డైలీ సీరియల్

ఒయాసిస్ 19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్నాడు ఉదయం అహోబలరావు రణధీర్‌కి ఫోన్ చేశాడు.
‘‘ఎవడో వెధవ నర్సింగ్ హోంకి వచ్చి.. లక్ష రూపాయలు ఇవ్వమని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడట, వాడెవడో ఏమిటో కనుక్కో..’’ అన్నాడు.
ఒక అరగంట లోపల రణధీర్ నర్సింగ్ హోంకి వెళ్ళాడు. కింద కన్సల్టేషన్ రూంలో డాక్టర్ మమత, నర్స్ నిర్మల ఉన్నారు. పాతికేళ్ళ కుర్రాడొకడు మమతకు ఎదురుగా కూర్చుని ఉన్నాడు.
రణధీర్‌ని చూడగానే, మమతకి ప్రాణం లేచొచ్చింది.
‘‘చూడండి సార్, వీడెవరో మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడు..’’ అన్నది.
‘‘అసలు విషయం ఏమిటీ?’’ అని అడిగాడు మమతని.
‘‘వీడెవడో టీవీ ఛానల్ రిపోర్టర్ అట. మా నర్సింగ్ హోం గురించి లేనిపోనివన్నీ టీవీలో టెలికాస్ట్ చేస్తాడట. అలా చెయ్యకుండా ఉండాలంటే వీడికి మేము లక్ష రూపాయలు ఇవ్వాలట. అహోబలరావుగారికి ఫోన్ చేశాను. ఆయన ‘డబ్బు పంపిస్తున్నా’రని చెప్పి ఇక్కడే ఉంచమన్నారు.. మీకు ఫోన్ చేసి చెప్పారు..’’ అన్నది మమత.
రణధీర్ ఆ కుర్రాడి వంక చూశాడు. పాతికేళ్ళపైనే ఉంటాయి. చదువుకున్న వాడిలాగే కనిపిస్తున్నాడు.
‘‘నీ పేరేంటి?’’ అని అడిగాడు రణధీర్.
‘‘సతీష్..’’
‘‘ఏం చేస్తుంటావ్?’’
‘‘టీవీ రిపోర్టర్..’’
‘‘ఏ ఛానల్..’’
‘‘డీ ఛానల్.. కొత్తగా రాబోతోంది..’’
‘‘మీ చానల్ ఆఫీసు ఎక్కడ?’’
‘‘జూబ్లీ హిల్స్..’’
‘‘నీ ప్రాబ్లెమ్ ఏంటి?’’
‘‘ఈ నర్సింగ్ హోం వాళ్ళు అవివాహితులైన అమ్మాయిలకు అబార్షన్ చేస్తూ, ఇల్లీగల్ పనులు చేస్తూ, అవినీతి చర్యలకు పాల్పడుతున్నారు.. సమాజంలోని అవినీతి, అక్రమాలను ప్రక్షాళన చెయ్యటమే మా ధ్యేయం..’’.
‘‘చాలా మంచి ధ్యేయం.. నీలాంటి యువకులు ఇలాంటి ఆలోచనలతో ముందుకు రావటం సమాజానికి ఎంతో శ్రేయస్కరం..’’
‘‘అవినీతి ఎక్కడున్నా క్షమించలేని తత్వం సార్ నాది..’’ అన్నాడు సతీష్.
‘‘్ధ్యయం, లక్ష్యం బాగానే ఉంది గానీ, అసలు నీకొచ్చిన ఇబ్బందేంటి?’’ అని అడిగాడు రణధీర్.
‘‘అబార్షన్‌లు చేయటం ఇల్లీగల్ గదూ.. సర్..’’
‘‘ఎవరు చెప్పారు అబార్షన్ ఇల్లీగల్ అని..’’ అన్నాడు రణధీర్.
‘‘నేను చెబుతున్నాను సర్..’’’
‘‘నువ్వెవరు చెప్పటానికి?.. బిడ్డను కనాలా వద్దా అని నిర్ణయించుకునే హక్కు, అధికారం కాబోయే తల్లికి ఉన్నాయి.. ఇండియాలో అబార్షన్ ఇల్లీగల్ కాదు..’’ అని దబాయించాడు రణధీర్.
సతీష్ కొంచెం మెత్తబడ్డాడు.
‘‘కాని అది భ్రూణ హత్య అవుతుంది. అబార్షన్ చేస్తున్నారంటే పుట్టబోయే బిడ్డను హత్య చేస్తున్నట్లే.. ధర్మం ఒప్పుకోదు. అది ఇమ్మోరల్ సర్?..’’ అన్నాడు సతీష్.
‘‘నువ్వు టీవీలో ఏదో ప్రసారం చేస్తానంటున్నావు. చేసుకో.. ముందు నువ్వు ఏం చెప్పదలచుకున్నావో, దానిమీద స్పష్టమైన అవగాహన ఏర్పర్చుకో.. ఇల్లీగల్ అంటే చట్టవ్యతిరేకం.. చట్టరీత్యా నేరం అవుతుంది. ఇమ్మోరల్ అనీ అన్నావు.. అంటే అది ధర్మ విరుద్ధం అని.. అది పాపం, పుణ్యం- దానికి సంబంధించిన అంశం.. రెండింటికీ మధ్య చాలా తేడా వుంది.. మద్యం సేవించడాన్ని ధర్మం సమర్థించదు. కానీ చట్టం అనుమతించింది. కనుక నేరం కాదు..’’ అన్నాడు రణధీర్.
‘‘కానీ ఇలాంటి పనులవల్ల ఎందరో అమ్మాయిలు అవినీతి పథాన నడుస్తున్నారు..’’ అన్నాడు సతీష్.
‘‘ఇప్పుడు అమ్మాయిలుగానీ, వివాహితులుగానీ, గర్భనిరోధానికి చాలా పద్ధతులు అవలంభిస్తున్నారు.
అబార్షన్స్‌దాకా రానివ్వరు.. వాళ్ళలో చాలా అవేర్‌నెస్ వచ్చింది.. ఇక అవినీతి పథాన నడుస్తున్నారన్నావు.. నీకు లక్ష రూపాయలు ఇస్తే అవినీతి, నీతి అయిపోతుందా? అవినీతి వాళ్ళది కాదు, నీది.. మీ చానల్ ప్రొప్రయిటర్‌తో నేను మాట్లాడతాను. ఆయన నెంబర్ ఇవ్వు...’’ అన్నాడు రణధీర్.
‘‘మీరెవరండీ?’’ అని అప్పుడు అడిగాడు సతీష్.
‘‘నేను క్రైం సెక్షన్‌లో పోలీసు ఇన్స్‌పెక్టర్ని...’’
‘‘సారీ సర్.. ఏదో సామాజిక సేవా దృక్పథంలో ఇతోధికంగా తోడ్పడదామని..’’
‘‘అసలు మీ చానల్ నెంబరూ, అడ్రసూ చెప్పు..’’
‘‘చానల్ ఇంకా పెట్టలేదు సర్. సారీ సర్..’’ అంటూ లేచి నిలబడ్డాడు.
రణధీర్ కూడా లేచి నిలబడ్డాడు..
‘‘నాతో రా..’’ అంటూ రణధీర్ ఆ యువకుడ్ని తనతో తీసుకెళ్ళాడు.
తన ఆఫీసుకి తీసుకుపోయాక సతీష్‌ని అడిగాడు.
‘‘అసలు ఆ నర్సింగ్ హోంను బ్లాక్‌మెయిల్ చేయాలన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది?’’
‘‘అక్కడ పెళ్లికాని అమ్మాయిలు అబార్షన్లు చేయించుకున్న కేసులు కొన్ని నా దృష్టికి వచ్చాయండీ..’’ అన్నాడు సతీష్.
‘‘నిజంగా.. అక్కడ అలా జరుగుతుంటే మేము ఊరుకోము.. నీకు తెలిసిన కొన్ని కేసుల వివరాలు చెప్పు..’’ అని అడిగాడు రణధీర్.
‘‘ఇవన్నీ రహస్యంగా జరిగిపోతుంటాయి సర్.. అంచేత మనం నిలదీసి అడిగినా ఆ అమ్మాయి నిజం చెప్పరు.. వీళ్ళూ అలాంటి కేసులను హేండిల్ చేస్తున్నట్లు అంగీకరించరు. మనకే రుజువులు దొరకవు సర్..’’ అన్నాడు సతీష్.

- ఇంకాఉంది

శ్రీధర