డైలీ సీరియల్

త్రిలింగ ధరిత్రి -- 16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుష్పం నుంచి లేచిన భ్రమరం ఒకటి నారాంబ శిరస్సుపై వాలబోయింది. ప్రభువు దానిని వారించాడు. పేరాంబ శిరోభూషణం ఒక మావి కొమ్మకు తగలబోయింది. ప్రభువు దానిని తొలగద్రోశాడు. ఆ నడకలో వారు ప్రభువుకు అతి సన్నిహితులైనారు.
కొంతసేపు వారు ఆ వెనె్నలలో వౌనంగా ఆనందం అనుభవించారు.
ప్రభువు మాట్లాడలేదు. రాణులూ మాట్లాడలేదు.
అయినా వారి హృదయాలు ఆనంద డోలికలలో ఊగిసలాడుతున్నాయి.
రమ్యాతిరమ్యంగా అలంకరింపబడి, సుశోభితమై, పరిమళమిళితమై అలరారు సువిశాల పల్యంకిక వారినాహ్వానించింది. ప్రభువు తాను కూర్చుండి వారిని తన సమీపాన కూర్చుండ జేశాడు.
‘‘ఈ రోజు వస్తుందని అనుకోలేదు’’ అన్నాడు గణపతిదేవుడు.
‘‘స్వామీ! ఆ భగవంతుడు తమ రూపంలోనే వచ్చాడనుకుంటాను’’ అంది నారాంబ.
‘‘అవును’’ అంది పేరాంబ.
ప్రభువు ఇరువురిని కౌగిలిలో బంధించాడు. వారు ప్రభువు హృదయ సీమపై ఒరిగిపోయి చేతులు ఆయన మెడమీదిగా భుజాలపై వేసి అర్థ నిమీలితలై ముఖ పద్మాలు ఆయన ఇరు కపోలాలకు జేరువ చేశారు. వారి యిరువురి కంటి వెంట రెండు ఆనంద బాష్పాలు రాలినాయి. అవి ఆయన కపోలంపై పడినాయి.
‘ఇవేమిటి?’ అన్నాడు ప్రభువు.
‘‘ఆనంద భాష్పాలు. మాకీ భాగ్యం పడుతుందని కలలో కూడా అనుకోలేదు. మా జన్మ ధన్యమైంది’’ అన్నారు ఆ రమణీమణులు.
‘‘మీరు అదృష్టవంతులే. మీరే కదా మేము కూడా. మీ ప్రేమను పొందగలిగిన మేము ధన్యులము. అనుకూలవతులైన అర్థాంగులు దొరకటం ఎంత అదృష్టం. ఆ భాగ్యం మాకు కలిగింది’’.
తోటలో చంద్రుడు నడవలేక నడవలేక నడుస్తున్నాడు. ఆకాశం ప్రశాంతంగా ఉంది. తెల్లని మేఘాలు ఉడురాజును మధ్య మధ్య తమ ఒడిలోకి తీసుకొంటున్నాయి. ప్రభువు కౌగిలిలో వారు పరవశులైనారు.
31
గణపతిదేవుడు అపార సేనావాహనితో పూర్వదేశ విజయయాత్రకు బయలుదేరాడు.
ప్రభువు కిరువైపులా ఇంద్రపాలుడు, మార్తాండవర్మ సాగుతుంటారు. దారిలో ఆయన అనేక శైవక్షేత్రాలను దర్శించి కానుకలర్పించి దేవాలయాలకు అనేక రీతుల సహాయం చేశాడు.
దారి పొడుగునా ఉన్న జొన్న చేలలో ఊచ బియ్యం, సజ్జకంకులు మొక్కజొన్న పొత్తులు, వేరుశెనగ, దోసకాయలు మొదలుగా వున్న పొలాల్లో సైనికులు జొరబడి వాటిని స్వాహా చేశారు.
సైనికాధికారులు ఆ పొలాల యజమానులను చేరదీసి వారికి తగిన పారితోషికం ఇచ్చి సంతోషపెట్టారు.
ఏరులు వాగులు నదులు ఉన్నచోటులందు నీటికి కొరత లేదు. ఆ నీరు సేకరించారు. కొన్నిచోట్ల వారు అవసరమైన చోట రాజమార్గం నుంచి ఏవైనా గ్రామాలకు పోయేదారి మూలల్లో పెద్ద బావులు తీసి వాటిని కట్టుదిట్టం చేసి గ్రామ ప్రజలకు నిత్యం ఉపయోగపడేలా చేశారు.
యుద్ధ సమయాలలో క్షతగాత్రులైన వారికి తగు వైద్య సహాయం ఏర్పాటుచేశారు. అట్టివారిలో కొందరిని అవసరాన్ని బట్టి రాజధానికి తరలించారు.
కొలనుపురము (ఏలూరు) రాజధానిగా చేసికొని కృష్ణా గోదావరీ నదుల మధ్య భూమిని తెలుగు నాయకులు ఏలుతున్నారు. వీరు నామమాత్రం వెలనాటి ప్రభువులుగా చెలామణి అవుతున్నారు.
కేశవరాజు, స్వామినాయకుడు ఎవరినీ లెక్క చేయక తమ బలిమి ఎదుటి బలిమి తెలిసికొనలేక గణపతిదేవుడితో యుద్ధానికి సన్నద్ధులైనారు.
గణపతిదేవుడు వారి అవివేకానికి నవ్వి వారిని తృటిలో ఓడించాడు.
గణపతిదేవుడు శేవణ, కర్ణాట, బాట, కళింగ, చోళ రాజ్యాలను తన హస్తగతం చేసికొన్నాడు.
‘అయ్య’ వంశ సంజాతుడైన కమ్మనాటి పాలకుడుగా నారప నాయకుని చోడ సముద్ర ప్రాంతాన్ని జయించి అశేష రత్న అశ్వగజ ధనక కనక వస్తు వాహనాలను రాజధాని ఓరుగల్లుకు తరలించాడు.
ఈ జైత్రయాత్రలో ఇందులూరి సోమరాజులు, పెద్దగణ్ణగరాజు, గణపతిదేవుడి కిరుభుజాలై జైత్రయాత్రను దిగ్విజయం చేశారు. సోమరాజు అప్రతిమానమైన తన చాకచక్యంతో మండలేశ్వరులైన తెలుగు నాయకులను మట్టుపెట్టడం జరిగింది.
జైత్రయాత్ర కారణంగా తూర్పు ప్రాంతమంతా తన ఏలుబడి కిందకి తీసికొని వచ్చి దాక్షారామ భీమేశ్వరాన్ని సేవించి కానులర్పించాడు గణపతిదేవుడు. ఆ దేవళానికి మహారాజు ఎంతో ధన సహాయం చేశాడు.
రాజ సేవాపరాయణులైన సేనా నాయకులు అకళంక దేశభక్తి ప్రపత్తులు, ప్రకటిస్తున్న అప్రతిమానులు, బుద్ధిని బృహస్పతి సమానులు అయిన మహామాత్యులు తంత్ర నీతి వెలారుస్తున్నా తన బల పరాక్రమాలు అడుగడుగునా ప్రదర్శిస్తున్నా ఎప్పటికప్పుడు శత్రుశేషం మిగులుతూ వస్తూనే వున్నది.
కళింగ గంగ వంశపు రాజులు ఆ ప్రాంతాల సామంతులు. గణపతిదేవుడికి అశాంతిని చేకూర్చారు.
మూడవ అనంగ భీమదేవుడు అతని కుమారుడు మొదటి నరసింహదేవుడు ఉత్తర దేశాన్ని జయించిన గర్వంతో కాకతీయులపై విరుచుకపడ్డాడు.
గణపతిదేవుడు బాగా ఆలోచించి తన ప్రధాని హేమారెడ్డిని గజసాహిణి జాయపను కళింగ పైకి నడిపించాడు.
అచిరకాలంలో వారు కళింగమును తమ అధీనంలోకి తీసుకొని రావడమే గాక శాంతిని వెలయించి తిరిగి వచ్చారు.
దాక్షారామాన హేమాద్రిరెడ్డిజాయప శాసనాలను వెలయించారు. అంతేగాక గణపతిదేవుడు మోటుపల్లి, ఉప్పరపల్లి, ఏకామ్రనాథము పాకాలలో కళింగ విజయమును పేర్కొన్న శాసనాలు చెక్కించాడు.
32
వెలనాటి చోళులకు నెల్లూరు గణపతిదేవుడి కాలంలో స్పర్థలు చాలా పెరిగినాయి. నెల్లూరు నేలుతున్న చోడ తిక్కరాజు మృతి చెందాడు. మనుమసిద్ధి రాజ్యాధికారం స్వీకరించాడు. అతని దాయాదులు అక్కన్న బయ్యన్నలు అప్పుడు వెలనాటి నేలుతున్న ద్రావిడ మూడో కుళోత్తంగ భోజుని సహాయంతో మనుమసిద్ధిని పదభ్రష్టుని చేసి అతని రాజ్యాన్ని ఆక్రమించారు.
ఆ సమయంలో మనుమసిద్ధి దిక్కుతోచక తన మంత్రి, ఆస్థాన కవి, ఏడుగడ అయిన తిక్కన సోమయాజిని ఆశ్రయించాడు.
‘‘మామా! ఈ అదనున మాకు సహాయం చేయగల పుణ్యాత్ములు మీరే. మీ ప్రజ్ఞాపాటవాలతో, ప్రతిభతో ఎటులైనా ఓరుగల్లు వెళ్లి గణపతిదేవుని మెప్పించి ఆయన ప్రాపకంతో మా రాజ్యాన్ని మాకిప్పించి మమ్మల్ని మళ్లీ సింహాసనాధిపతులను చేయగల రాజనీతి కోవిదులు మీరే. మమీ అజ్ఞాతవాసం నుండి బయపడవేయండి’’ అన్నాడు.
తిక్కనామాత్యులు చిరునవ్వు నవ్వారు.
మీరు దీనిని తేలికగా తీసుకోకండి. ఇపుడే మీ పాండితీ గరిమ ప్రదర్శించగల సమయం వచ్చింది. ఏ విధంగానైనా గణపతిదేవులను మెప్పించి అర్థించి మాకు న్యాయం చేయండి. ‘అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ..’

-అయ్యదేవర పురుషోత్తమరావు