చూస్తున్నానుకదా! నన్ను సలహా చేయకుండానే ఈ యుద్ధాన్ని ప్రకటించడంలో అర్థమేమిటి?.. ఆక్టోవియనే నన్నూ, క్లియోపాత్రాను నాశనం చేద్దామనే రుూ పథకం వేశాడు. కాని, తన గోతిని తానే తవ్వుకుంటున్నానని త్వరలోనే తెలుసుకుంటాడు. ఇక రుూ యుద్ధాన్ని విరమించుకోవటమనే ప్రశ్న లేదు. చూడు మిత్రమా క్లియోపాత్రా పది సంవత్సరాలుగా నాకు భార్య. అందులో రహస్యమేమీ లేదు. ఆక్టోవియన్ నా భార్యను ‘కులట’ అన్నాడు. నిండు సర్వాధికార వర్గ సమావేశంలో ఆమెను తూలనాడాడు.. నీ భార్యను నీచపరిస్తే నీవు ఊరుకుంటావా? వాడి నాలుక ఖండ ఖండాలుగా తుంచివేయవా? నేను అసమర్థుణ్ణని వాడనుకుంటున్నాడు. వాణ్ని ఎదుర్కోవటం, రోమనే ఎదుర్కోవటమనే మీ అభిప్రాయమైతే నేను చెప్పవలసిందేమీ లేదు’’ అన్నాడు ఏంటనీ.
‘‘ఏంటనీ! పోనీ క్లియోపాత్రాను ఈజిప్టు పంపి, నీవొక్కడివే ఈ యుద్ధాన్ని సాగించు’’ అన్నాడా మిత్రుడు, తానిక ఏంటనీకి యుద్ధ విరమణ విషయంలో నచ్చచెప్పలేనని తేల్చుకొని.
‘‘ఏం- ఆమె అంత పిరికిదనుకుంటున్నావా? తన మీద యుద్ధ ప్రకటన జరిగింది కనుక, భయపడి ఈజిప్టు పారిపోవాలా?’’ అన్నాడు ఏంటనీ.
‘‘ఆమె యుద్ధరంగంలో వుంటే, నీ మనస్సంతా ఆమె మీదనే వుంటుంది. అదీగాక రోమన్‌లు నీ కొరకైతే హృదయమిచ్చి పోరాడుతారు కాని, ఆమె కొరకంటే, ఈజిప్టు పతాకం కింద మనసిచ్చి పోరాడకపోవచ్చు కదా!’’
‘‘ఈ ఐశ్వర్యమంతా ఆమెది. వీళ్ళకు వేతనాలిస్తూన్నదామె. ఆ కృతజ్ఞతన్నా లేకుండా పోరాడటంలో వెనుకంజ వేస్తే వాళ్ళు యోధులా? కుక్కలకన్నా హీనులైపోతారు’’.
‘‘వాళ్ళు ఏమైనా, నీవు నష్టపడతావు కదా? ఏంటనీ! ఒకవేళ నీవు విజయలక్ష్మిని చేబట్టినా, క్లియోపాత్రాతో రోమ్‌కు రాలేవు కదా! నిన్ను ఏంటనీగా మాత్రమే రోమన్‌లు పూజిస్తారు. కాని క్లియోపాత్రా భర్తగా కాదు!’’’
‘‘నాకు రోమ్‌కు రావలసిన పనే ఉండదు కనుక, ఆ ప్రశే్న రాదు!’’
ఈ మొండివాడితో వాదించి ప్రయోజనం లేదనుకున్నాడా మిత్రుడు.
‘‘నా చివరి సలహా విను ఏంటనీ! యుద్ధమే తప్పకుంటే, నీవు నౌకాయుద్ధానికి సిద్ధం కావొద్దు, భూమి మీదనే యుద్ధం చేయి. నౌకాయుద్ధంలో నీకు ప్రావీణ్యం లేదు కదా!’’
ఏంటనీ పకపక నవ్వాడు!
‘‘నౌకాయుద్ధమే చేస్తాను మిత్రమా! సముద్ర తీరాన పెట్టని కోటవలె ఉన్న మా నౌకల్ని చూశావా? నా అధీనంలో వున్న ఈజిప్షియన్ నౌకలతో ఈ యుద్ధం ఎందుకు విజయవంతం కాదో చూస్తాను గాక! అదీగాక క్లియోపాత్రా నౌకాయుద్ధానికే సముఖంగా వున్నది!’
ఆ చివరి మాట ఆ మిత్రునికి కంపరమెత్తించింది.
‘‘ఏంటనీ! ఈనాడు నీకు వ్యక్తిత్వమూ, అభిప్రాయాలూ లేవని నేను తెలుసుకున్నాను. క్లియోపాత్రా అభిప్రాయాలే నీ అభిప్రాయాలు. ఈ ప్రణయమే ప్రపంచమనే మాయలో బోర్లాపడ్డావు. నిజం తెలుసుకొని, కళ్ళు తెరిచేటప్పటికి అంతా మించిపోతుంది. ఐనా, తాగి వున్నావు. మత్తు వొదిలాక తీవ్రంగా ఆలోచించు’’
‘‘తాగే ఉన్నాను.. ఆలోచనలు దేనికి? ఆలోచనలన్నీ క్లియోపాత్రా చూసుకుంటుంది. వాటిని అమలు జరపటమే మన వంతు!’’
ఇంకేమైనా మాట్లాడితే తనకు ప్రమాదం వాటిల్లినా వాటిల్లవచ్చు. అందుకని సెలవు తీసుకొని ఆ మిత్రుడు, వెనుకకు తిరిగి చూడకుడానే తన దారిన వెళ్లాడు.
క్లియోపాత్రా చాటునుంచి రుూ సంభాషణంతా వింటూనే వున్నది. ఏంటనీ ఏ సందర్భంలోనన్నా, ఆ మిత్రుని మాటలకు లొంగిపోతాడేమోనని భయపడింది కాని, తాను సౌందర్యంతో అధికారాన్ని సాధింది. ఇప్పుడా సౌందర్యానికి అధికారమూ, ధనమూ సమకూరినవి. వీటన్నిటితో తాను ఏంటనీని బందీగా చేసింది. ఇక రుూ ప్రపంచానే్న తాను స్వాధీనం చేసుకునేందుకు తగిన ఏర్పాట్లన్నీ పూర్తయినవి. దీనికి ఏంటనీయే ఎర. ఏంటనీ భవిష్యత్ తన భవిష్యత్!
కనుక, ఎలాంటి పరిస్థితుల్లోనూ తాను ఏంటనీని విడిచివెళ్ళరాదు. ఇక్కడి సేనానులూ, రోమన్‌లూ ఏ క్షణంలోనన్నా ఏంటనీ మనస్సు విరిచేసినట్లయితే తన జీవితాశయం నేలపాలవుతుంది. తన పలుకుబడిలో ఏంటనీ ఉన్నంతకాలం తనకు భయంలేదు.
తీరా కళ్లెదుట సేనానుల తలలు వేళ్ళాదీయబడి, మొండాలనుంచి రక్తం చిమ్ముతుంటే, ఏంటనీకి కళ్ళు తిరిగినవి. తాను ఎంతో ఘోరాతి ఘోరానికి తలపడ్డాడో అతను గ్రహించగలిగాడు. ఇక చూడలేక, కళ్ళు రెండూ మూసుకొని, అందర్నీ వెళ్లిపొమ్మని ఆజ్ఞాపించి, ఒక్కడూ చాలాసేపు దుఃఖపడ్డాడు.
కొంచెంసేపయాక తన దుర్గతిని గుర్తించాడు. జన్మలో తాను చేయలేని నీచాతి నీజమైన పనిచేశాడు. ఆలోచిస్తే- ఇదేకాదు- ఇలాంటివి ఇంకెన్నో చేసినట్లు తెలిసివస్తోంది. తానీ ప్రపంచంలో ఎవరి మాటా లెక్కచేయని మొండివాడుగా తయారయ్యాడు. ఒక్క క్లియోపాత్రాయే తనకు ప్రేయసి, భార్య, గురువు, దైవంగా ఉన్నది. ఆమె ముందు రుూ ప్రపంచంలోనివన్నీకూడా అత్యల్పాలుగానే తనకు కనిపించినవి. ప్రేమపిచ్చిలో పడిపోయి, నిజంగా పిచ్చివాడయ్యాడు. కాకుంటే ఇది పిచ్చిపనిగాక, మరేమిటి?
ఆమె సౌందర్యం ముందు, తాను కుక్కకన్నా హీనంగా బతుకుతున్నట్లు అతనికి తెలిసొచ్చింది. ఆమెకూ ఇదంతా తెలుసు. తనకు లొంగిపోయిన బానిసగానే ఆమె తనను చూస్తోంది. చివరకు తనతో ఏది చెప్పినా, అది ఆజ్ఞాపించే ధోరణిలోనే ఉంటోంది. తాను ఎదురుచెప్పేందుకు వీల్లేదు. అసలు ప్రతికూలంగా మాట్లాడబుద్ధికాదు!
క్లియోపాత్రా కేవలం దేవసుందరే కాదు, మాంత్రికురాలు కూడాను! కాకపోతే తనబుద్ధి ఏమైంది? తనకు వ్యక్తిత్వమనేది ఒకటి వున్నదా అనే సందేహం కలుగుతోందిప్పుడు. అసలు ఈ యుద్ధంకానీ, తాను తన మాతృదేశంమీద కత్తిదూయటం కానీ, దేశద్రోహిగా ముద్రవేయబడినా అంగీకరించటం కానీ- చివరకు మహాపతివ్రత ఆక్టోవియాకు నిష్కారణంగా విడాకులివ్వటంలోకానీ, రోమ్‌లోని తన సంతానాన్ని సైతం మర్చిపోవటంగానీ ఎలా జరిగినవి? అప్పుడు తన మనుస్స ఎలా పనిచేసి ఉంటుంది?
మనస్సు! అసలు తనకు మనస్సంటూ ఒకటి వున్నదా? ఆమె దాన్ని కూడా స్వాధీనం చేసుకొని, తన నొక ప్రాణమున్న బొమ్మగా చేసి పారేసింది. ఆమె పలుకుబడికి సీజరంతటి ఉక్కు మనిషే గిరికీలు తిరిగిపోయి, ఎంతో ప్రయత్నంమీద నిలదొక్కున్నాడు. తనకు అలాంటి అవకాశం రాలేదు. ఒకవేళ వచ్చినా, తాను దుర్వినియోగపరచుకున్నాడు. ఇప్పుడంతా మించిపోయింది. విచారించి లాభమేమిటి?
ఇంతవరకూ అమృతప్రాయంగా వినిపించిన ఆమె మాటల వెనుక దాగిన విషం, దావానలం వేడి తెలిసి వస్తోంది. ఈ ఒక్క స్ర్తికోసం తను ఎంత పతనమయ్యాడు! ఎంత ఎత్తునుండి కిందకి పడిపొయ్యాడో చూసుకుంటే, గుండె పగులుతోంది. ఒక నిండు జీవితాన్ని, మేరుపర్వతమంత కీర్తిని ఒక సుందరి కోసం బలిపెట్టిన నీచుడు తాను!
- ఇంకాఉంది

ధనికొండ హనుమంతరావు