డైలీ సీరియల్

అనంతం-22

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ప్రజల తిరస్కారాలనూ, ఆదేశాలనూ శిరసావహించి తీరాలి. ఆదర్శ రాజకీయవేత్తలకది కనీస ధర్మం! ప్రజలు నావాళ్లు. వాళ్లకి సేవలు చెయ్యటమే నా విధి’’ అని, ఎమ్మెల్యే వాళ్లవైపు చూశాడు.
వాళ్ళు వౌనంగా వింటున్నారు. పరధ్యానంగా నడుస్తున్నారు.
‘‘పాలకుడంటే ఎవ్వరో తెలుసా?’’
ఎమ్మెల్యే వైపు ప్రశ్నార్థకంగా చూశారు.
‘‘పాలకుడంటే పాలేరు’’
‘‘వా..ట్’’ అదిరి పడ్డారు వాళ్లు.
‘‘ప్రాచీనకాలంలో ఆస్తుల రక్షణ కోసం పాలేరు వ్యవస్థ ఏర్పడితే, ఆధునిక కాలంలో అదే ప్రజా ప్రతినిధుల వ్యవస్థగా రూపాంతరం చెందింది. ప్రజాప్రతినిధులు సేవకులే తప్ప ప్రజలకు యజమానులు కారు. వాల్లది దైవదత్త్ధాకారం కూడా కాదు’’ అని-
కీ.శే. పెద్దిరెడ్డి కొడుకు పెంటారెడ్డి పోలీసులకు జ్ఞానం చెప్పాడు!
‘‘మేం కూడానా’’ అని అగాడు పోలీసు ఉద్యోగి.
‘‘మేమేంటీ, మీరేంటీ- ప్రభుత్వ యంత్రాంగంలో వుండే అందరూ ప్రజలకు పాలేర్లే! పాలేరు పదం ప్రాచీనం కనుక గౌరవంగా ప్రభుత్వం అన్నారంతే’’
‘‘ఇది ప్రజలకెందుకు గుర్తులేదంటారు’’
‘‘గుర్తా! గుర్తు.. గుర్తులేక కాదు’’ అని తనలో తనే ఏదో గొణుగుతూ గబగబా నడిచాడు ఎమ్మెల్యే.
అంత అవమానం జరిగినా ఎమ్మెల్యే అలా మాట్లాడటం, కొంచెమైనా కోపం ప్రదర్శించకుండా చిర్నవ్వులు చిందిస్తూ శాంతిమూర్తిలా ఉండటం- పోలీసు సిబ్బందికి వింతగా వుంది!’’
గుడారాలకు చేరుకున్నారు.
ఎమ్మెల్యే తన గుడారంలోకి వెళ్తూ, అనుమతి లేకుండా ఎవర్నీ లోపలికి పంపించొద్దని చెప్పాడు కాపలా సిబ్బందితో.
ఒంటరిగా కూర్చొని తీవ్రంగా ఆలోచించ సాగాడు!
ఎంత తెలివిమీరిపోయారు, అడవి పుత్రులు! వాళ్ళని అమాయకులనటం అమాయకత్వం! రాజకీయాల్లో తలపండిన వాళ్ళకన్నా పోరాటాల్లో ఆరితేరినవాళ్లకన్నా తెలివిగా ప్రవర్తించారు!
ఆందోళన లేదు.
అలజడి లేదు.
విధ్వంసం లేదు.
ఎంతో శాంతియుతంగా తండా బాట కార్యక్రమాన్ని విఫలం చేశారు! అభాసుపాలు చేశారు!
అలా కాకుండా, నిరసనగా విధ్వంసం సృష్టిస్తే పోలీసు చర్యలు మొదలయ్యేవి. లాఠీఛార్జితో మొదలై కాల్పులదాకా వెళ్లినా ఆశ్చర్యం లేదు!
తర్వాత-
అరెస్టులు కోర్టులు విచారణలు జైళ్లు బెయిళ్లు ఖండన మండనలూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలూ...
స్వేచ్ఛగా తిరుగుతూ అడవి సంపద సేకరిస్తూ సంతలో అమ్ముతూ జీవనం గడిపే అవకాశం కోల్పోయే వాళ్ళు. దినచర్యలకు అంతరాయం కలిగేది. రోజులు గడవటం కష్టమయ్యేది.
కోర్టుల చుట్టూ తిరుగుతూ వకీళ్లకి ఫీజులిస్తూ గుమాస్తాల చేతులు తడుపుతూ- దినసరి ఆదాయం లేక, ఖర్చులు తప్పక ఉన్నదంతా వూడ్చిపెట్టుకొనిపోయి రిక్తహస్తాలతో మిగిలేవాళ్ళు.
రాబోయే అవాంతరాలను ముందుగా ఊహించే అలా శాంతియుతంగా అనుకున్నది సాధించారా, అడివిపుత్రులు.
శాంతి వెనుక కుట్ర వుందా?
శాంతి- పోరాటం ఒక్కటేనా?
కీ.శే. పెద్దిరెడ్డి కొడుకు ఎమ్మెల్యే పెంటారెడ్డి రగిలిపోతున్నాడు!
ఇందాకటిదాకా అతని మొహంలో చిందిన చిర్నవ్వులు ఇపుడు మటుమాయమయ్యాయి. కోపంతో ఎర్రబారిన మొహం, చింతనిప్పుల్లా మండుతోన్న కళ్ళూ..
అందరిముందు కనిపించిన ఎమ్మెల్యే పెంటారెడ్డి ఇతనేనా? అన్నంత అనుమానం కలుగుతుంది ఎవ్వరికైనా!
గుడారంలో పచార్లు చేస్తున్నాడు! పదే పదే అడవి పుత్రులే గురొస్తున్నారు! వాళ్ళింకా తనను చూసి హేళనగా నవ్వుతున్నట్టే వుంది!
లక్ష్మీబాయిని అంతగా పట్టించుకోవాల్సిన పనే్లదు!
వృద్ధురాలు. భర్తని పోలీసులు కొట్టారన్న బాధలో అలా మాట్లాడిందేమోకానీ, ధిక్కారం ఆమె నైజం కాదు! ఆమెని చూస్తేనే తెలుస్తుంది.
అమాయకంగా వున్న మొహం. మాటల్లో తడబాటు. కళ్ళల్లో భయం.. ఆవేశంలో, తాటాకు మంటలా మండిపడిందంతే!
అలాంటివాళ్ళ కోపంతో పెద్దగా ప్రమాదం ఉండదు.
అది లేదూ..! చాందినీ..!
కళ్ళల్లో భయం లేదు. మాటల్లో తడబాబు లేదు.
ధిక్కారమే ధ్యేయం అన్నట్టు ఎంత కఠినంగా మాట్లాడిందో!
తాటాకు మంటలా మండి చప్పున చల్లారిపోయేవాళ్ళ, ఉద్యమాలతో నినాదాలతో పోరాటాలతో మార్పులు సంభవించవుకానీ, అలా ఎండిన జిల్లేడుకాయల్లా రగిలిపోయేవాళ్ళతో చాలా ప్రమాదం!
చాందినీ క్షంతవ్యురాలు కాదు.
దానే్నం చెయ్యాలి? ఎలా చెయ్యాలి?
కీ.శే.పెద్దిరెడ్డికొడుకు పెంటారెడ్డి, కోపం పట్టలేక పళ్ళు పటపటా కొరికాడు.
సమయానికి గరుడాచలం కూడా లేడు. రాగ్యాతో కలిసి అడవికి వెళ్ళాడు. పక్షలు కనిపిస్తే విడిచిపెట్టడు.
ఏ పక్షి కనిపిస్తే ఆగాడో!
ఆంతరంగిక విషయాలు మనసు విప్పి మాట్లాడాలంటే వినేవాళ్లకొక స్థాయి, భావసారూప్యత వుండాలి. అవి లేనివాళ్ళతో మాట్లాడటంవల్ల మన స్థాయి దిగజారటం, పల్చన కావటంతప్ప ప్రయోజనం ఉండదు.
గరుడాచలం వచ్చేదాకా మనసు ఉగ్గపట్టి ఆగాలి. వచ్చిం తర్వాత అతనితో మాట్లాడి ఓ నిర్ణయానికి రావాలి!
రెడ్డియా నాయక్‌తండాలో జరిగిన పరాభవం, అడవి పుత్రులు ప్రవర్తించిన తీరు, ముఖ్యంగా చాంద్‌నీ విషయం అతనితో మాట్లాడాలి.
ప్రతీకారం తీర్చుకొందుకు మనసులోనే రచించుకున్న తన వ్యూహం గురించి చెప్తే ఏమంటాడో గరుడాచలం..
కొంత శాంతించిన మనసులో మళ్లీ తుపాను చెలరేగింది!
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు