డైలీ సీరియల్

పూలకుండీలు -2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణాష్టమి రోజున ఉట్టి స్తంభాన్ని పాకడానికి ప్రయత్నించినకొద్దీ తెగజారిపోయినట్టు వాళ్ళ చేతుల్లోనుండి ఎల్లయ్య కుటుంబమంతా జారిపోసాగింది.
నడిరోడ్డుమీద జరుగుతున్న ఆ గలాటాను అక్కడ చేరిన జనమంతా అలా గుడ్లప్పగించి సినిమా చూసినట్టు చూడసాగారు తప్ప ఒక్కరన్నా కలుగజేసుకుని ‘‘ఏమిటిందా?’’ అంటూ అడిగిన పాపాన పోలేదు.
హాస్పిటల్ ముందు జరుగుతున్న గందరగోళ పరిస్థితికి భయపడిన సెక్యూరిటీ ఆఫీసర్ ‘‘ ఎందుకైనా మంచిది’’ అనుకుని ఆ వార్తను వెంటనే అక్కడున్న ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ ద్వారా పోలీసు కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేయించాడు.
ఫోన్ రిసీవ్ చేసుకున్న ఎస్సై వెంటనే ఓ పదిమంది కానిస్టేబుళ్ళను వెంటబెట్టుకొని సైకిల్ మోటార్లమీద సందు గొంతుల గుండా హాస్పిటల్ వెనుకవైపుకు చేరుకున్నాడు.
వాళ్ళకోసమే ఆతృతగా ఎదురుచూస్తున్న హాస్పిటల్ సిబ్బంది వాళ్ళను చూస్తూనే ఆ వెనుక వైపు గేట్ తీసి పట్టుకున్నారు.
ఆ గేట్ గుండా హాస్పిటల్ ముందు పక్కకు వచ్చిన ఎస్‌స్సై ‘‘హ్హే ఆగండ్రా! నడిరోడ్డుమీద ఏంటీ గోలంతా? అసలు ఎవరు వీళ్ళు? ఎక్కణ్ణుండొచ్చారు? ముందు వాళ్ళను వదలండీ!’’ అంటూ హాస్పిటల్ సెక్యూరిటీ గార్డులను గద్దించాడు.
‘‘ఏమో సార్! వీళ్ళెవరో మాకు తెలియదు. మాకీమధ్యనే కొత్తగా కాంట్రాక్ట్ వచ్చింది. మేం మొన్ననే ఛార్జి తీసుకున్నాం. హాస్పిటల్ ముందుకొచ్చి గొడవ చేస్తున్నరని ఎల్లగొట్టడానికొచ్చామంతే’’ ఎల్లయ్యను గురించి కొంత తెలిసినా ఏమీ తెలియనట్టు, ఆ ట్రాఫిక్ జామ్‌లో తమ ప్రమేయమేమీ లేదన్నట్టు బదులిచ్చిన హాస్పిటల్ సెక్యూరిటీ గార్డులు తమ పట్టులో వున్న ఎల్లయ్య కుటుంబాన్ని విడిచిపెట్టి ఓ పక్కకు ఒదిగి నిల్చున్నారు.
‘‘ఏవూర్రా మీది? ఈ రోడ్డు మీ తాతగారిదనుకుంటున్నారా? లేకుంటే మీ పల్లె బస్సులు తిరిగే డొంక రోడ్డనుకుంటున్నారా? ఇంత ట్రాఫిక్ రోడ్డుమీద నాటకాలేస్తున్నారేంటి? ముందు రోడ్డుమీద నుండి లేచి పక్కకు జరగండీ!’’ తుపాకీ గొట్టంలో మందు దట్టించి పేల్చినట్టు గొంతులో పోలీస్ దర్పాన్ని గట్టిగా దట్టిస్తూ గర్జించినట్టుగా అన్నాడు ఎస్సై.
‘‘మాది పాలొంచ సార్!’’ ఏ మాత్రం నదురు బెదురు లేకుండా ఎస్సైకి సమాధానమిచ్చాడు ఎల్లయ్య.
ఎల్లయ్య మాట తీరుకు కొంచెం చిర్రెత్తుకొచ్చినా ఎస్సై తమాయించుకున్నాడు. ‘‘ఎక్కడో పాల్వంచ నుండి ఇక్కడికొచ్చి ఎవ్వరి సపోర్టు లేకుండానే హాస్పిటల్ ముందు బైఠాయించి ట్రాఫిక్ జామ్ చేసి కూడా వీడు ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు!? వీడింత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే నిజంగానే ఈ హాస్పిటల్ వాళ్ళు వీడి భార్యనేదన్నా చేసి వుండాలి. లేదా వాళ్ళ దగ్గర్నుండి డబ్బులు గుంజడానికి వీడే ఏదన్నా నాటకమన్నా ఆడుతుండాలి. కాకపోతే వీళ్ళను చూస్తుంటే అంత నాటకం ఆడేవాళ్ళ మాదిరిగా కన్పించడంలేదు. మొత్తంమీద వీళ్ళకేదో గట్టిదెబ్బే తగిలింది. అందుకే వెనుకా ముందూ చూసుకోకుండా రోడ్డెక్కారు’’ గంజాయి వనంలో తులసి మొక్కలా సగటు పోలీస్ అధికారికి భిన్నంగా ఆ క్షణంలో ఎందుకోగాని ఎల్లయ్య వాళ్లను గురించి కొంత ఆలోచన చేసి ‘‘మరిక్కడెందుకిలా గొడవ చేస్తున్నారు?’’ సహనాన్ని అరువుతెచ్చి పెట్టుకుంటూ నెమ్మదిగా అడిగాడు.
‘‘ఏంజెయ్యమంటారు సార్! ఈ ఆస్పత్రోల్లు నా భార్యను యాన్నో దాసిపెట్టారు. నా భార్యను నాకు కల్లజూపించండని వారం రోజులు ఆస్పత్రి సుట్ట పిల్లికూన లెక్క తిరిగినా. నా మాట సెవున బెట్టకపోగా ఈ సెక్యూరిటీ గార్డులతోని నన్ను గేట్లకు గూడా రాకుంట పిచ్చికుక్కను తరిమినట్టు తరిమిండ్రు. పోనీ నా ఎతా, చితా ఎవరికన్నా చెప్పుకుందామంటే ఇంత పెద్ద పట్నంలో మాకెవరున్నారు? ఒకవేళ వున్నా పూట గంజికి ఠికానా లేని మాలోంటి గుడ్డలోల్లను ఎవరు దేకుతరు?
దాంతోటి ఏంజెయ్యాల్నో తోసుబాటు కాక ఆకరికి వుంటే కుటుంబమంత ఈమందిల వుందాం, పోతే ఆమందిల కలిసిపోదాం అనుకొని వచ్చి రోడ్డెక్కినం. జర మీరన్న కలుగజేసుకొని నా భార్యను నాకు ఒప్పజెప్పిస్తే ఎంటబెట్టుకొని మా తోవన మేం బోతం. లేకుంటె మా అమ్మ చెప్పినట్టు కుటుంబమంత ఆ వుస్సేన్ సాగర్ల దూకి సస్తం’’ అరిచీ అరిచీ జీరబోయిన గొంతుతో తన గోడునంతా వెళ్లబోసుకున్నాడు ఎల్లయ్య.
సరిగ్గా అదే సమయంలో జుమ్మా నమాజ్ ముగించుకొన్న వాళ్లంతా ఒక్కసారిగా రోడ్లమీదికొచ్చారు. ఎల్లయ్య వాళ్ళ మూలంగా అప్పటికే కిలోమీటర్ల దూరం జామైపోయిన ట్రాఫిక్‌కు తోడు వాళ్ళూ వచ్చి జతగలిసేసరికి రోడ్లన్నీ జన ఉప్పెనతో స్తంభించిపోయినట్లయింది. ఆ పరిస్థితికి ఒక్కసారిగా అదిరిపోయిన ఎస్‌ఐ ‘‘ఇప్పుడు మనం ఏ మాత్రం అలసత్వం చూపించినా పరిస్థితి ఎటుపోయి ఎటు వస్తుందో తెలియదు. అసలే ఇది హోంమినిస్టర్ వెళ్ళే రోడ్డు’’ అనుకుని ఆ వెంటనే పోలీసుల వంక తిరిగి ‘‘యాక్షన్‌లోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చెయ్యండి’’ అంటూ హుకుం జారీచేశాడు.
అంతే!
తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు చెవులు చిల్లులుపడేలా విజిల్స్ ఊదుతూ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించటందుకు ముందుకు దూకారు.
అప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకున్న ఎస్‌ఐ ఎల్లయ్య వాళ్ళవంక చూస్తూ.. ‘‘మీరో గంటసేపు ఆ ఫ్లైఓవర్ కింద కూర్చోపోండి! ఈ ట్రాఫిక్ క్లియర్ అయిపోగానే మిమ్ముల్ని తీసుకుపోయి హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడుతాను గాని’’ అంటూ ఆ పక్కనే వున్న ఫ్లైఓవర్ కిందికి పంపించాడు.
అక్కడ ఏదో ఒక గందరగోళం తప్పకుండా జరుగుతుంది. దాన్లోనుండి ఎంతో కొంత తైలాన్ని పిండుకుందామనుకుని ఎదురుచూస్తూ ఆ పక్కనే నిల్చున్న ఆ ఏరియా గల్లీ లీడర్లు చూస్తునే ఉన్నారు. ఏమీ జరగలేదేమి అన్నట్టు ఉంది వారి ముఖం.

- ఇంకా ఉంది

-శిరంశెట్టి కాంతారావు