డైలీ సీరియల్

ఒయాసిస్ 3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కింద ఎవరూ లేరు.. మేడం పైన డెలివరీ కేసులో ఉన్నారనీ, ఆమె వెళ్ళటానికి లేటవుతుంది కదాని.. చౌకీదార్ చాయ్ తాగడానికి వెళ్ళాడంట.. వచ్చి చూసేటప్పటికి.. మేడం చనిపోయి వున్నారు..’’ అని చెప్పింది మమత.
‘‘కాబట్టి హంతకుడు రావడం కానీ, పోవటం గానీ చూసిన వాళ్ళు ఎవరూ లేరు..’’
‘‘ఔను సార్.. ఎవరూ చూడలేదు..’’ అన్నది మమత.
‘‘శే్వతగారి భర్తకు చెప్పలేదా?.. ఆయనింకా రాలేదు.. ఊళ్ళో లేరా?’’ అని అడిగాడు రణధీర్.
‘‘ఆయనకీ విషయం ఎలా చెప్పాలో తెలియటం లేదు. భయంగా వుంది. ఇంతమందిమి ఉండి ఆమెను అలా నిస్సహాయంగా వదివేశాం.. పైగా అహోబలరావుగారు హార్టు పేషెంటు.. సడెన్‌గా ఈ విషయం చెబితే ఆయనకేమన్నా అవుతుందేమోనని భయంగా వుంది...’’ అన్నది మమత ఎగబీలుస్తూ.
‘‘అయితే ఈ విషయం పోన్లో చెప్పడంకన్నా పర్సనల్‌గా వెళ్ళి చెప్పడమే మంచిది.. శంభుప్రసాద్, నువ్వెళ్లి ఆయన్ని తీసుకురా.. ఇంతసేపయినా ఆయనకి చెప్పకపోవడం దారుణం..’’ అన్నాడు రణధీర్.
‘‘వెళ్ళటానికి నాకేం లేదు. యూనీఫాంలో వున్న నన్ను చూస్తే ఏదో జరిగిందని ఆయనకిట్టే తెలిసిపోతుంది. మఫ్టీలో వున్న నువ్వు వెళ్ళటమే బెటర్..’’ అన్నాడు శంభుప్రసాద్.
‘‘ఓ.కె. ఎవరో ఒకరు.. దగ్గర ఉండి, ఈ న్యూస్ ఒక్కసారిగా కాకుండా.. ఆయన్ను మెంటల్‌గా ప్రిపేర్ చేసి చెప్పి తీసుకురావాలి...’’ అన్నాడు రణధీర్.
ఆయన ఇల్లు ఎక్కడో శే్వత చెప్పింది.
పది నిముషాల తర్వాత రణధీర్ కారు ఆయనింటి దగ్గర రోడ్డుమీద ఆపి, గేటు తీసుకుని లోపలకెళ్ళాడు. నౌకరు ఆయన దగ్గరకొచ్చి ఎవరని అడిగాడు. కొంచెం దూరంలో లాన్‌లో కూర్చున్న అహోబలరావు కన్పిస్తూనే ఉన్నాడు.
‘‘పోలీస్ డిపార్ట్‌మెంట్- సి.సి.ఎస్. ఇన్స్‌పెక్టర్ వచ్చాడని చెప్పు..’’ అని నౌకరుకు చెప్పాడు రణధీర్.
రెండు నిముషాల తర్వాత నౌకరు వచ్చి ‘రమ్మంటున్నారు..’ అన్నాడు.
రణధీర్ ఆయన దగ్గరకు వెళ్ళగానే, అహోబలరావు కూర్చునే చెయ్యందించాడు. రణధీర్ కరచాలనం చేశాడు.
‘‘కూర్చోండి.. మీరొస్తారని అనుకుంటూనే ఉన్నాను..’’ అన్నాడాయన.
‘‘ఎందుకలా అనుకుంటున్నారు?’’ అని అడిగాడు రణధీర్.
ఆయన నవ్వాడు. ‘‘యూ ఆర్ టూ ఇంటిలిజెంట్.. ఎందుకొచ్చిందీ మీకు తెలియనట్లు నా చేత చెప్పించాలని చూస్తున్నారు..’’
ఆయన ముందున్న టీపాయ్ మీద రెడ్ లేబుల్ విస్కీ బాటిల్, సోడా సీసాలు, మసాలా జీడిపప్పు.. ఒక గ్లాసులో ఆయన తాగుతున్న విస్కీ ఉన్నాయి. మరొక గ్లాసులో విస్కీ సోడా పోసి రణధీర్‌కి అందించాడు.
‘‘నో థాంక్స్..’’ అంటూ రణధీర్ తాగకుండానే గ్లాసు టీపాయ్‌మీద ఉంచాడు.
‘‘మీకు హార్ట్ ప్రాబ్లెం ఉందని డాక్టర్ చెప్పారు. మీరేమో ఎంచక్కా ఆనందోబ్రహ్మ అంటూ డ్రింకు లాగించేస్తున్నారు..’’ అన్నాడు రణధీర్.
‘‘మా ఆవిడ గురించేనా?.. ఆ, అది అలా అంటూనే ఉంటుంది. ఏం లేదండీ, ఈమధ్య జనరల్ చెకప్‌లో ఈసీజీ చేయించింది. ఒక వాల్వ్ బ్లాక్ అయిందట. ఇక అక్కడినుంచి తాగొద్దని గోల... రోజూ యుద్ధమే మా ఆవిడకు.. నాకూ.. అలవాటైన ప్రాణం కదా.. తాగితే చచ్చిపోతానని దాని భయం.. ఏమండీ.. తాగనివాళ్ళెంతమంది చావట్లేదండీ.. పాతికేళ్ళ కుర్రాళ్ళు, రోజూ ఎన్ని యాక్సిడెంట్లు చూస్తున్నాము.. అసలు నన్నడిగితే బర్త్ ఈజ్ యాన్ యాక్సిడెంట్.. అండ్ డెత్ ఈజ్ ఆల్‌సో యాన్ యాక్సిడెంట్.. ఆడాళ్ళు అలానే అంటుంటారులెండి.. మీరు తాగండి పర్లేదు’’ అన్నాడు అహోబలరావు.
‘‘లేదండీ.. నేను తాగను.. ఏమనుకోకండి..’’
‘‘అరే, రెడ్ లేబుల్ విస్కీ అండీ...’’’
‘‘నాకలవాటు లేదండీ...’’’
‘‘అలవాటు లేదా? చిత్రంగా ఉందే? మా ఆవిడ ఉండి వుంటే, మిమ్మల్ని చూపించి నన్ను వాయించి పారేసేది. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. అది చెప్పేది కరెక్ట్.. నేను పోతే తను ఎలా బ్రతకాలని కన్నీళ్ళు పెట్టుకుంటుంది.. పాపం.. నాకే జాలేస్తుంది.. నిజానికి మా ఆవిడ డబుల్ లైఫ్ లీడ్ చేస్తోందండీ...’’ అన్నాడు అహోబలరావు గ్లాసు ఖాళీ చేసి.
‘‘డబుల్ లైఫా? అంటే ఎలాగ?’’ అని అడిగాడు రణధీర్.
ఒక భార్యగా, ఒక డాక్టర్‌గా, ఒక ఇల్లాలిగా దాని లైఫ్ దానికి ఉంది.. ఇక నా గురించి కూడా , నేను ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోకూడదు దగ్గర్నుంచి అన్నీ అదే ఆలోచిస్తుంది. నా లైఫ్ గురించి కూడా అదే ఆలోచిస్తుంది. అంచేత పాపం అది డబుల్ లైఫ్ లీడ్ చేస్తోంది మరి..’’ అన్నాడు అహోబలరావు.
‘‘నిజంగా మీరు గొప్ప అదృష్టవంతులంటాను’’ అన్నాడు రణధీర్.
‘‘అవునండి కంప్యూటర్‌కు మనం ఫీడ్ చెయ్యాలి. కానీ.. భార్యకు మనం ఏం ఫీడ్ చెయ్యక్కర్లేదు. మనకే ఆవిడ ఫీడ్ చేస్తుంది. మరి ఇంత అన్నం ఎక్కడ్నుంచి వస్తోంది?.. ఫీడ్ చేసినా, లీడ్ చేసినా..’’ అన్నాడు అహోబిలరావు మళ్లీ గ్లాసు నింపుకుంటూ...
‘‘అడుగుతున్నందుకు ఏమనుకోకండి.. రోజూ ఎంత తాగుతారు?’’
‘‘ఒక లీటరుకు తక్కువ లేకుండా..’’ అన్నాడాయన.
‘‘లీటరా?’’

- ఇంకా ఉంది

శ్రీధర