డైలీ సీరియల్

అనంతం-26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది అనుకుండట్టే మొగపిల్లోడే బుట్టిండుగానీ, పేర్దెచ్చే గొప్పోడు గాదు! యదవనాకొడుకు బుట్టిండు.. ఏం శాత్తావూ!
దేవతసువంటిది నా పెండ్లాం! ఇసువంటి కొడుకునిగని తండాకి సెడ్డ పేరుతెత్తాడంటే రుూడ్నదే సావనూకేది. దేవతగాని కొడుకునిట్టా సూళ్ళేక ముందుగాల్నే సచ్చింది. సూత్తా అవమానాలు భరిత్తా నేను మాత్తరవ్ సచ్చి బతుకుండాను.
రాగ్యా శండాలపోడని నేనే సెప్తున్నా నింకా యిసారణలూ, సాచ్చీకాలూ ఏంటికి! ఆడేడుండాడో సూచి యత్తకరండి. సావగొట్టండి అని కాళీచరణ్ వలవలా ఏడ్చాడు.
అందరూ కొద్ది క్షణాలు నిర్విణ్ణులయ్యారు!
సూర్యోదయంతోనే అడవికి వెళ్ళటం, సంపద సేకరించి సాయంత్రానికి ఇల్లు చేరటం, కొడుక్కింత వండిపెట్టి తాను తినటం, నిద్రపోవటం తప్ప ఏ విషయాలూ పట్టించుకోడు కాశీచరణ్.
వౌనంగా వుంటాడు. నిర్వికారంగా తన పని తాను చేసుకొని పోతుంటాడు. యాంత్రికంగా బ్రతుకుతుంటాడు. మిన్నువిరిగి మీద పడుతుందన్నా చలించడు.
అలాంటివాడు కొడుకుచేసిన పనికి కుమిలిపోతూ అలా గుండె పగిలేలా ఏడవటం అందరికీ బాధనిపించింది.
‘‘ఇందులో నీ తప్పేంటిదుంది.. యాడవగాకు..’’ అన్నాడు బాణావతు.
‘‘గాచారవ్ అట్టాగుంది. నువ్వేటి జాస్తావ్‌వే’’ అన్నాడు నగ్గూరాం.
సానుభూతి భరించలేకపోతున్నాడు కాళీచరణ్!
‘‘గాచారవ్ గాదూ, వల్లకాడుకాడు! రాగ్యాగాడ్ని సావగొట్టండి. వాడి గాచారవని అప్పుడనండి’’ అన్నాడు కన్నీళ్ళు తుడుచుకుంటూ.
నిశ్శబ్దం ఆవరించిందక్కడ!
రాగ్యా కోసం వెతుకుతూ వెళ్లి కొంతమంది హడావిడిగా తిరిగొచ్చారు.
‘‘రాగ్యా కనిపిచ్చలేదా?’’ బాణావతు అడిగాడు.
‘‘కనిపిచ్చిండు’’
‘‘పట్టరాలేదేంటిది’’
‘‘పారిపోయిండు’’ అని చెప్పారు వాళ్ళు.
‘‘యాడ కనిపిచ్చిండు’’ బాణావతు మళ్లీ అడిగాడు.
‘‘ఇంట్లోనే వుండాడు. మమ్మల్ని సూసి కంచె దుమికి పారిపోయిండు’’
అందరూ అనుమానంగా కాళీచరణ్‌ని చూశారు!
కాళీచరణ్ అబద్ధం చెప్పాడా?
వాళ్ళంతా తన వైపు ఎందుకలా అనుమానంగా చూస్తున్నారో కాళీచరణ్‌కి అర్థమయ్యింది!
మళ్లీ అందరికీ దణ్ణం పెట్టాడు. ఏడుపు దిగమింగుతూ-
‘‘నన్నట్టా సూడగాకండి! సెట్టు తల్లి సాచ్చిగా అడవి తల్లి సాచ్చిగా సెప్తుండాను! సెట్టుకాడికినేనొచ్చేప్పుడు రాగ్యా ఇంటో లేడు. ప్రెవాణకవే జెయ్యవంటే శాత్తాగూడా!
తరువాత వొచ్చుంటాడు. అది నాకు తెలవదుగదా!
అడవి తల్లినీ, ఆశారాల్నీ నమ్మినోడ్ని.. కొడుకుని ఇంటో దాపెట్టి లేడని సెప్తానా?
ఆడుసేసింది తప్పు.. నాకూ తెలుసు.. తప్పు సేసినోడ్ని రచ్చిచ్చటానికి నేనేవీ యదవనుగాను.. కొడుకయితే ఏంటిదంట! తప్పుజేసినాక ఎవుడ్నయినా శిచ్చిచ్చాలంతే!
యాడికిబోయిండో యతకండి. సెట్టుకు కట్టేసి బాగా సావగొట్టండి. వల్లగాకుంటే సింతబరికె నాకియ్యండి. మీకాడికి నేనే బాగా గొడతాను’’ అన్నాడు కాళీచరణ్.
‘‘రాగ్యాగాడు దొరికినాకనే పంశాయితీ! ఇందులో కాళీచరణ్ తప్పేటీ లేదని తీరువానమయ్యింది’’ అని, తండా వాళ్ళతో బాణావతు అన్నాడు.
ఎవరి పనులకు వాళ్ళు వెళ్లిపోయారు.
వాళ్ళు గమనించలేదు కానీ,
ఇంట్లోనుంచి పారిపోయిన రాగ్యా, గరుడాచలం దగ్గరికి వెంటనే వెళ్ళలేదు. పంచాయితీ చెట్టుకు కొంచెం దూరంగా పొదల్లో నక్కి కూర్చుని, అక్కడ జరిగిందంతా చూసాడు!
రాగ్యా వొళ్ళు మండింది!
కోపంతో రగిలిపోయాడు.
చివరికి కన్న తండ్రి కూడా వాళ్ళవైపలే ఉన్నపుడు తండాతో ఇకనాకేమిటి సంబంధం అనుకున్నాడు.
తనకోసం వెదకుతున్న కుర్రవాళ్ళ కంట పడితే చాలా ప్రమాదం!
రాగ్యా ఇక ఆలస్యం చెయ్యలేదు. పొద్లో నుంచి నిశ్శబ్దంగా పైకి లేచాడు. చుట్టూ చూసాడు.
ఎవ్వరూ గమనించటంలేదు!
అక్కడ్నించి పరుగు లంకించుకున్నాడు.
అసలికే వొళ్ళంతా నెప్పులతో సలుపు తీస్తున్నది తలమీది గాయం బాధిస్తున్నది. జ్వరం వచ్చినట్టుంది.
అలాంటి పరిస్థితిలో విశ్రాంతిగా పడుకుంటే కొంత సేపటికి శక్తి పుంజుకొనేవాడు. అలాంటి అవకాశం లేకుండా పోయింది. పరిగెత్తటం అనివార్యమైంది కానీ, నిజానికి రాగ్యాకిప్పుడు అంత శక్తి లేదు.
అతని శరీరం నుండి చెమట ధారలు కడుతోంది. పరుగెత్తీ, పరుగెత్తీ అలసటగా, ఆయాసంగా వుంది. కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి.
మరో వైపు ఆలోచనల వడ్రంగి పిట్టలు ముక్కులతో పొడుస్తున్నాయి!
కన్నకొడుకు రక్షణకు రానివాడూ ఒక తండ్రేనా? సాంప్రదాయాలు.. ఆచారాలు, కట్టుబాట్లే ముఖ్యమని తండ్రి భావించినపుడు అలాంటి తండ్రితో ఇక అనుబంధం ఏమిటి?
కన్నతండ్రికన్నా గరుడాచలమే నయమనిపించాడు!
అతని ఆశయంలో వుండి అద్భుతాలు సాధించాలి. జీవితాన్ని సుఖమయం చేసుకొని గొప్పవాడై అప్పుడు కనిపించాలి- అనాగరికులైన తండావాళ్ళకి.
చాంద్‌నీ తిరస్కరిస్తున్నది కూడా తను గొప్పవాడుకానందుకే కదా!
ధనం, పలుకుబడి, నాగరికత, పట్నంవాసం, విలాసవంతమైన జీవితం సాధిస్తే -తను వెంటపట్టంకాదు, చాందినీయే తన వెంటపడి వస్తుంది!
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు