డైలీ సీరియల్

త్రిలింగ ధరిత్రి -- 17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుమసిద్ధి తిక్కనామాత్యుల పాదాక్రాంతుడైనాడు. తిక్కన సోమయాజి మనుమసిద్ధిని లేవదీసి-
‘‘మహారాజా! మీకెందుకు ఇంత ఆవేదన. విక్రమ సింహపురి రాజ్యం గురించి నాకు తెలియదా! నాకు మాత్రం బాధ్యత లేదా? మీరు సింహాసనాధిష్టులు కాని సమయం నేను చూడగలనా? మీరు ఇంతగా ఆవేదన వ్యక్తం చేయడం దేనికి? నేను రేపే బ్రాహ్మీముహూర్తంలో ఓరుగల్లు పయవౌతాను. నా వెంట నా శిష్యగణముంది. గురునాధుడున్నాడు. అందరం బయలుదేరుతాం. మార్గమధ్యంలో కూడా అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి సమయానికి గ్రంధస్థం చేయడానికి అతనే ఉండాలి. దారిలోనే రచనా వ్యాసంగం జరుగుతుంది. సామాన్యులుగానే ప్రయాణం చేస్తూ ప్రకృతి సౌందర్యాన్ని దర్శించుకుంటూ హరిహర క్షేత్రాలు దర్శించుకుంటూ సమయానికి ఎక్కడైనా ఏ ఏటి ఒడ్డుననైనా అనుష్టానం పూర్తిచేసుకుంటూ వీలైనంత త్వరలో కాకతీయ బలగంతో చేరుకుంటాను. ఈ రాత్రి వాయువేగ మనోవేగంతో పయనించే అశ్వాలను సిద్ధం చేసుకుంటాను. నా ధర్మం నేను నెరవేరుస్తాను. ఆ హరిహర నాధుడు రంగనాధుడు మనలను తప్పక కరుణిస్తాడు’’.
‘మహాప్రసాదం’ అంటూ మనుమసిద్ధి మళ్లీ పాదాభివందనం చేశాడు.
‘‘మహారాజా! నేను నా విధి నిర్వహిస్తాను. జయం సాధిస్తాను’’.
గణపతి దేవుడు శైవుడు, బ్రాహ్మణ భక్తి కలవాడు. పైపెచ్చు సాహిత్యాభిమాని. జయప్రదమైన రాయబారం నెరపుతాను. మీరు నిశ్చింతగా ఉండండి.
మనుమసిద్ధి చేతులు జోడించాడు.
మనుమసిద్ధి కంటి వెంట రెండు బిందులు రాలినాయి.
తిక్కన మనుమసిద్ధిని కౌగిలించుకున్నాడు.
‘‘మామా! నీదే భారం’’.
‘‘ఇక ఆ విషయం మరిచిపోండి. మిమ్మల్ని మళ్లీ విక్రమసింహపురి సింహాసనాధిష్టులను చేయటం నా విధి. విధి నిర్వహణలో ఈ బ్రాహ్మణుడు అపర చాణుక్యుడు. నేటినుంచి మీరు నిశ్చింతగా, శాంతిగా నిద్రపోవచ్చు.
మనుమసిద్ధి ముఖం వికసించింది. ఇప్పుడూ కంటివెంట రెండు బాష్పాలు రాలినాయి. అవి ఆనంద బాష్పాలు.
మనుమసిద్దిని సాగనంపుతూ ఉండగా గురునాథుడు వచ్చాడు. గురునాధుడు నమస్కరించాడు.
‘‘రేపు కోడికూసేలోపు. గుర్తుంది కదా శిష్యగణమంతా అశ్వాలను సమకూర్చుకుని తరలి రావాలి’’
‘‘మీ ఆజ్ఞ శిరోధార్యం’’.
మహారాజును నివాసం దాకా పంపిరా.
‘‘చిత్తం’’.
‘‘సెలవు’’ అన్నాడు మనుమసిద్ధి.
33
వేకువనే తిక్కన సోమయాజి గురునాధుడు శిష్యగణంతో అశ్వరూఢులై ఉత్తరంగా బయలుదేరారు.
తిక్కనామాత్యుడు బంధువులున్నచోట ఏరులున్నచోట ఆగుతూ వచ్చారు. స్నాన సంధ్యలు భోజన భాజనాలు ఏ లోటు లేకుండా జరుగుతున్నాయి ఆ బ్రాహ్మణ సేనకు.
వేకువనే ప్రయాణం. ఏటి ఒడ్డున అనుష్టానం. మళ్లీ ప్రయాణం. మిట్టమధ్యాహ్నం భోజన సమయానికి తెలిపిన ఊరు బంధువులు స్నేహితులు అభిమానులు ఉన్న చోట విశ్రాంతి, సాయంత్రం మళ్లీ ప్రయాణం. మళ్లీ రాత్రి ఎక్కడైనా విశ్రాంతి. ఈ రకంగా ప్రయాణం సాగింది. మధ్యమధ్య ఎక్కడైనా మనోజ్ఞమైన ప్రదేశంలో ప్రకృతి సౌందర్యం ఆస్వాదిస్తూ గురునాధుడితో సాహిత్య చర్చ.
గురునాధుడు వెంట ఉండటంవల్ల తిక్కనామాత్యులకు ఎంత దూరం ప్రయాణం చేసినా చేసినట్లు లేదు.
ఆ రాత్రి ఏకశిలానగరం చేరుకున్నారు. గణపయామాత్యులవారు స్వాగతం పలికి కుశల ప్రశ్నలు వేశారు.
స్నానం భోజనం అయిన తరువాత గణపయామాత్యులు తిక్కన సోమయాజి వెనె్నలలో పడకలు వేశారు.
గురునాధుడు అందుబాటులో పడుకున్నాడు. తక్కిన శిష్యగణం సమీపంలో శయనించారు.
34
ఉదయం స్నానానుష్ఠానం అనంతరం గోక్షీరం సేవించిన తరువాత తిక్కనామాత్యుడు, గణపయామాత్యులు, గణపయామాత్యులవారి గృహ ప్రాంగణంలో ఉన్న చలువరాతి వితర్దికపై ఆశీనులైనారు.
‘‘అమాత్యా! ఇంత దూరం ప్రయాణం చేశారు. విక్రమ సింహపురి సుభిక్షమే కదా. లేక ఏదైనా?..’’
‘‘అవును అమాత్యా! అదే ఇపుడు సమస్య. మనుమసిద్ధి భూపాలుని దాయాదులు అక్కన బయ్యనలు వెలనాటి చోళుల ప్రాపకంతో ఆయన సింహాసనానికి ఎసరుపెట్టారు. ఇపుడ మనుమసిద్ధి భూపాలుడు విగతరాజ్యుడు. ఆయనకు మాకూ ఉన్న సంబంధం మీకు తెలియంది కాదు. మామా! అనే నన్ను సంబోధిస్తాడు. ఆయన రాజు, నేను మంత్రి అని నేను ఏనాడు అనుకోలేదు. ఆయన నన్ను ఏడుగడగా భావిస్తాడు. ఆ అక్కన బయ్యనల దుర్మార్గాన్ని అణచాలి. వెలనాటి చోళులను పారదోలాలి. ఆ పని మీ అనుగ్రహంతో గణపతిదేవ ప్రభువులవారి వల్లనే అవుతుంది.
‘‘మంచిది. అటులనే. అన్నట్లు మరిచాను. మీ భారత రచన ఎంతవరకు వచ్చింది?’’
‘‘యుద్ధఘట్టంలో ద్రోణపర్వంలో ఉంది.’’
‘‘అమాత్యా! ఒక పని చేద్దాం. గణపతిదేవులకు సాహిత్యాభిమానం మెండు. మంచి కవిత్వానికి ఆయన చెవి కోసుకుంటాడు. రేపు సభ ఏర్పాటుచేద్దాం. మీ భారతం వినిపించండి.’’
‘‘తప్పకుండా’’
35
సభ నిండుగా ఉంది.
మహారాజు గణపతిదేవుడు అగ్రాసనాధిపతుడైనాడు. రాణివాసం మహారాజు వెనుక వరుసలో ఉంది.
గణపయామాత్యులు మొదలైన మహామాత్యులు, తిక్కచమూపతి మొదలైన అమాత్యులు ఏకశిలా నగర పాలకుడు మేచనాయకుడు చక్రవర్తి సర్వాధికారి తివిరి అన్నయ్య, కార్యాచరణుడు, దామయామాత్యుడు నగర ప్రముఖులు. వణిగ్వరులు, పూర్వాధికారులు, పండితులు, కవులు, సామంతులు, దండనాధులు, సైన్యాధ్యక్షులు వారి వారి ఆసనాలు అధివసించి ఉన్నారు.
తిక్కనామాత్యుడు ప్రభువుల సమీపంలో ప్రత్యేక ఆసనంపై అధివసించి ఉన్నాడు. ఆజానుబాహుడు, పచ్చని దేహపుష్టి. విశాల వక్షస్తలం నుదుటిపై తీర్చిదిద్దిన విభూతి రేఖలు కుంకుమ బొట్టు పట్టువస్త్రాలు ధరించి మిలమిలా మెరిసిపోతున్నాడు.
(సశేషం)

-అయ్యదేవర పురుషోత్తమరావు