డైలీ సీరియల్

పంచతంత్రం--11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదేచోట తన బైక్ పార్క్‌చేసి దాని పక్కనే నిలబడి ఉన్నాడు కార్తీక్. నల్లటి హెల్మెట్ ధరించి ఉండటంతో అతడి ముఖం కనపడటం లేదు. పైగా మెడ చుట్టూ నల్లటి మఫ్లర్ చుట్టుకుని ఉన్నాడు కార్తీక్.
‘‘అన్నా! అక్కడికే వెళ్తున్నా....! వాళ్ళని బాగా బెదిరిస్తా.....! బూతులు తిడతా.....! టెర్రర్ క్రియేట్ చేస్తా...! అన్నా! కొడుకులు... అందరూ మిడిల్ క్లాసోల్లు.... భయపడిపోతారు... మనం చెప్పినట్టు వింటారు.’’అంటూ చెపుతున్నాడు బాల్‌రాజ్.
ఆ మాటలు కార్తీక్‌కి వినిపించాయి. వెంటనే బాల్‌రాజ్ ముఖంమీద బలంగా ఒక గుద్దుగుద్దుదాం అనుకున్నాడు. కానీ కోపాన్ని బలవంతంగా నిగ్రహించుకున్నాడు. ఆటో అడ్డు తొలగగానే జీప్‌ను ముందుకు పోనించాడు పఠాన్. ఆ వీధిలో సరిగ్గా వాసుదేవరావు ఇంటిదగ్గర జీప్ ఆపాడు పఠాన్. బాల్‌రాజ్ జీప్ దిగి వాసుదేవరావు ఇంట్లోకి వెళ్ళాడు.
పఠాన్ మాత్రం జీప్‌లోనే ఉన్నాడు. అతడు జీప్‌ని రివర్స్ తీసుకుని తిరిగి వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. ఇదంతా కార్తీక్ చూస్తూనే ఉన్నాడు. బాల్‌రాజ్‌తో మాట్లాడే సమయంలో తన ఫాదర్, హరీష్, రవి, జైరాం వాళ్ళ ఫాదర్స్ ఎంత భయానికి లోనవుతారో కార్తీక్‌కి తెలుసు.
సరిగ్గా ఇరవై నిమిషాల తర్వాత ఇంట్లోంచి బయటకువచ్చి జీప్ ఎక్కుతున్న బాల్‌రాజ్ కార్తీక్‌కి కనిపించాడు. వెంటనే బైక్ స్టార్ట్ చేసాడు కార్తీక్. బాల్‌రాజ్ ప్రయాణిస్తున్న జీప్ తనను దాటగానే. బైక్‌ను ముందుకు దూకించి జీప్‌ను ఫాలో అవసాగాడు.
రెండు నిమిషాలలో మెయిన్‌రోడ్‌లోకి ప్రవేశించింది బాల్‌రాజ్, పఠాన్‌లు ప్రయాణిస్తున్న జీప్.
ఆ ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నదో బార్. రోజూ ఆ బార్‌లో మందుకొట్టటం బాల్‌రాజ్ అలవాటు. ఆ బార్ దగ్గర జీప్ ఆపాడు పఠాన్. ఇద్దరూ బార్‌లోకి నడిచి ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. బార్‌లో లిక్కర్ కౌంటర్ దగ్గర 1000-500 నోట్లు తీసుకోబడును అనే బోర్డు ఉంది. వాళ్లనే గమనిస్తున్న కార్తీక్ తనుకూడా బైక్‌పార్క్ చేసి బార్‌లోకి నడిచాడు. అతడికి ఓచోట కూర్చుని ఉన్న బాల్‌రాజ్, పఠాన్‌లు కనిపించారు. వాళ్ళు కూర్చున్న సీట్స్‌కి వెనకవైపున ఒక సీట్ ఖాళీగానే ఉంది. వాళ్ళవైపు వీపుపెట్టి కూర్చున్నాడు కార్తీక్. అప్పటికి బార్‌లో జనాలు పల్చగా ఉన్నారు. రెండు నిమిషాల తర్వాత వెయిటర్ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. అప్పటికే ఆ వెయిటర్ నాలుగు పెగ్గులు మందు కొట్టి తూలుతున్నాడు.
‘‘రెండు బీర్లు... రెండు ఫ్రాన్స్ ఫ్రై, రెండు పెగ్గులు విస్కీ, రెండు చికెన్ సిక్స్‌టీఫైవ్, రెండు పెగ్గులు రమ్ము, రెండు అపోలో ఫిష్...’’
పఠాన్ చెపుతూ ఉండగానే వెయిటర్ మధ్యలోనే అందుకుని.
‘‘రెండు పెగ్గులు ఓడ్‌కా, రెండు తందూరీ చికెను, రెండు పెగ్గులు బ్రాందీ, రెండు జింజర్ షికెను...నాలుగు ళెగ్గు పీషుళు.... షాళా అర్జెంటు....! రోజూ ఉండేవేగా అన్నాయిలూ....! మిమ్మల్ని షూడగానే అన్నీ రెడీ చేసేశా అన్నాయిలూ....!’’అంటూ చెప్పి నవ్వాడు వెయిటర్. తర్వాత అదే వెయిటర్ కార్తిక్ దగ్గరికి వచ్చాడు.
అతన్ని చూడగానే - ‘‘ఒక ప్లేట్ ఇడ్లీ!’’అంటూ అలవాటుగా చెప్పాడు కార్తీక్.
వెయిటర్ బిత్తరపోయి చూసాడు. తన తప్పు తెలుసుకున్న కార్తీక్.
‘‘ఓ! సారీ!! నాకు తాగే అలవాటు లేదు.’’
వెయిటర్ అన్నాడు ‘‘ఇఖడ ఎవరూ టాగరు.... కొడతాళు’’
‘‘ఏం కొడతారు?’’
‘‘...విష్కి, డ్రమ్ము, ఓడకా.’’
‘‘మరేం తాగుతారు?’’
‘‘మిణరళ్ వాట్రు, థంషాప్పు, క్రొక్రోక్రోళా...’’
‘‘ముందు ఓ థమ్స్‌అప్... తర్వాత మరో థమ్స్‌అప్...’’
‘‘ఓఖే... షార్!’’
అంటూ వెయిటర్ తూలుతూ వెళ్లిపోయాడు. అదే సమయంలో ఆ బార్ బయట ఒక బుల్లెట్ బైక్ ఆగింది. ఆ బైక్ మీద సివిల్ డ్రెస్‌లో కూర్చుని ఉన్నాడు ఎస్‌ఐ మహేంద్ర. అతడి నెత్తిమీద నలుపురంగు ఫెల్ట్‌హాట్ ఒకటి ఉంది. దాన్ని ముందుకు లాక్కుంటూ అతడు బార్‌లోకి ప్రవేశించాడు.
అతడికి పఠాన్, బాల్‌రాజ్‌లు కనిపించారు. కానీ వాళ్ళు మాత్రం అతడిని గమనించలేదు.
అంతలో ‘‘ఒకసారి అన్నతో మాట్లాడదాం...!’’ అంటూ బాల్‌రాజ్‌తో చెపుతున్న పఠాన్ మాటలు కార్తీక్‌కు వినిపించాయి. వెంటనే కార్తీక్ లేచి నిలబడ్డాడు. బార్‌లో ఎవరికోసమో వెతుకుతున్నట్లు తల తిప్పుతూ బాల్‌రాజ్‌వైపు చూసాడు. అప్పుడే ప్యాంటు జేబులోంచి సెల్‌ఫోన్ తీసాడు బాల్‌రాజ్. స్పీడ్ డయల్ బటన్ ప్రెస్‌చేసాడు, కొద్ది క్షణాల తర్వాత అవతల నుంచి అతడికి నిరంజన్ కంఠం వినపడింది.
కాని బాల్‌రాజ్ డయల్ చేసిన నెంబర్ చూడలేకపోయాడు కార్తీక్. దాంతో వెంటనే కూర్చుని, ఆ నెంబర్‌ని ఎలా తెలుసుకోవాలా అని ఆలోచించ సాగాడు... అతడిలో ఓ ఆలోచన రూపుదిద్దుకుంది.
ఈలోపు వెయిటర్ తూలుతూ వచ్చి, రెండు పెద్దపెద్ద ప్లేట్లలో పెట్టుకుని తెచ్చిన గ్లాసులు, మందు బాటిల్స్, మటన్, చికెన్ కర్రీస్‌తో నిండిన ప్లేట్స్ మొదలైనవి బాల్‌రాజ్, పఠాన్‌ల ముందు సర్దివెళ్ళిపోయాడు.
‘‘అన్నా!... నేను బాల్‌రాజ్‌ని!!... ఆ వాసుదేవరావుగాడు ఆడి ఫ్రెండ్స్‌ని బెదిరించా, బూతులు తిట్టా... టెర్రరైజ్ చేశా... అంతా భయపడిపోయారు హి...హి... హి...’’అంటూ నవ్వుతూ, ఆరోజు సాయంత్రం జరిగిన డెవలప్‌మెంట్స్ అన్నీ నిరంజన్‌కి వివరించసాగాడు బాల్‌రాజ్.
కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ బాల్‌రాజ్ మాటలను వినసాగాడు కార్తీక్.
అప్పటికి మహేంద్ర కూడా లిక్కర్ కౌంటర్ దగ్గరకు చేరుకున్నాడు, అతడు ఒకసారి తల తిప్పి బాల్‌రాజ్ వాళ్ళవైపు చూసాడు. అతడిని కార్తీక్ గమనించాడు. కానీ మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. మహేంద్ర లిక్కర్ కౌంటర్ ముందున్న స్టూల్‌మీద కూర్చుని, రెండు పెగ్గులు ఓల్డ్ ఫ్యాషన్డ్ కాక్‌టైల్ ఆర్డర్‌చేసాడు.
వెంటనే కౌంటర్‌లోని వ్యక్తి ఒక గ్లాసులో రెండు పెగ్గుల విస్కీ పోసాడు, ఆ తర్వాత కొన్ని ఐస్‌క్యూబ్స్, ఆ తర్వాత రెండు షుగర్ క్యూట్స్ వేశాడు. ఒక నారింజ కాయ ముక్కలుగా కట్‌చేసి, ఒక ముక్క నారింజ రసం గ్లాస్‌లో పిండాడు. చివరగా ఒక చిన్న నారింజ ముక్క విస్కీ గ్లాస్‌లో పడేసి, ఆ గ్లాస్‌ను మహేంద్ర ముందుకునెట్టాడు. కౌంటర్‌లోని వ్యక్తి కాక్‌టైల్ ప్రిపేర్ చేసేలోపు మహేంద్ర రెండు, మూడుసార్లు బాల్‌రాజ్, పఠాన్‌లవైపు తలతిప్పి చూసాడు. దాంతో అతడు బాల్‌రాజ్, పఠాన్‌లను గమనిస్తున్నాడని గ్రహించాడు కార్తీక్.
ఏదో ఆలోచన రావటంతో కార్తిక్ సెల్‌ఫోన్ తీసి హరీష్‌ని రింగ్ చేసాడు. అవతలినుంచి హరీష్ లైన్‌లోకి రాగానే-
‘‘నేను మెగావర్టిగో బార్‌లోఉన్నా...! వెంటనే వచ్చెయ్’’అంటూ చెప్పి ఫోన్ కట్‌చేసాడు. ఈలోపు వెయిటర్ వచ్చి కార్తీక్ ముందు కూల్‌డ్రింక్స్ పెట్టాడు.
పదిహేను నిమిషాలు గడిచాయి. హరీష్ ఇంకా రాలేదు.
అంతలో లిక్కర్ కౌంటర్ దగ్గర ఉన్న మహేంద్రని గమనించాడు పఠాన్.
‘‘అన్నా! అక్కడ కౌంటర్ దగ్గర.... ఆ మహేంద్రగాడు... నాకేదో...అనుమానంగా ఉందన్నో...!’’అంటూ బాల్‌రాజ్‌తో చెప్పాడు పఠాన్. వెంటనే-

-సశేషం

-జి.వి.అమరేశ్వరరావు