ఎడిట్ పేజీ

విపక్షాలు బాధ్యతను గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామిక వ్యవస్థలో జరిగే ఎన్నికలలో ప్రజలు చెప్పే తీర్పుకు ఎక్కడైనా, ఎప్పుడైనా ఒకే అర్థం ఉంటుంది. అది ప్రభుత్వాన్ని మంచిగా పాలించమని, ప్రతిపక్షాన్ని మంచి ప్రతిపక్షంగా వ్యవహరించమని. నిన్న బిహార్‌లో అయినా, నేడు వరంగల్‌లో అయినా జరిగింది అదే. ఇందులో ఒక్కోసారి రిగ్గింగ్‌లు, ప్రలోభాల వంటి చీకాకులు ఉండవచ్చు. నిజానికి రిగ్గింగ్‌లు, రౌడీయిజం వంటివి ప్రజాస్వామ్యం పురోగమించిన కొద్దీ పోతున్నాయి. ప్రలోభాలు కూడా, ఓటర్లు ఒకవేళ ఏమైనా తీసుకున్నా చివరకు తమకు నచ్చినవారికి ఓటేసే ధోరణి వస్తున్నకొద్దీ నిరర్ధకమవుతున్నాయి. ఇదంతా ప్రజాస్వామ్యానికి మేలుచేసేదే. ఇవిగాక, కులానికి, మతానికి, ప్రాంతానికి ఓటువేయటమనేది ఒకటుంది గాని, వాటిని కొంత తరచిచూస్తే తేలేది, అటువంటి ముద్రలుగల అభ్యర్థులైతే తమను ఎక్కువ ఉద్ధరించగలరని ఓటర్లకు ఉండే ఆశాభావమే పనిచేస్తున్నదని. అది పనిచేసినంతకాలం లాలూప్రసాద్‌కు ఓటువేసిన బిసిలు, తమ ఆశలు నెరవేరనపుడు ఆయనకు దూరం కాలేదా? ఆయన వరుసగా రెండు ఎన్నికలు ఓడలేదా? ఆ తర్వాత అవే ఆశలతో రెండుసార్లు నితీశ్‌కుమార్‌తో నిలిచినవారు ఇపుడు మూడవసారి తనను ఆమోదించలేదా? అందువల్ల, కులం వగైరాలన్న వాటికి కూడా ఒక అర్థం ఉన్నది తప్ప, అది కేవలం కులం కాదు. ఒక దశలో దాని మోతాదు కొంత ఎక్కువ ఉన్నట్లు కనిపించినా, ప్రజాస్వామ్యం అర్ధవంతంగా మారుతున్నకొద్దీ అది కూడా మార్పులకు లోనవుతున్నది.
వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితాన్ని విశే్లషించుకున్నట్లయితే మనకు అందులో ఇటువంటి అర్థతాత్పర్యాలే కన్పిస్తాయి. టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనను, ప్రతిపక్షాల వ్యవహరణ తీరును బేరీజువేసుకున్న ఓటర్లు అధికారపక్షం వైపు మొగ్గటమే సరైనదని నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ పక్షం ఒక మంచి ప్రభుత్వంగా వ్యవహరించినట్లు, ప్రతిపక్షాలు మంచి ప్రతిపక్షాలుగా ప్రవర్తించలేదని ఓటర్లు భావించారన్నది స్పష్టం. మంచి వ్యవహరణ అన్నది నూటికి నూరు శాతం అనే పద్ధతిలో ఉండదు. అధికార పక్షానికైనా ఉండదు, ప్రతిపక్షాలకైనా ఉండదు. ప్రజలు కూడా విషయాలను ఆ విధంగానే చూస్తారు. ఎంతో కొంత పొరపాట్లు అందరూ చేస్తారు. అది తమ జీవితాలలో ఉన్నట్లే రాజకీయ పార్టీలకు కూడా ఉంటాయని వారికి తెలుసు. కనుక అందుకు మినహాయింపు ఇస్తూనే ఉంటారు. కాని అది ఒక పరిమితిని దాటినపుడు మాత్రం ఆమోదించబోరు. అదే పద్ధతిలో ఇరుపక్షాల మధ్య పోలికలను చూస్తారు. అధికారపక్షం చేసిన మంచి ఎంత, చెడు ఎంత? మంచి అన్నది అత్యల్పమా, సగటు స్థాయిలో ఉందా, లేక గొప్పగానా? ప్రతిపక్షాల వ్యవహరణ సవ్యంగా, బాధ్యతాయుతంగా ఉందా లేక బాధ్యతారహితంగానా? బాధ్యతారాహిత్యం ఒక స్థాయికి పరిమితమైందా, లేక మితిమీరి కన్పిస్తున్నదా? అన్నవి ప్రాథమిక స్థాయి పరిశీలనలు. ఆ తర్వాత ఇరువురి వ్యవహరణా స్థాయిలలోని మంచి చెడులను బేరీజు వేయటం చేస్తారు. దానినిబట్టి నిర్ణయాలుంటాయి.
ఎక్కడ జరిగేదైనా ఇదే. వరంగల్లులోనూ అదే జరిగింది. ఎన్నిక సమయంలో ఓటరు ఎదుట ఒక వాదన, ఒక అనుభవం ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వం గత ఏడాదిన్నర కాలంలో ‘‘ఏమీచేయలే’’దన్నది ఆ వాదన. అది ప్రతిపక్షాలు చేసినటువంటిది. వారు ఓటర్లకు చెప్పిన దాని ప్రకారం ప్రభుత్వం ‘‘మంచి పని అసలేమీ చేయలేదు. మేనిఫెస్టోను ఎంతమాత్రం అమలుపరచలేదు. చెడ్డపనులు అనేకం చేసింది. ప్రజలను నిలువునా మోసగించింది. ముఖ్యమంత్రి అందరికీ దోచిపెట్టాడు. ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. టిఆర్‌ఎస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించేందుకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నిక కేసీఆర్ పాలనపై రెఫరెండం. అందులో ఓడితే ఆయన రాజీనామా చేసేందుకు సిద్ధమా?’’ మరొకవైపు అధికారపక్షం ఓటర్లకు చెప్పిన దానినిబట్టి ప్రతిపక్షాలు ‘‘చేసిన మంచిని చూసేందుకు నిరాకరిస్తున్నాయి. అసత్య ప్రచారాలు చేస్తున్నాయి. నెగెటివ్ వైఖరి తీసుకుంటున్నాయి. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయి. ఈ ఎన్నిక అవును మా పాలనపై రెఫరెండమే.’’
ఓటర్లు ఉభయపక్షాల వాదనలను ప్రచారకాలమంతా పదేపదే విన్నారు. చివరకు రెఫరెండంలో తమ తీర్పు ఏమిటో చెప్పారు. ఆ తీర్పు గణాంక వివరాలన్నీ కనిపిస్తున్నవే గనుక ఇక్కడ మళ్లీ రాసుకోనక్కరలేదు. కాని ఆ తీర్పు ద్వారా వారు చెప్పిన అర్థతాత్పర్యాలేమిటి? వివరాలను అట్లుంచి స్థూలంగా చెప్పాలంటే, మొత్తంమీద అధికార పక్షం వాదనతో ఏకీభవించారు. అది కూడా చాలా బలంగా. టిఆర్‌ఎస్ సహా ఎవరూ ఊహించనంత బలంగా. ప్రతిపక్షాలతో విభేదించారు. ఆ పక్షాలు సైతం ఊహించనంత తీవ్రంగా. ఇంతకూ వారు ఇరుపక్షాలను చూసింది ఏ విధంగా?
2014 జూన్‌లో అధికారానికి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో, బడ్జెట్లలో, ఇతరత్రా చాలా చెప్పింది. వాటినన్నింటిని అమలుపరచి రాష్ట్రాన్ని ‘బంగారు తెలంగాణ’గా మార్చుతానంది. తను చెప్పిన వాటిలో ఒకవైపు ప్రజాసంక్షేమం, రెండవ వైపు అభివృద్ధి ఉన్నాయి. ప్రజాసంక్షేమం కింద తలపెట్టిన పథకాలు కొన్ని వారి దైనందిన జీవితాలను మెరుగుపరుస్తాయి. కొన్ని అదే పనిని దీర్ఘకాలిక ప్రాతిపదికపై చేస్తాయి. కొన్ని రెండువిధాలుగానూ ఉపయోగపడతాయి. ఉదాహరణకు సంక్షేమ నిధులను రూ.13,000 కోట్లనుంచి ఒకేసారి రూ.36,000 కోట్లకు పెంచారు. బియ్యం కోటా పెంచటం, కుటుంబ సభ్యుల సంఖ్య సీలింగును ఎత్తివేయటం, వరుసగా ఒకటితర్వాత ఒకటిగా హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరాలవల్ల ఆకలి తీరటమేకాదు. మనిషికి పోషకాహార విలువలు పెరుగుతాయి. మనిషి విశ్వాసంతో, గౌరవంగా జీవించే అవకాశం కల్పిస్తాయి. ఇందులో తక్షణ ప్రయోజనం, దీర్ఘకాలిక ప్రయోజనం రెండూ ఉన్నాయి. సమాజానికి వౌలిక ఆధారమైన మనిషి ఆ విధంగా వృద్ధిచెందటం దీర్ఘకాలికమైన సాధారణాభివృద్ధిలో భాగమవుతుంది. ఇదంతా నిపుణులు చెప్తున్న విషయమే.
బియ్యం కాకుండా సంక్షేమంలో భాగంగా జరుగుతున్నవి మరి కొన్ని కూడా ఓటర్ల దృష్టిలో ఉన్నాయి. ఈరోజున ఒక గ్రామంలో ఆరు విధాలైన వారికి (వృద్ధులు, వితంతువులు, నేత పనివారు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, వికలాంగులు) ప్రతినెల ఆసరా పెన్షన్లు అందుతున్నాయి. వీరందరిని కలిపితే ఒక సగటు గ్రామంలో సుమారు మూడింట ఒకవంతు కుటుంబాలుంటాయి. వారికి, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు కలిపి ఇంకా ఇతర సంక్షేమ సహాయాలు కొన్ని నికరమైన రీతిలో అందుతున్నాయి. ఇళ్ల రూపంలో మరిన్ని అందచేయటం ఆరంభమైంది. ఇది కేవలం సంక్షేమంలోని ఒకటిరెండు అంశాల ఉదాహరణ. తెలంగాణా పేదలు, సామాన్యుల జీవితాలలో ఇది చిన్న విషయంకాదు. ఆ మార్పును వారు గత ఏడాదికి పైగా వాస్తవమైన రీతిలో అనుభవిస్తున్నారు. అటువంటి స్థితిలో ‘‘అసలేమీ జరగలే’’దనే ప్రతిపక్షాల విమర్శను ఓటర్లు ఏవిధంగా తీసుకుని ఉంటారు? ఆ విమర్శను ప్రాతిపదికగా చేసుకుని ప్రభుత్వ పాలన గురించి ఏమనుకుని ఉంటారు? ఆ విమర్శచేసిన ప్రతిపక్షాలపై వారికి ఏ అభిప్రాయం కలిగి ఉంటుంది? ఆ విధంగా ఒక నిర్ణయానికి వచ్చిన వెనుక, ఎవరికి ఓటువేయాలనుకుని ఉండవచ్చు? రెఫరెండపు ఫలితమేమిటో కనిపిస్తూనే ఉంది.
వరంగల్ ఎన్నిక ఫలితపు అర్థతాత్పర్యాలు ఇందులోనే ఉన్నాయి. ప్రజలు కోరుకునేది ప్రభుత్వం బాగా పరిపాలించాలని, ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని. వారిదృష్టిలో పైన చెప్పిన ఉదాహరణనుబట్టి, ప్రభుత్వం తమకు ఉపయోగకరమైన విధంగా పనిచేస్తున్నది. కాని ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలకు పాల్పడుతూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ ఒక రహస్యం ఉంది. ప్రభుత్వం బాగాపనిచేస్తున్నదని భావించినప్పటికీ, ఒకవేళ ప్రతిపక్షాలు బాధ్యతాయుతమైన విమర్శలు, నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తూ, ప్రజలకు ఫిర్యాదులు ఏవైనా ఉంటే వాటిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునే ఏకైక దృష్టితోగాక ప్రజల మేలు తమకు ప్రధానమనే వైఖరిని ప్రదర్శించి ఉన్నట్లయితే, వరంగల్ రెఫరండం తలకిందులు కాకపోయినా కొంత భిన్నంగా ఉండేదేమో. ఓటరుకు ప్రతిపక్షాలపై మరీ ఇంత వ్యతిరేకత పెరగక వారికి బహుశా డిపాజిట్లు లభించేవేమో. కాని అధికారపు ఆతురతలో సంయమనం కోల్పోయిన ప్రతిపక్షాలు తమకు తాము మరింత నష్టంచేసుకున్నాయి. వరంగల్ అర్థతాత్పర్యంలో ఇది కూడా ఉంది.
అదే పద్ధతిలో మరొకటి గమనించండి. ప్రజలకు ప్రభుత్వంపై కొన్ని అసంతృప్తులు ఉన్నాయని, వాటిని ఎన్నికకుముందు కాలంలో, ఎన్నిక సమయంలో తమ దృష్టికితెచ్చి మాట్లాడవలసిందిగా కోరానని, కనుక ఆ పనిచేసామని ప్రతిపక్షాలనుంచి ఒకమాట వినవచ్చింది. అది నిజమనుకుందాం. అటువంటి స్థితిలోవారు ఆ అంశాల గురించి వాస్తవాలు ఆధారంగా మాట్లాడి, అందుకు తమ దృష్టినుంచి లేనిపోని కొన్నింటిని స్వప్రయోజనాలకోసం జోడించకుండా ఉండినట్లయితే విశ్వసనీయత ఏర్పడేది. కాని అందుకు విరుద్ధంగా జరగటంతో వారి మాటలకు అదే ప్రజలు విలువ ఇవ్వని స్థితి ఎదురైంది. మరికొన్నయితే ఎదురుతిరిగాయి. ఉదాహరణకు రైతుల ఆత్మహత్యలు. అవి తీవ్రమైన సమస్య, చాలా బాధాకరమైనవన్న దానిలో రెండవ అభిప్రాయానికి తావులేదు. కాని ప్రతిపక్షాలు దానిని ఉపయోగించుకునే ఆరాటంలో, ఆత్మహత్యలు తాము అధికారంలో ఉండినపుడు సుతరామూ జరగలేదు, అంతా ప్రస్తుత ప్రభుత్వ దోషమేనన్నట్లు హోరెత్తించటం ప్రజలను ఆశ్చర్యపరచింది. ‘‘మీ పాలనలో మీరేమి చేసారు?’’అంటూ అధికార పక్షం మొదటినుంచి వేసిన ప్రశ్న, ప్రచారం చివరి దశ వచ్చేసరికి సామాన్యుల ప్రశ్నగా కూడా మారింది. రెఫరెండపు తీర్పును ఆమేరకు అదనంగా ప్రభావితం చేసింది. ఒకవేళ ప్రతిపక్షాలు అటువంటి అతి చేయకుండా ఉండినట్లయితే, వారి విశ్వసనీయత దెబ్బతినటం ఆమేరకు తగ్గేదేమో. ఇటువంటివే ఇంకా ఉన్నాయి. ఈ అర్థతాత్పర్యాలను ముందే గ్రహించ గలగటం నాయకత్వానికి సమర్ధత ఉంటే కష్టంకాదు. కాని విచిత్రంగా వారువీరని గాక ప్రతిపక్షాలన్నీ ఇదే బాధ్యతారాహిత్యాన్ని చూపాయి. అది తగదన్నది ఎన్నికల ఫలితపు అర్థతాత్పర్యాలలో ఒకటి.
మనిషేకాదు పార్టీలుకూడా నిరంతరం పాఠాలు నేర్చుకోవలసిందే. తప్పులు చేయటంకన్న వాటినుంచి నేర్చుకోకపోవటం పెద్ద తప్పవుతుంది. వరంగల్ ఫలితం వెలువడిన అనంతరం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాము గెలుపునుంచి పాఠం తీసుకుంటున్నామన్నారు. మంచి పనులు ‘‘ఇదే విధంగా ఇంకా చేయాలంటూ ప్రజలు మాపై బాధ్యత పెట్టారు. దానిని వినయంతో స్వీకరిస్తున్నా’’మని అన్నారు. గెలుపు అర్థతాత్పర్యం బాధ్యత పెరగటమనే పాఠాన్ని అధికారపక్షం తీసుకున్నపుడు, ఓటమి అర్థతాత్పర్యం బాధ్యతాయుతమైన వ్యవహరణ అని ప్రతిపక్షాలు గ్రహిస్తే వారికే మేలు జరుగుతుంది.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)