మెయన్ ఫీచర్

సరిహద్దు రాష్ట్రాల్లో తగని చెలగాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశపు దురదృష్టమేమోగాని మన పార్టీలన్నీ సరిహద్దు రాష్ట్రాలలో రాజకీయ చెలగాటాలాడుతున్నాయి. అధికార కాంక్షతో ఇతర రాష్ట్రాలలో ఇటువంటి క్రీడలాడితే వారికింకా ప్రజాస్వామిక పరిణతి రాలేదని సరిపెట్టుకోవచ్చు. స్వాతంత్య్రానంతరం ఇన్ని దశాబ్దాలు గడిచినా అటువంటి పరిణతి ఇంకా కలగకపోవటం విచారకరమే అయినా, అందువల్ల కనీసం దేశ సమగ్రతకు, సమైక్యతకు ముప్పు ఉండదు గనుక ఆమేరకు ఉపేక్షించవచ్చు. కాని అటువంటి ధోరణులు సరిహద్దు రాష్ట్రాలలో తలెత్తటం, నిరవధికంగా కొనసాగటం మాత్రం తప్పక ప్రమాదకరమవుతుంది. అందువల్ల, ఆ ధోరణులను ప్రదర్శించే పార్టీలు ఏవైనాసరే ఖండించక తప్పదు.
అరుణాచల్‌ప్రదేశ్ రాజకీయ పరిణామాలపై సుప్రీంకోర్టు ఈనెల 13వ తేదీన చెప్పిన తీర్పును పురస్కరించుకుని ఈ చర్చ చేయవలసి వస్తున్నది. ఈశాన్య భారతంలో సరిహద్దు రాష్ట్రాలు మరికొన్ని ఉన్నప్పటికీ వాటినన్నింటిలో అరుణాచల్‌ప్రదేశ్ మరింత కీలకమైనది. దానిని ఆనుకుని చైనా ఉన్నది. భారత-చైనా సరిహద్దు వివాదంలో అరుణాచల్ ఉత్తర ప్రాంతాలు సున్నితంగా మారాయి. చైనా లోగడ నాగా, మణిపురి, త్రిపురి, అస్సామీ మొదలైన తీవ్రవాద వేర్పాటువర్గాలకు ఏళ్లతరబడి సహాయం చేసింది. తర్వాత అది ఆగిపోయింది గాని అరుణాచల్ భూభాగాల వివాదం ఇంకా కొనసాగుతున్నది. అక్కడ వేర్పాటువాద సంస్థలంటూ లేవుగాని, సాధారణ ప్రజలలోని పలువురు త్రిశంకు స్వర్గంలో ఉన్నామనే భావనలో జీవిస్తుంటారు. దానినిబట్టి అది మరింత సున్నితమైన ప్రాంతమవుతున్నది. ఈశాన్య భారతం, జమ్మూ-కశ్మీర్ వంటిచోట్ల ఉన్న పరిస్థితులు, జరిగే పరిణామాల వార్తలలో తక్కిన దేశ ప్రజలకు తెలిసే వాటికన్న తెలియనివి చాలా ఎక్కువ. అటువంటపుడు ఆ పరిణామాల పట్ల విషయాలు తెలిసి స్పందించే అవకాశం తక్కిన దేశానికి లేదు గనుక, రాజకీయ నాయకత్వాలపై బాధ్యత మరింత పెరుగుతుంది.
కాని మన పార్టీలు అటువంటి బాధ్యతలో వ్యవహరించటం లేదు. సరిహద్దు రాష్ట్రాలలోనూ దేశ భద్రతకన్న స్వీయ రాజకీయ ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. సరిహద్దు రాష్ట్రాల భద్రత అంటే లక్షలకొద్దీ బలగాలను మోహరించటం ఒక్కటే కాదు. అక్కడ సామాజిక, రాజకీయ, ఆర్థిక సుస్థిరతలను నెలకొల్పటం అన్నింటికన్న ప్రధానం. కాని ఇవేవీ జరగటం లేదు. సామాజికంగా, సాంస్కృతికంగా అక్కడ వైవిధ్యతలు అనేకం ఉన్నాయి. అవి చారిత్రకంగా వేల ఏళ్లుగా ఉన్నవి. వాటన్నింటికి కలిపిన ఐక్యతలు స్థూలంగానైనా పొసగనందువల్లనే బ్రిటిష్ వలస పాలనానంతరం పలు ఘర్షణలు, కొత్త రాష్ట్రాలు, రాష్ట్రాలలో స్వయంపాలిత ప్రాంతాలు, ప్రత్యేక హక్కులు, ఇన్నర్ పర్మిట్లు వగైరాలు చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితులు ఈ రోజువరకు కూడా ఇంకా కొలిక్కిరాలేదు. ఆర్థికంగా కేంద్రం వేల కోట్ల రూపాయలు కుమ్మరించటం మొదటినుంచి ఉన్నా, అక్కడ నివసించే కొద్దిపాటి జనాభాలకు అవసరమైన అభివృద్ధి, ఆర్థిక సుస్థిరతలు నేటికీ లేవు. ఇక రాజకీయం రాజకీయమే. అధికార క్రీడలకు అంతులేదు. మొత్తం మీద ఏ సుస్థిరతలూ లేవు. ఈ పరిస్థితి తరచు సాధారణ అశాంతికి మించిన కల్లోలాలకు తావిస్తున్నది. అయినప్పటికీ లెక్కచేయని కేంద్ర నాయకత్వాలు సాయుధ బలగాలలో ఒక స్థాయి అదుపును సాధించటానికి మించి, ఎంతో సున్నితమైన సరిహద్దు రాష్ట్రాలలో నిజమైన, స్థిరమైన, సుస్థిరతలకోసం ప్రయత్నించటం లేదు. ప్రస్తుతం మనం కశ్మీర్‌లో చూస్తున్న పరిస్థితులకు పూర్తిగా కాకున్నా తగినంతమేర కారణం ఇదే.
సరిహద్దులలో ఇటువంటి అధ్వాన్నపు ధోరణులు స్వాతంత్య్రానంతరం నుంచి మొదలుకొని కాంగ్రెస్‌తో మొదలయ్యాయి. దార్శనికుడు, ఆదర్శవాది అని ప్రపంచవ్యాప్తంగా పేరుపొందిన మొదటి ప్రధానమంత్రి నెహ్రూ కూడా ఇందుకు మినహాయింపు కాలేదు. అపుడాయన అధికారానికి ఏ ప్రమాదం లేకున్నా ఇక తర్వాతివారు అటువంటి ప్రమాదాలను ఎదుర్కోవటంతోపాటు ఆయనకన్నా కిందిస్థాయి నాయకులైనందున, వారు సాగిస్తూవచ్చిన రాజకీయాలు అంతులేనివి. గమనించదగినదేమంటే, వారందరికి ‘ప్రత్యామ్నాయ’విధానాలని ప్రకటించుకున్న బిజెపి పాలనలోనూ తేడా కన్పించటం లేదు.
కేవలం స్థూలంగా, సాంకేతికంగా పరిశీలిస్తే అరుణాచల్ పరిణామాలలో బిజెపి చేతికి మట్టి ఏదీ అంటనట్లు కనిపిస్తుంది. అక్కడ కాంగ్రెస్‌కు చెందిన నబామ్ తుకీ ప్రభుత్వం ఉండేది. ఆయనపై కలీఖోపుల్ నాయకత్వాన అసమ్మతి వర్గం ఒకటి ఏర్పడింది. ఆ వర్గం తన వాదనను వినిపించేందుకు ఎంత ప్రయత్నించినా ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నెలల తరబడి అపాయింట్‌మెంట్ అయినా ఇవ్వలేదు. వాదన విని అవుననటం, కాదనటం వేరు. కాని వారి మాటైనా వినలేదు. ఆ నవతరపు - ఆధునిక- యువ ప్రజాస్వామిక నేత. దానితో విసుగెత్తిన అసమ్మతి వర్గం పార్టీనుంచి చీలిపోయి, బిజెపి మద్దతుతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుచేసింది. కొత్త ముఖ్యమంత్రి తన మెజారిటీని కూడా నిరూపించుకున్నారు. ఇటువంటి సాంకేతిక వివరాలను పరిగణనలోకి తీసుకుంటే ఇది అనేక రాష్ట్రాలలో కనిపించిన సాధారణమైన కథ మాత్రమే. అందులో ఆక్షేపించదగినది ఏమైనా ఉంటే కాంగ్రెస్ అధినాయకత్వపు వైఫల్యం మాత్రమే.
కాని వివరాలలోకి వెళ్లినపుడు దృష్టికి వచ్చేది వేరే కథ. సుప్రీంకోర్టు తీర్పు సహాయాన్ని తీసుకుని విషయాన్ని విశే్లషించి చూడండి. తిరుగుబాటును ఎదుర్కొన్న ఏ ముఖ్యమంత్రి అయినా చేయవలసింది తన ఆధిక్యతను అసెంబ్లీలో నిరూపించుకోవటం. బయట ఏమి జరిగినా, గవర్నర్ వద్దకు ఎందరు ఎమ్మెల్యేలు వెళ్లినా నిమిత్తం లేదు. ఇది రాజ్యాంగం, కోర్టు తీర్పులు స్పష్టంచేసే విషయం. అదే ప్రకారం కాంగ్రెస్ ముఖ్యమంత్రి నబామ్ తుకీ బలపరీక్షకోసం 2016 జనవరి 14వ తేదీని నిర్ణయించారు. అది స్పీకర్ ఆమోదముద్రతో జరిగిన పని. కనుక పూర్తిగా చట్టసమ్మతం. కాని గవర్నర్ రాజ్‌ఖోవా తనంతట తాను ఆ తేదీని 2015 డిసెంబర్ 16కు ముందుకు జరిపారు. అటువంటి అధికారం తనకు ఎంతమాత్రం లేదు. అడ్వాన్స్ అసెంబ్లీలో మొదటి అంశం స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం అని నిర్ణయించారు. అసెంబ్లీ అజెండాను నిర్ణయించే అధికారమూ ఆయనకు లేదు. డిసెంబర్ 16న సభ స్పీకర్ నిర్ణయించింది కాకపోవటంతో అధికారులు అసెంబ్లీని తెరవలేదు. అసమ్మతి వర్గం బయట మరొకచోట సభ జరిపింది. ఆ సమావేశాన్ని గవర్నర్ ధృవీకరించారు. అందుకాయనకు అధికారం లేదు. బయట జరిగిన సభలో స్పీకర్‌ను తొలగించటం, మరో ముఖ్యమంత్రి ఎన్నిక కావటం వంటివి జరిగితే గవర్నర్ వాటికి ఆమోదముద్ర వేసారు. ఈ అధికారాలేవీ ఆయనకు లేవు. అనగా రాజ్‌ఖోవా చర్యలు సమస్తం రాజ్యాంగ విరుద్ధం, చట్టవిరుద్ధమన్నమాట.
అధికార వర్గం ఆలోగా తన రాజకీయం తానుచేసి అసమ్మతి సభ్యులు కొందరిని స్పీకర్ చేత అనర్హులుగా ప్రకటింపజేసింది. ఆ ప్రకటనను హైకోర్టు కొట్టివేసింది. ఆ దరిమిలా ఏమవుతుందన్నది కూడా అసెంబ్లీ ఓటింగులో తేలవలసిన విషయమే గాని, జోక్యం చేసుకునే అధికారం గవర్నర్‌కు సుతరామూ లేదు. సుప్రీంకోర్టు మరొకమారు స్పష్టం చేసినట్లు, ఒకవేళ ఈ పరిణామాల మధ్య గవర్నర్‌కు సందేహాలు ఏవైనా ఏర్పడితే, సూచనలు ఏవైనా చేయదలిస్తే, ఆ పని చేయవలసింది రాష్టప్రతి సమక్షంలో మాత్రమే. స్వీయ విచక్షణతో నిర్ణయాలు తీసుకునే అధికారం ఆయనకు లేదు. వీటన్నింటిని గమనికలోకి తీసుకున్నందువల్లనే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గత బుధవారంనాడు అంత ఘాటైన తీర్పు చెప్పింది. అదే రోజున తుకీ అసాధారణమైన రీతిలో ఢిల్లీలోనే తిరిగి ముఖ్యమంత్రిగా అధికారం స్వీకరించారు.
గవర్నర్ ఆదేశం మేరకు రెండ్రోజుల్లో తుకీ బలం రుజువు చేసుకోవాల్సి ఉండగా అతని స్థానంలో 37 ఏళ్ల పెమా ఖండూ అనూహ్యంగా తెరపైకి రావడం, కాంగ్రెస్ శాసనసభాపక్షం నూతన నేతగా ఎన్నికవడం చకచకా జరిగిపోయాయ. పెమా ఖండూ దివంగత ముఖ్యమంత్రి డోర్జీ ఖండూ తనయుడు. భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గతంలో కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోయన కలిఖోపుల్ సహా అసంతృప్త శాసన సభ్యులంతా తిరిగి గూటికి చేరుకున్నారు. వీరంతా ఖండూకు మద్దతు ఇస్తామని ప్రకటించడంతో అరుణాచల్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి తెరపడి నట్లయంది.
చివరగా బిజెపి విషయానికి వస్తే, కలిఖోపుల్ మాట ఎట్లున్నా, గవర్నర్ చర్యల వెనుక కేంద్రం సంకేతాలు ఉన్నాయనే భావన అప్పటినుంచే సర్వత్రా ఏర్పడింది. ఉత్తరాఖండ్ వంటి పరిస్థితే ఇది కూడా. ఇటువంటి భావనలను కొట్టివేయటం తేలిక కాదు. ముఖ్యంగా ఈశాన్య భారతాన విస్తరణకు బిజెపి గట్టిగా ప్రయత్నిస్తున్నపుడు. అయితే, వారు ఆ పని అస్సాం విజయం రూపంలో రాచమార్గంలో సాధించినపుడు ఎంతటి ప్రశంసలు లభించియో, అరుణాచల్ వంటి సున్నితమైన సరిహద్దు రాష్ట్రంలో ఈ తీరున వ్యవహరించారన్న భావన మాత్రం అంతటి విమర్శలకు తావిస్తుంది. అది వారు కొనితెచ్చుకున్నది.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)