మెయన్ ఫీచర్

ట్రంప్ గెలుపులో ‘సమాఖ్య’ స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ నామాంకితు డు-నామినీ-డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కానున్నట్టు రష్యా దేశంలోని సైబీరియాలో ఒక ‘మంచు ఎలుగుబంటి’ జోస్యం చెప్పిందట! ఆ జోస్యం నవంబర్ 8న అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలలో వాస్తవంగా ధ్రువపడింది! ఓడిపోతాడన్న ఉద్ధృత ప్రచారానికి గురి అయిన ట్రంప్ గెలిచి కూర్చున్నాడు, డెమోక్రాటిక్ పార్టీ ‘నామాంకిత’-నామినీ- సుప్రసిద్ధ హిల్లరీ క్లింటన్‌ను ఓడించగలిగాడు! హిల్లరీ క్లింటన్ 1993-2001 మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన బిల్ క్లింటన్ భార్య కావడం ఆమె విశ్వవ్యాప్తి ప్రసిద్ధికి ప్రధాన కారణం! చివరి రోజుల పదవీకాలంలో బిల్ క్లింటన్ ‘అక్రమ శృంగార’ అవినీతి వ్యవహారానికి గురై భ్రష్టుపట్టాడు. అమెరికా కాం గ్రెస్-పార్లమెంట్-అభిశంసనను తృటిలో త ప్పించుకున్నాడు. ఆయన సతీమణిగా హిల్లరీ క్లింటన్ అమెరికా ప్రజల సహానుభూతికి గురిఅయింది! 2008లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయబోయింది! కానీ పార్టీ అంతర్గత ఎన్నికల ‘ప్రైమరీ’లలో ఆమె నెగ్గలేదు. అందువల్ల ఆమెకు డెమోక్రాటిక్ పార్టీ నామాంకనం - నామినేషన్ దక్కలేదు, దక్కించుకున్న బరాక్ హుస్సేన్ ఒబామా పోటీ చేసి గెలిచాడు! ఒబామా ప్రభుత్వంలో నాలుగేళ్ళపాటు 2013 వరకు హిల్లరీ క్లింటన్ విదేశాంగ మంత్రిణిగా పనిచేసింది! ఆమె ప్రసిద్ధికి ఇది మరో కారణం! ఆమె న్యూయార్క్ రాష్ట్రం నుండి ఎన్నికైన తొలి మహిళా సెనేటర్! అమెరికా అధ్యక్ష పదవిని అలంకరించిన తొలి మహిళగా ఆమెకు చరిత్రలో స్థానం లభించగలదన్న ప్రచారం మంగళవారం ఎన్నికల పోలింగ్ మొదలయ్యేవరకూ జరిగింది! కానీ ఈ ‘చరిత్ర’ వాస్తవం కాలేదు! డొనాల్డ్ ట్రంప్ అడ్డుకోగలిగాడు! గత ఏడాది రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా రంగంలోకి దూకేవరకు గొప్ప ధనవంతుడైన ట్రంప్‌కు రాజకీయాలతో పరిచయం లేదు. కానీ ‘వివాదాల పుట్ట’గా మారిన ఈ వయోవృద్ధుడు డెబ్భై రెండేళ్ల ట్రంప్‌కు అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలొక్టరల్ కాలేజీలో మెజారిటీ లభించింది! అమెరికన్ ఓటర్లు ఎనిమిదేళ్లకంటే ఎక్కువకాలం ఒకే పార్టీ పాలనను సహించడం లేదు. 1952 నుంచి కొనసాగుతున్న సంప్రదాయం ఇది. 1988లో ఒకసారి మాత్రం ఈ సంప్రదాయం భంగపడింది. 1980 నుంచి ఎనిమిదేళ్లు రిపబ్లికన్ రోనాల్డ్ రీగన్ అధ్యక్షుడిగా ఉండినప్పటికీ 1988లో మళ్లీ రిపబ్లికన్ పార్టీకి చెందిన జార్జ్ బుష్ సీనియర్- అధ్యక్షుడుగా ఎన్నిక కావడం ఈ అపవాదం. 2008 నుంచి డెమోక్రాట్ ఒబామా అధ్యక్షుడు కాబట్టి ఇప్పుడు రిపబ్లికన్ ఎన్నిక కావడం సహజం!
క్రీస్తుశకం 1776 జూలై నాలుగవ తేదీన అమెరికా ఖండంలోని పదమూడు బ్రిటన్ వలసలు-కాలనీస్-బ్రిటన్‌పై తిరుగుబాటు చేశాయి. స్వాతంత్య్రం ప్రకటించుకొన్నాయి. ఈ పదమూడు వలసలు పదమూడు రాష్ట్రాలుగా సమైక్యం కావడం అమెరికా సంయుక్త రాష్ట్రాల- యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా-యుఎస్‌ఏ- ఆవిర్భవానికి అంకురార్పణ! ఇలా కొత్త స్వతంత్ర దేశంగా ఏర్పడిన అమెరికా ప్రజలు నిజానికి బ్రిటన్ సంతతివారు, ఐరోపా సంతతివారు- తమ చరిత్ర మాత్రమే చరిత్ర అని, తాము కనుగొన్నదే పరిశోధన అని, తమ విజ్ఞానం, నాగరికతలే నిజమైనవని, తమ హితమే ప్రపంచ హితమని భావించే దురహంకారం ఐరోపా జాతులను నడిపించింది, నడిపిస్తోంది. ఇతర దేశాలను తాము ‘కనుగొన్న’ నాటినుంచి మాత్రమే ఆయా దేశాల చరిత్ర ఆరంభమైందన్న స్వార్థం ఐరోపా జాతుల స్వభావం! ఈ దురహంకారం, స్వార్థం ఇతర జాతులను అణగద్రొక్కడంలోనే కాదు తమ జాతులలోని బలహీనులను సైతం వివక్షకు, అన్యాయానికి బలిచేయడంలో శతాబ్దులపాటు ప్రస్ఫుటించింది. ఈ బలహీనులలో అత్యధికులు మహిళలు, అబలలు.. గొప్ప నాగరికతగా చరిత్రలో- ఐరోపావారు వ్రాసుకున్న చరిత్రలో ప్రసిద్ధిగాంచిన ‘గ్రీసు’ సమాజంలో మహిళలకు సమాన హక్కులు లేవు. ఈ గ్రీసు నాగరికత క్రీస్తునకు పూర్వం నాటిది! క్రీస్తుశకం ఇరవై శతాబ్ది ఆరంభం వరకు ఐరోపా సమాజంలో మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగానే భావించడం చారిత్రక వాస్తవం.. బ్రిటన్‌లో తామే ప్రజాస్వామ్య పద్ధతులను కనిపెట్టినట్టు జనం చాటుకున్న బ్రిటన్‌లో మహిళలకు వోటు హక్కు వందేళ్ల క్రితం మాత్రమే లభించింది. బ్రిటన్ ‘వారసత్వం’ స్వభావమైన అమెరికాలో సైతం మహిళలకు వోటు హక్కు 1920లో మాత్రమే లభించింది. 1919లో అమెరికా రాజ్యాంగానికి జరిగిన పంతొమ్మిదవ సవరణ ద్వారా మహిళలు కూడా ప్రజాస్వామ్య ప్రక్రియలో పురుషులతో సమాన భాగస్వాములయ్యారు. 1865లో జరిగిన పదమూడవ రాజ్యాంగ సవరణ ద్వారా అమెరికాలో ‘బానిసత్వాన్ని’ రద్దుచేశారు. అంతవరకు తెల్లవారు ‘నల్లవారిని’, ఆఫ్రికా సంతతివారిని జంతువులతో సమానంగా పరిగణించడం అమెరికా కృత్రిమ, సంకర నాగరిక చరిత్రలో భాగం.. కానీ బానిసత్వం రద్దయిన తరువాత కూడా యాభై ఐదేళ్లపాటు మహిళలకు పురుషులతో సమానంగా రాజ్యాంగ ప్రతిపత్తి లభించకపోవడం చరిత్ర...
ఈ చరిత్ర మన దేశంలో లేదు. మన దేశంలో అనాదిగా యుగాలుగా మహిళలకు పురుషులతో సమాన ప్రతిపత్తి లభించడం మాత్రమే కాదు, మహిళ పురుషుని కంటే ఎక్కువ గౌరవాన్ని పొందడం కూడా నిరాకరింపజాలని నిజం! ‘సహస్రంతు పిత్వన్ మాతా గౌరవేణాతిరిచ్యతే..’ అన్నది భారతీయ సహజ జీవన స్వభావం.. తండ్రి కంటే తల్లి వేయి రెట్లు ఎక్కువగా గౌరవించదగినది! ఈ జీవన స్వభావం విదేశీయుల పాలనలో వక్రీకరణకు గురి అయింది. ఈ విదేశీయులలో మన జాతిని ప్రభావితం చేసిన వారు బ్రిటన్ వారు! మన దేశంలో పురుషాధిక్య సమాజం పరిఢవిల్లుతున్నట్టు బ్రిటన్ వారు కనిపెట్టి ప్రచారం చేసిన సమయంలో నిజానికి బ్రిటన్‌లోను, అమెరికాలోను మహిళలు వోటుహక్కు లేని ద్వితీయ తరగతి పౌరులు. డెబ్భై ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మహిళలు సర్వోన్నత రాష్టప్రతి పదవిని, ప్రధానమంత్రి పదవిని నిర్వహించగలిగారు. రెండు వందల నలభై ఏళ్ళ - క్రీస్తుశకం 1776 నుండి 2016 వరకు స్వతంత్ర అమెరికా చరిత్రలో ఇప్పటివరకూ ఒక మహిళ ప్రభుత్వ అధినేత కాలేదు! స్ర్తి, పురుష సమానత్వానికి పదవులు ప్రాతిపదిక కాదు. కానీ అమెరికా సమాజంలో నిహితమై ఉన్న మహిళాభ్యుదయ వైముఖ్యం డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి ఎన్నిక కావడానికి ప్రధాన కారణం!
క్రిస్ట్ఫర్ కొలంబస్ అనే ఐరోపా వాడు 1492లో అమెరికా ఖండాన్ని కనిపెట్టినప్పటినుంచి మాత్రమే తమ చరిత్ర మొదలైనట్టు స్వతంత్ర అమెరికా దేశీయులు 1776 తరువాత కూడా విశ్వసించడం, వ్రాసుకొనడం అమెరికా అనాది చరిత్రను ఐరోపా వారు దిగమింగడానికి సాక్ష్యం. ఈ కొలంబస్ కనిపెట్టడానికి ముందు, అంతకుముందు అమెంగో వెస్బూజీ అనేవాడు కనిపెట్టకముందు కూడా అమెరికా ఖండం ఉంది. ప్రస్తుతం అమెరికా సంయుక్త రాష్ట్రాల భూభాగం ఉంది. అక్కడ ప్రజలున్నారు, నాగరికతలు పరిఢవిల్లాయి. కానీ, క్రీస్తుశకం పదహారవ శతాబ్ది నుంచి అమెరికాకు వలసపోయిన ఐరోపావారు అమెరికాలో అనాదిగా నివసించిన ప్రజలను దశాబ్దుల తరబడి సామూహికంగా హత్య చేశారు. అనాది సంస్కృతిని వ్యవస్థలను నిర్మూలించారు! ఇలా హత్యలు చేసిన ఐరోపా జాతులవారు అమెరికాలో స్థిరపడిపోయారు. ఈ ఐరోపా జాతుల సమష్టి 1776 నాటికి ఇప్పటి అమెరికాలో కొత్త జాతిగా ఏర్పడి ఉంది! ఈ కొత్త జాతి మళ్లీ బ్రిటన్‌పై తిరుగుబాటు చేసి స్వతంత్ర దేశమైంది! ఈ కొత్త దేశం పదమూడు దేశాల సమాఖ్య! అమెరికా అధ్యక్షుని ఎన్నికలలో పాటిస్తున్న ‘వరణ సమితి’ ఎలక్టరల్ కాలేజ్ పద్ధతికి ఈ సమాఖ్య స్ఫూర్తి ప్రాతిపదిక! అమెరికాలో ‘ప్రజాస్వామ్యం’ కంటే ఈ సమాఖ్య పద్ధతి ప్రాధాన్యం సంతరించుకొంది! అందువల్లనే అమెరికా అధ్యక్షుడిని సమాన హక్కు కలిగిన ప్రజలు ఎన్నుకొనడం లేదు. సమాన ప్రతిపత్తి కలిగిన రాష్ట్రాలు ఎన్నుకొంటున్నాయి. దీనివల్ల అనేక సందర్భాలలో ప్రజాస్వామ్య స్ఫూర్తి భగ్నమైంది! దేశం మొత్తం మీద ఎక్కువ ప్రజల వోట్లను పొందిన అభ్యర్థి ఓడిపోవడం, ఓడిన అభ్యర్థి కంటే తక్కువ ప్రజల మద్దతు పొందిన అభ్యర్థి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం కూడా అమెరికా చరిత్రలో భాగం. ‘సమాఖ్య’ ఇందుకు కారణం! ప్రజలు రాష్ట్రాల వారీగా ‘వరణ సమితి’ సభ్యులను మాత్రమే ఎన్నుకొంటున్నారు. ‘వరణ స మితి’లోని 538 స్థానాలలో మెజారిటీ లభించడం అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అనివార్యం! ప్రజల వోట్లలో ఆధిక్యత సాధించడం అనివార్యం కాదు!
తొలినాడు, 1776లో ఏర్పడిన పదమూడు రాష్ట్రాలకు సమాఖ్యలో సమాన ప్రతిపత్తి లభించింది. అమెరికా కాంగ్రెస్ పార్లమెంట్‌లోని ఎగువ సభ సెనెట్ ఈ సమానత్వ స్ఫూర్తికి ప్రతీక! అందువల్ల 1789లో ఏర్పడిన తొలి సెనెట్‌లో ప్రతి రాష్ట్రానికి ఇద్దరు చొప్పున ఇరవై ఆరుగురు సభ్యులున్నారు. అమెరికా తూర్పున అట్లాంటిక్ సముద్ర తీరం పొడవునా- వ్యాపించిన ఈ ‘పదమూడు సమైక్య రాష్ట్రాలు’ క్రమంగా యాబయికి చేరడం తరువాతి చరిత్ర. కొత్త భూభాగాలను ఆక్రమించుకుంటూ అమెరికా ప్రజలు పడమటగా విస్తరించడంతో అమెరికా పడమటి హద్దులు పసిఫిక్ సముద్ర తీరానికి చేరాయి. యాభై రాష్ట్రాలకు రెండు చొప్పున అమెరికా ‘సెనేట్’లో వందల స్థానాలుండడం ఈ ‘విస్తరణ’- వెస్ట్ వర్డ్ ఎక్స్‌పాన్షన్‌లో భాగం! కానీ దిగువ సభ- హవుస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్‌లో యాభై ఐదు స్థానాలున్న కాలిఫోర్నియా రాష్ట్రానికి ‘సెనేట్’లో రెండు స్థానాలే ఉన్నాయి. సెనెట్ కాంగ్రెస్‌లో ఎగువ సభ! దిగువ సభలో కేవలం ఒకే ప్రతినిధి ఉన్న అతి చిన్న రాష్ట్రాలైన ‘వెర్‌వౌంట్’, ‘అలాస్కా’, ‘డిలావేర్’, ‘మంటానా’ వంటి అతి చిన్న రాష్ట్రాలకు కూడా ‘కాలిఫోర్నియా’తో సమానంగా ఎగువ సభలో రెండు స్థానాలుండడం సమాఖ్యలోని సమానత్వ స్ఫూర్తి! అమెరికా కాంగ్రెస్‌లోని ఉభయ సభలలో ఒక్కొక్క రాష్ట్రానికి ఉన్న ప్రతినిధులకు సమానమైన సంఖ్యలో ఆయా రాష్ట్రాలకు ‘అధ్యక్ష వరణ సమితి’లో ప్రతినిధులను కేటాయిస్తున్నారు. దిగువ సభలో నాలుగు వందల ముప్ఫఐదుగురు, ఎగువ సభలో సెనేట్‌లోని వందమంది, రాజధాని వాషింగ్టన్ ప్రాంతమైన కొలంబియా జిల్లాకు ముగ్గురు! ఇలా ఎలక్టొరల్ కాలేజీ మొత్తం సభ్యుల సంఖ్య 538! ఇందులో 270 స్థానాలు గెలిచిన వారు ‘అధ్యక్షుడు’గా ఎన్నికవుతారు! ట్రంప్‌కు బుధవారం మధ్యాహ్నానికే ఈ కాలేజ్‌లో ‘మెజారిటీ’ దక్కింది! ట్రంప్ గెలుస్తాడని జోస్యం చెప్పిన సైబీరియా ‘ఎలుగుబంటి’ పురుషుడన్నది ప్రచారవౌతున్న చతురోక్తి...

-హెబ్బార్ నాగేశ్వరరావు 2013hebbar@gmail.com