డైలీ సీరియల్

యమహాపురి -45

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహుశా బిచ్చగాడి హత్య గురించి చెప్పొచ్చని అతడికి అనిపించింది. అదే నిజమైతే రాజా ఎక్కడున్నదీ ఇంట్లో వాళ్లకి తెలిసుండాలి.
శ్రీకర్ శ్రద్ధగా వింటున్నాడు.
‘‘అంతకు రెండ్రోజులు ముందు ఇంట్లో పనిలో ఉండగా అమ్మ కళ్లు తిరిగి పడిపోయింది. ఏ కళనుందో అత్తయ్య విసుక్కోలేదు. అమ్మని హాస్పిటల్‌కి తీసుకెళ్లి చూపించి టెస్టులు కూడా చేయించింది. ఆ రిపోర్టు ఆ రోజే వచ్చింది. అమ్మకి క్యాన్సరట. ప్రారంభ దశలో ఉన్నదట. ఉన్నపళంగా రెండు లక్షలు ఖర్చుపెట్టి వైద్యం చేయించకపోతే అమ్మ మాకు దక్కదని చెప్పింది అత్తయ్య’’ అన్నాడు గోపాల్.
‘‘గోరుచుట్టుమీద రోకటిపోటుకి ఇంతకంటే ఉదాహరణ ఉండదు’’ అనుకున్నాడు శ్రీకర్ జాలిగా. అప్పుడు అతడిలోంచీ ఇన్స్‌పెక్టర్ మాయమై ఓ మానవతామూర్తి వెలిసి, ‘‘అయ్యో, తట్టుకోలేని దెబ్బ అది’’ అన్నాడు.
‘‘ఔనండి.. అమ్మయితే వెంటనే అంది. ‘ఇప్పటికే తలమునక అప్పుల్లో ఉన్నాం. ఇంకా చిన్నాడి చదువుంది. నేను చావనైనా చస్తాను కానీ- నామీద ఒక్క పైసా ఖర్చయితే ఒప్పుకోను’ అని’’ అన్నాడు గోపాల్.
‘‘తర్వాతేమయింది?’’ అన్నాడు శ్రీకర్ ఆత్రుతగా.
‘‘అప్పుడొచ్చాడు అన్నయ్య ఎంతో హుషారుగా. జగదానందస్వామి దీవెన తనకి లభించిందన్న విషయం వాడింకా చెప్పనే లేదు. అత్తయ్య వాడికి అమ్మ జబ్బు గురించి చెప్పేసింది’’ అన్నాడు గోపాల్.
శ్రీకర్ ఇస్సురని నిట్టూర్చి వింటున్నాడు.
గోపాల్ చెబుతుంటే ఆ దృశ్యం అతడి కళ్లకి కడుతోంది.
****
తల్లి జబ్బు గురించి వినగానే రాజా హతాశుడయ్యాడు. ‘‘అంతా జగదానందస్వామి దీవెన ఇంత గొప్పదీ అంత గొప్పదీ అంటారు. మరి నా విషయంలో ఇలా జరిగిందేమిటో...’’ అని వాపోయాడు.
జగదానందస్వామి పేరు వింటూనే జయమ్మ ఉలిక్కిపడింది. విషయమేమిటని అడిగి తెలుసుకుని ‘‘అసలాయన సభకి వెళ్లి ఆయన గొంతు వినడమే అదృష్టం. అలాంటిది ఆయన పిలుపందుకుని వేదికనెక్కి ఆయనకు దగ్గరగా వెళ్లి ఆయన దీవెన అందుకోవడం మహాదృష్టం. నువ్వు నా మేనల్లుడివి కావడం, ఈ ఇంట్లో ఉండడం నా అదృష్టం. నాకంటే చిన్నవాడివైపోయేవు కానీ నీకు పాదాభివందనం చెయ్యాలనుంది’’ అంది.
ఆమె నోట అంత సౌమ్యంగా, ప్రేమగా మాటలు వినడం- ఆ ముగ్గురికీ తొలి అనుభవం. జరుగుతున్నది కలా, నిజామా అన్న సందిగ్ధంలో వాళ్ళకి మాటలు రాలేదు.
జయమ్మ అంతటితో ఆగలేదు. ‘‘పాదాభివందనం చెయ్యకపోతేనేం- స్వామి దీవెన లభించిన నిన్ను దేవుడికంటే మిన్నగా చూసుకుంటాను. ఈ రోజు నుంచీ నీ సంతోషమే నా ధ్యేయం. అందుకు నా మొదటి చర్య ఋణమాఫీ. అంటే ఈ రోజుతో నీ పాత బాకీలన్నీ చెల్లు. నా రెండో చర్య వదినకు వైద్యం. మూడో చర్య నీ తమ్ముణ్ణి అదే నా చిన్న మేనల్లుణ్ణి ఇంజనీర్ని చెయ్యడం. అన్ని ఖర్చులూ నావే’’ అంది.
ఈ మాటలు విన్న మాలతి, గోపాల్ నిశే్చష్టులైపోయారు. వాళ్లు తేరుకునేసరికి- రాజా జయమ్మ కాళ్ల ముందు సాష్టాంగపడి ఉన్నాడు. ‘‘ఏమిట్రా ఇది- లేలే’’ అంటూ జయమ్మ అతణ్ణి లేవనెత్తింది.
‘‘నువ్వు దేవతవి అత్తయ్యా! నీకు పాదాభివందనం చెయ్యడం నా కర్తవ్యం’’ అన్నాడు రాజా.
అక్కడ కాసేపు రాగబంధం, స్నేహభావం రాజ్యమేలితే ‘అంతా స్వామి దీవెన ఫలితం’ అనుకున్నాడు గోపాల్ మనసులో. అప్పుడు జయమ్మ రాజాతో, ‘‘నువ్వు నా కోసం ఒక్క పని చెయ్యాలిరా- అది చేస్తేనే నేను మీకు చేస్తానన్నవన్నీ చెయ్యగలుగుతాను’’ అంది.
గోపాల్ మనసులో బెంగ- అత్తయ్య మళ్లీ ఏం మెలిక పెడుతుందోనని.
‘‘చెప్పు అత్తయ్యా! నీ కోసం నా ప్రాణాలిమ్మన్నా ఇస్తాను’’ అన్నాడు రాజా. అతడి గొంతులోనే తెలుస్తోంది- స్వామి దీవెనకు మించి- అత్తయ్యలోని మార్పు అతడికి అపరిమితమైన సంతోషాన్నిచ్చిందని.
‘నీకు ఆయుఃక్షీణమని, చెయ్యాలనున్నా పాదాభివందనమే చెయ్యనిదాన్ని. నిన్ను ప్రాణాలెలా అడుగుతాన్రా? నువ్వు నా కోసం నా తరఫున ఓ దైవకార్యం చెయ్యాలి. అది నేనే చెయ్యొచ్చు. కానీ జగదానందస్వామి దీవెన పొందిన నీ చేత చేయిస్తేనే ఫలితం గొప్పగా వుంటుందని నమ్మకం’’ అంది జయమ్మ.
‘‘దీనికింతలా చెప్పాలా? దైవకార్యం ఎవరి తరఫున చేసినా పుణ్యమే కదా! ఏం చెయ్యాలో చెప్పు’’ అన్నాడు రాజా.
‘‘అది రహస్యం. నీకూ నాకూ మధ్యనే వుండాలి’’ అంది జయమ్మ.
ఆ రహస్యం చెప్పడానికి జయమ్మ రాజాని పక్క గదిలోకి తీసుకెళ్లింది.
గోపాల్ మనసులో ఏదో అనుమానం- దైవకార్యానికి రహస్యమేమిటని?
‘‘అత్తయ్య ఏదో మెలిక పెడుతుందేమో అమ్మ!’’ అన్నాడు మాలతితో.
‘‘లేదురా- కొన్ని మ్రొక్కులు నేను మీక్కూడా చెప్పను. దైవకార్యం విషయంలో రహస్యం దాచడం మన సంప్రదాయంలో మామూలే’’ అంది మాలతి.
ఆడపడుచును సమర్థించడం జయమ్మకి మామూలే! అది మితిమీరిన మంచితనమో- కొడుకులావేశపడితే ఉన్న ఆ కాస్త ఆధారమూ లేకుండా పోతుందన్న అభద్రతా భావమో మరి!
ఈలోగా జయమ్మ, రాజా గదిలోంచి బయటకొచ్చారు. రాజా ముఖం సంతోషంతో వెలిగిపోతోంది.
అతడు తల్లితో, ‘‘రహస్యమంటే ఏదో చాలా కష్టమైన పని అనుకున్నానమ్మా! చాలా సింపుల్!’’ అన్నాడతడు.
‘‘మనం మాట్లాడుకోవడం అయింది. ఇక మీరు మాట్లాడుకునేదేమైనా ఉంటే మాట్లాడుకోండి’’ అని జయమ్మ అక్కణ్ణించి వెళ్లిపోయింది.
‘‘అత్తయ్యేం చెప్పిందో నాకు చెప్పరా- ఎవరికీ చెప్పను. అమ్మ మీదొట్టు’’ అన్నాడు గోపాల్ రాజాతో.
రాజా ఆ మాట విననట్లు నటించాడు. తల్లితో, ‘‘టీవిలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం వస్తోందా? వాళ్లు ఆడియన్స్‌కి వేసిన ప్రశ్న ఏమిటో తెలుసా- ‘తినగ తినగ ఏది తీయనగును?’ అని.

ఇంకా ఉంది

వసుంధర