మెయన్ ఫీచర్

గ్రహాల గృహాల గగన పథం వెంట..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూమి వంటి మరో ఏడుగ్రహాలను శాస్తవ్రేత్తలు గుర్తించారట! ఈ ఏడు గ్రహాలు ఒక ‘నక్షత్రం’ చుట్టూ తిరుగుతున్నాయట! ఈ గ్రహాల గృహం మన సౌర కుటుంబానికి ము ప్పయి తొమ్మిది ‘కాంతి సంవత్సరాల’ దూరంలో అంతరిక్షంలో అలరారుతోందట! ‘్భరతీయ అంతరిక్ష పరిశోధక మండలి’- ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్- ఇస్రో- వారు గత మాఘ బహుళ పంచమి- ఫిబ్రవరి పదిహేనునాడు ఒకేసారి నూట నాలుగు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి భూసమాంతర కక్ష్యలో ప్రవేశపెట్టగలగడం సమాంతర చారిత్రక పరిణామం! కొత్తగా ‘కనుగొన్న’ ఏడుగ్రహాలు అంతరిక్షంలో అనాదిగా ఉన్నాయి. ‘ఉపగ్రహాలు’ కొత్తగా ప్రవేశించాయి. ఇదీ సమాంతర పరిణామాల మధ్య అంతరం. మన ‘్భమి’ కంటె చాలా పెద్దదైన ‘మహాభూమి’ కూడ అంతరిక్షంలో ఉన్నట్టు పాశ్చాత్యులు రెండేళ్ల క్రితం ‘కనిపెట్టారు..’!
నూట నాలుగు కొత్త ఉపగ్రహాలు ఒకేసారి భూమి చుట్టూ తిరగడం ఆరంభం కావడం ఖగోళ వ్యవస్థలో సంభవించిన శుభంకర పరిణామం! ఒకప్పుడు ఒకే ఒక చంద్రుడు బిక్కుబిక్కుమంటూ భూమి చుట్టూ తిరిగేవాడు. చంద్రుడు భూమాతకు ఉపగ్రహం! కోట్ల సంవత్సరాల ఈ చరిత్రలో, ఈ కలియుగం యాబయి ఒకటవ శతాబ్దిలో, కొత్త కలకలం ఏర్పడింది. మానవ నిర్మిత ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరగడం మొదలైంది. కొన్ని కొత్త ఉపగ్రహాలు భూభ్రమణానికి సమానవేగంతో భూమి చుట్టూ తిరుగుతున్నాయి. అందువల్ల అవి ఎప్పుడూ, సాపేక్షంగా ఒకేచోట ఉంటున్నాయి. ఇలా నిరంతరం తిరుగుతున్న గ్రహాలు, నక్షత్రాలు, బ్రహ్మాండాలు భూమి నుంచి చూసినప్పుడు ఒకేచోట దృశ్యమానం కావడం సృష్టిగత అద్భుతం! ఇది సహజం! సాపేక్షం! ఈ సహజ సూత్రాన్ని మానవ నిర్మిత ఉపగ్రహాలకు అన్వయింపచేసుకొనడం మానవుల విజ్ఞానం. అనాదిగా భూమి చుట్టూ తిరుగుతున్న చంద్రుడనే ‘ఉపగ్రహం’ ఇప్పడు ఒంటరి వాడు కాడు. వందలాది మంది సోదర ‘ఉపగ్రహాలు’ ఆయనకు తోడుగా భూమి చుట్టూ తిరుగుతున్నారు! మన దేశానికి చెందిన ‘ఆర్యభట్’ ఉపగ్రహం చాలా ఆలస్యంగా ఈ ‘ఉపగ్రహాల’ పరంపరలోకి చేరాడు! కలియుగం నాలుగవ శతాబ్దిలో ‘ఆర్యభట్టు’ అనే ఖగోళ విజ్ఞానవేత్త మనదేశంలో జీవించాడు! ఇప్పుడు కలియుగంలో యాబయి రెండవ శతాబ్ది నడుస్తోంది, ప్రస్తుతం కలియుగంలోని ఐదువేల నూట పద్దెనిమిదవ సంవత్సరం జరుగుతోంది. అందువల్ల మన దేశంలో పుట్టిపెరిగిన ఆర్యభట్టు ఇప్పటికి దాదాపు నాలుగువేల ఏడు వందల ఏళ్లకు పూర్వం జీవించాడు! అంటే క్రీస్తునకు పూర్వం ఇరవై ఎనిమిదవ శతాబ్ది నాటివాడు. కలియుగం మూడువేల నూట రెండవ ఏట క్రీస్తుశకం ఆరంభమైంది! ఇలా అతి ప్రాచీన ఖగోళవేత్తలు మన దేశంలో పుట్టినప్పటికీ మనం అంతరిక్ష పరిశోధక రంగంలో వెనక పడిపోయామన్న భ్రమ కలగడానికి ఏకైక కారణం కలియుగం నలబయి ఎనిమిదవ శతాబ్ది నుంచి- క్రీస్తుశకం పదిహేడవ శతాబ్ది నుంచి- బ్రిటన్ సామ్రాజ్యవాదులు మన దేశంలోకి చొరబడిపోవడం. అమెరికా,రష్యా దేశాల వారు మానవ నిర్మిత ఉపగ్రహాలు ప్రయోగించిన తరువాత అనేక ఏళ్లకు కాని మనం ఉపగ్రహాలను ప్రయోగించలేకపోయాము. కలియుగం ఐదువేల డెబ్బయి ఏడవ సంవత్సరంలో క్రీస్తుశకం పంతొమ్మిది వందల డెబ్బయి ఐదవ ఏట- మనం ప్రయోగించిన మొదటి ఉపగ్రహానికి ఆర్యభటుని పేరు పెట్టుకోవడం శుభారంభం. నాలుగేళ్ల తరువాత రూపొందిన రెండవ ఉపగ్రహం ‘్భస్కర’! భాస్కరాచార్యుడనే గణితశాస్తవ్రేత్త కలియుగం ముప్పయి ఆరవ శతాబ్దిలో జీవించాడు. అంటే క్రీస్తుశకం ఐదవ శతాబ్దివాడు!
శతాబ్దుల విదేశీయ దురాక్రమణ వల్ల వెనుకబడిన మనం మళ్లీ అంతరిక్ష విజ్ఞాన పథంలో అగ్రగాములు అవుతున్నాము. ‘చతురోత్తర శత ఉపగ్రహ ప్రయోగం’ ఇందుకు ఒక నిదర్శనం. కలియుగంలో మూడు వందల ముప్పయి ఏడవ సంవత్సరంలో తాను జన్మించినట్టు ‘ఆర్యభటుడు’ స్వయంగా చెప్పుకున్నాడు. ‘కలియుగమునందు ‘అరవై ఏళ్లు’ ఆరుసార్లు గడిచినప్పటికీ నాకు ఇరవై మూడు ఏళ్లు..’ అని తన ‘ఆర్యభటీయం’ అన్న గ్రంథంలో ఆయన చెప్పుకున్నాడు. అంటే కలియుగంలో మూడువందల అరవై ఏళ్లు గడిచినప్పటికి ఆయనకు ఇరవై మూడు ఏళ్లు! ‘‘షష్ట్యబ్దానాం షడ్భి? యదా వ్యతీతాః త్రయశ్చ యుగ పాదాః త్య్రధికా వింశతి రబ్దాస్తదేవ మమ జన్మనః అతీతాః..’ ఇలా క్రీస్తుశకం ఆరంభం కావడానికి ముందు రెండు వేల ఏడు వందల నలబయి రెండవ సంవత్సరం నాటికి ఆర్యభటుని వయస్సు ఇరవై మూడు ఏళ్లు. ఆయన క్రీస్తునకు పూర్వం రెండు వేల ఏడువందల అరవై ఐదవ ఏట జన్మించాడు. ఇప్పటి నాలుగువేల ఏడు వందల ఎనబయి ఒక్క సంవత్సరాలకు పూర్వం ఆర్యభటుడు జన్మించాడు! జాతీయ చరిత్రకారుడు స్వర్గీయ కోట వెంకటాచలం ఈ వివరాలను వెల్లడించి ఉన్నాడు. ఇలా అతి ప్రాచీన ఖగోళ వేత్త ఆర్యభటుడు జన్మించిన మన దేశం మళ్లీ ఇన్నాళ్ల అంతరిక్ష పరిశోధన పథంలో ముందు వరుసలో నడవగలుగుతోంది! క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దినాటి వరాహ మిహిరుడు, మహాకవి కాళిదాసు అంతరిక్ష విజ్ఞాన సముద్రాన్ని మధించిన భారతీయులు. వరాహ మిహిరుడు తన సమకాలంలో ప్రపంచ ప్రసిద్ధుడని కాళిదాసు తన ‘జ్యోతిర్ విదాభరణం’ గ్రంథంలో చెప్పాడు. ‘ఖ్యాతో వరాహ మిహిరః..’. వీరిద్దరూ క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దిలో అఖండ భారతదేశాన్ని పాలించిన ప్రమర వంశపు విక్రమ సమ్రాట్టు ఆస్థాన విద్వాంసులు! నవరత్నాలలోని ఇద్దరు. వరాహ మిహిరుడు నేటి అఫ్ఘానిస్థాన్, పాకిస్తాన్ దేశాలలో అప్పుడు ఉత్తరంగా విస్తరించి ఉండిన ‘సింహపుర’ రాజ్యంలో పుట్టాడు. ఆయన ఉజ్జయినికి రాకపూర్వమే దేశ విదేశాలలోని విద్యార్థులు ఆయన వద్ద ‘ఖగోళం’ అభ్యసించారు! క్రీస్తు శకం నాలుగవ శతాబ్ది- కలియుగం ముప్పయి ఐదవ శతాబ్ది- నాటి భట్టోత్పతుడు మరో ప్రసిద్ధ ఖగోళవేత్త! ఆర్యభటుడు ‘అరవై’ని ‘ఆరు’తో గుణించి కాలాన్ని లెక్కించడం భారతీయమైన విలక్షణ పద్ధతి. ‘ప్రభవ’ నుంచి ‘అక్షయ’ వరకు అరవై ఏళ్ల సంవత్సర చక్రం పదే పదే పునరావృత్తం అవుతోంది. ఇది కేవలం కలియుగం ఆరంభమైన తరువాతి కథ!
‘సూర్య సిద్ధాంతం’ అన్న ఖగోళ గ్రంథం పూర్వయుగాలలోనే ప్రచారంలో ఉంది! పూర్వ యుగాలు ద్వాపర, త్రేత, కృత యుగాలు! పూర్వయుగాల పేరు చెప్పగానే ముక్కులను, మూతులను వంకరగా తిప్పి వికృత విన్యాసాలను ప్రదర్శించే బ్రిటన్ మానసిక బౌద్ధిక వారసులు ఈ చరిత్రను నమ్మకపోయినంత మాత్రాన నష్టం లేదు. ‘కృతత్రేత ద్వాపర కలి’ యుగాలను మరచిన బ్రిటన్ భావదాసుల చరిత్ర ‘రాతియుగం’, ‘కోతి యుగం’, ‘లోహ యుగం’, ‘మోహయుగం’ వంటి కల్పనా ప్రపంచంలో గింగిర్లు తిరుగుతూ ఉంది! కానీ, ‘సూర్య సిద్ధాంతం’ అనాదిగా భారతదేశంలో ఖగోళ వాస్తవాలను ప్రచారం చేసింది. సౌర సంవత్సరం నిడివి క్రమంగా తగ్గుతోందని మొదట గుర్తించినది భారతీయులే. ఇందుకు ఒక ప్రధానమైన ఆధారం సూర్య సిద్ధాంతం! ప్రతి నాలుగు వేల తొమ్మిది వందల సంవత్సరాలకు నలబయిన్నర ‘సెకండ్ల’ మేర సౌర సంవత్సరం నిడివి తగ్గుతోంది! క్రీస్తుశకం పదునెనిమిదవ శతాబ్దినాటి ఫ్రాన్స్ శాస్తవ్రేత్త మాన్స్ డి. లా కయిలీ ఈ సంగతిని కొత్తగా ‘కనిపెట్టాడు’! సంవత్సరం నిడివి మూడువందల అరవై ఐదు రోజుల ఐదు గంటల నలబయి ఎనిమిది నిముషాల నలబయి ఎనిమిది సెకండ్లని ‘లా కయిలీ’ నిర్ధారించాడు. భారతీయ ఖగోళ వేత్తలు లక్షల ఏళ్లుగా వివిధ సమయాలలో సంవత్సరం నిడివి మారిన సంగతిని నిర్ధారించారు. అందువల్లనే సృష్ట్యాది నూటతొంబయి ఐదు కోట్ల సంవత్సరాలకు పైబడిన చరిత్రలో ‘కాలగణన’ నిర్దిష్టంగా కొనసాగింది, కొనసాగుతోంది! పనె్నండు ‘సంక్రాంతులు’ ఇలా పనె్నండు సౌరమాన మాసాలు! సంక్రాంతులు- ఖగోళ గత పరిణామాలకు ప్రత్యక్ష ప్రమాణాలు! సృష్టిగత వాస్తవాలను సమాజసిద్ధంగా మార్చుకొన్న జాతి భారత జాతి! అందుకే మనవారు ‘కనిపెట్టలేదు’! ఉన్న సంగతిని గుర్తించారు. ఖగోళ స్థితి వాస్తవాలను అనాదిగా గుర్తించడం, వాటి పట్ల సహజ అవగాహన కలిగి ఉండడం భారతీయుల వినయంతో కూడిన సమన్వయం! అందువల్ల మన ‘పంచాంగాల’ లెక్కలు తప్పలేదు! మన ‘విజ్ఞాన’ పరిధిలో ‘విశ్వాన్ని’ ఇరికించే ప్రయత్నం భారతీయులు చేయకపోవడం లెక్కలు తప్పని మన కాలగణనకు నిదర్శనం! ఈ ‘ప్రయత్నం’ చేసిన పాశ్చాత్యులు ఎప్పటికప్పుడు ‘పప్పు’లో కాలేయడం గత రెండు వేల ఏళ్ల చరిత్ర! అంతకు పూర్వం పాశ్చాత్యులకు ‘పంచాంగం’ లేదు, కాలండర్ లేదు!
క్రీస్తునకు పూర్వం ఒకటవ శతాబ్దినాటి విక్రముడు సమకాలంలో ప్రపంచ ప్రసిద్ధుడు! ఆయన కొత్త శకాన్ని స్థాపించవలసి వచ్చింది. ఎందుకంటే అంతకు పూర్వం ‘సైరస్’ అన్న పారశీక రాజు మన దేశాన్ని జయించి తన పేరుతో శకాన్ని స్థాపించి మన దేశంపై రుద్దిపోయాడు. బ్రిటన్ దురాక్రమణదారులు క్రీస్తుశకాన్ని మనపై రుద్దడం ‘సైరస్’కు పునరావృత్తి! అందువల్ల ‘సైరస్ శకం’ వ్యాప్తి చేసిన విదేశీయ భావదాస్యం నుంచి విముక్తిని కలిగించడానికి మాత్రమే మన విక్రముడు నేపాల్‌లోని పశుపతినాథ ఆలయం ప్రాంగణంలో ‘సంవత్’ విక్రమ శకాన్ని ఆరంభించాడు! విక్రముని శకం గురించి విన్న తరువాత రోము చక్రవర్తి ‘జూలియస్ సీజర్’ పాశ్చాత్య దేశాలకు మొదటిసారి ‘కాలండర్’ను ఏర్పాటుచేశాడు! అది ‘జూలియన్’ కాలెండర్!
కానీ సంవత్సరం నిడివి గురించి కచ్చితంగా తెలియని కారణంగా పాశ్చాత్యుల ‘జూలియన్’ కాలండర్‌లో పదిహేను వందల ఏళ్లలో ‘పదకొండు రోజుల’ లెక్క తప్పింది! కోట్ల సంవత్సరాలు గడిచినప్పటికీ ‘క్షణం’ కూడ లెక్క తప్పని భారతీయుల ‘పంచాంగం’ ఇప్పటికీ కొనసాగుతోంది! సంవత్సరం ‘నిడివి’ని ఖగోళ గ్రహగతుల నక్షత్ర కుటుంబాల చలనాల ప్రాతిపదికగా మనవారు అనుసంధానం చేసుకున్నారు. సూర్య సిద్ధాంతానికి అత్యాధునిక భాష్యం- ద్వాపర యుగంలో- వ్రాసిన నాటికి సంవత్సరం నిడివి మూడు వందల అరవై ఐదు రోజుల ఆరు గంటల పదకొండు నిముషాల ముప్పయి ఆరు సెకెండ్లు! ‘లా కెయిలీ’ కాలం నాటికి లక్షా డెబ్బయి మూడు వేల ఏళ్లలో సంవత్సరం నిడివి ఇరవై మూడు నిముషాల మేర తగ్గింది. ఇలా తగ్గిన సంగతి సృష్టిగత వాస్తవం, భూమికీ సూర్యునికీ, సూర్యునికీ ఇతర నక్షత్రాలకు మధ్యగల ‘సాపేక్ష’- రిలెటివ్- గమన సంబంధం! దీన్ని ఎప్పటికప్పుడు గ్రహించిన భారతీయుల ‘పంచాంగం’, ఖగోళ విజ్ఞానం అందుకే నిర్దుష్టం, నిర్దిష్టం! గ్రహంచలేని పాశ్చాత్యుల ‘కాలండర్’లో అలా పదకొండు రోజుల లెక్క తప్పింది. క్రీస్తుశకం పదహారవ శతాబ్దిలో పదమూడవ గ్రెగరీ అన్న పోపు 1582 అక్టోబరు పదకొండవ తేదీ తరువాత అక్టోబర్ ఇరవై రెండవ తేదీని లెక్క పెట్టాలని ఆదేశించాడు! పదకొండు రోజులే ఎగిరిపోయాయి! ఈ కొత్త గ్రెగేరియన్ కాలండర్ ప్రస్తుతం నడుస్తోంది! కానీ దీనిలో కూడ బోలెడన్ని తప్పులు దొర్లాయి. పద్ధతి మారడం వల్ల ‘పది నెలలు’ కూడ ఎక్కువగా లెక్కించారు! కోట్ల ఏళ్లుగా నిర్దిష్టమైన భారతీయ పద్ధతిని మరచి ‘గ్రెగేరియన్ కాలండర్’ను నెత్తికెత్తుకొని ఉండడం మన ఖగోళ విజ్ఞానానికి అవమానకరం! ‘సంక్రాంతులు’ అంతరిక్షంలో కాలగణన ధ్వజాలు! వీటిని సరిగా గుర్తించని ‘గ్రెగేరియన్ కాలండర్’ తప్పుల తడక అయింది. వివేకానందస్వామి క్రీస్తుశకం 1863లో మకర సంక్రాంతి నాడు పుట్టాడు. అప్పుడు మకర సంక్రాంతి నాడు ‘గ్రెగేరియన్’ జనవరి పనె్నండవ తేదీ వచ్చేది! ఇప్పడు మకర సంక్రాంతినాడు ‘గ్రెగేరియన్’ జనవరి పదునాలుగవ తేదీన వస్తోంది! అంతరిక్ష వాస్తవాలు అయిన ‘సంక్రాంతులు’ మారలేదు! గ్రెగేరియన్ కాలండర్ బాట తప్పిపోతోంది. నూట యాబయి ఏళ్లలో రెండు రోజుల లెక్క తప్పింది!
*

-హెబ్బార్ నాగేశ్వరరావు 2013hebbar@gmail.com