రచ్చ బండ

కొత్త ఏడాది..కొత్త ఆశలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త ఏడాదిలోకి (ఆంగ్ల) అడుగు పెట్టాం. ఈ ఏడాది అంతా మంచి జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. గ్రహఫలాలపై నమ్మకం ఉన్న వారు తమ రాశి ఎలా ఉందోనని ఆసక్తిగా తెలుసుకోవడం సహజం. అలాగే రాజకీయ పార్టీల నేతలూ గత ఏడాది చేదు అనుభవాలను మరిచి పోయేలా, ఈ ఏడాది అంతా శభం జరగాలని ఆశిస్తున్నారు. గత ఏడాది (2015) సాధించిన విజయాల కంటే అపజయాలే ఎక్కువగా ఉన్నాయని మధనపడిపోతున్నారు. కాబట్టి ఈ ఏడాది మంచి జరగాలని, పార్టీ మరింత బలోపేతం కావాలని అన్ని పార్టీల నేతలు ఉవ్విళ్లూరుతున్నారు.
తెలంగాణలో ముఖ్యంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి కంటే ప్రతిపక్షాల నాయకులే ఎక్కువగా కోటి ఆశలతో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిలోనూ పార్టీ నాయకులు, ఆశావాహలు పదవుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టిఆర్‌ఎస్ అధికారం చేపట్టి సుమారు ఏడాదిన్నర కాలం పూర్తయినా నామినేటెడ్ పదవుల పంపకం ప్రారంభంకాలేదు. ఇది ఆ పార్టీ ముఖ్య నేతలను, ఆశావాహులను దిగులు పరుస్తోంది. 2015 సంవత్సరంలోనూ చాలా మంది నామినేటెడ్ పోస్టుల కోసం ఎదురు చూశారు. కొత్త ఏడాదిలోనైనా పదవుల పంపిణీ జరిగితే బాగుంటుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇంకా జాప్యం జరిగితే సార్వత్రిక ఎన్నికలకు మిగిలేది మూడు సంవత్సరాలే కాబట్టి సమయం వృధాగా పోతుందేనేది వారి మనోవ్యథ. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నాలుగైదు మినహా మిగతా నామినేటెడ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టలేదు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో జాప్యం చేసినా, తాజాగా పలువురిని చైర్మన్లుగా నియమించారు. ఆంధ్రలో టిడిపి-బిజెపి మిత్రపక్షాలుగా ఉన్నాయి. బిజెపి ఎమ్మెల్యేలు కూడా ఆంధ్ర మంత్రివర్గంలో ఉన్నందున, అక్కడ ఆ పార్టీ ప్రజా సమస్యలపై యుద్ధ భేరీ మోగించే స్థితి లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరాటం చేస్తున్నది. కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడలేదు. రాష్ట్ర విభజన చేసినందుకు ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఆ పార్టీని ఇప్పట్లో కనికరించేలా లేరు. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలిస్తున్నది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు, రైతుల సమస్యలపై, ఇంకా కరవు, విద్యుత్తు, నీటి పారుదల వంటి అంశాలపై ఉద్యమిస్తున్నది. కాంగ్రెస్ తదితర పార్టీల నుంచి అధికార తెలుగు దేశం పార్టీలోకి ముఖ్య నేతలు కొందరు దూకినా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన ఎమ్మెల్యేలను కాపాడుకుంటున్నారు.
ఇక తెలంగాణలో టిఆర్‌ఎస్ దూకుడుతో ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. తమ పార్టీ నాయకులను టిఆర్‌ఎస్‌లో చేర్చుకుంటూ మొత్తం ప్రతిపక్షాలనే లేకుండా చేయాలన్న పన్నాగంతో ఉన్నారని టిఆర్‌ఎస్‌పై విరుచుకుపడుతున్నారు. టి.కాంగ్రెస్. టి.టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలువురు ఇప్పటికే టిఆర్‌ఎస్‌లో చేరారు. ఇటీవల వరంగల్ లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఈ చేదు అనుభవంతో టిడిపి, కాంగ్రెస్, బిజెపి నేతలు ఉన్నారు. తాజాగా స్థానిక సంస్ధల కోటా నుంచి ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, ఆరింటిని టిఆర్‌ఎస్ ఏకగ్రీవం చేసుకోగా, మిగిలిన ఆరు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగింటిని టిఆర్‌ఎస్ తమ ఖాతాలో వేసుకోగా, రెండు స్థానాలు ‘హస్త’గతమయ్యాయి. ఇది కాంగ్రెస్‌కు కొంత ఊతమిచ్చింది. కనీసం రెండు ఎమ్మెల్సీ స్థానాలైనా దక్కించుకుని గుడ్డిలో మెల్ల అనిపించుకుంది. అవి దక్కకుండా పోతే అధిష్టానం నుంచి ఢిల్లీకి రావాల్సిందిగా మరోసారి పిలుపు వచ్చేది. ఢిల్లీకి వెళ్ళి అధిష్టానం ముందు నిలుచోవాల్సి వచ్చేది. ఈ ఏడాది అయినా తమకు అనుకూలిస్తుందో లేదోనన్న బెంగా వారికి పట్టుకున్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్‌కు (జిహెచ్‌ఎంసి) జరగబోయే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు వ్యూహం చేస్తున్నది.
తెలంగాణలో బలంగా నిలదొక్కుకునేందుకు తెలుగు దేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. బిజెపితో కలిసి పోటీ చేసి ఉమ్మడి రాజధానిలో బలీయమైన శక్తిగా అవతరించాలన్నది ఆ పార్టీ నేతల తపన. జిహెచ్‌ఎంసి పరిథిలో సెటిలర్లు అధికంగా ఉన్నందున మెజారిటీ సీట్లను కైవసం చేసుకోగలమన్న ధీమాతో ఉన్నారు. అసెంబ్లీ, లోక్‌సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్‌సభతో పాటు 9 అసెంబ్లీ స్థానాల్లో సైకిల్ జోరు కొనసాగింది. కొత్త ఏడాది కూడా సైకిల్ స్పీడు పెంచేందుకు మిత్రపక్షమైన బిజెపితో కలిసి వ్యూహం పన్నుతున్నారు. బిజెపి కూడా టి.టిడిపితో కలిసి జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. కేంద్ర మంత్రులను, బిజెపి అగ్ర నాయకులను హైదరాబాద్‌కు పిలిపించి వివిధ కార్యక్రమాలను కొనసాగించి, ప్రజలను ఆకర్షించే దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీలో ఉన్న లుకలుకలను సరి చేసుకోవాల్సి ఉంది. బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. కిషన్‌రెడ్డిని మారిస్తే తప్ప పార్టీ బాగుపడదని బహిరంగంగానే చెప్పారు. కొత్త ఏడాదిలో ఇటువంటి లోటుపాట్లను సరి చేసుకుంటూ ముందుకెళ్ళాల్సి ఉందని టి.బిజెపి సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు.
టిఆర్‌ఎస్ మాత్రం నింపాదిగా ఉంది. తాము పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని, ఎవరైనా టిఆర్‌ఎస్‌లో చేరేందుకు ముందుకు వస్తేనే చేర్చుకుంటున్నామని చెబుతోంది. కొత్త ఏడాది కూడా తమకు అంతా శుభమే జరుగుతుందన్న ధీమాతో గులాబీ దండు ఉంది. మజ్లిస్, వామపక్షాలతో సహా ప్రతిపక్షాలన్నీ కొత్త ఏడాదిపై కోటి ఆశలు పెట్టుకున్నాయి.

- వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి