రచ్చ బండ

ఎవరు ముందు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే ఎన్నికలే ప్రధాన లక్ష్యంగా అధికార, పాలక ప్రతిపక్షాలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇందులో కొత్తదనం ఏముందీ? ఏ పార్టీలైనా అధికారం కోసం వెంపర్లాడడం సహజమే కదా అని అనుకోవచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో పాలక, ప్రతిపక్షాల మధ్య పోటా పోటీ నడుస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందే సమయంలో ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని పొందుపరచడంలో అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం పట్టించుకోలేదు. తాము అధికారంలోకి వస్తే తప్పకుండా ప్రత్యేక హోదా కల్పిస్తామని బిజెపి అగ్ర నాయకుడు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎం. వెంకయ్య నాయుడు స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ ఏపీకి ప్రత్యేక హోదా విషయం పట్టించుకోకపోవడమే కాకుండా విభిన్న ప్రకటనలు చేయడంతో గందరగోళం నెలకొన్నది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో టిడిపి భాగస్వామ్య పార్టీగా ఉన్నందున, సమర్థించుకోవడానికి ప్రత్యేక హోదాతో రాత్రికి రాత్రే అద్భుతాలు జరిగిపోతాయని అనుకోరాదని చెప్పారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు రాజ్యసభలో ప్రత్యేక హోదా కోసం ప్రైవేటు బిల్లు ప్రతిపాదించడంతో అన్ని పార్టీల్లోనూ కదలిక వచ్చింది.
ఈ విషయంలో ఎక్కడ వెనుకబడిపోతామేమోనని ఏపీలో అధికార తెలుగు దేశం పార్టీ నేతలు ఆందోళన చెందగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా స్పీడు పెంచింది. ఆ పార్టీ ఎంపి అవినాశ్ రెడ్డి ద్వారా ప్రైవేటు బిల్లు ప్రతిపాదించింది. టిడిపి కూడా ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై వత్తిడి పెంచుతోంది. ప్రత్యేక హోదా అంశంతో వైకాపా నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళడం, అసెంబ్లీని స్తంభింపజేయడం వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ప్రత్యేక హోదా సాధించకపోతే కాంగ్రెస్‌కు పట్టిన గతే తమకూ పడుతుందన్న భయం టిడిపి నేతలను వెంటాడుతోంది. ఇలా అన్ని పార్టీలూ ప్రత్యేక హోదా కోసం పావులు కదుపుతున్నాయి.
ఇక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎత్తుగడలతో బిజెపి మినహా అన్ని పార్టీలూ కకావికలమయ్యాయి. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు టిఆర్‌ఎస్ ఇప్పటి నుంచే పావులు కదుపుతూ ప్రతిపక్షాల అడ్రసు లేకుండా చేసేందుకు యత్నిస్తోంది. ఇందులో భాగంగా 15 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైన టిడిపికి చివరకు మిగిలింది ముగ్గురే సభ్యులు. అసెంబ్లీ ఆవరణలో ఏదైనా పార్టీకి కార్యాలయం ఇవ్వాలంటే తప్పని సరిగా 5 లేదా అంతకు మించి ఎమ్మెల్యేల సంఖ్య ఉండాలి. ఈ నేపథ్యంలో టిడిపి ఆఫీసును అసెంబ్లీ అధికారులు రెండు రెగ్యులర్ కమిటీలకు అప్పగించారు. కాంగ్రెస్ తరఫున 21 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైతే ఇప్పటికే 8 మంది వలస బాట పట్టారు. బిజెపి ఐదు ఎమ్మెల్యే స్థానాలు గెలుపొందింది. అధికార పార్టీ విపక్షాలను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ ధాటిని తట్టుకుని నిలబడేందుకు కాంగ్రెస్, టిడిపిలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. బిజెపి మాత్రం టిఆర్‌ఎస్‌కు మేమే ప్రత్యామ్నాయం అంటూ ప్రచారంలో దూసుకెళుతున్నది. అందుకు అనుగుణంగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నది.
మరోవైపు కేంద్రంలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉండడం వల్ల కేంద్ర మంత్రులు తరచూ తెలంగాణ రాష్ట్రానికి రావడం, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతున్నది. ఆ దిశగా బిజెపి అడుగులు వేస్తుండగా, దేశానికి కాంగ్రెస్సే కీలకమని ఆ పార్టీ ప్రచారం చేస్తున్నది. ఈ దశలో టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిని, ముఖ్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యతిరేక శక్తులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితికి కాంగ్రెస్, బిజెపిలు అనుబంధ సంఘాలుగా మారాయని రేవంత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అందునా మిత్రపక్షమైన భాజపానీ ఆయన వదలలేదు. ఇందులో మతలబు లేకపోలేదు. వచ్చే ఎన్నికల నాటికి బిజెపి మిత్రపక్షంగా ఉన్నా, లేకపోయినా టిఆర్‌ఎస్ వ్యతిరేక శక్తులను, సంఘాలను తమ వైపు తిప్పుకోవచ్చన్నది ఆయన అభిమతం. ఒకవేళ మిత్రపక్షంగా ఉంటే ఎన్నికల సమయానికి టిడిపి జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదో రకంగా మాట్లాడి వివాదం లేకుండా చేస్తారన్నది ఆయన నమ్మకం. మిత్రపక్షంగా లేకపోతే టిడిపి ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే, అప్పటి వరకు టిఆర్‌ఎస్‌కు దూరమైన కొంత మంది ముఖ్యులు, టి-జాక్ వంటి శక్తులను చేరదీస్తూ మద్ధతు కూడగట్టవచ్చన్నది రేవంత్ తాపత్రయం. ముఖ్యమంత్రి కెసిఆర్‌తో తలపడుతున్న నాయకుడిని తానేనన్న సంకేతాలను ప్రజల్లోకి పంపించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైనా, ప్రజా పోరాటాలను చేయడంలో వెనుకబడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు మార్చిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కాం గ్రెస్ ఎమ్మెల్యేలు దానిని బహిష్కరించారు. ముఖ్యమంత్రి సభలో అన్నీ అవాస్తవాలే చెప్పారని, వాస్తవాలు ఏమిటో ప్రజల ముందు పెట్టేందుకు తామూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామంటూ ప్రకటనలు చేస్తూ సుమారు ఆర్నెల్లు గడిపారు. శనివారం (23న) నిర్వహించాల్సిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాయిదా పడింది. టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎల్‌పి నేత కె. జానారెడ్డి సొంత జిల్లా అయిన నల్లగొండలోనే పార్టీ నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌కు అడుగులు ముందుకు పడడం లేదు. టిఆర్‌ఎస్ హనీమూన్ ముగిసిందని, వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని బిజెపి, టిడిపి, కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పడంలో పోటీ పడుతున్నారు. టిఆర్‌ఎస్ మాత్రం విపక్షాలు బలహీనంగా ఉన్నాయని, అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేస్తారన్న ధీమాతో ఉంది.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి