మెయన్ ఫీచర్

బెడిసిన వ్యూహం.. బెంబేలెత్తిన జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు వేల రూపాయల కొత్త నోటు కూడా చెలామణి కాని అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. పది, ఇరవై, ఏభై, వంద నోట్లను అధిక సంఖ్యలో ముద్రించినా చిల్లర కొరత లేకుండా పోయేది. రోజువారి కొనుగోళ్లు సజావుగా సాగేవి. పౌరజీవనం స్తంభించేది కాదు. చేతిలో డబ్బుండి కూడా వస్తువుల్ని కొనలేక, ప్రయాణాలు చేయలేక, చెల్లింపులు జరక్క జనం పడుతున్న ఇబ్బంది యుద్ధ కాలాన్ని తలపిస్తున్నాయి.
చెడు చేయటానికి పక్కా ప్రణాళిక లేకున్నా, ఓ మంచి పని చేయడానికి ఆచరణాత్మక వ్యూహం, నిజాయితీ, నిబద్ధత వుండాల్సిందే! లేకుంటే అనుకున్న లక్ష్యం నెరవేరకపోగా తప్పుడు ధోరణులు, అడ్డంకులు తప్పవు. పెద్దనోట్ల రద్దు వ్యవహారంలో ఎంత గంభీరంగా ప్రధాని మోదీ మాట్లాడినా, కడదాకా నిలదొక్కుకుంటాడా? అనే అనుమానం కలుగుతున్నది. చాకలివాడి కుక్క, గాడిద కథలో మంచి చేయబోయిన గాడిద యజమానిచే దెబ్బలు తిన్నట్లు, పెద్దనోట్ల రద్దులో కొందరు సామాన్యులు లాఠీ దెబ్బలు తినడమే కాదు, ఇంకొందరు ప్రాణాల్ని కూడా వదలడం విషాదకరం. పరిస్థితులు ఇంతగా చేజారతాయని మోదీ గాని, ఆర్థికమంత్రి జైట్లీగాని, ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌గాని అనుకొని వుండరు. ఆకలికి, అనారోగ్యాలకు, చలికి, ఎండావానలకు, ప్రకృతి వైపరీత్యాలకు మరణించడం ఓ సాధారణం విషయంగా భావించే ప్రస్తుత వ్యవస్థలో- తమ రెక్కల కష్టం తమకు దక్కకుండా పోతుందేమోననే బెంగ, అభద్రతా భావం జనాల్ని వెంటాడడం ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ఠ.
విదేశాల్లో 75 లక్షల కోట్ల రూపాయలకు పైగా మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెప్పించలేక, కనీసం దేశంలో చెలామణి అవుతున్న నల్లధనాన్ని అరికట్టాలని కాబోలు మోదీ ఈ నిర్ణయాన్ని తీసుకొని వుంటాడు. తన క్యాబినెట్‌లోని మంత్రులకే తెలియనీయకుండా, ఎలాంటి లీకులకు తావియ్యకుండా వ్యవహారాన్ని నడిపినా, పెద్దనోట్ల రద్దు తర్వాత రోజుకో తీరుగా ఇస్తున్న ఆదేశాలు మోదీ ఏకపక్ష వ్యవహార శైలిని ఎత్తిచూపుతున్నాయి. బయటకు చెప్పలేక పోతున్నా, బిజెపి ఎంపిలకు, మిత్రపక్ష ఎంపిలకు, కేంద్రమంత్రులకు ఈ వ్యవహారం ‘నోట్లో వెలగపండు పడ్డ’ చందంగా తయారైంది. బహుశా వీరి సంకేతాలతోనే కాబోలు ప్రతిపక్షాల గొంతు ధైర్యంగా వినిపిస్తున్నది. తనకు ఆస్తులు, ఆడంబరాలు లేవని చెపుతున్న పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ ఈ విషయంగా ప్రధాన భూమిక పోషించడం బలహీనంగా వున్న కాంగ్రెస్‌కు కలసివచ్చింది. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా బిహార్ సిఎం నితీష్‌కుమార్ మద్దతు తెలపడంతో మోదీకి సైతం బాగానే కలసివచ్చింది. ఇక ఎన్నికల రొంపిలో దిగిన యుపి, పంజాబ్ రాజకీయాలు ‘నోట్లరద్దు’ను రాజకీయం చేయలేని స్థితి. ఎందుకోగాని దిల్లీ సిఎం కేజ్రీవాల్ గొంతు దేశ రాజధానిలో కాలుష్యాన్ని ఛేదించి బయటకు రావడం లేదు.
నోట్ల రద్దుపై సంధించిన పది ప్రశ్నలకు జనం స్పందించిన తీరు మోదీకి ఎనలేని ధైర్యాన్ని తెచ్చిపెట్టింది. ఒక్క పదో ప్రశ్న తప్ప, మిగతా తొమ్మిది ప్రశ్నలు, నల్లధనాన్ని, అవినీతిని అరికట్టడాన్ని సమర్ధిస్తారా? అనే ధోరణిలోనే వుండడంతో 93 శాతం ‘ఎస్’ అంటూ ఓటు వేసారు. దేశంలోని సగం పార్లమెంటు స్థానాల్లో జరిగిన ‘సి’ ఓటర్ సర్వేలో కూడా సరాసరి 86 శాతం అనుకూలంగా స్పందించడం గమనించాలి. నల్లధనాన్ని పోగు చేసుకునేవారు, కోట్లకు పడగలెత్తినవారు సైతం ఇలాంటి ప్రశ్నలకు సానుకూలంగానే సమాధానాలు చెబుతారు. అంతరంగం ఏమైనా ముఖేష్ అంబానీ, గాలి జనార్దన రెడ్డి కూడా మోదీ చర్యలు మంచివేనని సెలవిస్తారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే జరిపిన ఉద్యమం సందర్భంగా ఇలాంటి వ్యక్తుల నుంచి సానుకూల సమాధానాల్ని చూసాం. ఇలాగైనా భవిష్యత్ బంగారు బాట కాకపోతుందా? అనే ఆశల పల్లకి ఈ స్పందనకు కారణం కావచ్చు!
ఇంత సానుకూలత ఉన్నప్పుడు, నోట్ల రద్దును అతి రహస్యంగా చేయాల్సిన అవసరం ఏంటనేది మరికొంతమంది ప్రశ్న కాగా, మోదీ అనుకూల వర్గానికి ఈ విషయం ముందే తెలుసనేది మరో ఆరోపణ. ముఖేష్ అంబానీ చమురు బావుల్లో అడ్డగోలుగా సంపాదించిన డబ్బును ‘జియో’లో పెట్టుబడిగా పెట్టి తెల్లధనంగా మార్చుకున్నాడనేది మరో ఆరోపణ. ఎపి సిఎం చంద్రబాబు ‘రద్దు’ ప్రకటనకు మూడు రోజుల ముందే హెరిటేజి షేర్లను అమ్ముకున్నాడనేది మరో ఆరోపణ. చివరికి గుర్రుగుర్రుమన్న కెసిఆర్ దిల్లీ నుంచి తిరిగి వచ్చి చల్లబడ్డారనేది మరో వాదన.
పెద్దనోట్లను రద్దు చేయడం ఎంత మంచిదో, తర్వాత తీసుకుంటున్న చర్యలు మాత్రం ఆక్షేపనీయంగానే వుంటున్నాయి. కరెన్సీలో అధిక శాతం పెద్దనోట్లే కావడం, దొంగనోట్లు ముద్రించడానికి ఆస్కారం, పాకిస్తాన్‌లో ఐఎస్‌ఐ కనుసన్నల్లో సాలీనా 70 కోట్ల రూపాయలు ముద్రిస్తూ భారత్‌లోకి చేరవేస్తున్నారని ఆరోపిస్తూనే- రద్దయిన నోట్ల కంటే పెద్దదైన 2వేల రూపాయల నోట్లను ముద్రించడంలో ప్రభుత్వ ఆంతర్యం అంతుపట్టని వ్యవహారంగా వున్నది. 500 రూపాయల్ని కొన్నాళ్లు చెలామణిలో వుంచినా బ్యాంకుల ముందు జనాలు పడిగాపులు పడాల్సి వచ్చేది కాదు. ప్రత్యక్షంగా ఖాతాదారుడే బ్యాంకుకు రావాలన్నా, వేలిపై ఇంకు ముద్ర వేసినా- ఏ ఒక్క బడాబాబు గానీ, రాజకీయవేత్త గానీ క్యూలో నిల్చునే పరిస్థితి రాలేదంటే నోట్ల మార్పిడి ఎంత పారదర్శకంగా సాగుతోందో తెలుస్తున్నది. అందుకే 25.45 కోట్లుగా వున్న జన్ ధన్ ఖాతాల్లో వారం రోజుల్లోనే ఎకాఎకిన 21 వేల కోట్లు వరదలా వచ్చి చేరాయి. ఇందులో 5.8 కోట్ల ఖాతాల్లో ‘జీరో బ్యాలెన్స్ ’ ఉండడం మరో వింత.
నోట్ల రద్దు వ్యవహారంపై ప్రజలకు అనేక అనుమానాలున్నాయి. తాము దాచుకున్న కొద్దిపాటి నగదు తమకు కాకుండా పోతుందేమో అనే వేదనతో మరణించిన వారు వున్నారు. నిజానికి ఈ చావులకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. వంద, రెండువందల కొనుగోలుకు 2వేల రూపాయల కొత్త నోటు కూడా చెలామణి కాని అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. పది, ఇరవై, ఏభై, వంద నోట్లను అధిక సంఖ్యలో ముద్రించినా చిల్లర కొరత లేకుండా పోయేది. రోజువారి కొనుగోళ్లు సజావుగా సాగేవి. పౌరజీవనం స్తంభించేది కాదు. ఏరోజుకారోజు కావాల్సిన కూరగాయలు, పాలు, కిరాణా వస్తువులు ఆరోజు కొంటేనే అమ్మకందారుకు, వినియోగదారునికి జీవనం గడుస్తుంది. రోజువారి కూలీలకు పని దొరుకుతుంది. చేతిలో డబ్బుండి కూడా వస్తువుల్ని కొనలేక, ప్రయాణాలు చేయలేక, చెల్లింపులు జరక్క జనం పడుతున్న ఇబ్బంది యుద్ధ కాలాన్ని తలపిస్తున్నాయి. భూకంపం లాంటి ప్రకృతి విపత్తులు వచ్చిన సందర్భాల్లోనూ వద్దంటే సహాయం దొరుకుతుంది. నోట్ల రద్దు వ్యవహారం వీటన్నింటిని మించిపోయింది.
నిజానికి మనది అర్థం కాని, అర్థం చేసుకోలేని ఆర్థిక వ్యవస్థ. లాభాలు వస్తాయంటే పుస్తెలు, మట్టెలు అమ్మి, ఉపవాసం వుండైనా పెట్టుబడులు పెట్టడం, ఇల్లు గుల్ల చేసుకోవడం భారతీయులకు అబ్బిన విద్య. చెప్పుడు మాటలు వినడం తప్ప సొంతంగా ఆలోచించని మనస్తత్వం. సర్కారీ ఉద్యోగం వచ్చిందంటే- పై ఆదాయం ఎంత అని ప్రశ్నించే సమాజంలో ఉద్యోగం ఓ హాబీ! క్లేశమాత్రంగా కూడా సేవా భావం లేనివారు దేవుణ్ని కూడా వ్యాపారానికి వాడుకుంటున్నారు. సంపాదనే పరమావధిగా భావించే సమాజంలో ధనవంతుడు మరింత ధనవంతుడు కావడం సహజం. దీన్ని నియంత్రించే శక్తి రాజ్యానికి లేకపోవడం, వారసత్వపు హక్కుగా సంపాదన తరతరాలకు సంక్రమించడం, రాజకీయాల్ని వారే నియంత్రించడం ఈ సమస్యలన్నింటికీ హేతువు. ఉద్యోగ, రాజకీయ, సామాజిక, మానవీయ ధర్మాలు మాటలకే పరిమితం కావడం, వ్యక్తిగత కుటుంబ ధర్మమే ప్రధానం కావడం ఈ వ్యవస్థ పతనానికి ఉత్ప్రేరకాలుగా పనిచేస్తున్నాయి.
అందుకే బిచ్చగాడు కూడా దాచుకోవడానికే అడుక్కుంటాడు. రాచరిక ఠీవి, భూస్వామ్య సంస్కృతి పక్కవాడి గూర్చి ఆలోచించనీయవు. వీటిని వదులుకోని మనస్తత్వం ఎన్ని అబద్ధాలైనా ఆడుతుంది. ఈ జీవనశైలే మన సమాజాన్ని ఎదగనీయకుండా చేస్తున్నది. నల్లధనమే కాదు, అక్రమ ఆస్తుల్ని పెంచుకునే అవకాశాల్ని కల్గిస్తున్నది. దేశాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నామని, యువతకు ఉపాధి కల్పిస్తున్నామని బడాయిలు చెప్పే వందలాది పారిశ్రామికవేత్తలు బినామీ పేర్లపై, కాగితాలపైనే పరిశ్రమల్ని, సంస్థల్ని నడుపుతున్నట్లు చూపుతుంటే- పార్లమెంటు ఆమోదముద్ర వేస్తున్నది. ఇలా 2,071 మంది పారిశ్రామికవేత్తల నిరర్ధక ఆస్తులే రూ.3.89 లక్షల కోట్లుగా తే లింది. వివిధ బ్యాంకుల నుంచి వీరంతా కనీసం రూ.50 కోట్లకు పైబడి తీసుకున్నవారే! రుణాల్ని చెల్లించక, లాభాలు లేవని నమ్మబలికితే విజయ్ మాల్యాకు ఇచ్చినట్లే రిజర్వు బ్యాంకు వీరందరికీ రైట్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఎంపి లెందరో, మంత్రులెందరో బయటకు పొక్కదు.
వివిధ పద్దుల కింద వీరికిచ్చిన పన్ను రాయితీలు రూ.4,524 కోట్లకు పైమాటేనని ఈనెల 22న ‘కాగ్’ ప్రకటించడం గమనార్హం. ఇందులో ముఖేష్ అంబానీ నడిపే రిలయన్స్ పోర్ట్స్ అండ్ టర్మినల్స్ లి. సంస్థకు ఇచ్చిన రాయితీయే రూ.1,766.74గా వుంది. మరో సంస్థ రిలయన్స్ ఇన్‌ఫ్రాకు రూ.51.88కోట్లు పన్ను రాయితీ ఇవ్వగా, జెఎస్‌డబ్లు ఎనర్జీ సంస్థకు రూ.340 కోట్లకు, టాటా పవర్‌కు రూ.36.99 కోట్లను, గుజరాత్ ఫ్లూరో కెమికల్స్‌కు రూ.22.75 కోట్లను ఇచ్చినట్లు ‘కాగ్’ పేర్కొంది. ప్రభుత్వ సూచన మేరకే ఆదాయపుపన్ను శాఖ 80-1ఎ కింద ఈ రాయితీలిచ్చింది. ఇలా లెక్కలు తీస్తూంటే ప్రజల సొమ్మును మింగే ‘మొసళ్లు’ దేశమంతటా విస్తరించి వున్నాయి. ఇప్పుడీ దోపిడీ విద్యాలయాలకు, కార్పొరేట్ ఆసుపత్రులకు వరంగా మారింది. ప్రభుత్వాల బలహీనతలు, బాధ్యతారాహిత్యం ప్రజాస్వామ్యాన్ని ప్రైవేట్‌మయంగా మార్చివేసింది. వీటిని నియంత్రించగలిగితే నిజంగా మోదీ సత్తా ఉన్న ప్రధానిగా చరిత్రలో నిలిచిపోతాడు.

- జి.లచ్చయ్య సెల్: 94401 16162