డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ 30

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమెకి వెంటనే భరణి గుర్తుకు వచ్చాడు. వరుణ్‌కి భరణి మాటంటే గురి. అతడు చెబితే ఏ విషయమైనా తప్పకుండా వింటాడు. భరణి గుర్తుకు వచ్చాక ఆమెకి కొంత ధైర్యంగా అనిపించింది.
***
మర్నాడు భరణిని కలుసుకుంది హరిత.
‘‘హాయ్ హరితా, ఎలా వున్నావ్? ఏంటి ఒక్కదానివే వచ్చావు? వరుణ్ ఎక్కడ?’’ హరితని చూడగానే నవ్వుతూ పలకరించి షేక్‌హ్యాండ్ ఇస్తూ అన్నాడు భరణి.
‘‘వరుణ్ నామీద కోపంగా వున్నాడు భరణీ. నిజానికి మేమిద్దరం చాలా పెద్ద సమస్యలో వున్నాం. చెబితే వరుణ్ అర్థం చేసుకోవడం లేదు. నువ్వే ఎలాగైనా నచ్చచెప్పాలి’’ అంటూ కూర్చుని జరిగినదంతా చెప్పింది హరిత. చెబుతుంటే బాధతో హరితకి కళ్ళ నీళ్ళు వచ్చేసాయి.
భరణి ఆమెని దగ్గరకు తీసుకుని ఓదార్చాడు. ‘‘వరుణ్ వట్టి పిరికిపంద, నీలాంటి అపురూపమైన లవర్ని దూరం చేసుకుంటున్న ఫూల్’’ అంటూ వరుణ్‌ని తిట్టసాగాడు.
‘‘అలా అనకు భరణీ, వరుణ్ అంటే నాకు ప్రాణం. అతడిని నువ్వే ఎలాగోలా ఒప్పించి ధైర్యం చెప్పాలి’’ అంది హరిత అభ్యర్థనగా.
భరణి కాసేపేం మాట్లాడలేదు. ఏదో ఆలోచిస్తున్నట్టుగా సీరియస్‌గా వుండిపోయాడు. ‘‘నువ్వేమీ అనుకోనంటే ఒక మాట చెప్పనా హరితా?’’ అన్నాడు చాలాసేపటి తరువాత.
‘‘ఏమిటి భరణీ?’’ అంది.
‘‘వరుణ్ నీకు సరిపోడు హరితా’’ అన్నాడు భరణి.
ఉలిక్కిపడ్డట్టుగా అతడివంక చూసింది ఆమె. తమ ప్రేమని ప్రోత్సహించిన అతడేనా అలా మాట్లాడుతున్నది?! ‘‘ఏమిటి భరణీ నువ్వంటున్నది?’’ అయోమయంగా అంది.
‘‘పిరికివాళ్ళకి ప్రేమించే అర్హత వుండదంటారు. ఇంత జరిగినా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఇప్పటికైనా నువ్వు వరుణ్ విషయంలో రియలైజ్ కావడం మంచిది’’ అన్నాడు భరణి.
‘‘మా ప్రేమ గురించి తెలిసిన నువ్వే ఇలా అంటున్నావా భరణీ?’’ ఆశ్చర్యంగా అంది హరిత.
‘‘నిజమే హరితా, ఇలా అనడం నిన్ను బాధిస్తుందని తెలుసు. కానీ చేదుగా వున్న నిజం నిజమే కదా?! ఎవరెన్ని చెప్పినా వరుణ్‌కి వాళ్ళ నాన్నని ఎదిరించే ధైర్యం వస్తుందని నేననుకోను. గర్ల్‌ఫ్రెండ్‌ని సినిమాకి తీసుకెళ్ళాలన్నా నాలాంటివాడిమీద ఆధారపడే వాడికి అంత ధైర్యం ఎక్కడనుంచి వస్తుంది చెప్పు?’’ నెమ్మదిగా అన్నాడు భరణి.
భరణి మాటలు వింటూ విస్తుపోయింది హరిత. అంటే వరుణ్ ఇన్నాళ్ళు తనతో సినిమాలకీ, షికార్లకీ, పబ్బులకీ తిరగడానికి భరణిమీద ఆధారపడ్డాడా?! కనీసం ఎప్పుడూ తనతో మాటవరసకైనా చెప్పలేదే? అందుకేనా వరుణ్‌కి భరణి అంటే అంత భక్తి? అందుకేనా అతడు చెప్పిన దానికల్లా బుద్ధిమంతుడిలా తలూపేవాడు?! ‘మా ప్రేమకి పెద్దదిక్కువి నువ్వు భయ్యా’ అని వరుణ్ అనే మాటలకి అర్థం అదా? ఆమెకెందుకో మనసంతా చేదుగా అయిపోయినట్టనిపించింది.
‘‘ఏమిటి భరణీ నువ్వు చెబుతున్నది?’’ అంది హరిత.
‘‘నిజం హరితా. వరుణ్ వాళ్ళు చాలా కలిగినవాళ్ళే కానీ, అతడి విలువ ఇంట్లో శూన్యం. అతడి గురించి తెలిసి ఇంట్లో కనీసం పాకెట్ మనీ కూడా ఇవ్వరంటే నమ్ముతావా నువ్వు? అలాంటివాడు తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పి ఎలా ఒప్పిస్తాడనుకున్నావు? మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలాసార్లు అనిపించేది, నిన్ను ప్రేమించే అర్హత వరుణ్‌కి ఏ కోశాన లేదని. నీకు చాలాసార్లు చెప్పాలనుకున్నాను. కానీ నువ్వేమనుకుంటావో అని చెప్పలేకపోయేవాడిని’’ బాధగా అన్నాడు భరణి.
అతడి మాటలు వింటుంటే హరితకేం మాట్లాడాలో అర్థం కాలేదు.
****
వారం రోజులు గడిచాయి. వరుణ్ ఫోన్ చేస్తాడేమోనని ఎదురుచూసింది హరిత. అతడినుంచి ఫోన్ రాకపోవడంతో బాధేసింది. ఆమె వరుణ్ ఫోన్ గురించి ఎదురుచూస్తున్న సమయంలో భరణి ఫోన్ చేశాడు.
‘‘ఎలా వున్నావు హరితా’’ అన్నాడు.
‘‘బాగానే వున్నాను’’ అంది హరిత.
‘‘ఇంకా వరుణ్ గురించే ఆలోచిస్తున్నావా?’’
హరిత ఏమీ మాట్లాడలేదు. మళ్లీ భరణినే అన్నాడు ‘‘హరితా, నీకో విషయం చెప్పనా?! నేనిలా అనడం నీకు వింతగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం. నాకు నువ్వు మొదటి చూపులోనే నచ్చావ్. కాలేజ్‌లో మొదటి రోజు నిన్ను చూడగానే ఈ రూపాన్నీ, నీలోని అమాయకత్వాన్నీ ఇష్టపడ్డాను. కానీ నువ్వు వరుణ్‌ని ఇష్టపడుతున్నావని తెలిసి, ఇన్నాళ్ళూ నీకు దూరంగా వున్నాను. నీ కోసమే వరుణ్ ఎప్పుడు ఎంత డబ్బు కావాలని అడిగినా ఇచ్చేవాడిని. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు వరుణ్ నీకు సరైన జోడీ కాదని తెలుసుకుంటే అంతే చాలు. నేను నీ కోసం ఏం చేయమన్నా చేయడానికి సిద్ధంగా వున్నాను’’ నెమ్మదిగా ఒక్కోమాట తూచి తూచి మాట్లాడుతున్నట్టుగా అన్నాడు.
వింటున్నకొద్దీ హరితకి మతిపోతున్నట్టుగా అనిపించింది. ‘‘్భరణీ, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా?’’ అంది కోపంగా.
‘‘తొందరేం లేదు హరితా, బాగా ఆలోచించుకుని చెప్పు’’ అన్నాడు భరణి.
హరిత కోపంగా ఫోన్ పెట్టేసింది.
అపుడు కోపంగా ఫోన్ పెట్టేసింది కానీ, ఆ తరువాత ఆమెకి భరణీ మాటలు చాలాసార్లు గుర్తుకు వచ్చి డిస్ట్రబ్ అయింది. మొదటి రోజు కాలేజ్‌లో సీనియర్స్ తనని ‘నీ నెంబరెంత?’ అని ర్యాగింగ్ చేస్తున్నపుడు భరణి రావడం, తనని మొదటిసారిగా చూడడం గుర్తొచ్చాయి. మనసులో ఇదీ అని చెప్పలేని భావం.. గతంలో అతడు తనకి చేసిన సహాయాలు కూడా గుర్తుకువచ్చాయి. తనమీద మనసులో ఇష్టముండబట్టే అలా ప్రవర్తించాడా అనుకుంది. చిత్రంగా ఆమె ఆ రోజంతా వరుణ్ గురించి కాకుండా భరణి గురించి ఆలోచించసాగింది!
***
నాలుగు రోజుల తరువాత మళ్లీ ఫోన్ చేశాడు భరణి హరితకి. మొదట ఎత్తకూడదనుకున్నా. మనసులో ఏ మూలో అతడిమీద సాఫ్ట్ కార్నర్ వుండడంవల్ల ఫోన్ ఎత్తింది.
‘‘ఆ రోజు నేనన్న మాటలకి నీకు కోపం వస్తే సారీ హరితా.. కానీ ఎందుకో ఎప్పటినుంచో నా మనసులో వున్నది నీకు చెప్పాలనిపించి చెప్పేశాను. నీకిష్టం లేకపోతే వదిలేయ్. నన్ను ఎప్పటిలాగానే స్నేహితుడిగానే చూడు. కానీ నువ్వు ఇలా ఎన్నాళ్ళని వరుణ్ గురించి ఆలోచిస్తూ మూడ్ పాడుచేసుకుంటావు? నువ్వు మామూలు మనిషివి కావాలి. అలా ఇంట్లో కూర్చుంటే ఎప్పటికీ తేరుకోలేవు. ఎల్లుండి నుంచీ మాకు కూడా హాలీడేస్ కదా? మళ్లీ చాలా రోజులకి కానీ కలవం అని రేపు మన హాస్టల్లో మన బ్యాచ్ అంతా కలుస్తున్నారు. మీ ఫ్రెండ్స్ కావేరీ వాళ్ళూ కూడా వస్తున్నారు. నువ్వు కూడా వస్తే, నీకూ కాస్త రిలీఫ్‌గా వుంటుంది. అది చెబుదామనే ఫోన్ చేసాను, వస్తావా?’’ అన్నాడు.
హరితకేమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ‘‘మా ఇంట్లో పరిస్థితి సంగతి నీకు తెలుసు కదా భరణీ, అమ్మ నన్ను బయటికి పంపదు’’ అంది.

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ