మెయన్ ఫీచర్

వ్యవ‘సాయం’.. వాస్తవమా? శూన్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది.. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు ని జంగా శూన్యమా? కొన్ని మాటలు పైకి వినేందుకే ఆశ్చర్యకరంగా తోస్తాయి. అయినప్పటికీ ‘కళ్లతో ప్రత్యక్షంగా చూడడమే అంతిమ రుజువు’ అనే మాట ప్రకారం ఈ రచయిత ఇటీవల అయిదు నీటి పారుదల పథకాలను చూసిన తర్వాత, ఈ ఆరోపణల పట్ల ఆశ్చర్యం మరింత పెరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగానదిపై చనాఖా-కోరట బ్యారేజి , మహబూబ్‌నగర్ జిల్లాలో కోయిల్‌సాగర్, జోగులాంబ గద్వాల జిల్లాలో నెట్టెంపాడ్, వనపర్తి జిల్లాలో భీమా, నాగర్‌కర్నూలు జిల్లాలో కల్వకుర్తి.. ఈ అయిదు కూడా ఎత్తిపోతల పథకాలే. టిఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి చేస్తున్నది ‘ఏమీలేదు, అంతా శూన్యం’ అనే విమర్శలు మొదటి సంవత్సరంలో మొదలయ్యాయి. ఇపుడు మూడో సంవత్సరంలోనూ అంతే గట్టిగా వినవస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన ఒక పంట కాలం తర్వాత విద్యుత్ కోతలు మటుమాయం కావటం, రెండవ సంవత్సరం సగంలోకి వచ్చేసరికి ఉచిత విద్యుత్ సరఫరా 7నుంచి 9 గంటలకు పెరగటం, విత్తనాలు, ఎరువుల కోసం ‘క్యూ’లు కట్టనక్కరలేని స్థితి, విరివిగా గోడౌన్ల నిర్మాణం వంటివి హైదరాబాద్‌లో వినిపించే విషయాలు. చెరువుల మరమ్మతులు, వివిధ నీటి ప్రాజెక్టుల నిర్మాణాల గురించి కూడా పదే పదే వినవస్తున్న విషయం. ఇవన్నీ రైతుకు మేలుచేసేవి కావా? నేరుగా వ్యవసాయ రంగానికి కాకున్నా రైతు కుటుంబాలకు ఉపయోగపడేవి మరికొన్ని ఉన్నాయి. ఉదాహరణకు ఆసరా పెన్షన్లు పొందుతున్న 37 లక్షల మందిలో అధిక సంఖ్యాకులు రైతు కుటుంబాలవారే. అయినా రైతులకు, వ్యవసాయానికి చేసింది శూన్యమని, వారిని కెసిఆర్ ప్రభుత్వం మోసగిస్తున్నదని అనటం సహజంగానే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చేసింది చాలదని, చేయాల్సినవి చాలా ఉన్నాయని అనటం వేరు. నాసిరకం విత్తనాలను అరికట్టటం, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లభించటం, పరపతి సౌకర్యం గణనీయంగా పెరగటం మొదలైనవి. ఇటువంటి సమస్యలను ఎత్తిచూపితే అర్థం చేసుకోవచ్చు. కాని జరిగిన వాటిని ఇంకా జరగవలసిన వాటిని కూడా కలగలిపి, కళ్లఎదుట జరుగుతున్న వాటిని కూడా విస్మరిస్తూ ‘అసలేమీ’జరగటం లేదనటం వాస్తవం ఎట్లా అవుతుంది?
పైన పేర్కొన్న అయిదు సాగునీటి ప్రాజెక్టు ప్రాంతాలకు వెళ్లి అక్కడ క్షేత్ర స్థాయిలో ప్రత్యక్షంగా జరుగుతున్నదేమిటో చెప్పుకుందాము. ఈ అయిదుచోట్ల ప్రధానమైన ఆర్థిక కార్యకలాపం వ్యవసాయం. జనాభాలో అత్యధికులు భూమి ఉన్న రైతులు. వారిలో అత్యధికులు మధ్య, చిన్నతరహావారు. వ్యవసాయ పనులపై ఆధారపడి జీవించే కూలీలు, వివిధ వృత్తుల వారిని కలిపి చూస్తే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. కనుక వ్యవసాయం కోసం నేరుగా ఏదైనా చేయటమంటే పరోక్షంగా వీరికోసం కూడా చేయడమన్నమాట.
ఆదిలాబాద్ జిల్లాలో పెన్‌గంగ నదిపై చనాఖా-కోరట బ్యారేజి నిర్మాణానికి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మహారాష్టత్రో మొదటిసారి 1975లో ప్రాథమిక చర్చలు జరిపింది. ఆ ప్రతిపాదనలు నలభై ఏళ్లయినా ముందుకుపోలేదు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజులనుంచే వరుసగా సమావేశాలు జరిపి ఒప్పందం చేసుకున్నారు. బ్యారేజి పనులు 2018లోగా పూర్తయ్యేలా పనులు ఆరంభించారు. నదిపై బ్యారేజి, సమీపంలో పంప్‌హౌస్ పనులు, ప్రధాన కాల్వల పనులు సాగుతున్నాయి. ప్రస్తుతం పొలాల్లో పంటలు ఉన్నందున సిస్టర్న్, పిల్లకాల్వల పనులు వాయిదాపడ్డాయి. రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు నిర్మించాలనే ఆలోచన తర్వాత కలిగినందున ఆ పనులు ఇంకా ఆరంభంకావలసి ఉంది. భూసేకరణ, కాంట్రాక్టింగ్ పనులు దాదాపు ముగిశాయి. నిధులకు కొరత లేదు. ఇదంతా చెప్పటం ఎందుకంటే, ఆ ప్రాంతాలలో తిరిగినపుడు సుమారు యాభయి ఏళ్లకు పైబడిన వారంతా, ఈ ప్రాజెక్ట్ మాట తమ చిన్నపుడు విన్నామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పనులు మోదలయ్యాయని సంతోషంగా అన్నారు. ప్రభుత్వం చెప్తున్నట్లు 2018 మధ్యకు కాకున్నా నాలుగు రోజులు అటుఇటుగా బ్యారేజి, కాలువలు పూర్తయి తమ పొలాలకు నీరురాగలదన్న నమ్మకంతో వారు ఉన్నారు.
చనాఖా-కోరట బ్యారేజి కింద సాగునీరు ప్రధానంగా తాంసీ, జైనథ్, బెల మండలాలకు, ఆదిలాబాద్ మండలంలోని నాలుగు గ్రామాలకు అందుతుంది. వీటిలో బెల ఏజెన్సీ మండలం. వీటన్నింటిలో 90 శాతానికి పైగా భూములు వర్షాధారం. బోర్లువేసినా నిలిచేవి కొనే్న. రైతులలో అత్యధికులు నిమ్నవర్గాలవారు. బెల మండలంలో గోండ్లు, కొలాములు, పరధానులు పెద్దసంఖ్యలో ఉన్నారు. అన్ని మండలాల్లోనూ కొద్దిమందిని మినహాయిస్తే రైతులు కూడా తమ కుటుంబ సభ్యులతోపాటు కూలి పనులు చేస్తే తప్ప గడవదు. ఇటువంటి పరిస్థితులలో వారంతా బ్యారేజి కల సాకారమవుతుండగా, ఎంత సంతోషంగా ఉండేదీ ఊహించవచ్చు. ఆ నీరు వచ్చినపుడు తాము ఏమేమి చేయగలరో, తమ జీవితాలు ఎట్లా బాగుపడగలవో వారు ఇప్పటినుంచే అంచనాలు వేస్తున్నారు.
పాత ఆదిలాబాద్ వలెనే పాత మహబూబ్‌నగర్ బాగా వెనకబడిన జిల్లా. పాలమూర్ అనే పేరు ఉన్న ఈ ప్రాంతం ‘పాలమూర్ లేబర్’ పేరిట దేశ, విదేశాలలో వలస కూలీలకు పేరుపడింది. జిల్లాల విభజనలో నాలుగు జిల్లాలుగా మారినా మొత్తం అన్నీ వ్యవసాయకంగా వెనుకబడినవే. పెన్‌గంగానది మహారాష్టల్రో సరిహద్దుగా ఉండి కూడా ఆదిలాబాద్ మండలాలు నీటికి నోచుకోనట్లు, కృష్ణానది తమ భూభాగం మధ్యనుంచే ప్రవహిస్తున్నా మహబూబ్‌నగర్ జిల్లా రైతులు వ్యవసాయం సాగక వలస కూలీలుగా మారారు. ఎన్ని తరాలు గడిచినా పరిస్థితి మారలేదు. అటువంటిచోట కోయిల్‌సాగర్, భీమా, నెట్టెంపాడ్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలకు ఆమోదాలు తెలిపి 8 నుంచి 10 ఏళ్లు గడిచినా పనులు పూర్తికాలేదు. కొన్నిచోట్ల కొద్ది నీళ్లు మాత్రం వచ్చాయి. ప్రాజెక్టులకు భూములు, ఇళ్లు, ఊర్లు ఇచ్చిన వారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. మొత్తం నాలుగు ఎత్తిపోతల పథకాలూ శరవేగంతో పూర్తవుతున్నపుడు ఈ రైతులకు ఇకపై కష్టాలు తీరినట్లేనని భావించాలి. ఇప్పటికే చాలాచోట్ల నీళ్లు కాలువల ద్వారా పూర్తి స్థాయిలో, కొన్నిచోట్ల పాక్షికంగా రావటం మొదలైంది. జూరాలలో అందుబాటులో గల కృష్ణా నీరు వృథాపోరాదని ఎత్తిపోతలు చేసి అనేక జలాశయాలు, వందల కొద్దీ చెరువులు, కుంటలు నింపారు. జలాశయాలు, చెరువులు, కాలువల ఊటతో బోర్లు తిరిగి ప్రాణం పోసుకుంటున్నాయి. కొత్త బోర్లు గతంలో కన్నా తక్కువ లోతులో పడుతున్నాయి. ఒకప్పుడు పశువులను అమ్ముకున్న రైతులు మళ్లీ వాటిని పెంచే ఆలోచన చేస్తున్నారు. మంచినీటి సమస్య తీరిపోయింది. రైతులు తమకు ఇక ఒక పంట గ్యారంటీ అవుతుందని, పలుచోట్ల రెండవ పంట కూడా రాగలదని నమ్మకంతో కన్పించారు. పంట దిగుబడి గతంలో కన్నా పెరుగుతుందన్న భరోసా అందరికీ కలిసింది.
అయిదు ఎత్తిపోతల ప్రాంతాలలోనూ అప్పులులేని రైతు కుటుంబాలు అరుదుగా తప్ప కన్పించలేదు. బ్యాంకుల కన్న ప్రైవేటు అప్పులు ఎక్కువ. నీళ్లు వచ్చి పంటలు పెరిగితే, పెద్దఖర్చులకు తప్ప ఇక కొత్త అప్పులు చేయవలసిన అవసరం ఉండకపోవచ్చునని, ఇప్పటికే అప్పులను తప్పక తీర్చివేయగలమన్న ధైర్యం రైతుల్లో కనిపిస్తోంది. తమకు ప్రైవేట్ అప్పులపై ఆధారపడే అవసరాన్ని తప్పించి, గిట్టుబాటు ధర వచ్చేట్లు చేయగలిగితే తమ కష్టాలు తొలగినట్టేనని వీరు అంటున్నారు. తాము ఇక వరి, గోధుమ, వేరుశనగ, మొక్కజొన్న, పసుపు, పెసర, బొబ్బర్ల వంటివి కూడా సాగుచేయగలమని, పశువులను పెంచుతామని, తమ భూములను కౌలుకు ఇవ్వకుండా తామే సాగుచేసుకోగలమని, కూరగాయలను తామే పండిస్తామని , పళ్లతోటలు వేస్తామని అంటున్నారు.
అయిదు ఎత్తిపోతల ప్రాంతాలలోనూ రైతులు అధికులు నిరక్షరాస్యులు. వీరంతా తమ పిల్లలను స్థానికంగా ఉన్న బడులకు పంపుతున్నారు. దూరప్రాంతాలకు పిల్లలను పంపి డిగ్రీలు చదివించడం అరుదు. ఆర్థిక స్థోమత లేకపోవటం అందుకు కారణం. తమ తరంలో చదువు ప్రాముఖ్యత తెలియలేదు వీరికి. వ్యవసాయం బాగుపడితే పిల్లలను డిగ్రీ చదువులకు పట్టణాలకు పంపగలమని అంటున్నారు. నీరు వచ్చి, వ్యవసాయం బాగుపడి, ఆర్థిక పరిస్థితి మెరుగు పడితేనే ఇవన్నీ నిజమవుతాయి. మరి వీరికి ప్రభుత్వం ఏదైనా చేస్తున్నట్లా? లేక అంతా శూన్యమా?
ప్రతిపక్షాలు ప్రజల్లో తమ విశ్వసనీయతను కోల్పోతున్నది ఈ విధంగానే. రైతులకోసం ప్రభుత్వం చేస్తున్నదేమిటో వారికి తెలియదనలేము. చేస్తున్నవి కొన్నికాగా ఇంకా జరగవలసినవి కొన్నున్నందున, చేస్తున్న వాటిని గుర్తిస్తూ చేయవలసిన వాటి గురించి ఎత్తిచూపినట్లయితే ఆ మాటకు విలువ, విశ్వసనీయత ఉంటాయి. ఇది అతి సామాన్యమైన తర్కం. ప్రతిపక్షాలు అంతా శూన్యమనటం అధికారం పట్ల ఆతురతతో సంయమనాన్ని కోల్పోవటం వల్ల మాత్రమే. నిజానిజాలతో నిమత్తం లేకుండా విమర్శలు చేస్తూపోతే ప్రజలు నమ్ముతారని, నమ్మి తమకు ఓటువేస్తారని తిరిగి అధికారం సంపాదించవచ్చునన్నది వారి ఆశాభావం. రైతులకు సంబంధించి జరుగుతున్నదేమిటో ప్రత్యక్షంగా తెలియని పట్టణవాసులు కొందరు ఈ ఆరోపణలు నిజమని నమ్మవచ్చు. ఇంకా జరగవలసినవి చాలా ఉన్నాయి. అందుకు సంబంధించి రైతుల వద్ద డిమాండ్లు ఉంటాయి. అసలేమీ జరగటం లేదని మాత్రం రైతులు అనడం లేదు.
*

టంకశాల అశోక్ సెల్ : 98481 91767