డైలీ సీరియల్

యమహాపురి 29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సార్! మీ ప్రశ్న నా నిజాయితీని శంకిస్తోంది. మొబైల్ కూసేలోగానే మాట్లాడ్డం ఆపేసి నా నిజాయితీని నిరూపించుకున్నాక కూడా...’’ అన్నాడు యోగి.
శ్రీకర్ నవ్వాడు. ‘‘వెరీ ఇంటెలిజెంట్! నిజాయితీని నిరూపించుకున్నట్లు చెబుతూనే పది నిముషాలైపోయింది. కాబట్టి ఇక మాట్లాడనని పరోక్షంగా చెప్పారు. సరేలెండి, ఇకమీదట నో టైం లిమిట్, నేనడిగిందానికి బదులిస్తూండండి’’ అన్నాడు.
‘‘సార్! మనం మళ్లీ మాట్లాడ్డం మొదలెడితే- ఎంతసేపు కొనసాగుతుందో తెలియదు. లోపల్నుంచి మేడమ్ హోంవర్క్ అంటూ మీకో లిమిట్ చెప్పారు. మరి అది నాకూ వర్తిస్తుందా?’’ అన్నాడు యోగి.
శ్రీకర్ అతణ్ణి చురుగ్గా చూసి, ‘‘నాతో మాట్లాడ్డానికి పెద్ద పెద్దవాళ్లే భయపడతారు. మీరేమిటీ- నాకంటే చిన్నయుండీ- చిన్ననాటి స్నేహితుడిలా మాట్లాడుతున్నారు!’’ అన్నాడు.
యోగి అతనితో చూపులు కలపలేక తల దించుకున్నాడు. తర్వాత నెమ్మదిగా, ‘‘అడిగారు కాబట్టి- ఇప్పుడు మీకు నేను నా గురించి కొంత చెప్పాలి’’ అన్నాడు.
శ్రీకర్ చెప్పమన్నట్లు చూశాడు. యోగి మొదలెట్టాడు.
యోగిది కృష్ణా జిల్లాలో ఓ పల్లెటూరు. బంగారం పండే పదెకరాల మాగాణి ఉంది. పట్నంలో బంగారం వ్యాపారం ఉంది. అన్నీ తండ్రి చూసుకుంటాడు. యోగి తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు.
యోగి బీకాం చదివాడు. ఉద్యోగానికి ప్రయత్నించడంలేదు. అవసరమైనపుడు తండ్రికిసాయపడుతూ మిగతా సమయాల్లో సమాజానికి ఉపయోగపడే పనులు చెయ్యాలని అతడి తాపత్రయం.
‘‘నాకు వ్యవసాయంలో ఆనుపానులు తెలుసు. వ్యాపారపు కిటుకులు తెలుసు. బాగా డబ్బుంది. ఇంకా సంపాదించాలన్న కోరిక లేదు. అందువల్ల నాకు తగినంత తీరుబడి కూడా ఉంది. ఆ తీరుబడి సమయాన్ని సమాజం కోసం ఉపయోగించాలని నా ఆశయం’’ అన్నాడు యోగి.
శ్రీకర్ నవ్వి ‘‘లేనివాళ్లకి అన్నదానం చెయ్యండి. ఉన్నవాళ్లకి- బంగారం న్యాయమైన ధరకి సరఫరా చెయ్యండి. మీలాంటివాళ్లు సమాజానికి చెయ్యగల సేవ అదే- ప్రస్తుతానికి’’ అన్నాడు.
‘‘సార్! నేను సినిమాలు తియ్యాలనుకోవడం లేదు. రాజకీయాల్లో చేరాలనుకోవడం లేదు. పేరుకోసం తాపత్రయం పడ్డంలేదు. సమాజం కోసం ఏమైనా చెయ్యాలని సిన్సియర్‌గా అనుకుంటున్నాను. నాలాంటివాణ్ణి సీరియస్‌గా తీసుకోవడం మీ వంటి సిన్సియర్ ఆఫీసర్ల బాధ్యత సార్!’’ అన్నాడు యోగి.
యోగి ముఖంలో లేత ఎరుపు. పెదవుల్లో సన్నని వణుకు. కళ్ళలో చిన్నగా విషాదం.
శ్రీకర్ అది గమనించి, ‘‘నిజమే, నేను సిన్సియర్ ఆఫీసరునే! కానీ ఆర్డర్సు నా సుపీరియర్స్ నుంచి తీసుకుంటాను. కంప్లయింట్స్ సామాన్యులనుంచి తీసుకుంటాను. ఎవరో జగదానందస్వామి నుంచి ఆర్డర్సూ తీసుకోను. ఆయన రికమెండేషనూ పట్టించుకోను. ఆ తెచ్చుకున్నది డబ్బుకి లోటులేని ఓ భాగ్యవంతుడి కొడుకైనా సరే పట్టించుకోను. అండర్‌స్టాండ్!’’ అన్నాడు.
‘‘అయ్యో! నా మాటలు మీకిలా అర్థమయ్యేయా’’ అన్నాడు యోగి కొంచెం నొచ్చుకుని. ‘‘నాకు డబ్బున్నా, వ్యాపారం చిట్కాలు తెలిసినా- చొరవ తక్కువ. మొహమాటం ఎక్కువ- సార్! నాకున్న స్నేహితులు కూడా చాలా తక్కువ. అలాంటి నేను జగదానంద స్వామిని కలుసుకున్నాక- మీవంటి పోలీసాఫీసరుతో చిన్ననాటి స్నేహితుడిలా మాట్లాడగలిగాను. అదీ ఆయన పవర్ సార్! అదలాగుంచితే ఆయన మీకేమీ ఆర్డరు వెయ్యలేదు సార్! మీ సాయాన్ని అభ్యర్థించమని నాకు సూచించాడు. అందుకే మీ దగ్గరికొచ్చాను’’.
‘‘జగదానందస్వామిని కలిసేదాకా- మీకు చొరవ తక్కువ, మొహమాటం ఎక్కువా అన్నారు. మరి ఒక ఆడపిల్లని ప్రేమించడానికి మహా మహా హీరో పెర్సనాలిటీసే తడబడారు కదా- ఆయన్ని కలవకముందే లతికనెలా ప్రేమించారు మీరు?’’ అన్నాడు శ్రీకర్.
‘‘ప్రేమకు ప్రయత్నం, చొరవ అవసరం అనుకోను. మొహమాటం అడ్డొస్తుందనీ అనుకోను. దానంతటదే పుట్టుకొచ్చి, దానంతటదే బయటపడేదే ప్రేమ అని నా అనుభవం చెబుతోంది’’ అన్నాడు యోగి.
ఆ మాట చెప్పడానికి అతడేమీ తడుముకోకపోవడం గమనించిన శ్రీకర్, ‘‘ఇతడి మాటల్లో నిజాయితీ ఉంది’’ అని మనసులో అనుకుని, ‘‘ఇంతకీ ఇప్పుడు మీ కోసం నేనేం చెయ్యాలి?’’ అన్నాడు శ్రీకర్.
‘‘నా కథ మొత్తం విన్నారుగా. నేను మీకు పని చెప్పడానికి రాలేదు. మిమ్మల్ని పని అడగడానికి వచ్చాను’’.
శ్రీకర్ నొసలు ముడతలు పడింది. కళ్లు చిట్లించి, ‘‘ఇది నా ఇల్లు. ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్ కాదు’’ అన్నాడు.
‘‘జీతం లేకుండా పని చేస్తానంటే- ప్రతి ఇల్లూ ఒక ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌ఛేంజ్ ఔతుంది. కాదంటారా?’’
‘‘కాదనే అంటాను. ఉదాహరణకి మా ఇల్లే తీసుకోండి. ఉత్తినే కాదు, ఎదురిచ్చి పని చేస్తామన్నా మా ఇంట్లో ఖాళీ లేదు’’ వెంటనే అన్నాడు శ్రీకర్.
‘‘ఇంట్లో ఖాళీ ఎందుకుండాలి? నేను పనిచేసేది బయట ఐనప్పుడు?’’ అన్నాడు యోగి.
‘‘పనిచేసేది మీరే అయినా, ఇవ్వడానికి నా దగ్గిర పనుండాలిగా?’’
‘‘జగదానందస్వామి గురించి ఇంకా తెలుసుకోమనండి. నరకపురి మీద నిఘా వెయ్యమనండి. ఇవ్వాలనుకోవాలి కాని, మీకు పనులకి కొదువా?’’ అన్నాడు యోగి.
‘‘ఆ పనులు నేనివ్వడమెందుకు? ఐనా అవి మీకు సంబంధించిన పనులు. మీ అంతట మీరే చెయ్యొచ్చుగా?’’
‘‘చెయ్యొచ్చు సార్! కానీ అది నాకు నేనుగా కల్పించుకున్న పనయితే- ఒక్కడుగు కూడా ముందుకెయ్యలేను. అదే ఒక పోలీసాఫీసర్ నాకప్పగిస్తే.. ’’ అని క్షణమాగి, ‘‘నేను చెప్పాలా, అన్నీ మీకే తెలుసు’’ అన్నాడు యోగి.
శ్రీకర్ ఉలిక్కిపడ్డాడు. అతణ్ణి నిశితంగా చూశాడు. తర్వాత ఆలోచనలో పడ్డాడు.
యోగికి డబ్బవసరం లేదు. ఉద్యోగావసరం లేదు. లతిక అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ ప్రేమకి ప్రతిబంధకం నరకపురి అనే ఒక ఊరు. ప్రేమకోసం ఆ ఊరిని ఎదిరించాలని అనుకుంటున్నాడు.

ఇంకా ఉంది

వసుంధర