డైలీ సీరియల్

ట్విన్ టవర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త సీరియల్ ప్రారంభం

**

టాక్సీ ఎయిర్‌పోర్ట్ ముందు ఆగింది. ఇంత దూరంగా ఆపావేమయ్యా అని అన్నయ్య దబాయించాడు.

‘‘ఇంతే సర్! ఇంతకంటే ముందుకు పోనీయరు’’ సమాధానమిచ్చాడు టాక్సీవాల!
‘‘సామాను లోపలకు తీసుకువెళ్ళమన్నారా’’ అంటూ నలుగురు చుట్టుముట్టారు. మరొకడయితే ట్రాలీ తీసుకువచ్చి జబర్దస్తీగా సామాను దానిమీద పెట్టేశాడు.

ఎయిర్‌పోర్ట్ చాలా ఎక్స్‌పాన్షన్ చేశామని పేపర్స్‌లో చదవడమే కాని, రావాల్సిన అవసరం లేకపోవడంతో ఎప్పుడూ రాలేదు.
చాలా హడావిడిగా ఉంది. వెళ్ళే పాసెంజర్ ఒక్కరే అయినా, పంపేవాళ్ళు ఎక్కువగా ఉన్నట్లున్నారు.
ఎంట్రెన్స్ దగ్గరకు రాగానే, అన్నయ్యని లోపలికి పోనీయలేదు. ఇది దాటి వెళ్ళకూడదు సార్! టికెట్ ఉన్నవాళ్ళే ఇటు వెళ్ళచ్చు. మీరు ఎంట్రీ టికెట్ కొనుక్కుంటే అటు వెళ్లి వాళ్లను కలవచ్చు అని నన్ను లోపలకు పంపి, అన్నయ్యని మరోవైపు చూపాడు, డోర్ మాన్. పాస్‌పోర్ట్ టికెట్ జాగ్రత్త అన్నాడు అన్నయ్య. విశాలమైన హాలు, రకరకాల ఎయిర్‌లైన్స్ కౌంటర్స్. అందరూ ట్రాలీపై సామాను పెట్టుకుని తోసుకుంటూ వెడుతున్నారు.
ఒక్క క్షణం ఆ గందరగోళం చూస్తూ నిలబడిపోయాను. అక్కడ ప్రయాణీకులను చూస్తే తరచుగా ప్రయాణం చేసేవాళ్ళు, నాలా మొదటిసారి చేసేవాళ్ళు తెలుస్తూనే ఉంది.
మొహంలో కొంచెం అయోమయం! కళ్ళల్లో కన్‌ఫ్యూజన్ కొట్టచ్చినట్లు కనిపిస్తున్నాయి. భాషతో సమస్య లేదు కాబట్టి, అన్ని చూసుకుంటూ ఎయిర్ ఇండియా కౌంటర్ వైపుకు నడిచాను.
పాస్‌పోర్ట్, వీసా, టికెట్ అన్నీ చూసి, సామాను తూచి, సెక్యూరిటీ చెక్‌కి పంపారు. అన్నీ తీసుకుని, రెండు టాగ్స్ చేతిలో పెట్టారు.
అటువైపు వెళ్ళండి. మీకు కూడా సెక్యూరిటీ చెక్ పూర్తి అయ్యాక, మీరు సరాసరి గేటుకి వెళ్ళచ్చు, ఇంగ్లీషులో చెప్పింది ఎయిర్ ఇండియా కౌంటర్‌లో పనిచేసే వ్యక్తి.
అటువైపు వెడుతూ వెనక్కి విజిటర్స్ లాంజ్‌వైపు చూశాను. అన్నయ్య కనిపిస్తాడేమో అని. నా కోసమే చూస్తున్న అన్నయ్య నన్ను చూడగానే చెయ్యి ఊపాడు.
హ్యండ్ బ్యాగ్ భుజాన వేసుకుని, ఎయిర్‌బాగ్ చేత్తో పట్టుకుని లాంజ్ వైపు నడిచాను. మధ్య గేటు ఉంది. ఒకసారి చెక్ ఇన్ అయ్యాక అటువైపు వెళ్ళకూడదు.
కాని అన్నయ్యతో సంభాషించడానికి ఏమీ అడ్డు లేదు. కాని ఒకటే రణగొణ ధ్వని. రైలు స్టేషన్ కంటే తక్కువేమీ లేదు. అయితే కూల్ డ్రింక్స్, కాఫీ, టీ అని అరిచే వెండర్స్ లేరు. అక్కడికంటే కొంచెం శుభ్రంగా ఉంది. ఏసి మూలంగా చల్లగా ఉంది.
ఏమీ కంగారు పడకు. విమానం నిండా మనాళ్ళే. రిసీవ్ చేసుకోవడానికి వౌళి వస్తాడు.
‘‘....’’
చేరగానే ఫోన్ చేయమని చెప్పు వాడికి! తల ఊపాను.
‘‘పెద్దమావయ్యకి కోపం వచ్చిందని చెప్పు. పెళ్లి అమెరికాలో చేసేసుకుంటున్నందుకు. మేమందరం చూడకుండా చేశాడని.
నవ్వాను. ‘‘నువ్వూ వదిన వస్తే బావుండేది అన్నయ్యా!’’ అన్నాను.
ఇక్కడ పరిస్థితి నీకు తెలియనిదేముంది? అయినా నా రిప్రజెంటేషన్ వస్తున్నాడుగా, నీ రాజకుమారుడు. నవ్వాడు.. మళ్లీ అన్నాడు. చాలా సంతోషించానని కూడా చెప్పు. ఓ తెల్ల అమ్మాయిని కాకుండా, మనవాళ్ళ పిల్లనే చేసుకుంటున్నందుకు’’.
మళ్లీ నవ్వాను. ఇంతకీ నీ మూడ్ ఎలా ఉందని చెప్పను, కోపమా! సంతోషమా? అన్నాను.
‘‘రెండూను! ప్రస్తుతం నీ మనసుకు మల్లేనే!’’
కళ్ళెత్తి అన్నయ్య వంకే చూచాను. నా మనసును పుస్తకంలా చదవగలడు.

-ఇంకా ఉంది

రమాదేవి చెరుకూరి