డైలీ సీరియల్

యువర్స్ లవింగ్లీ .... 8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమ్మాయిలకి అతడిపట్ల హీరోవర్షిప్. అతడి వెంట ఎప్పుడూ ఎవరో ఒకమ్మాయి ఉంటూ ఉండేది. అమ్మాయిలంతా వెంటబడే అతడంటే అబ్బాయిలకి కూడా హీరో వర్షిప్ ఉండేది. భరణి మాత్రం స్టూడెంట్లందరికీ ‘ఎంజాయ్ చెయ్యండి, కానీ మీరిక్కడికి వచ్చింది ఎంజాయ్ చెయ్యడానికి కాదనీ, చదువుకోవడానికనీ మర్చిపోకండి’ అని చెబుతూ ఉండేవాడు. కాలేజీలో ఆడామగా స్నేహాల్లో ఏ సమస్య వచ్చినా భరణి చాలా చాకచక్యంగా, సామరస్యంగా పరిష్కరిస్తాడని చెప్పుకునేవారు. కాలేజీలో ఉండే లవర్స్‌కి భరణి ఒక గైడ్ లాంటివాడు. అందుకే స్టూడెంట్లు ఎవరూ తన ఎఫైర్స్‌ని కూడా భరణి దగ్గర దాచుకునేవారు కాదు.
చైతన్య స్రవంతిలా ఎప్పుడు చూసినా విపరీతమైన ఎనర్జీ లెవెల్సుతో కనిపించేవాడు భరణి. అతడిని చూస్తేనే, అతడితో మాట్లాడితేనే ధైర్యం వస్తుంది అన్నట్టుగా ఉండేవాడు. అలాంటి భరణిలో గత కొద్దిరోజులుగా ఏదో మార్పు గమనించాను నేను..’’ అంటూ ఒక్క క్షణం ఆగాడు.
‘‘ఏమిటా మార్పు?’’
‘‘అతడిలోని ఎనర్జీ లెవెల్సు తగ్గినట్టు కనిపించేవి. ఇదివరకటంతటి హుషారు ఉండేది కాదు. పైకి మామూలుగా ఉన్నట్టు కనిపిస్తున్నా, ఆ తేడా స్పష్టంగా కనిపించేది. అతడేదో సమస్యతో సతమతవౌతున్నాడని నాకనిపించేది. ఎందరి సమస్యలనో పరిష్కరించే అతడికి సమస్యేమిటా అని ఆశ్చర్యంగా కూడా అనిపించేది. అయితే కొద్దిరోజుల తరువాత నాకు అతడి సమస్యేమిటో తెలుసుకునే అవకాశం కలిగింది’’.
పాణి ఆసక్తిగా వింటున్నాడు అతడి మాటలని. ‘‘ఏమిటా సమస్య? అది నీకెలా తెలిసింది?’’ ఉత్సుకతగా అడిగాడు.
‘‘మా కాలేజీలో ఒక రూల్ వుంది. దాని ప్రకారం విద్యార్థుల్లో కొంతమంది కలిసి ఒక కమిటీగా ఏర్పడి కాలేజీ అడ్మినిస్ట్రేషన్లో భాగం పంచుకుంటూ యాజమాన్యానికి విద్యార్థుల తరఫున సహకారం అందజేస్తారు. దీనివల్ల కాలేజ్ నుంచి బయటికి వెళ్ళేసరికి విద్యార్థుల్లోని అడ్మినిస్ట్రేటివ్, లీడర్‌షిప్ స్కిల్స్‌ని పెంచుకోవడానికి కూడా దోహదపడుతుందని కాలేజీ యాజమాన్యం ఉద్దేశం. దాంట్లో భాగంగా నాకు కాలేజీకి వచ్చే కరస్పాండెన్సుని రిసీవ్ చేసుకోవడం, బయటికి పంపే కరస్పాండెన్సుని సక్రమంగా వెళ్ళేలా చూసుకోవడమనే డ్యూటీ పడింది. కాలేజీకి వచ్చే ఉత్తరాల్లో కాలేజీకి సంబంధించినవే కాకుండా విద్యార్థులకి వచ్చే ఉత్తరాలు కూడా ఉండేవి. వాటిని వేరు చేసి సంబంధిత విద్యార్థికి అందేలా చూడడం కూడా నా పనే.
రొటీన్‌గా ఈ పన్లు చేసుకుపోతున్న నేను గత కొద్దికాలంగా ప్రతి బుధవారం నాడూ భరణికి ఒక తెల్ల రంగు కవరు రావడం గమనించాను. ఎప్పుడూ కాలేజీకి ఎలాంటి ఉత్తరాలూ రాని వాడికి అలా రెగ్యులర్‌గా ఉత్తరాలు రావడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. భరణిలో కనిపిస్తున్న మార్పుని గమనించిన నాకు హఠాత్తుగా ఒక విషయం అర్థమైంది. దాదాపుగా ఆ ఉత్తరాలు వస్తున్న దగ్గరనుంచే భరణి డల్‌గా అయిపోయాడు! ఆ ఉత్తరాలకీ అతడిలోని మార్పుకీ ఏమైనా సంబంధం ఉందా అన్న అనుమానం వచ్చింది నాకు.
కవరుమీద భరణి అడ్రస్ ఇంగ్లీషులో టైపు చేసి వుండేది. ఫ్రమ్ అడ్రస్ ఏదీ ఉండేది కాదు. ఆ ఉత్తరాలన్నీ ఆర్డినరీ పోస్టులో వచ్చేవి. ఆ ఉత్తరాల్లో ఏముంది? భరణి ఎందుకలా మారిపోయాడు? ఈ ప్రశ్నలు నన్ను నిలబడనిచ్చేవి కాదు. భరణిని అడగాలంటే భయం వేసింది. చివరికి ఆసక్తిని చంపుకోలేక ఒక బుధవారంనాడు భరణికి వచ్చిన ఉత్తరాన్ని ఎవరూ చూడకుండా తెరిచి చూసాను.
కవరు తెరవగానే అందులో పూర్తిగా నల్లరంగులో వున్న ఒక కాగితం. దానిమీద తెల్లరంగులో తెలుగులో ప్రింటు చేసి వున్న ఒకే ఒక వాక్యం ‘నీ అంతు చూస్తాను. నిన్ను వదలను’ అని! పేరూ ఊరూ ఏమీ లేవు. క్రింద మాత్రం ‘యువర్స్ లవింగ్లీ’ అని ఉంది. నీ అంతు చూస్తాను అనడం, మళ్లీ క్రింద యువర్స్ లవింగ్లీ అని రాయడం నాకేమీ అర్థం కాలేదు. ఉత్తరాన్ని కవరులో పెట్టి తిరిగి అంటించి ఏమీ తెలియనట్టుగా భరణికి ఇచ్చేశాను.
తరువాతి బుధవారం కూడా అలాంటి ఉత్తరమే భరణికి వచ్చింది. భరణి లాంటి వ్యక్తి, ఎవరో అనామకుడు రాస్తున్న ఆ బెదిరింపు ఉత్తరాలకి భయపడి మనసు ఎలా పాడుచేసుకుంటున్నాడా అని ఆశ్చర్యంగా అనిపించేది. అతడు అనవసరంగా ఆ ఉత్తరాలకి ప్రాధాన్యత ఇస్తున్నాడనిపించేది. నా దృష్టిలో భరణికున్న ఇమేజ్‌కి భిన్నంగా కనిపించింది భరణి ప్రవర్తన. భరణితో ఆ విషయం చర్చించాలనిపించేది. కానీ అతడికొచ్చిన ఉత్తరం నేను చదివానని తెలిస్తే నాకు చెడ్డపేరు వస్తుందని మాట్లాడకుండా ఊరుకున్నాను.
నిన్న బుధవారం. కాలేజ్‌కి భరణిపేరుమీద ఆ ఉత్తరం రాలేదు. సాయంత్రానికల్లా నాకు భరణి మరణవార్త తెలిసింది!
పాణి అతడు చెబుతున్నదాన్ని ఊపిరి బిగబట్టి వింటున్నాడు. అతడేదో భరణి గురించిన ముఖ్యమైన సమాచారమే చెబుతాడని అనుకున్నాడు కానీ, మరీ ఇంతటి సంచలన విషయం చెబుతాడనుకోలేదు.
‘‘ఎప్పుడూ లేనిది భరణి ముఖంలో భయాన్ని చూడడం, అతడి పేరున వచ్చిన ఆ ఉత్తరాలూ, సరిగ్గా అవి రావడం ఆగిపోయిన రోజునే భరణి మరణించడం ఇవన్నీ చూస్తే, నాకెందుకో భరణి మరణం వెనుక ఏదో కుట్ర ఉందనిపించింది. అందుకే మా మామయ్యకి వెంటనే ఫోన్ చేశాను. మా మామయ్య మీతో మాట్లాడమన్నాడు’’ అన్నాడు శివ.
‘‘చాలా థాంక్స్. నువ్వు నాకెంతో విలువైన సమాచారాన్ని ఇచ్చావు. భరణికి వచ్చిన ఆ ఉత్తరాల్లో ఒకటైనా నీ దగ్గర ఉందా?’’ అడిగాడు పాణి.
‘‘లేదండీ- వచ్చిన ఉత్తరాన్ని వచ్చినట్టు అతడికి ఇచ్చేసేవాడ్ని. ఆ ఉత్తరం చూడగానే భరణి ముఖంలో భయం కనిపించేది. ఉత్తరాన్ని అందుకునేటప్పుడు చేతులు వణకడం స్పష్టంగా కనిపించేది. అతడ్ని అంతలా భయపెట్టేది ఎవరా అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది’’.
‘‘్భరణికుండే మిగిలిన స్నేహితులు ఎవరు? అతడు ఎక్కువగా ఎవరితో క్లోజ్‌గా ఉంటూ ఉంటాడు?’’

ఇంకా ఉంది

వరలక్ష్మి మురళీకృష్ణ