డైలీ సీరియల్

యమహాపురి 42

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటు ఆ గ్రామస్థులనుంచి కానీ, ఇటు మన మీడియా నుంచి కానీ- ఫిర్యాదులూ లేవు, సహకారమూ లేదు..’’ అని నిట్టూర్చాడు.
‘‘నేనో మాటంటాను సార్- ఏమీ అనుకోవద్దు’’ అన్నాడు సుందరం. శ్రీకర్ చెప్పమన్నట్లు చూడగానే, ‘‘ఇక్కడికి ఈశ్వర్ సారొచ్చారు. మధురాపురిలో నేరమన్నది లేకుండా పోయింది. ఆయన స్థానంలో మీరొచ్చారు. నరకపురి విషయం తేలిపోతుందని నాకనిపిస్తోంది’’ అన్నాడు.
‘‘ఎందుకని?’’ అన్నాడు శ్రీకర్ ఆశ్చర్యంగా.
‘‘సాక్షాత్తూ ఆ దేవుడే అవతారమెత్తినా- అన్ని పనులూ నెత్తిమీదేసుకోడు. తను వచ్చిన పని అవగానే అవతారం చాలిస్తాడు. ఈశ్వర్ సార్ ఇక్కడికి మధురాపురి పనిమీదొచ్చారు. అదవగానే మరో చోటికి వెళ్లారు. మీరిక్కడికి నరకపురి పనిమీదొచ్చారు..’’’
ఈ పొగడ్తకి శ్రీకర్ ముఖం ఎర్రబడింది. ‘‘కానీ నేనొచ్చింది మధురాపురికి..’’ అన్నాడు మొహమాటంగా.
‘‘కానీ చూడండి సార్! జయదేవ్ టిఫిన్ సెంటర్లో డబల్ స్పెషల్ చాయ్ పేరిట- ఏదో జరుగుతోందని మీరనుమానించారు. ఆ వ్యవహారంలో సర్వర్ అప్పూ పాత్ర ఉందనుకున్నారు. అతడి జీవన విధానం, వుంటున్న గదిలో సౌకర్యాలు తెలుసుకున్నారు. ఏదో వంకన స్టేషనుకి రప్పించాలనుకున్నారు. పథకం వేశారు. కానీ అనుకోకుండా అప్పూది నరకపురి అని తెలిసింది. అంటే నరకపురి గ్రామం- మీ సాయం కోరుతోంది సార్! ఈ రోజు అప్పూ, మున్ముందు ఇంకా నరకపురి వాళ్ళెందరు మీకు తగుల్తారో..’’ అన్నాడు సుందరం.
శ్రీకర్ ఉలిక్కిపడ్డాడు. మున్ముందేమిటి ఇప్పటికే యోగి తనని కలుసుకున్నాడు. అతడి ప్రియురాలు లతికది నరకపురి.
‘‘నీ మాటలు నిజమేనేమో- నరకపురి నన్ను పిలుస్తోందేమో!’’ అని, ‘‘ఆ నరకపురి పిలుపే నిన్నూ నన్నూ కలిపిందేమో- నువ్వు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం’’ అంటూ శ్రీకర్ టేబుల్ సొరుగులోంచి ఓ పేపర్ కటింగ్ తీసి అతడికి అందించాడు.
‘‘ఏమిటిసార్- ఇది?’’ అన్నాడు సుందరం.
‘‘అందులోని ఫొటోలో ఉన్న వ్యక్తుల్ని శ్రద్ధగా చూసి గుర్తుపెట్టుకో. వీళ్ల గురించి ఆరా తియ్యాలి- అదీ గోప్యంగా. నేడు అప్పూని ఇరికించినంత గోప్యంగా..’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఎవరున్నారు సార్ ఇందులో? మరో నరకపురి కేసా?’’ అంటూ సుందరం యథాలాపంగా ఆ ఫొటోకేసి చూసి ఉలిక్కిపడ్డాడు. ఫొటోని మరోసారి చూశాడు. కాసేపు అలాగే చూస్తుండిపోయాడు.
‘‘మన పని అంత సులభం కాదు. ఆ ఫోటో తీసినవారికికానీ, పేపర్లో వేసినవారికిగానీ- ఆ మనుషులంతా తెలియరు. వాళ్ల గురించి ఎలా వాకబు చెయ్యాలన్నది ఇప్పుడు మనం ఆలోచించాలి..’’
సుందరం ఇంకా ఆ ఫోటోనే చూస్తూ, ‘‘సార్! శివగిరి దగ్గిర చనిపోయిన బిచ్చగాడి శవానికి పోస్టుమార్టం రిపోర్టు వచ్చింది కదూ?’’ అన్నాడు.
ఆ వచ్చింది. వాడికి విషప్రయోగం జరిగింది. ఇప్పుడు వాడి సంగతెందుకూ?’’ అన్నాడు శ్రీకర్.
సుందరం సాలోనచగా, ‘‘ఊరి బయట అడుక్కుతినేవాణ్ణి విషం పెట్టి చంపాలనుకునే దరిద్రుడెవరా అని ఆశ్చర్యంగా ఉంది నాకు’’ అన్నాడు.
‘‘ఇందులో ఆశ్చర్యమేముంది? ఈ రోజుల్లో అడుక్కుతినేవాళ్ల సంపాదన మన జీతాలకంటే ఎక్కువ. వాళ్లలో కొందరు బ్యాంకులో ఖాతాలు తెరచి లక్షలకు లక్షలు దాచుకుంటున్నారు. ఈ బిచ్చగాడికి తెలివిలేక డబ్బంతా దగ్గిరే ఉంచుకున్నట్లున్నాడు. ఎవడో విషయం పసికట్టి ఈ పని చేశాడు. బిచ్చగాడు చచ్చినా పట్టించుకునేదెవరులే అని కూడా వాడి ధైర్యమై ఉంటుంది. ఈ మాట నాది కాదు నీది. మర్చిపోయావా?’’ అన్నాడు శ్రీకర్.
‘‘అప్పుడేదో అన్నాను కానీ- అదంతా అనుమానమే సార్! ఆ బిచ్చగాడి దగ్గిర అంత డబ్బుంటే పక్కనున్న బిచ్చగాళ్ళలో ఒకరికైనా తెలియకుండా వుంటుందా? వాడు చావగానే ఏదో వంకన వాడితో చుట్టరికం కలిపేవారు. వాళ్లు హంతకుణ్ణి పట్టుకోవాలనుకున్నారు తప్ప వాడి శవాన్ని తీసుకుపోతుంటే ఒక్కరంటే ఒక్కరు వాడిమీద ఆసక్తి చూపలేదు. అంతా వెళ్లి వారి వారి స్థలాల్లో కూర్చున్నారు’’ అన్నాడు సుందరం.
‘‘ఆ బిచ్చగాడి దగ్గిర డబ్బు లేకపోతే ఆ కుర్రాడెవరో ఎందుకు చంపాలనుకుంటాడు?’’ అన్నాడు శ్రీకర్.
‘‘ఈ రోజుల్లో ఏం చెబుతాం సార్! షూటింగ్ ప్రాక్టీసుకి మనం డమీలు వాడతాం కదా- అలాగే వాడు మర్డర్ ప్రాక్టీసుకి ఈ బిచ్చగాడినెన్నుకున్నాడేమో..’’ అన్నాడు సుందరం.
‘‘మర్డర్ ప్రాక్టీసా? అదేమిటి?’’ కుతూహలంగా అడిగాడు శ్రీకర్.
‘‘ఈ రోజుల్లో సమాజంలో పెద్దమనుషులుగా చలామణీ ఔతున్న చాలమాంది హత్యలకు పాల్పడుతున్నారు. వాళ్లు తమకి తాముగా హత్యలు చెయ్యలేక నిరుద్యోగ యువకుల్ని పట్టి ప్రలోభపెట్టి వాళ్లని హత్యలకి పురిగొల్పుతున్నారు. ఆ కుర్రాళ్లకి మాత్రం ధైర్యం చాలొద్దూ! వాళ్లు ప్రాక్టీసుకి ఏ రిస్కూ లేని బిచ్చగాళ్లనెన్నుకుని హత్యలు చేస్తున్నారు. తర్వాత ఆ ధైర్యంతో తమకి పురమాయించిన పని చేస్తున్నారు. ఇప్పుడు ఈ బిచ్చగాడికి విష ప్రయోగం జరిగిందా- నా ఊహ కరక్టయితే రేపు ఇలాంటి విష ప్రయోగమే కాస్త పేరున్న వాళ్ల ఇంట్లో జరుగుతుంది. వినడానికి మనం సిద్ధంగా ఉండాలి’’ అన్నాడు సుందరం.
శ్రీకర్ అతడివంక ముచ్చటగా చూసి, ‘‘నీ ఊహ కరెక్టవాలని నేను కోరుకోను కానీ- నీది ఐజి లెవెల్ బుర్ర. కానిస్టేబుల్‌గా ఉండిపోయావని బాధగా వుంది’’ అన్నాడు.
‘‘ఈమాట ఇంకెవరో కూడా అన్నారు. కానీ బాధుంటే నాకుండాలి సార్ మీకెందుకు?’’ అన్నాడు సందరం.
శ్రీకర్ మాట్లాడలేదు. అతడికి సుందరం దృక్పథం తెలుసు.
సుందరం తండ్రిది బిజినెస్ బుర్ర. కానీ ఆయన బిజినెస్ చెయ్యడు. చుట్టాలకి బిజినెస్‌లో సలహాలిచ్చి కన్సల్టెంట్ ఫీజు తీసుకుంటాడు. సుందరం అన్న బ్యాంకులో గుమాస్తా. మూడుసార్లు ఆఫీసరు ప్రమోషన్ కాదన్నాడు. సుందరం కూడా అంతే- కానిస్టేబుల్ హోదానుంచి ఎదగడానికి ఏ మాత్రం ప్రయత్నించడు.
‘‘తెలివిని స్వంతానికి ఉపయోగించుకుంటే- జీవితంలో ఎంతైనా ఎదగొచ్చు.

ఇంకా ఉంది

వసుంధర