మెయన్ ఫీచర్

చైనా ‘చేతి’కి నేపాల్ ‘వేలు’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేపాల్‌లో చైనా పెట్టుబడులు పెరుగుతుండడం మన దేశానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న కుట్రలో భాగం! నేపాల్‌కు వివిధ దేశాల నుంచి లభిస్తున్న పెట్టుబడులలో చైనావారి వాటా అరవై ఎనిమిది శాతమన్నది ఇప్పుడు వెల్లడైన వాస్తవం. గత ఆర్థిక సంవత్సరం నేపాల్‌కు తరలివచ్చిన ‘విదేశీయ ప్రత్యక్ష నిధుల’- ఫారిన్ డైరక్ట్ ఇన్‌వెస్ట్‌మెంట్- ఎఫ్‌డిఐ-లో చైనా వాటా నలబయి శాతం! ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ ‘వాటా’ అరవై శాతానికి పెరగడం మనకు ఆందోళన కలిగించవలసిన విపరిణామం! కాని మన ప్రభుత్వం పెద్దగా ఆందోళన చెందడం లేదు. ‘నేపాల్‌తో మన సంబంధాలు పెట్టుబడులపై ఆధారపడి లేవు..’ అని మన విదేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతినిధులు వ్యాఖ్యానించినట్టు సమాచారం. మరి మనకు నేపాల్‌తో సంబంధాలు దేనిపై ఆధారపడి ఉన్నాయి? మన దేశంలోనే చైనావారి పెట్టుబడులు విపరీతంగా పెరుగుతున్నాయి. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ‘పోటీ’లు పడి మరీ చైనా యాత్రలు చేస్తున్నారు. ‘ఇన్ని వేల కోట్ల రూపాయల చైనా పెట్టుబడులు, అన్ని లక్షల కోట్ల రూపాయల చైనా పెట్టుబడులు మనకు లభిస్తున్నట్టు’ ఈ ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలు ‘టముకు వేసి’, టాం టాం కొట్టి ప్రకటించడం నడుస్తున్న చరిత్ర. చైనాలో బుల్లెట్ రైలెక్కి మురిసిపోయిన మనవారికి, మన దేశంలోని చైనీయ ఆహారశాలల్లో విచిత్రమైన పదార్థాలను పసాపసా నములుతున్నవారికి చైనా మన భూభాగాలను కాజేసి ఉన్న వాస్తవం గురించి ధ్యాస లేదు! ‘మనమే’ చైనావారి పెట్టుబడులను భారీగా స్వీకరిస్తున్నప్పుడు, నేపాల్ ప్రభుత్వం వారు స్వీకరించడం గురించి ఆందోళన చెందే ‘నైతిక అధికారం’ మనకు ఉందా? అన్నది ప్రశ్న.. ఒకప్పుడు బ్రిటన్ మన దేశాన్ని దురాక్రమించడానికి పూర్వం నేపాల్ మన దేశంలో భాగం! సమస్త భారతావని బ్రిటన్ బీభత్సకారుల దురాక్రమణకు బలి అయిన సమయంలో, అలా బలికాకుండా స్వాతంత్య్రం నిలబెట్టుకున్న అఖండ భారత ప్రాంతం నేపాల్..!
‘మా దేశం చేతికి లడక్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రాంతాలు ఐదువేళ్లు.. టిబెట్ అరచెయ్యి..’- అన్నది చైనా కమ్యూనిస్టు నియంతలు అమలుజరుపుతున్న దశాబ్దుల దురాక్రమణ నీతికి ప్రాతిపదిక. చైనాలో క్రీస్తుశకం 1949లో కమ్యూనిస్టులు ఏకపక్ష నియంతృత్వ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ నీతి ప్రబలంగా అమలుజరుగుతోంది. అప్పటి కమ్యూనిస్టు అధినేత మావోసేటుంగ్- మావోఝేడుంగ్ - ఈ దురాక్రమక ‘హస్త’ సిద్ధాంత రూపశిల్పి! ఫలితంగా రెండువేల ఐదువందల ఏళ్లకు పైగా స్వతంత్ర దేశంగా ఉండిన టిబెట్ - త్రివిష్టపమ్-ను క్రీస్తుశకం 1950వ దశకంలో చైనా ఆక్రమించుకొంది. రెండువేల ఐదువందల ఏళ్లకు పూర్వం ‘అఖండ భారత్’లో భాగంగా ఉండిన ‘టిబెట్’ క్రమంగా భారత్ నుండి విడిపోయి ‘స్వతంత్ర దేశం’గా అవతరించడం రాజకీయ విపరిణామ పరంపరలో భాగం! అలా స్వతంత్ర దేశంగా ఏర్పడిన ‘త్రివిష్టపం’ క్రీస్తుశకం 1914వ సంవత్సరం వరకు చైనాతో సంఘర్షణ సాగించింది. యుద్ధాలు చేసింది, స్వతంత్ర దేశంగా మనుగడ సాగించింది! 1914లో త్రివిష్టపానికి, మన దేశానికి మధ్య తూర్పు ప్రాంత సరిహద్దును బ్రిటన్ ప్రభుత్వం ఏర్పరచింది. ఈ సరిహద్దు ‘మెక్‌మాహన్ రేఖ’గా ప్రసిద్ధికెక్కింది. భూటాన్ సరిహద్దు నుంచి బర్మా సరిహద్దు వరకు భారత్, టిబెట్ దేశాల మధ్య ఈ ‘మెక్‌మాహన్ రేఖ’ ఏర్పడడం భౌగోళిక చారిత్రక వాస్తవం.. కానీ 1959లో టిబెట్‌ను చైనా పూర్తిగా దురాక్రమించడంతో ‘్భరత-టిబెట్ సరిహద్దు’ ‘్భరత-చైనా సరిహద్దు’గా మారింది. రెండువేల ఐదువందల ఏళ్ల తరువాత మళ్లీ మన దేశానికీ, చైనాకు మధ్య సుదీర్ఘమైన - దాదాపు నాలుగువేల రెండువందల కిలోమీటర్ల సరిహద్దు ఏర్పడింది. ‘మెక్‌మాహన్ రేఖ’ ఈ సుదీర్ఘమైన సరిహద్దు రేఖలో తూర్పు విభాగమైంది.. టిబెట్‌ను 1950 నుంచి దశలవారీగా చైనా దిగమింగిన సమయంలోనే మన జమ్మూ కశ్మీర్‌లోని లడక్‌లోకి కూడ చైనా చొరబడిపోయింది! అరుణాచల్‌ప్రదేశ్ తమదేనని చైనా కమ్యూనిస్టు నియంతలు 1950వ దశకం నుంచి పేచీపెడుతున్నారు. నేపాల్ గత కొన్ని ఏళ్లుగా చైనా ‘కబంధ బంధం’లో చిక్కుకొంటూ ఉండడానికి ఈ చైనా ‘చెయ్యి’ సిద్ధాంతం నేపథ్య వైపరీత్యం...
నేపాల్ స్వతంత్ర దేశమైనప్పటికీ మన దేశంతోకల సాంస్కృతిక ఏకత్వం నేపాల్ జాతీయ వారసత్వం. కొలంబో నుంచి ‘కైలాసం’ వరకు, గాంధారం నుంచి బర్మా వరకు గల భూఖండంపై అనాదిగా వికసించిన భారత జాతీయ జీవనంలో నేపాల్ చరిత్ర భాగం. క్రీస్తుశకం పదిహేడవ శతాబ్ది ఆరంభం నుంచి మన దేశంలోని చొరబడిన బ్రిటన్ వాణిజ్య బీభత్సకారులు క్రమంగా రాజకీయ బీభత్సకారులుగా స్థిరపడినారు. నేపాల్ ప్రాంత ప్రజలు ఈ బ్రిటన్ దురాక్రమణను విజయవంతంగా ఎదిరించారు. 1925 వరకు నేపాల్ బ్రిటన్‌వారి దురాక్రమణపై పోరాడింది. 1925లో బ్రిటన్ సామ్రాజ్యవాదులు నేపాల్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించడం చరిత్ర.. భారత ఖండంలోని ఇతర ప్రాంతాలు దాస్యగ్రస్తం అయ్యాయి. భారత ఖండంలోని నేపాల్ మాత్రం 1947వరకూ స్వతంత్రంగా మనుగడ సాగించింది. అందువల్ల బ్రిటన్ విముక్త భారతదేశంలో నేపాల్ 1947లో సహజంగా ఏకీకృతం అయి ఉండాలి! అలా జరుగకపోవడం అప్పటి మన నాయకుల వైఫల్యం! భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల వలె నేపాల్ కూడ బ్రిటన్ దురాక్రమణకు బలి అయి ఉండినట్టయితే, 1947 ఆగస్టు 15వ తేదీ తరువాత కూడ ‘నేపాల్’ సహజంగానే భారతదేశంలో ఒక ప్రాంతంగా కొనసాగి ఉండేది! అది జరగకపోవడం నేపాల్ మన దేశం నుంచి విడిపోవడానికి కారణమైంది! తమ ‘రాజ్యాన్ని’ కూడ మన దేశంలో విలీనం చేయగలమని, అందుకు అంగీకరించాలని 1947లోను, 1950వ దశకంలోను నేపాల్ ప్రభుత్వం స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని కోరిందట! కానీ అప్పటి మన ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ అంగీకరించలేదట! ‘మీరు మా దేశంలో విలీనం కావద్దు, మీరు స్వతంత్ర దేశంగానే ఉండండి..’ అని నెహ్రూ నేపాల్ ప్రభుత్వానికి సలహా ఇచ్చాడట! అదే సమయంలో చైనా ప్రభుత్వం టిబెట్‌ను దురాక్రమించింది! చరిత్రలో ఎప్పుడు కాని టిబెట్ దేశం చైనాలో భాగం కాదు.. అలాంటి టిబెట్‌ను చైనా దురాక్రమించుకొంది. బ్రిటన్ వాణిజ్య సామ్రాజ్యవాదులు మన దేశాన్ని ‘కబ్జా’ చేసేవరకు అనాదిగా నేపాల్ మన దేశంలో భాగం! అలాంటి నేపాల్ మన దేశంలో మళ్లీ కలసిపోవడానికి స్వచ్ఛందంగా సంసిద్ధతను ప్రకటించినప్పటికీ మన ప్రభుత్వం కలుపుకోలేదు, నెహ్రూ నేపాల్‌ను దూరంగా నెట్టేశాడు! అటల్ బిహారీ వాజపేయి ప్రధానమంత్రిగా ఉండిన సమయంలో ‘మల్కానీ’ అన్న ప్రముఖ పత్రికా రచయిత, భారతీయ జనతాపార్టీ వరిష్ఠ నాయకుడు ఈ చారిత్రీక వాస్తవాన్ని, జవహర్‌లాల్ నెహ్రూ అవలంబించిన విస్మయకరమైన దేశ వ్యితిరేక విధానాన్ని బయటపెట్టాడు! కాని అప్పటికి మన విదేశ వ్యవహారాల విధానపు ‘చేతులు’ కాలిపోయాయి.. ‘ఆకు’లను పట్టుకోలేదు! చైనావారి ‘చెయ్యి’ సిద్ధాంతం నేపాల్‌ను ఆవహించిపోతోంది....
పుష్పక్‌మల్ దహల్ ప్రచండ అన్న ‘నేపాల్ మావోయిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ’ మహానేత గత ఆగస్టులో మళ్లీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఈ ‘చైనా చొరబాటు’ మరింత తీవ్రతరం అయింది. 2008వ, 2009వ సంవత్సరాలలో నేపాల్ ప్రధానిగా పనిచేసిన సమయంలో కూడ ప్రచండ మన దేశంపై విషం కక్కాడు. చైనాకు అనుకూలంగా నేపాల్ సైనిక దళాలను తీర్చిదిద్దడానికి యత్నించాడు! క్రీస్తుశకం 1950వ సంవత్సరం నాడు ‘్భరత్- నేపాల్’ మైత్రీ ఒప్పందాన్ని రద్దుచేయాలని కోరాడు. 1949 నాటి ‘వాణిజ్యం, రాకపోకల’- ట్రేడ్ అండ్ ట్రాన్సిట్- ఒప్పందం కూడ రద్దు కావాలన్న కోర్కెను ప్రచండ వెళ్లగక్కాడు! నిజానికి చైనా ప్రేరణతో 1995-1996వ సంవత్సరాలలో నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీని చీల్చి, కొత్త పార్టీగా అవతరించిన నాటినుంచి మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీవారు మన దేశంపై విషం కక్కుతూనే ఉన్నారు! పదేళ్లపాటు బీభత్సకాండ సాగించిన మావోయిస్టులు దాదాపు పదమూడువేల మంది నేపాలీ భద్రతా సిబ్బందిని, ప్రజలను హత్యచేయడం చైనావారి విష వ్యూహంలో భాగం! మావోయిస్టులు ఎన్నికలలో ఓడిపోయినట్టయితే వారు మళ్లీ సాయుధ బీభత్సకాండకు పూనుకుంటారన్న భయంతో నేపాల్ వోటర్లలో ఎక్కువమంది 2008నాటి రాజ్యాంగ పరిషత్ ఎన్నికలలో వారికి అనుకూలంగా వోట్లు వేశారు. ఆరువందల ఒక్క స్థానాలున్న రాజ్యాంగ పరిషత్‌లో ఆ ఎన్నికలలో మావోయిస్టులకు రెండు వందల ఇరవై అయిదు స్థానాలు లభించాయి. ప్రచండ ప్రధానమంత్రి అయ్యాడు. కానీ అధ్యక్షుడు రామ్‌భరణ్ యాదవ్ అడ్డుకోవడం ప్రచండ ప్రభుత్వం వారు 1950 నాటి, 1949 నాటి ఒప్పందాలను రద్దుచేయలేకపోయారు! సైనిక దళాలను చైనాకు అనుకూలంగా మార్చడానికి కూడ ప్రచండ అప్పుడు ప్రయత్నించాడు! దీనికి అడ్డుగా ఉండిన రుక్మాంగద కటావల్‌ను సైనిక దళాల ప్రధాన అధికారి పదవి నుంచి ప్రచండ తొలగించాడు. అధ్యక్షుడు రామ్‌భరణ్ యాదవ్ ఈ తొలగింపును రద్దుచేయడంతో ప్రచండ 2009లో ప్రధాని పదవికి రాజీనామా చేశాడు..
రాజ్యాంగ పరిషత్‌కు 2013 నవంబర్‌లో రెండవసారి జరిగిన ఎన్నికలలో మావోయిస్టు పార్టీ ఘోర పరాజయం పాలైంది, మూడవ స్థానానికి దిగజారిపోయింది. అయినప్పటికీ గత ఏడాది ఆగస్టులో ప్రచండ మళ్లీ ప్రధానమంత్రి కాగలిగాడు! అతి పెద్ద పార్టీగా అవతరించిన నేపాల్ కాంగ్రెస్‌కూ, రాజ్యాంగ పరిషత్‌లో రెండవ పెద్దపార్టీ‘కమ్యూనిస్టు మార్క్సిస్ట్ లెనినిస్ట్’ పార్టీకి మధ్య ఏర్పడిన వైరుధ్యాలు ఇందుకు కారణం! ఈ వైరుధ్యలను కల్పించడం కూడ చైనా వ్యూహంలో భాగం. ప్రచండ చైనా వారి చంకబిడ్డ. నూతన రాజ్యాంగం ఏర్పడిన తరువాత రాజ్యాంగ పరిషత్ జాతీయ శాసనసభగా మారింది! ఖడ్గప్రసాద్ ఓలీని ప్రధానమంత్రి పదవి నుంచి తొలగించి ప్రచండ ప్రధాని కాగలిగాడు!
చైనాతో నేపాల్ భౌగోళిక, వ్యూహాత్మక, వాణిజ్య సంబంధాలను పెంచుకొనడం 1949వ, 1950వ సంవత్సరాల నాటి ‘్భరత్- నేపాల్ ఒప్పందాల’ స్ఫూర్తికి విఘాతకరం. ఈ ఒప్పందాలు యుగయుగాలుగా నేపాల్‌కు మన దేశంతో ఉన్న సమాన సాంస్కృతిక, రక్షణ, భౌగోళిక, ఆర్థిక బంధానికి మరో ధ్రువీకరణ మాత్రమే! ఆదిశంకరాచార్యుడు క్రీస్తునకు పూర్వం ఐదవ శతాబ్దిలో నేపాల్‌ను సందర్శించి తన హైందవ జాతీయ సమైక్యవాణిని వినిపించిన నాటిది ఈ సాంస్కృతిక బంధం. క్రీస్తునకు పూర్వం ముప్పయి రెండవ శతాబ్దినాటి మహాభారత యుద్ధ సమయంలో ‘నేపాల్ రాజ్యం’ పాండవులకు బాసటగా నిలచినప్పటిది ఈ భౌగోళిక బంధం. అప్పటినుంచి క్రీస్తుశకం ఏడవ శతాబ్ది వరకూ కొనసాగిన సమీకృత భారత రాజ్యాంగ వ్యవస్థలో నేపాల్ భాగం! క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దినాటి భారత సమ్రాట్ విక్రముడు నూతన ‘కాలగణన’ పద్ధతి ‘సంవత్’ను నేపాల్‌లోని పశుపతినాథుని సన్నిధిలో ప్రారంభించడం చరిత్ర. ఈ విక్రమ శకాన్ని నేపాల్ ప్రజలు రెండువేల ఏళ్లకుపైగా పాటిస్తున్నారు. 2009లో నేపాల్ ప్రభుత్వం ఈ శకాన్ని రద్దుచేసినప్పటికీ నేపాలీ ప్రజలు మాత్రం విక్రమ శకాన్ని పాటిస్తున్నారు!
నేపాల్‌కు చరిత్రలో ఎప్పుడూ చైనాతో ఎలాంటి సంబంధాలు లేవు. నేపాల్‌కు, చైనాకు మధ్య ‘టిబెట్’ ఉండడం ఇందుకు కారణం. 1959 తరువాత కూడ ఇటీవలి వరకూ చైనాతో నేపాల్‌కు ప్రమేయం లేదు! కానీ ఇప్పుడు చైనానుండి నేపాల్‌కు రహదారులు ఏర్పడిపోయాయి! యుగాలుగా మన దేశం గుండా నేపాల్‌కు సకల విధ వస్తువుల రవాణా జరిగింది! ఇప్పుడు చైనా నుండి వస్తుసామగ్రి నేపాల్‌కు తరలివస్తోంది! ‘నేపాల్, చైనా సైనికుల ఉమ్మడి విన్యాసాలు’ భారత వ్యతిరేకతకు పరాకాష్ఠ!! మన ప్రభుత్వం వ్యూహాత్మకంగా విఫలమైపోతోందా? *

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 99510 38352