డైలీ సీరియల్

వ్యూహం-17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అవును.. మా అమ్మ గర్భంలో వన్నపుడే మా నాన్న పాట్నా వెళ్లిపోయాడు, అమ్మనుంచి విడాకులు తీసుకుని.. ఇపుడు ఎక్కడ వున్నాడో కూడా తెలియదు.. ఎలా వున్నాడో? ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలన్న ఆసక్తి మాత్రం వుంది’’
‘‘మా హాస్పిటల్లో సీనియర్ డాక్టర్ అరవింద్‌గారే మీ నాన్నగారు’’ అందామె.
‘‘అరవింద్ అని పేరున్న డాక్టర్లంతా నాకు నాన్నలవుతారా?’’
తన బ్యాగ్‌లో వున్న ఫోటో తీసి స్కందకు చూపించింది.
కన్నతల్లి ప్రక్కన సూట్‌లో దర్జాగా నిలబడ్డ వ్యక్తిని చూచాడు స్కంద. తన పోలికలు వున్నాయి ఆయనకు. అమ్మ ప్రక్కన నిలబడినంత మాత్రాన తండ్రి అవుతాడా? మళ్లీ ఏదో అనుమానం.
‘‘డాక్టర్ అరవింద్‌గారు మంగళూరులో మెడిసిన్ చదివేటప్పుడు మీ అమ్మగారితో పరిచయం ఏర్పడింది. మీ నాన్నగారి బాల్యస్నేహితుడు కాశి, అతని ప్రక్కన నిలబడింది అతని భార్య రోషిణి.. ఈ ఫోటో మీ అమ్మగారికి చూపిస్తావా?’’ అడిగింది లోహిత.
‘‘వద్దు.. అమ్మ ఫైర్ అవుతుంది.. నన్ను ఉద్యోగం మానేయమంటుంది. అరవింద్‌గారికి మాఫియా గ్యాంగులతో పరిచయాలు వున్నాయని అమ్మక్కూడా తెలుసు.. బెంగుళూరు వెళ్లిపోదామంటుంది.. మా తాతగారు, అమ్మమ్మ, మా పిన్ని బెంగుళూరులోనే ఉంటున్నారు. నా ఇనె్వస్టిగేషన్ అంతా డాక్టర్ అరవింద్‌పైనే కేంద్రీకృతమైందని తెలిస్తే మరింత ఆందోళన చెందుతుంది. నన్ను ఇక్కడ ఉండనివ్వదు.. బెంగుళూరో, అమెరికానో తీసుకువెడుతుంది.. ఆమె మనస్సు నొప్పించడం నాకు ఇష్టంలేదు.. అమ్మకు ఏ విషయం తెలియకూడదు.’’ అన్నాడతను.
‘‘ఒకసారి మీ హాస్పిటల్‌కు వచ్చి డాక్టర్ అరవింద్‌గారిని చూసి వెళ్ళండి!’’
‘‘నాకూ చూడాలని వుంది.. ఏదో ఒక మారువేషంలో వచ్చి ఎవరూ పసిగట్టకుండా ఆయన్ని చూసి వెళతాను.. అయితే నా పరిశోధన మాత్రం ఆగదు. నేర సామ్రాజ్యం కూలిపోయేదాకా నిద్రపోను.. ప్రభుత్వం నాకు అప్పగించిన బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వహిస్తాను’’ అన్నాడు దృఢ సంకల్పంతో.
అసలే ఆరడుగుల మనిషి.. మరింత ఎత్తుగా ఎదిగిపోతున్నట్లుగా కన్పించాడు. అతని చేతిని తన చేతిలోకి తీసుకుని నిమిరింది. అనురాగ స్పర్శ అది.
ఇద్దరూ సినిమా థియేటర్‌లోకి అడుగుపెట్టారు.
***
‘‘పొరపాటున మీ భార్యాభర్తల ఫొటో నా వేనిటీ బ్యాగ్‌లో పెట్టుకున్నాను మీ ఫోటో తీసుకోండి’’ అంది లోహిత ఫొటో కాశీకి తిరిగి ఇచ్చేస్తూ.
‘‘నన్ను కాదనుకుని రోషిణి వెళ్లిపోయిందిగా.. మనుషులే దూరమయ్యాక ఫొటోల మీద ఆసక్తి ఏం వుంటుంది? ఇపుడు నాకు అమితమైన ఆనందాన్ని కల్గించేది మీ మాటలే! మీరు ఎదురుగా కన్పిస్తే చాలు పరవశం చెందుతుంది హృదయం. ఆ ఆనందం చాలు ఈ మిగిలిన జీవితానికి.. ఇంకేం కోరుకోను. మిమ్మల్ని తాకాలని కూడా అన్పించదు. మీ రూపం కళ్ళముందు కన్పిస్తే చాలు, మనస్సు సన్నాయి పాట పాడుతూ వుంటుంది’’ అన్నాడు కాశీ ఆమె వైపు చూస్తూ.
అతని ఆరాధనాభావం తనకేం ఇబ్బంది కల్గించడంలేదు.
‘‘అక్టోబర్ పదో తారీఖున ‘డి’ బ్లాకులో వున్న ఆపరేషన్ థియేటర్‌లో లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్ జరిగిందా?’’
ఏదో క్యాజువల్‌గా అడిగినట్లు అడిగింది లోహిత. ఆ విషయంమీద తనకు ప్రత్యేకమైన ఆసక్తి లేనట్లుగా ఏదో ప్రొఫెషనల్‌గా అడిగినట్లు అడిగి తల మరో ప్రక్కకు తిప్పుకుంది.
‘‘ఓ రైతు ఎడ్లబండిమీద నుంచి రోడ్డుమీద పడ్డాడు.. బ్రెయిన్ డెడ్ అయ్యింది. అతని లివర్ తీసి ఓ పెద్ద పారిశ్రామికవేత్తకు అమర్చారు అదే రోజు’’ సమాధానం ఇచ్చాడు కాశి.
‘‘ఆపరేషన్స్ వీడియో కూడా తీస్తారా?’’ మళ్లీ అడిగిందామె.
‘‘అరుదుగా జరిగే పెద్ద పెద్ద ఆపరేషన్స్ వీడియో తీస్తారు.. లివర్ ప్రకాష్ జైన్ అనే పెద్ద పారిశ్రామికవేత్తకు.. ఆయన పెద్ద మొత్తం మా హాస్పిటల్‌కు ఇచ్చాడు’’.
‘‘ఆ వీడియో చూడాలని వుంది నాకు.. అటువంటి పెద్ద పెద్ద ఆపరేషన్స్ ఎలా జరిగియో చూస్తే నాకూడా కొంత అనుభవం వస్తుంది.. ఆపరేషన్ చెయ్యడానికి గుండె ధైర్యం ఏర్పడుతుంది’’ అందామె.
‘‘ముఖ్యమైన డాక్యుమెంట్స్ వీడియోలు డాక్టర్ అరవింద్‌గారి ఛాంబర్‌లో వున్న లాకర్లలో వుంటాయి. ఆయన పాట్నా, ముంబాయి వెళ్లినపుడు లాకర్ కీస్ నాకు ఇస్తాడు.. అప్పుడు చూపిస్తాను’’ అన్నాడు కాశి.
***
మధ్యాహ్నం పూట నార్త్ బ్లాక్‌లో వున్న పేషెంట్లను చూస్తూ వుంది లోహిత. పేషెంట్లకు ఏయే ఇంజెక్షన్స్ ఇవ్వాలో, ఏ టాబ్లెట్స్ ఇవ్వాలో నర్సులకు చెబుతూ వుంది.
‘‘ఓ పేషెంటు పెద్దగా శోకాలు పెడుతూ వున్నాడమ్మా! భద్రాచలం నుంచి పర్ణశాల వైపు వెళ్ళే రోడ్డుమీద పడిపోతే ఎవరో తీసుకొచ్చి హాస్పిటల్లో చేర్పించారట. తనకేం జబ్బు లేదు.. అన్నం తినకపోవడంతో నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాడట.. హాస్పిటల్‌కు వచ్చేక పెద్ద ఆపరేషన్ చేశారట.. నాకు ఎందుకు ఆపరేషన్ చేశారని మా మీద ఎగిరిపడుతున్నాడు బక్క కోపంతో’’ అంది నర్సు డాక్టరు లోహితతో.
ఆ పేషెంటును చూడాలనిపించిందామెకు.
నర్సుతోపాటు ఆ పేషెంటు వున్న రూముకు వెళ్ళింది.
బెడ్‌మీద పడుకుని మూలుగుతున్న అరవైయ్యేళ్ళ వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది.
జీవితంలో మళ్లీ ఆయన్ని చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు.
‘‘మీరా? ఇక్కడ!’’ అంది లోహిత ఆ పేషెంటు తల నిమిరి.
***
ఎదురుగా నిలబడ్డ డాక్టర్ లోహితను చూసి శేషగిరి కూడా నిబిడాశ్చర్యంతో ఊగిపోయాడు. - ఇంకా ఉంది

అలపర్తి రామకృష్ణ.. 9908587876