డైలీ సీరియల్

పంచతంత్రం--15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మాణంలో వున్న అపార్ట్‌మెంట్స్ వైపు చెయ్యి చూపిస్తూ ‘‘వాడు.. ఆ అపార్ట్‌మెంట్స్‌లో ఉన్నాడు. వాడి అంతు చూద్దాం..! వాడిని నరికి చంపుదాం.. కత్తులు రెడీ చేయండి. జీప్ తియ్యండి..’’ అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ పఠాన్, బైరాగిలతో చెప్పాడు బాల్‌రాజ్.
‘‘అన్నా! కత్తులు రెడీగానే ఉన్నాయ్ కానీ.. రోడ్డుమీద ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. బండిమీద వెళ్ళడంకన్నా పరిగెత్తుకుంటూ వెళ్ళడం బెటర్’’ అన్నాడు పఠాన్.
‘‘సరే!’’ అంటూ ఒక్క దూకు దూకి పరుగు లంకించుకున్నాడు బాల్‌రాజ్. అతడిని అనుసరించారు పఠాన్, బైరాగి.
ముగ్గురూ ట్రాఫిక్‌ను తప్పించుకుంటూ అండర్ కన్‌స్ట్రక్షన్‌లో వున్న అపార్ట్‌మెంట్‌లోకి దూసుకుపోయారు.
‘‘వాడు మూడో ఫ్లోర్‌లో ఉన్నాడు.. వేసేయండి.. వాడిని ఖతం చెయ్యండి!’’ అంటూ అరిచాడు బాల్‌రాజ్. అలా అరుస్తూనే మెట్లమీద థర్డ్ ఫ్లోర్‌వైపు పరుగు తీశాడు. అతడిని అనుసరించారు అతడి అసిస్టెంట్లు. వాళ్ళ కాళ్ళ కింద గజు పెంకులు శబ్దం చేస్తూ పగిలిపోయాయి.
సరిగ్గా రెండో ఫ్లోర్‌పై మెట్టుమీదకు చేరుకుంటుండగానే బాల్‌రాజ్ కుడి కాలు నేలమీద పోసిన కొబ్బరినూనెమీద పడింది. అతడు జర్రున జారుతూ బ్యాలెన్స్ నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా, ఎడమ కాలు అక్కడే పడి ఉన్న అరటి తొక్కలమీద పడింది. మిగిలిన వాళ్ల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ముగ్గురూ బాలన్స్ తప్పి హాహాకారాలు చేస్తూ మెట్లమీద నుంచి మొదటి అంతస్తు వైపు కిందకు దొర్లసాగారు.
అలా దొర్లుతుండగా మెట్లమీద పడివున్న గాజుపెంకులు కసుక్కున గుచ్చుకున్నాయి. దాంతో మరింత బాధగా అరిచారు.
మెట్లకు ఇంకా రెయిలింగ్ ఏర్పాటుచెయ్యలేదు. దాంతో వాళ్ళు మొదటి అంతస్తు నుంచి నేరుగా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఇసుక దిబ్బమీద పడ్డారు. ఇసుక దిబ్బ మీద పడటంతో ప్రాణాపాయం తప్పింది.
సరిగ్గా అదే సమయంలో-
బైక్స్‌మీద బాల్‌రాజ్ స్థావరం దగ్గరకు చేరుకున్నారు కార్తీక్, అతడి ఫ్రెండ్స్. అందరూ ముఖాలు కనపడకుండా హెల్మెట్స్ పెట్టుకున్నారు. అక్కడకు చేరుకుంటూనే భుజాలకు వేలాడుతున్న షోల్డర్ బాగ్స్‌లోంచి డీజిల్‌తో నిండిన క్యాన్స్ బయటకు తీశారు. అక్కడ వున్న చెక్క వస్తువులమీద డీజిల్ చల్లారు. కార్తీక్ అగ్గిపుల్ల వెలిగించి విసిరేశాడు. మరుక్షణం భగ్గుమంటూ అగ్నిజ్వాలలు ఎగసిపడ్డాయి. ఇక వాళ్ళు క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడినుంచి తప్పుకున్నారు.
ఇక ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇసక దిబ్బమీద పడి ముక్కుతూ, మూలుగుతూ పైకి లేచిన బాల్‌రాజ్, అతడి అసిస్టెంట్స్ ఒంటికి పట్టుకున్న దుమ్ము దులుపుకోసాగారు. అంతలో ఏదో అనుమానం వచ్చి రోడ్డుకు అటువైపు వున్న తమ స్థావరంవైపు చూసాడు బైరాగి. వెంటనే అతడి నోరు ఆశ్చర్యంతో తెరుచుకుంది. అతడు అసంకల్పితంగా-
‘‘అన్నా! అన్నా! అటు చూడు’’ అంటూ బాల్‌రాజ్‌తో చెప్పాడు.
బైరాగి చూపించిన వైపు చూసాడు బాల్‌రాజ్. తన ఇల్లు తగలబడిపోతున్న దృశ్యం అతడికి కనిపించింది. వెంటనే పెద్దగా అరుస్తూ ముందుకు పరుగు తీశాడు. ఐతే అతడు తన ఎదురుగా వున్న మూత లేని మ్యాన్ హోల్ చూసుకోలేదు. బాల్‌రాజ్ పెద్దగా అరుస్తూ మ్యాన్‌హోల్లో పడిపోయాడు. ఈ హఠాత్ పరిణామానికి విభ్రాంతికిలోనై, తేరుకుని మ్యాన్ హోల్‌లో పడ్డ బాల్‌రాజ్‌ని నానా తంటాలు పడి బయటకు లాగారు బైరాగి, పఠాన్.
డ్రైనేజీ అశుద్ధంతో అభిషేకించినట్టు కనపడుతున్నాడు బాల్‌రాజ్. అతడినుంచి వస్తున్న దుర్గంధాన్ని తట్టుకోలేక భళ్ళున వాంతి చేసుకున్నాడు.
బైరాగి ముక్కు మూసుకుంటూ-
‘‘అన్నా! .. ఇపుడు మనం ఏం చెయ్యలేం.. ఫైర్ ఇంజన్‌కి ఫోన్ చేస్తున్నా!.. వాళ్ళు ఆ మంటల్నీ.. వీలయితే నీకు పట్టిన మురికినీ వదలిస్తారు’’ అంటూ ఫైర్ ఇంజన్‌కి రింగ్ చేయసాగాడు పఠాన్.
తగలపడుతున్న బాల్‌రాజ్ ఇంటికి రెండు వందల గజాల దూరంలో నిలబడి ఉన్నారు కార్తీక్, అతడి ఫ్రెండ్స్. తన దగ్గర వున్న బాల్‌రాజ్ సెల్‌ఫోన్ నుంచి టీవీ చానెల్స్ వాళ్ళకి ఫోన్ చేసి ఫలానా చోట ఫైర్ ఆక్సిడెంట్ అయింది అనీ, త్వరగా రమ్మనీ చెప్పాడు కార్తీక్. ఫోన్ చేసిన కొద్దిసేటికి టీవీ చానెల్స్ వాళ్ల వ్యాన్లు అక్కడ ప్రత్యక్షం అయ్యాయి. అప్పటికే జనం గుమిగూడారు.
కార్తీక్ తన ఫ్రెండ్స్‌తో.
‘‘నా అంచనా కరక్ట్ ఐతే ఆ నిరంజన్‌గాడు తప్పక వస్తాడు’’ అంటూ చెప్పాడు.
* * *
తన ఇంట్లో కూర్చుని చికెన్ తింటూ, విస్కీ తాగుతూ టీవీలో వార్తలు చూస్తున్నాడు నిరంజన్. నిజానికి నిరంజన్‌కి వార్తలు చూసే అలవాటు లేదు. కానీ పెద్ద నోట్లు రద్దైన తర్వాత వార్తలు చూడటం మొదలుపెట్టాడు. టీవీలో ఎవరిదో ఇల్లు తగలబడిపోతున్న దృశ్యం లైవ్‌లో టెలికాస్ట్ అవుతోంది. ఫైర్ ఇంజిన్లు మంటల్ని ఆర్పుతున్నాయి. జనం గుంపులుగా నిలబడి చూస్తున్నారు. విసుగ్గా ఆ ఛానల్‌ని మార్చబోతూ ఏదో అనుమానంతో ఆగాడు నిరంజన్. ఆ తగలబడిపోతున్న ఇల్లు ఎక్కడో చూసినట్టు అతడికి అనిపించింది. వెంటనే అతడికి స్ఫురించింది.
అది బాల్‌రాజ్ ఇల్లు.
తాను బాల్‌రాజ్‌కు రెండు కోట్ల రూపాయల కరెన్సీ ఇచ్చిన విషయం నిరంజన్‌కు గుర్తుకువచ్చింది. వెంటనే అతడు బాల్‌రాజ్‌కు ఫోన్ చేసాడు.
* * *
కార్తీక్‌దగ్గర ఉన్న బాల్‌రాజ్ సెల్‌ఫోన్ మోగింది. కార్తీక్ సెల్‌ఫోన్ తీసి చూసాడు. నిరంజన్ లైన్‌లో ఉన్నాడు.
‘‘ఆ నిరంజన్‌గాడు లైన్‌లో ఉన్నాడు’’ అంటూ తన ఫ్రెండ్స్‌తో చెప్పి ఫోన్ రిసీవ్ చేసుకుని, అవతలినుంచి నిరంజన్ మాట్లాడే లోపే-
‘‘ఒరేయ్! నేను నువ్వు అనుకునే మనిషిని కాదురా! ... పెట్టెయ్‌రా ఫోన్!’’అన్నాడు కార్తీక్.
ఆ మాటతో షాక్‌తిన్న నిరంజన్.
‘‘రేయ్!... ఎవడివిరా నువ్వు?’’అంటూ అరిచాడు.
‘‘నీ మొగుణ్ని...!... ఈ ఫోన్ కొట్టేసినోడిని... నోరు, ఫోను రెండూ మూసెయ్యరా వెధవా!’’అంటూ ఫోన్ కట్‌చేసి, స్విచ్ ఆఫ్‌చేసాడు కార్తీక్.
* * *
ఎవడో పిక్‌పాకెటర్‌గాడు బాల్‌రాజ్ ఫోన్ కొట్టేసాడు అనుకున్నాడు నిరంజన్. అతడు వెంటనే బాల్‌రాజ్ దగ్గర ఉన్న రెండో ఫోన్‌కి రింగ్ చేసాడు. లైన్‌లోకి వచ్చిన బాల్‌రాజ్‌తో అన్నాడు.
‘‘ఎక్కడ చచ్చావ్?...’’
‘‘మ్యాన్ హోల్లో!... ఆ... అదే ఇక్కడే ఉన్నా!’’
‘‘నీ ఇల్లు తగలబడిపోతోంది నీకు తెలుసా?’’అంటూ కోపంగా అడిగాడు నిరంజన్.
‘‘తెలుసన్నా! ఇక్కడే ఉన్నా!!’’
‘‘నీ ఫోన్ ఎవడో కొట్టేశాడు... ఆ సంగతి నీకు తెలుసా? నీకు ఫోన్‌చేస్తే వాడు ఎత్తాడు.’’
‘‘తెలుసన్నా!... ఇవ్వాళ టైం దొరకలేదు... రేపు ఆ సిమ్ముని బ్లాక్ చేయిస్తా అన్నా!
‘‘వద్దు! సిమ్ము బ్లాక్ చేయించవద్దు!!... వాడు నాతో తిక్క తిక్కగా మాట్లాడాడు. అవమానించాడు. వాడిని ట్రాక్‌చేసి, ఖతం చెయ్యండి. ఆ పండిట్ గాడి హెల్ప్ తీసుకోండి.’’

-జి.వి.అమరేశ్వరరావు