డైలీ సీరియల్

సింధు నాగరికతలో ఓ ప్రేమకథ-17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలస్యం అయినకొద్దీ అతడిలో నిరాశ పెరిగింది. ఇటువంటి కన్య భార్యగా తనను సుఖపెట్టగలదా అనే సంశయం కూడా మొలకెత్తింది. కానీ లోలోనే ఆమె రాలేకపోవడానికి ఏదో కారణం ఉండవచ్చునేమో అనే భావన కూడా పొడసూపింది.
ఔను, తను మానసిక బలహీనతకు లోనై నకారాత్మక ఆలోచనలకు తావివ్వకూడదు. ఆమెను జీవిత భాగస్వామిని చేసుకుందామని అనుకున్నపుడు ఏ విధంగానైనా ఆమె హృదయాన్ని చూరగొనాలి. ఆమెను తనదానిని చేసుకోవాలి అని అనుకుంటూండగా దూరంగా ఓ కోమలాంగి వయ్యారంగా, నర్తనకు అలవాటుపడ్డ అడుగులతో వస్తూ కానవచ్చింది. ఆమె కాదా? కొన్ని క్షణాల తర్వాత ఆ స్ర్తి మూర్తి స్పష్టంగా కానరాగానే అతడి మనసు ఎగిరి గంతేసింది. ఆమె తన హృదయ సామ్రాజ్ఞి మోరీనే!
ఆమె కొత్త వేషధారణలో నిపుణుడైన చిత్రకారుడు వేసిన రంగు రంగుల స్ర్తి చిత్రంలా ఉంది.
ఆమె వొతె్తైన జుత్తును మధ్య పాపిడితో దువ్వుకొని నితంబాల కిందవరకు వేలాడే సువానలు వెదజల్లే రంగు రంగుల పూలజడతో సౌందర్యమూర్తిగా వెలుగొందుతోంది. తలకి చుట్టూ బంగారు పట్టీ కట్టుకుంది. పట్టీ నుంచి ఎర్రని రత్నంగల పతకం నుదుటి మధ్య వేలాడుతూ మెరుపుల సౌందర్యంలో ఆమె మెడలోనున్న హారాలతో పోటీ పడుతోంది. అమావాస్య ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నట్టు ఆమె కేశరాశిలో చిన్న చిన్న ఆభరణాలు మెరుస్తున్నాయి.
మెడలో ఓ ఎర్ర నీలం పూసలు మాలతోబాటు అజోడా కానుకగా ఇచ్చిన రేఖాకృతులు చిత్రించబడిన బంగారు రేకు బిళ్ళల హారం ఆమె నగ్న ఉన్నత ఉరోజాలపై ఊగుతూ తమ అదృష్టానికి తామే గర్వపడుతున్నట్టు ఉంది.
నడుముకు మోకాళ్ళ వరకు కంకుమ రంగు అధోవస్త్రం చుట్టుకుని దానిపై మూడు పేటలుగల వడ్డాణం పెట్టుకుంది.
పసుపు రాసుకుని స్నానం చేసిందేమో శరీరానికి పసుపు రంగు వింతైనా కాంతిని అద్దుతోంది.
ఆమె దగ్గరగా వచ్చక కూడా ఆమెనే అలా చూస్తూ ఉండిపోయాడు ఆమె ప్రియుడు.
‘‘నేనో మాట అంటే కోపగించుకోవు కదా’’ అన్నాడు అజోడా.
‘‘చెప్పండి, చిన్నయ్యగారూ’’
‘‘నేనింత చక్కని అప్సరసకి భర్తను కాగలిగితే నాకు వేరే స్వర్గం ఎందుకు? ఈ లోకమే స్వర్గంగా మారుతుంది’’.
‘‘నాకూ మీ వంటి భర్త దొరికే అదృష్టం ఉండాలి కదా’’ అంది మోరీ నవ్వి.
దాంతో అజోడాకి ఐరావతం ఎక్కి స్వర్గానికి వెళుతున్నట్లు అనిపించింది. ఆమె అలా అంటే తనను స్వీకరించినట్టే కదా!
‘‘నా ప్రియాతి ప్రియమైన మోరీ! నీ ఈ మాటలు నన్ను పరవశుణ్ణి చేస్తున్నాయి. ఇంక చూడు ఈ లోకమంతా ఏకమై వచ్చి నన్ను ఎదిరించినా వాళ్ళను మట్టి కరిపించి నిన్ను నా భార్యను చేసుకుంటా. నా మాటకు తిరుగులేదు.. రా కూచో..’’ అని తన గుండె చూపి.. ‘బండిలో..’ అన్నాడు నవ్వుతూ, పరుపును మెత్తను సరిచేస్తూ.
మోరీ గలగల నవ్వుతూ ఉరికి బండి ఎక్కి కూచుంది. బండి బయలుదేరింది.
‘‘జోగార్‌కు ఎంతసేపు ప్రయాణం?’’’ అడిగింది మోరీ.
‘‘ఐదు ఘడియలు’’ (రెండున్నర గంటలు) అన్నాడు అజోడా.
‘‘కానీ గిత్తల్ని పరిగెత్తిస్తే మూడు ఘడియలు అనుకో. కానీ మనం ప్రేమ పక్షులం కదా! మనకు తొందరేమిటి? అక్కడ భోంచేసి, విహరించి నీ కార్యక్రమానికి ముందే తిరిగి వచ్చేస్తాం’’.
‘‘మీరు నన్ను కూడా ప్రేమ పక్షిగా మార్చేస్తున్నారు’’.
‘‘బండిలో వున్నపుడు ఇద్దరం ప్రేమ పక్షులం అవుతాం కదా! ఒకరు ప్రేమ పక్షి, ఒకరు ప్రేమలేని పక్షి ఎలా అవుతారు?’’
‘‘మీతో నేను వాదించగలనా? సరే అలానే అనుకోండి’’ అంది నవ్వుతూ. అజోడా కూడా బిగ్గరగా నవ్వాడు.
దూరంగా చిన్న కొలనులో ఓ బాతు, దాని పిల్లలు ఒకే వరుసలో ఈదుతున్నాయి. ఆ దృశ్యం మోరీకి చాలా ముచ్చట కలిగించింది.
‘‘చూడండి, చిన్నయ్యగారూ, ఆ బాతూ, పిల్లలు ఎంత ముచ్చటగా ఉన్నాయో’’’ అంది ఆమె చనువుగా.
‘‘చూశా మహారాణీ!’’
‘‘నాకంత మర్యాదెందుకు?’’
‘‘ఎందుకంటే మీరు నా హృదయ రాణి కదా! మర్యాదనివ్వాలి’’.
‘‘సరే మీకు అలా పిలవడం సరదాగా ఉంటే పిలవండి. నేనూ మిమ్మల్ని దొరకారూ అంటా’’.
‘‘అలాగే పిలవండి మహారాణి! చిన్నయ్యగారు అని పిలిచేకంటే అది వెయ్యి రెట్లు నయం’’.
‘‘ఆ బాతుల్ని చూస్తుంటే నాకెలా అనపించిందో చెప్పేదా మహారాణి?’’
‘‘చెప్పండి దొరగారు’’
‘‘నేను, మా అక్క అమ్మా నాన్నలకు సంతానం. నేను మాత్రం ఆ లోటు తీర్చడానికి ఆ బాతులాగా బోలెడంత సంతానాన్ని కంటా’’.
ఆమె బుగ్గలు మందారాలయాయి. సిగ్గుతో తల వంచుకుంది.
‘‘నన్ను క్షమించు మోరీ. నేను తప్పుగా మాట్లాడి నీకు ఇబ్బంది కలిగిచానా ఏమిటి?’’
‘‘్ఫర్వాలేదు లెండి’’ అంది మోరీ.
‘‘ఓమాట అడగాలనుకున్నా. మన వివాహానికి మీ వాళ్ళకు ఏ అభ్యంతరం ఉండదా?’’
‘‘వాళ్ళకు ఏ అభ్యంతరం ఉంటుంది? వాళ్లు తలక్రిందులుగా తపస్సు చేసినా మీలాంటి అల్లుడు దొరుకుతాడా?’’
‘‘నన్ను ములగచెట్టు ఎక్కించేస్తున్నావు, ఏమిటి విశేషం?’’
‘‘ఉన్నమాటే అన్నా. నాకు ఇచ్చకాలు చెప్పే అవసరం ఏముంది?’’
‘‘‘నువ్వు అన్నది నిజమే మోరీ. ఏదో పరాచికానికి అన్నా ములగచెట్టు ఎక్కిస్తున్నావని. నీ ఆ పాట ‘కలలోకి వచ్చాడు బావ..’ పాడు.
ఆ పాట అందుకుంది మోరీ.
అజోడా పాట వింటూ తన్మయం చెంది ఉండగా బండి ఎదురుగా వస్తున్న దున్న బండిని రాసుకుంటూ పోయింది. ఆ బండి చోదకుడు బండి ఆపి ‘‘ఏమయ్యా నీ బండిని చూస్తే చాలా సొంపుగా ఉంది! నువ్వు దాన్ని ఎంతో జాగ్రత్తగానే నడపాలి కదా!
- ఇంకాఉంది

-పులిగడ్డ విశ్వనాథరావు