డైలీ సీరియల్

అనంతం-58

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతలో-
గోపీనాయక్ అనుచరులు కావిళ్ళతో భోజనాలు తెచ్చారు.
’’లెగండి..లెగండి! బువ్వదిందురు లెగండి’’అంటూ, అందర్నీ తట్టి లేపారు.
లక్ష్మీబాయి లేచి కూర్చుంది. వాల్యానీ నిద్రలేపింది..
అందరూ లేచి కూర్చున్నాడు.
అనుచరులు కావిటి బుంగల్లోనుంచి రాగి సంకటి తీసి పెద్దపెద్ద ఆకుల్లో పెట్టి, అందరికీ అందిస్తున్నారు.
‘‘ఎంత కాలఁవిట్టా’’లక్ష్మీబాయి మధ్యలో అడిగింది.
‘‘సూడాల’’అన్నాడు గోపీనాయక్, తలపంకిస్తూ.
‘‘శాందినీ, నగ్గూరాం-ఇద్దర్నీ సంపారు. గుడిసెలో ఏడ్చేవోళ్ళేలేరు.. మనల్ని గూడా అట్టా సంపితే బాగుండేది’’ అన్నారెవ్వరో.
నిశ్శబ్దం జడలు విప్పింది!
కొద్ది క్షణాల తర్వాత-
‘‘ఓ...ప్పుడు రెడ్డియానాయక్‌ని సంపారు... ఇప్పుడు బాణావతుని సంపారు. కాలీశరన్ని సంపారు. అగుపిస్తే మనల్నీ సంపుతారు..
సావటానికి మనఁవూ- సంపటానికి వాళ్ళూ బుట్టినట్టుంది’’ అన్నాడు, బాగా సోమ్లానాయక్.
మళ్ళీ నిశ్శబ్దం పరచుకుంది.
మారు వడ్డించాలని ఎవ్వరో చివరికి మిగిలిన కావిటి కుండ మూత తెరిచారు.
ఏ తండానుంచి వచ్చిందోకానీ, దాన్నిండా వరిబువ్వ వుంది!
వాల్యా వాసన పట్టాడు!
మొహం విప్పారింది!
ముక్కుపుటాలు వొణికాయి!
గతంలో కోల్పోయిన ఏదో దివ్యానుభూతికి తిరిగిలోనైన త్రికాలజ్ఞుడిలా-
‘‘వరి బువ్వ! శాందినీ అప్ప అంపిచ్చిన వరి బువ్వ’’ అంటూ పెద్దగా అరిచాడు వాల్యా!
రాగ్యా ఉలిక్కిపడ్డాడు!
చాంద్‌నీ గుర్తొచ్చింది. కళ్ళల్లో నీళ్ళూరాయి.
అన్నం కుండ వైపూ, వాల్యావైపూ మార్చిమార్చి చూశాడు!!
ఇప్పుడు చాంద్‌నీ వుంటే ఎంత బాగుండేది!
తనే వాడికి వరి బువ్వముద్దలు కలిపి పెట్టేది.. తన చేతులతోనే కొసరి కొసరి తినిపించేది.
వరిబువ్వ తింటున్నందుకు వాడి కళ్ళల్లో ఆనందపు మెరుపులు మెరుస్తుంటే చూసి ఆనందించేది. సంతోషంతో పొంగిపోయేది.
రాగ్యా చివాల్నలేచాడు.
అన్నంకుండ దగ్గరికి వెళ్ళాడు.
మరో ఆకులో వరిబువ్వ పెట్టి వాల్యాదగ్గరికి వెళ్ళాడు.
‘‘శాందినీ అంపిచ్చింది’’అంటూ చేతికి అందించాడు.
వాల్యా వరి బువ్వ అందుకొని ఆబగా తింటుంటే-
చాంద్‌నీ కళ్ళతో తను చూస్తూ, చాంద్‌నీ చూసిన అనుభూతి పొందాడు!
మనోఫలకం మీద చాంద్‌నీ..
తేనెటీగల మధ్య చాంద్‌నీ.. రక్తమాంసాల మధ్య చాంద్‌నీ.. మరణానందం పొందుతూ చాంద్‌నీ.. చివరి వీడ్కోలు పలుకుతూ చాంద్‌నీ..
రాగ్యా బలంగా తల విదుల్చుకున్నాడు! చాంద్‌నీ చెరిగిపోయింది. ఆమె చెరిగి పోయినా ఉద్వేగం చెరిగిపోలేదు. జ్ఞాపకాలు చెదిరిపోలేదు.
వెళ్ళాలి..
చాంద్‌నీ శవం దగ్గరికి వెళ్ళాలి..
క్షమించమని అడగాలి..
నగ్గూరాం, బాణావతు, కాళీచరణ్ శవాల మీద పడి తనివి తీరా ఏడ్వాలి. కన్నీళ్ళతో అర్ధించి క్షమాభిక్ష కోరాలి!
వాళ్ళు క్షమిస్తారా?
అనుబంధాలు గుర్తొచ్చి ప్రేమలూ ఆప్యాయతలూ పొంగి, వాళ్ళు ఒకవేళ క్షమించినా ఆత్మలు క్షమించవేమో!
రాగ్యా భావోద్వేగంతో చలించిపోతోన్నాడు.
అసంకల్పంగానే లేచి నిల్చున్నాడు.
పెద్దపెద్ద అడుగులువేస్తూ గుహబైటికి వెళ్ళిపోయాడు.
రాగ్యా వెళ్ళటం ఎవ్వరూ గమనించలేదు.
గొలుసుకొండలు దాటాడు. వొడుపుగా వొంపులు తిరుగుతూ చెట్ల మధ్యగుండా నడుస్తూ ముందుకు సాగిపోతోన్నాడు.
అడవి పుత్రుల్ని క్షేమంగా స్థావరానికి చేర్చాడు. ఇక, బంధాలు లేవు. బాధ్యతలు లేవు. అయిన వాళ్ళులేరు. బాధ్యత తీరిపోయింది..
నిష్కారణంగా యింకా బ్రతకటం ఎందుకూ?
తేనెపట్టు దగ్గరికి వెళ్ళాలి.
చాంద్‌నీకి మరణానందం ప్రసాదించిన ఆ తేనెటీగల్ని తనకూ అదే ఆనందం ప్రసాదించమని అడగాలి.
ఆలింగనం చేసుకోవాలి..
అవ్వి తిరస్కరిస్తే గుడారాల దగ్గరికి వెళ్ళాలి.
కన్న తండ్రికి కనీసం కర్మకాండలు జరపాలి.
రాగ్యా గబగబా నడుస్తున్నాడు.
పెద్దపెద్ద అంగలువేస్తూ దూసుకుపోతోన్నాడు.
ఓ మలుపుతిరిగాడు.
‘‘అరేయ్...రాగ్యా’’అన్న పిలుపు వినిపించింది.
‘్ఠ’క్కున ఆగాడు. తలెత్తిచూశాడు.
ఎదరగా యాదయ్య!
ఫారెస్టుగార్డు యాదయ్య!
‘‘ఎక్కడ్నించి’’అని యాదయ్య అడిగాడు.
రాగ్యా సందేహిస్తూ చూస్తున్నాడు.
‘‘మిత్రద్రోహం చెయ్యను’’అన్నాడు యాదయ్య.
‘‘ఎవురన్నారూ’’అడిగాడు రాగ్యా.
‘‘నీ చూపులు.’’
‘‘పోలీసోనివి గదా’’
‘‘నేనూ మనిషినే’’
‘‘రావనుడూ మడిసే’’
‘‘కాదు. రాక్షసుడు’’
‘‘పోలీసోనివి- ఎట్టా నమ్మేది’’
‘‘దేవుడ్ని నమ్మితే నన్నూనమ్మాలి’’
రాగ్యా యాదయ్య కళ్ళల్లోకి చూసాడు!
‘‘తండా దగ్గరికి వెళ్తున్నావా’’ యాదయ్యే అడిగాడు.
‘‘కాదు’’అన్నాడు రాగ్యా.
‘‘్థంక్‌గాడ్! తండా దగ్గరికి వెళ్ళకపోవటం చాలా మంచిది.’’
‘‘ఏంటికి?’’
‘‘పోలీసులు మీకు చాలా అన్యాయం చేస్తున్నారు. కాల్పులు జరిపి అడవి పుత్రుల్ని పొట్టన పెట్టుకున్నది చాలక, మీ తండాని తగులబెట్టారు.. అక్కడ పోలీసు కాపలా పెట్టారు.’’
‘‘తండాకాడ్నా’’అని రాగ్యా అడిగాడు.
‘‘అవును.’’
‘‘ఏంటికంట’’
‘‘అక్కడికి వచ్చినవాళ్ళని అరెస్టుచెయ్యటానికి’’
‘‘అంత అనే్నలఁవ్ జాస్తారా-పోలీసోళ్ళు’’
‘‘ఎంతైనా చేస్తారు! పాడు ఉద్యోగం చెయ్యక తప్పటం లేదు.’’
‘‘ఏంటికి’’
‘‘బ్రతుకుతెరువు కావాలి కదా! అందుకే ఇష్టంలేకపోయినా పోలీసు ఉద్యోగం చేస్తున్నాను.. మనసు చంపుకున్నాను.’’
రాగ్యా అతనివైపు జాలిగా చూసాడు.
‘‘అంతా నాకర్మ! నువ్వుకూడా ఇందాక నన్ను అనుమానించావంటే నా ఉద్యోగమే కారణం! అయిన వాళ్ళుకూడా నమ్మని ఉద్యోగం నాది.’అని నొచ్చుకున్నాడు యాదయ్య.
(ఇంకా ఉంది)

-గోపరాజు నాగేశ్వరరావు