డైలీ సీరియల్

విలువల లోగిలి-24

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇప్పుడు మీ వంతు. మీ అమ్మాయి మీకు భగవద్గీతను ఇస్తోంది’’ అంటూ ఆయన చేతిలో పెట్టింది.
‘‘అపురూపమైన కానుక, కాదనలేని కానుక. నాకే కాదు ఇంటిల్లిపాదికి అవసరమైనది కూడా. మనిషిని సన్మార్గంలో నడిపించే గ్రంథమిది’’అంటూ కళ్ళకద్దుకొని ‘దీర్ఘాయుష్మానుభవ’అని విశ్వను ఆశీర్వదించారు.
‘‘అమ్మా! మీకు పట్టుచీర. మరి నేను శాంత పెళ్ళికి లేను. లేకపోతే అప్పుడే పెట్టేదాన్ని. కాదనకూడదు’’అంటూ ఆవిడ చేతుల్లో పెట్టింది.
‘‘ఎందుకమ్మా ఇవన్నీ. నీ స్నేహితురాలు ఇల్లు అంటే నీ ఇల్లే. సరదాగా రావచ్చు. ఉండచ్చు. ఇలా కానుకలు ఇవ్వాలా ఏం?’’
‘‘ఇదంతా నా తృప్తికోసం, ఇవ్వాలని, ఇవ్వకూడదని కాదు. నా సంతోషం నాది. నేను లేకపోయినా నా వస్తువులు నన్ను మీకు గుర్తుచేస్తుంటాయి. అందుకన్నమాట.’’
‘‘ఇక వేణుగోపాల్‌గారూ మీకు రిస్ట్‌వాచ్. దాన్ని చూసినప్పుడల్లా మా శాంతి గుర్తురావాలి. దానికి మీరు కేటాయించ వలసిన సమయం గుర్తురావాలి. అందుకే మీకీ బహుమతి.’’
విశ్వనే గమనిస్తోంది శాంతి.
ఎందుకు వీళ్ళందరికోసం ఇంతింత ఖర్చుపెట్టింది?
వాళ్ళలో తను కోరుకున్న మార్పురాకపోతే ఈ డబ్బు అంతా వృధానే కదా!
నీ ఆలోచనలు నాకు తెలుసులే అన్నట్లు శాంతిని చూసి ‘నీ కోసం ఐపాడ్ తెచ్చాను. చక్కగా పనులు చేసుకుంటూ పాటలు వినవచ్చు. ఒంటరితనం ఉండదు. ప్రక్కన ఎవరన్నా ఉంటే మాత్రం దీన్ని దాచెయ్. ఇది ఎవరికి ఇచ్చినా నేను ఒప్పుకోను. నువ్వే వాడుకోవాలి. తెలిసిందా?
‘‘ఇప్పుడెందుకే ఇవన్నీ’’అని అనకుండా ఉండలేకపోయింది.
‘‘మొదటిసారి మీ ఇంటికి వచ్చానుకదా అందుకని. సరేనా?’’ ‘‘ఒప్పుకోకపోతే ఊరుకోవుగా.’’
‘‘అస్సలు ఊరుకోను.’’
ఆ తర్వాత అందరూ కలిసి కబుర్లలో పడిపోయారు. అలా రెండు గంటలు గడిచిందని వారికే తెలియనంతగా ఆప్యాయత ఊయలలో ఓలలాడారు.
వెనె్నల రేయిని, చల్లగాలి హాయిని, చందమామ చక్కదనాన్ని ఆస్వాదిస్తూ ఎప్పుడు నిద్రపోయారో వారికే తెలియదు.
* * *
ప్రపంచానికంతా ఉషోదయం మామూలే అయినా శాంతి ఇంట్లో మాత్రం ‘విశ్వ’మాటల కిరణాలు పడటం వలనేమో కొత్తగా ఉషోదయం వెల్లివిరిసింది. లీలావతి, సుందరి కూడా శాంతికి పనులలో సహాయపడటమే దానికి నిదర్శనం. కొన్నాళ్ళకు శాంతి వాళ్ళకు హెల్ప్‌చేసే పరిస్థితిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
‘ఇప్పుడు నువ్వున్నావని అలాచేస్తున్నారు. నువ్వు వెళ్ళాక మళ్ళీ మామూలే’ అంతరంగం గొప్ప విషయం కనిపెట్టానన్నట్లు చెప్పింది విశ్వకు.
‘‘సరే! ఇప్పటికి నీ మాటే నిజమనుకుందాం. తర్వాత శాంతి ఎలాగో చెబుతుందిగా. అప్పుడే నువ్వు ఒప్పుకుందువుగానీ. నీతో ఇప్పుడు నాకు తగువెందుకు చెప్పు.’’
‘‘చూద్దాం.’’
‘నేనూ అదేగా చెప్పేది.’
‘‘విశ్వా!’’అన్న శాంత పిలుపుకు ఏమిటన్నట్లు చూసింది.
‘‘ఏం మంత్రం వేసావే? మా అత్తగారు టీ.వీ. జోలికి పోవటం లేదు. అన్నిటికన్నా విచిత్రం. అమ్మలక్కల 12 గం.ల సమావేశం ఇంకా ప్రారంభం కాలేదు.’’
‘‘నాకు తెలిసి అది కాన్సిల్.’’
‘‘అదే. ఎందుకు?’’
‘‘సస్పెన్స్. నీకే తెలుస్తుందిలే తర్వాత.’’
‘‘చెప్పలే. మా అత్తగారు దేన్నో తెగ చదివేస్తున్నారు. అదేమిటోకూడా నాకు అర్థంగావటం లేదు.’’
‘‘నేనో పోటీ పెట్టానులే. దానికి ప్రిపేర్ అవుతున్నారు’’
‘‘ఏదీ తిన్నగా చెప్పవుకదా.’’
‘‘ఏం లేదే! మీ అత్తగారికి పుస్తకాలు చదివే అలవాటు లేదన్నావుగా. ఆ అలవాటు చేస్తున్నానంతే.’’
‘‘నువ్వు చెప్పగానే ఆవిడ చదవదే. ఇందులో ఏదో కిరికిరి ఉంది.’’
‘‘నువ్వన్నది కరెక్టే. ఒక చిన్నపరీక్షపెట్టి గెలిస్తే బహుమతి ఇస్తానన్నాను.’’
‘‘ఇప్పుడర్థమయిందిలే.’’
‘‘అంత తొందరగా లొంగే ఘటంకాదని ముందే నువ్వు చెప్పావుగా. అందుకే పక్కాప్లానుతో వచ్చాను.’’
‘‘ఏది ఏమైనా రాత్రంతా వాళ్ళు నాపై అంత ఆప్యాయత చూపిస్తుంటే ఎంత సంతోషం వేసిందో?’’
‘‘అది శాశ్వతం కావాలన్నదే నా తపన.’’
‘‘మాటలతో మారడం అన్నది సాధ్యమా అనుకునేదానే్న విశ్వా.’’
‘‘అదంత తేలికగా జరగదు. చెప్పేవాళ్ళు ఎందరో ఉంటారు. వినాలనే వాళ్ళు ఉండాలిగా. రెండూ మనస్ఫూర్తిగా జరిగితేనే ఫలితం ఉంటుంది.’’
‘‘అదీకాక వాళ్ళిద్దరూ నాకు సహాయం చేయటం ఏమిటే?’’
‘‘అదా! నిన్న సాయంత్రం మాటల మధ్యలో మా బాబాయి సి.ఐ. అని, ఇక్కడ మూడు మండలాలకి హెడ్ అని చెబుతూ కోడలిని సరిగ్గా చూసుకోవటంలేదని కేసువేస్తే ఈరోజు వస్తున్నారని, నేను ఇక్కడ ఉన్నానని తెలిసి మన ఇంటికి కూడా వస్తున్నారని చెప్పా. ఆవిడలో కాస్త తడబాటు కనిపించింది నీ గురించి కూడా నాకు తెలిసే ఉంటుందని, చెప్పేస్తానేమోనని వివరాలు అడిగింది. ఆ కేసు స్టడీచేయటానికే వస్తున్నారని చెప్పాను. అయినా ఇంటి కోడలు ఏమన్నా పనిమనిషా అన్ని పనులు చేయటానికి, ఆ ఇంటికి లక్ష్మీదేవిలా వస్తుంది. అందరూ ఆమెను బాగా చూసుకోవాలిగా. పనులన్నీ ఒక్కదానికే అప్పచెప్పి, అన్నీ చేయిస్తూకూడా తిట్లు, దెబ్బలుపడాల్సిన అవసరం ఏముంది? రేపు వాళ్ళమ్మాయిని ఎదుటి వాళ్ళు అలాచూస్తే ఊరుకుంటారా? అంటూ నాలుగైదు మాటలు కలిపి చెప్పి బెదరగొట్టానులే. ఇనుము వేడిమీద ఉన్నప్పుడే నాలుగు సమ్మెట దెబ్బలు పడాలంటారుగా. నాకున్నది నాలుగురోజులే కదా.

- ఇంకా ఉంది

- యలమర్తి అనూరాధ