మెయన్ ఫీచర్

ఉగాది ఇక్కడ.. ఉషస్సు ఎక్కడ..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం ఉగాది పండుగను జరుపుకునే సమయంలో భూ మండలంపై ఉత్తర ధ్రువం ప్రాంతంలోని ప్రజలు ‘ఉషస్సు’కు స్వాగతం చెబుతారు! సూర్యుడు ఉత్తరంగా జరుగుతూ భూమధ్య రేఖపై ప్రకాశించడం ఇందుకు కారణం! ఇదే సమయంలో ఉత్తర ధ్రువంలో సూర్యోదయం అవుతుంది. దక్షిణ ధ్రువంలో సూర్యుడు అస్తమిస్తాడు. భూమధ్య రేఖపైకి ఉత్తరాయణ సమయంలో సూర్యుడు వచ్చినప్పుడు ‘సౌరమానం’ ప్రకారం మేష మాసం ఆరంభవౌతుంది. అంటే సూర్యుడు ‘మేషరాశి’తో కలిసి ఉదయించడం ఆరంభవౌతుంది! ‘సూర్యమానం’ లేదా ‘సౌరమానం’ ప్రకారం సంవత్సరాన్ని లెక్కపెట్టే తమిళులకు, ఇతరేతర ప్రాంతాల వారికి ఇలా మేషంలో సూర్యుడు ప్రవేశించిన రోజున అంటే మేష సంక్రాంతి రోజున ఉగాది. తెలుగువారు, కన్నడిగులు, మరాఠీలు మన దేశంలో మిక్కిలి ఉత్తరంగా ఉన్న ‘త్రివిష్టప’- టిబెట్- ప్రజలు ‘చాంద్రమానం’ ప్రకారం ఉగాది పండుగను జరుపుకుంటున్నారు. చాంద్రమానం ప్రకారం చైత్ర వైశాఖ మాసాలు ‘వసంత ఋతువు’! ‘సౌరమానం’ పాటించేవారు ‘మీన, మేషాల’ను ‘వసంత ఋతువు’గా పరిగణిస్తున్నారు. ఎలా పరిగణించినప్పటికీ ‘వసంత ఋతువు’ సమయం ఒక్కటే. సూర్యుడు భూమధ్యరేఖ ప్రాంతానికి రావడం.. సూర్యుడు భూమధ్య రేఖవద్ద నుండి కర్కటరేఖకు వచ్చేసరికి మూడు నెలలు అవుతుంది. అప్పుడు ఉత్తర ధ్రువం వద్ద మిట్ట మధ్యాహ్నం! దక్షిణ ధ్రువం వద్ద అర్ధరాత్రి. ధ్రువాల వద్ద ఆరునెలలు ఏకధాటిగా పగలు, మరో ఆరునెలలు ఏకధాటిగా రాత్రి! ఖగోళ వ్యవస్థ ప్రాతిపదికగా భూమిపై జరుగుతున్న అద్భుతమిది! అంటే సూర్యుడు మేషరాశిలో ప్రవేశించిన నాటినుండి తులా రాశిలో ప్రవేశించేవరకు ఆరునెలలు ఉత్తరధ్రువ ప్రాంతంలో పగలు! ఈ ఆరునెలలూ దక్షిణ ధ్రువంలో రాత్రి, చీకటి.. ఇలా ఉత్తర గమనంలో సూర్యుడు భూమధ్యరేఖ పైకి వచ్చినప్పుడు వసంత ఋతువు. ఈ వసంత ఋతువు నడికొన్న సమయంలో భూమధ్య రేఖకు దక్షిణంగాను ఉత్తరంగాను ఉన్న ‘అరవై ఆరు’ భాగ-డిగ్రీ-ల మధ్య ప్రాంతంలోని ప్రపంచంలో రాత్రింబవళ్ళు కాల వ్యవధులు సమానంగా ఉంటాయి. ఇలా ‘రాత్రి పగలు’ సమానంగా చెరి ముప్పయి ‘ఘడియల’- పనె్నండు గంటల-పాటు ఉన్న దినాన్ని ‘విషు’ అని అంటారు. ‘‘సమ రాత్రిందివే కాలే విషుః’’అని అమరకోశంలో చెప్పారు. అందువల్ల ‘వసంత విషు’- సంభవించే సమయంలో మనం కొత్త సంవత్సరాన్ని ఆరంభిస్తున్నాము! భారతీయుల అనాది కాలగణన ‘గుడ్డి’గా లేదు, మూఢాచారం కాదు! ఖగోళ పరిణామక్రమంలో అనుసంధానమై ఉన్న శాస్ర్తియ, తార్కిక సనాతన- శాశ్వత- వ్యవస్థ భారతీయుల కాలగణన! హైందవ జాతీయ జీవన శాస్ర్తియతకు, ప్రామాణికతకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే!
‘నామ లింగాను శాసనం’ అన్న అమరకోశాన్ని కలియుగం ముప్పయి ఒకటవ శతాబ్దిలో ‘అమరసింహుడు’ రచించాడు. అంతకు పూర్వం యుగాల తరబడి ‘సూర్య సిద్ధాంతం’ వంటి గ్రంథాల ద్వారా ఈ విజ్ఞానం గురించి భారతీయులకు తెలుసు. చైత్రమాసంలో లేదా మేష మాసంలో భూమధ్యరేఖ మీద ఉన్న సూర్యుడు ఆషాఢ మాసం నాటికి కర్కట రేఖ మీద ప్రవేశిస్తాడు. అప్పటినుంచి ‘దక్షిణం’గా సూర్యుడు జరగడం దక్షిణాయనం! మూడు నెలల తరువాత ఆశ్వయుజ మాసంలో లేదా సౌరమానం ప్రకారం ‘తులా’మాసంలో సూర్యుడు మళ్లీ భూమధ్య రేఖ పైకి వస్తాడు! అపుడు కూడ మరో ‘విషువు’ ఏర్పడుతుంది. అది శరద్ విషువు! ఆశ్వయుజ కార్తిక మాసాలు శరత్ ఋతువు! శరత్ ‘విషువు’నాడు ఉత్తర ధ్రువంలో రాత్రి మొదలౌతుంది. దక్షిణ ధ్రువంలో సూర్యోదయం అవుతుంది. ఆరునెలల తరువాత మళ్లీ ‘వసంత విషువు’నాడు దక్షిణ ధ్రువంలో ఆరు నెలల రాత్రి, ఉత్తరధ్రువంలో ఆరునెలల పగలు ఆరంభవౌతున్నాయి. వసంత నవరాత్రుల సమయంలోను, శరన్ నవరాత్రుల సమయంలోను ఇలా సూర్యుడు భూమధ్య రేఖపై ఉంటాడు. అందువల్లనే ప్రపంచమంతటా ఈ సమయాలలో సమశీతోష్ణస్థితి ఏర్పడి ప్రకృతి పరిసరాలు స్వచ్ఛంగా సుగంధ భరితమై ఉంటాయి! మనం ఉత్తర అర్ధగోళంలో ఉన్నాము కనుక వసంత విషువునుంచి శరత్ విషువు వరకు ఉత్తరార్ధ గోళంలో వెలుగు ఎక్కువ కనుక వసంత ఋతువునకు అధికతర ప్రాధాన్యం! వసంతాదిలో ‘వత్సరాది’ని కూడా జరుపుకునే ప్రాంతాల భారతీయులు వసంత ఋతువునకు మరింత ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలుగువారు వసంతాదిలోనే సంవత్సరాదిని జరుపుకుంటున్నారు! వింధ్యకు ఉత్తరాన అనేక ప్రాంతాలలో ‘బృహస్పతి’ రాశి మారినప్పుడు నూతన సంవత్సరాన్ని జరుపుకోవడం వేరే సంగతి! బృహస్పతి ఒక రాశిలో ‘సంవత్సరం’ ఉంటాడు! ‘రాశు’లంటే ఖగోళంలో విస్తరించి ఉన్న నక్షత్రాల సమూహాలు. భూమితో సన్నిహిత సంబంధం ఉన్న ‘ఇరవై ఏడు’ నక్షత్ర సముదాయాలున్నాయి.
అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశీర్ష, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశే్లష, మఘ, పూర్వాఫల్గుని, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్ర, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి- అన్నవి ఇరవై ఏడు నక్షత్రాలు! ఇవన్నీ భూమి నుంచి చూసినప్పుడు భూమధ్య రేఖకు అటూ ఇటూ ప్రతిరోజు ఉదయించి అస్తమిస్తూ ఉంటాయి! అశ్వని నుండి లెక్కిస్తే మధ్యది చిత్ర. చిత్ర నుంచి మొదలుపెడితే మధ్యది అశ్వని! ఈ రెండు కూడ భూమధ్య రేఖపై నెలకొని ఉన్నాయి. ఒకటి ఉదయిస్తున్న సమయంలో మరొకటి అస్తమిస్తూ ఉంటుంది! చంద్రుడు ప్రతిరోజు ఒక నక్షత్రంతో కలసి ఉదయిస్తాడు! ఉదాహరణకు ఆదివారం నాడు ‘అశ్వని’తో కలసి ఉదయించే చంద్రుడు సోమవారం ‘్భరణి’తో జతకట్టి ఉదయిస్తున్నాడు. మన భూమికి కోట్లు, వందల కోట్లు, వేల కోట్లు కిలోమీటర్ల దూరంలోని ఈ ‘నక్ష్రతాల’తో కేవలం ‘లక్షల’ కిలోమీటర్ల దూరంలోని చంద్రుడు కలసి ఉదయించడం ‘సాపేక్షం’ మాత్రమే! ఈ ‘సాపేక్ష’ వ్యవస్థ కృత్రిమం కాదు, మానవ నిర్మితం కాదు, ఈ ‘సాపేక్ష’వాస్తవం అనాదిగా విశ్వవ్యవస్థలో నిహితమైన సహజ పరిణామం! దీన్ని హిందూ జాతీయులు అనాదిగా గుర్తించారు! ఇలా ‘పౌర్ణమి’ రోజున చంద్రుడు ‘చిత్ర’ నక్షత్రంతో కలసి ఉదయించే నెల పేరు ‘చైత్రమాసం’! ఈ చైత్రంలో మొదటిరోజున ఉగాది. ‘ఉగాది’ ఖగోళ వాస్తవం!!
మనకు సంబంధించిన వాటిని తెలుసుకొనకపోవడం, ఇలా తెలిసికొనకపోవడం గొప్ప అని వగలుపోవడం మన దేశపు విద్యావంతులలో అత్యధికులకు జీవన రీతి- ఫ్యాషన్- అయిపోయింది! ‘‘విదేశీయ విజ్ఞానం గురించి తెలియకపోవడం మాత్రం గొప్ప అవమానకరం..’’ ఉగాది పండుగ గురించి అవగాహన లేకపోవడం పట్ల ఈ విద్యాధికులు సిగ్గుపడడం లేదు. ‘పంచాంగం’ అన్నది అనాదిగా కాలగణనకు నిర్దుష్టమైన నిర్దిష్టమైన కొలమానమన్న సత్యం గురించి ఈ విద్యాధికులకు ధ్యాస లేదు. ధ్యాస లేనందుకు సిగ్గులేదు! విదేశాల నుంచి వచ్చిపడిన, బ్రిటన్ బౌద్ధిక బీభత్సకారులు మన నెత్తికెత్తిపోయిన ‘గ్రెగేరియన్’ కాలండర్ గురించి మాత్రమే మన విద్యావంతులకు అవగాహన గొప్పగా ఉంది! ఈ గ్రెగేరియన్ కాలండర్‌లో నాలుగేళ్లకోసారి ఫిబ్రవరిలో ఒకరోజు ఎక్కువగా రావడం ‘‘గొప్ప విజ్ఞాన విషయం’’గా మన విద్యావంతులలో అధికాధికులు ‘ముక్కులు’, ‘మూతులు’ తిప్పుతూ వివరిస్తుంటారు! కానీ మన దేశంలోని ‘చాంద్రమాన’ పద్ధతిలో ముప్పయి మూడు నెలలకొకసారి ఒక నెల ఎక్కువగా వస్తుందన్న వాస్తవం గురించి మన మేధావులలో అధికాధికులకు ధ్యాస లేదు! మన దేశం వైవిధ్య విజ్ఞాన రీతుల నిలయం! ఈ వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేదు! సమన్వయం ఉంది! పాశ్చాత్యులకు లేదా ‘గ్రెగేరియన్’ కాలండర్‌ను ‘కనిపెట్టి’న వారికి ఈ సమన్వయ సంస్కృతి గురించి తెలియదు. వైవిధ్యాల మధ్య పాశ్చాత్యులకు వైరుధ్యం కనిపించడం చరిత్ర! అందువల్లనే ‘చాంద్రమానం’- లూనార్ కాలండర్- గురించి ‘గ్రెగేరియన్ కాలండర్’ను కనిపెట్టిన పాశ్చాత్యులకు అవగాహన లేదు- వారికి తెలిసిందల్లా ‘సౌరమానం’- సోలార్ కాలెండర్! ఈ ‘సౌరమానాన్ని’ కూడ పాశ్చాత్యులు సరిగా లెక్కకట్టలేకపోవడం చరిత్ర!
‘చాంద్రమానం’- చంద్రుడు, నక్షత్రాలు, భూమి, సూర్యుని మధ్య శాశ్వతం- సనాతనం-గా ఉన్న సాపేక్ష సంబంధం ప్రాతిపదికగా విశ్వవ్యవస్థలో ఏర్పడి ఉంది! ‘సౌరమానం’ - సూర్యుడికీ, నక్షత్రాలకు, భూమికి మధ్యగల సాపేక్ష సంబంధం ప్రాతిపదికగా నెలకొని ఉన్న ఖగోళ వాస్తవం! భారతీయులకు అనాదిగా ఈ రెండు ‘కాలమానాలు’- చాంద్రమానం, సౌరమానం తెలుసు! ఇంకా ‘బృహస్పతి’ -జూపిటర్ గ్రహానికి, నక్షత్రాలకు, భూమికి మధ్యగల శాశ్వత సంబంధం ప్రాతిపదికగా ఏర్పడి ఉన్న ‘బార్హసృత్యమానం’ గురించి కూడ తెలుసు! ‘నక్షత్రమానం’ కూడ ఉంది. ఇవన్నీ వైవిధ్యవంతమైన ‘సృష్టి’కి ఒక ఉదాహరణ మాత్రమే! వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేకపోవడం విశ్వవ్యవస్థ స్వభావం! ఈ సృష్టిగత వైవిధ్య స్వభావం మానవ జీవన స్వభావం కావడం అనాదిగా హైందవ జాతీయ లేదా భారత జాతీయ చరిత్ర! వివిధ పద్ధతుల కాలగణనాన్ని ‘సౌరమానం’తో సమన్వయం చేసుకొనడం అనాదిగా హైందవ జాతీయ జీవన విలక్షణ తత్త్వం. ఇలా సమన్వయం చేసుకొనడంవల్లనే ‘చాంద్రమాన’ కాలగణన పద్ధతిలో అధిక మాసం, క్షయ మాసం లెక్కించడం ఈ దేశంలో అనాది చరిత్ర.. అధిక మాసానికి, క్షయ మాసానికి ప్రాతిపదికను మనం కల్పించలేదు. విశ్వవ్యవస్థలో నిహితమై ఉన్న సహజమైన ఈ వాస్తవాన్ని మన పూర్వులు గుర్తించారు.. అంతే!!
చైత్ర మాసం ‘‘పూర్ణిమ, చంద్రుడు, చిత్ర’’ల సంబంధి అయినట్టే, ‘్ఫల్గునం’ వరకు గల పనె్నండు నెలలకూ పూర్ణిమ నాడు చంద్రునితో కలసి ఉదయించే నక్షత్రం పేరు ఏర్పడి ఉంది. ‘పౌర్ణమి’నాడు చంద్రుడు ‘అశ్వని’తో కలసి ఉదయిస్తే ఆ నెల ఆశ్వయుజ మాసం! ఇది చాంద్రమానం ఈ ఇరవై ఏడు నక్షత్రాలను పనె్నండు రాశులుగా వర్గీకరించడం సౌలభ్యం. అవి మేషం నుండి మీనం వరకు గల రాశులు. సూర్యుడు ఒక్క ‘రాశి’తో కలపి ఉదయించడం ఒక్కొక్క నెల- ఇది సౌరమానం!
వీటి పట్ల ధ్యాస మనకు పెరగాలి! కానీ ‘జూలియన్’ కాలండర్, గ్రెగేరియన్ కాలండర్ల జనవరి- డిసెంబర్‌లు మాత్రమే మనం బట్టీపట్టాము! ‘జూలియన్’ కాలండర్‌లో వెయ్యేళ్లలో పదకొండు రోజులు లెక్కతప్పాయి. ఈ ‘లెక్క’ను సవరించుకొని ‘గ్రెగేరియన్’ కాలండర్‌ను పాశ్చాత్యులు పెట్టుకున్నారు. కానీ ఇది కూడ తప్పుల తడకే.. వివేకానందస్వామి పుట్టిన సమయంలో మకర సంక్రాంతి నాడు జనవరి పనె్నండవ తేదీ వచ్చింది. ఇప్పుడు మకర సంక్రాంతి జనవరి పదునాలుగవ తేదీన వస్తోంది! నూటయాబయి ఏళ్లలో పాశ్చాత్యుల ‘గ్రెగేరియన్’ కాలండర్‌లో రెండు రోజుల లెక్క తప్పింది!! నూట తొంబయి ఐదు కోట్ల ఏళ్ల కుట్రగా ‘క్షణం’ కూడ లెక్క తప్పని మన ‘పంచాంగం’ గురించి మనకు ధ్యాస లేదు! ఆంగ్ల ‘‘ఈక్వినాక్స్’’ అంటే విద్యాధికులకు తెలుసు, ‘విషువు’ గురించి తెలుసా?
*

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 99510 38352