మెయన్ ఫీచర్

‘వసంత మేఘ గర్జన’కు ఏభై ఏళ్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమే కాదు, దాన్ని మార్చాలి. ఇది ఉపన్యాసాలు వినడం ద్వారానో, పుస్తకాలు చదవడం ద్వా రానో మాత్రమే కాకుండా ప్రజలతో మమేకమై, వారి సమస్యల్ని తెలుసుకొని, వారి పోరాటాల్లో భాగస్వామ్యమైతేనే సాధ్యం..’ అన్న మార్క్సు మాటలు మార్క్సిజానికి, లెనినిజానికి, మావోయిజానికి ఇరుసుగా పనిచేస్తూ ప్రపంచ రాజకీయాల్ని, ఆర్థిక సూత్రాల్ని అవగాహన చేసుకొనడానికి పనిచేస్తూనే వున్నాయి. భారత్ లాంటి దేశాల్ని దోచుకోవాలనే సామ్రాజ్యవాదుల ఎత్తుగడలను నిలువరించడానికి, ప్రజలు ఎదురొడ్డి నిలబడడానికి ఈ సూత్రమే అప్రతిహతంగా పనిచేస్తూ వున్నది. ప్రజల సామాజిక, ఆర్థిక సమస్యలకు శాస్ర్తియ మూ లాలను వెదికే శాస్త్రంగా ‘మార్క్సిజం’ ప్రపంచ వ్యాప్తం కావడానికి దోహదపడింది. అభివృద్ధి, విధ్వంసం లోనుంచి పుట్టిందే దోపిడీ. తెలివైనవారు, బలమున్నవారు భూమిని, ఉత్పత్తి శక్తుల్ని స్వంతం చేసుకోవడం, తామే ఉత్పత్తిదారులుగా ముద్ర వేసుకోవడం ప్రారంభమైన మొదటి దశలోనే- సంపదల్ని సృష్టించే శ్రమజీవులు సంఘటితం కావడం, నిలదీయడం, ఎదుర్కోవడం మొదలైంది. వర్గ వైరుధ్యంగా, పోరాటంగా ఆది మానవుడితో మొదలైన ఈప్రక్రియ రాతియుగం నుంచి ఆధునిక యుగం వరకూ కొనసాగుతూనే వున్నది. ఫ్రెంచి విప్లవానికి ముందు భౌతిక సూత్రాల్ని ఔపోసన పట్టిన జర్మన్ తత్వవేత్త హెగల్ ప్రతిపాదించిన గతితార్కిక వాద పద్ధతి, ఫ్యూర్‌బా భౌతికవాద విశే్లషణల ఆధారంగా మరింత శాస్ర్తియంగా, సాక్ష్యాలతో ప్రపంచ గమనాన్ని వీక్షించేదే మార్క్సిజం! దీనికి ఏ దేశ సరిహద్దులూ ఎల్లలు కావు. దోపిడీ వర్గాల్ని, సామ్రాజ్యవాదుల్ని నియంత్రించే ఓ సామాజిక శాస్త్రం ఇది. ‘రాజ్యం’ పీడనను బట్టి ఎత్తుగలను రూపొందించుకునే ఆధునిక సామాజిక శాస్త్రంగా అన్ని భాషల్లోకి అనువదించబడి అన్ని దేశాల్లో విస్తరించిన ఏకైక శాస్త్రం మార్క్సిజం.
మార్క్సిజం పుట్టకముందు కూడా అనేక ఉద్యమాలు నడిచాయి. ఆ ఉద్యమాల విశే్లషణ, అంతిమ పరిష్కారాలు, చేపట్టాల్సిన పోరాట మార్గాలను సూత్రీకరించేదే మార్క్సిజంగా ఎదిగింది. కేంద్ర అసెంబ్లీలో బాంబు విసిరిన భగత్‌సింగ్ జైలులో మార్క్సిజం అధ్యయనం చేసి మరింతగా బుద్ధి కుశలతను పెంచుకున్నట్లు ఆయన జీవిత చరిత్ర చెబుతున్నది. మార్క్సిజం మాట రాకముందే 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ సూత్రీకరణతోనే మొదటి ప్రపంచ యుద్ధకాలంలో రష్యా విముక్తమైంది. అప్పటికే యుద్ధ్భూమిగా మారిన భారత్‌లో ఏ సిద్ధాంత నేపథ్యం లేకుండానే అల్లూరి, కట్టబ్రహ్మన్, కొమురం భీం, రాంజీగోండ్ లాంటివారు నడిపిన ఉద్యమాలున్నాయి. బ్రిటిషు సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఈ ఉద్యమాలన్నీ ‘్భమి’ కేంద్రంగా జరగడం గమనార్హం!
ఇలాంటి చారిత్రక క్రమంలో 1920 అక్టోబర్‌లో పుట్టిన భారత కమ్యూనిస్టు పార్టీ 1946-51 మధ్య జరిగిన తెలంగాణ రైతాంగ పోరాటాన్ని సాయుధ పోరాటంగా మార్చి నాయకత్వం వహించింది. దీన్ని దీర్ఘకాలికంగా కొనసాగించలేక, దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని సంతసించి, నెహ్రూ చెప్పిన ‘సోషలిజం’ మాటలకు ఆకర్షితులై రష్యాకు అనుకూలంగా మారిపోయి కమ్యూనిస్టులు ఎన్నికల్లో పాల్గొంటూ, పాలకపక్షంలో భాగస్వామి అయ్యారు. 1964లో క మ్యూనిస్టు పార్టీ రెండుగా చీలిపోయాక, 1967లో పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ అధినేత అజయ్ ముఖర్జీ నేతృత్వంలో ఏర్పాటైన 14 పార్టీల కూటమిలో సిపిఐ, సిపిఎంలు భాగస్వామి అయ్యాయి. జ్యో తిబసు ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. తాము అధికారంలోకి వస్తే జోతేదార్ల (్భస్వాముల) చేతుల్లో వున్న వేలాది ఎకరాల భూమిని, మిగులు భూమిని నిరుపేదలకు, గిరిజనులకు పంచుతామని ఎన్నికల హామీగా సిపిఎం ప్రచారం చేసింది. అంతకుముందే 1964లో జరిగిన సిపిఎం సమావేశాల్లో చారుమజుందార్ కొన్ని ప్రశ్నల్ని లేవదీసాడు. రైతుల సమస్యపై, పార్లమెంటరీ పంథాపై, విరమించిన సాయుధ పోరాట ఆవశ్యకతపై, సోవియట్ రష్యాకు అనుకూలంగా మారిన విధానంపై పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని కోరాడు. దీనికి నాయకత్వం స్పందించకపోవడంతో 1965-67 మధ్య కాలంలో ఎనిమిది రాజకీయ, పోరాట డాక్యుమెంట్లను చారుమజుందారు పార్టీ ముందుకు తెచ్చాడు. ఇలాంటి సైద్ధాంతిక ఘర్షణల క్రమంలో డార్జిలింగ్ జిల్లా సిలిగిరి డివిజన్ పరిధిలోని గిరిజన గ్రామమైన ‘నక్సల్బరీ’లో నిప్పురవ్వ రాజుకుంది. సంయుక్త పార్టీ అధికారం చేపట్టిన మరుసటి రోజే (మార్చి 3, 1967) స్థానిక భూస్వాములు లాక్కున్న భూముల్ని, ఆక్రమించిన పంటల్ని స్వాధీనం చేసుకున్నారు. మార్చి- ఏప్రిల్ మధ్య కాలంలో రైతులు సంఘటితమై, కమిటీలుగా ఏర్పడి భూస్వాముల వద్ద నుంచి పత్రాల్ని లాక్కొని తగలబెట్టారు. ఈ పోరాటానికి చారుమజుందార్‌తోపాటు స్థానిక నాయకులైన కామా సన్యాల్, జంగల్ సంతాల్‌లతోపాటు సౌరెన్ బోసు, ముజిబుర్ రెహ్మాన్ వంటివారు నాయకత్వం వహించారు. ఈ క్రమంలోనే మే 23, 1967న భూమిని దున్నుకోవచ్చు అని బీమల్ కిషన్ అనే వ్యక్తికి అనుకూలంగా కోర్టు ఉత్తర్వులు ఇవ్వగా, సహించని స్థానిక భూస్వామి తన మనుషులచేత బీమల్‌ను తీవ్రంగా కొట్టించాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం, 144 సెక్షన్ విధించబడడం, పర్యవేక్షణకై వచ్చిన పోలీసు అధికారి ఫోనమ్ వాంగ్డి మరణించడం జరిగిపోయాయి. మే 25న అధిక సంఖ్యలో సాయుధ బలగాలు నక్సల్బరీ గ్రామాలతోపాటు చుట్టూగల గ్రామాల్ని అదుపులోకి తీసుకోవడం, మహిళలు కూడా ప్రతిఘటించిన నేపథ్యంలో జరిగిన పోలీసు కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస సంఘటనలతో నక్సల్బరీ నిప్పురవ్వలు ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి.
కలకత్తా, దిల్లీ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు, విద్యార్థులు నక్సల్బరీ సంఘటనను నిరసిస్తూ తరగతులను బహిష్కరించారు. అసేం చటర్జీ, సంతోష్ రాణా వంటి మొదటితరం వారిని నక్సల్బరీ వైపు నడిచేలా చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం మీదుగా కేరళ వరకు పాకిన ఈ ఉద్యమం నవంబర్ 1968లో రెండు పోలీసుస్టేషన్‌లపై దాడికి పురికొల్పింది. కేరళ సిపిఐ కార్యదర్శిగా వున్న అరిఖిడ్ వర్గీస్ నాయకత్వంలో పోలీసు క్యాంపుపై దాడి జరగ్గా ఇద్దరు పోలీసులు మరణించారు. కేరళలో 18 ఏళ్ల కె.అర్జిత ఉద్యమబాట పట్టగా, పోలీసులు ఆమెను పట్టుకొని అర్ధనగ్నంగా ఊరేగించారు. ఈ సంఘటనతో కేరళ ప్రభుత్వం కొన్ని భూముల్ని పేద రైతులకు పంపిణీ చేసింది. ఇలా దేశవ్యాప్తంగా నక్సల్బరీ ప్రభావం కనిపిస్తుండగా పెకింగ్ రేడియో దీన్ని ఓ ‘ముందడుగు’ అని జూన్ 28, 1967న అభివర్ణిస్తే, చైనా పీపుల్స్ దినపత్రిక ‘్భరతదేశంపై వసంత మేఘ గర్జన’ అని వ్యాఖ్యానించింది. నాటి కమ్యూనిస్టులకు, ఆలోచనాపరులకు నక్సల్బరీ పోరాటం ఉత్ప్రేరకంగా పనిచేసింది, ఉద్యమబాట పట్టడానికి కారణమైంది. రైతాంగ, గిరిజన, కార్మిక పోరాటాలకు చిరునామాగా ‘నక్సల్బరీ’ పర్యాయపదంగా మారింది. ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులోనూ చోటు సంపాదించుకుంది.
శ్రీకాకుళం జిల్లాలో రాజుకున్న ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌లో అన్ని విశ్వవిద్యాలయ విద్యార్థుల్ని అమితంగా ఆకర్షించింది. వైద్య విద్యార్థులు, ఉపాధ్యాయులు సైతం ఉద్యమంలోకి వెళ్లేలా చేసింది. కవుల్ని, కళాకారుల్ని నిద్రలేపింది. జగిత్యాల, సిరిసిల్లకు వ్యాపించి దొరలు గడీలను వదిలేలా చేసింది. ఈ విప్లవంలో పాల్గొని ప్రభుత్వంపై, భూస్వాములపై తిరుగుబాటు చేసిన వారిని ‘నక్సలైట్లు’ అని పిలవడం మొదలైంది. నక్సల్బరీలో పుట్టిన ఉద్యమం కాలక్రమంలో అనేక మార్పులకు లోనైంది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో నక్సలైట్ల ఉద్యమం 1969 నుంచి 2004 దాకా వెంగళరావు, చెన్నారెడ్డి, ఎన్‌టిఆర్, చంద్రబాబు, వైఎస్‌ఆర్ లాంటి ముఖ్యమంత్రులను కదిలించింది. వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నక్సలైట్ల ఉద్యమం సద్దుమణిగింది. నక్సలైట్లు ఆ తర్వాత ‘మావోయిస్టులు’గా రూపాంతరం చెందారు. ‘పీపుల్స్‌వార్’కు బదులు ఇపుడు ‘మావోయిస్టు పార్టీ’ పేరిట వీరి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దండకారణ్యంలో తమ ఉనికిని బలోపేతం చేసుకుంటూ, 16 రాష్ట్రాలకు విస్తరించింది మావోయిస్టు పార్టీ. ఆంధ్ర, తెలంగాణల్లో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుముఖం పట్టగా, చత్తీస్‌గఢ్, ఒడిశా, ఝార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో పట్టుకొనసాగిస్తోంది. ‘కష్టంతోనే ఉద్యమ విజయం’ అని మావోయిస్టు పార్టీ నమ్మితే, ‘గెరిల్లాతో గెరిల్లాలా పోరాడు’ అనే రీతిలో ‘గ్రీన్‌హంట్’ పేరిట ప్రభుత్వాలు అణచివేత చర్యలకు దిగుతున్నాయి. ఈ పోరులో సాధారణ గిరిజనులు, పౌరులు సమిధలైతున్నా పరిష్కార మార్గాల్ని వెతకని పాలకపక్షాలు ఈ దేశాన్ని నిరాటంకంగా పాలించాలనే చూస్తున్నాయి. కొండకోనల్లో విలువైన ఖనిజ సంపదల్ని వేదాంత, పోస్కో, టిస్కో, ఎస్సార్, జిందాల్ లాంటి బహుళజాతి కంపెనీలకు ప్రభుత్వం ధారాదత్తం చేస్తున్నది. సాయుధ బలగాలకు నష్టం జరిగితే చర్చలని, భద్రతాదళాలది పైచేయిగా వుంటే మావోయిస్టులు బేషరతుగా లొంగిపోవాలని పాలకులు చెబుతుంటారు. సింగూర్, నందిగ్రామ్ భూముల్ని రైతులకు తిరిగి ఇవ్వాలనే నినాదంతో పశ్చిమబెంగాల్‌లో పాగా వేసిన మమతాబెనర్జీ ఎన్నికల ముందు మావోయిస్టు పార్టీ అండదండలు కోరారు. పదవిలోకి రాగానే హామీలను ఆమె విస్మరించింది. గతంలో యుపిఎ ప్రభుత్వం కూడా ఇదే వైఖరిని ప్రదర్శించింది. మన్‌మోహన్ సింగ్ క్యాబినెట్‌లో పర్యావరణ మంత్రిగా పనిచేసిన జయంతీ నటరాజన్- వేదాంత లాంటి కంపెనీలను ఆదివాసీ ప్రాంతాల్లో ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు అనుమతించేది లేదని పేర్కొన్నారు. అలా చెప్పిన కొద్ది రోజులకే ఆ పదవి నుంచి ఆమెను తప్పించారు.
ప్రపంచీకరణకు, బహుళజాతి కంపెనీలకు మన పాలకులు దాసోహం కావడంతో పేద రైతులు, గిరిజనుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. వీరికి అండగా నిలబడేందుకే తాము పోరాడుతున్నామని మావోయిస్టులు చెబుతున్నారు. మావోయిస్టులు, భద్రతాదళాల మధ్య తరచూ కాల్పులు జరగడం, విధ్వంసం చోటు చేసుకోవడంతో కొన్ని చోట్ల గిరిజనులు పట్టణాలకు వలసబాట పడుతున్నారు. కొందరు గిరిజన యువకులు ఆయుధాలు పడుతున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి మావోయిస్టులే అడ్డంకి అంటున్న రాజకీయ పార్టీలు, దశాబ్దాల కాలంగా ఈ అభివృద్ధిని ఎందుకు చేపట్టలేదో చెప్పడం లేదు. అభివృద్ధికి ఖర్చుపెట్టాల్సిన నిధుల్ని సాయుధ బలగాలపై పెట్టడం- ప్రజలపై యుద్ధం చేయడమే అవుతుంది. యుద్ధం ఏ సమస్యకు పరిష్కారం కాదనేది తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో జాతీయస్థాయిలో చర్చను చేపట్టాలి. మావోయిస్టులతో చర్చలు జరిపి కొండకోనల్లో ప్రశాంతత ఏర్పడేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకు పరిష్కార మార్గాలు గుర్తించాలి. ‘దోపిడీ, పీడన అంతం అయ్యేవరకూ పోరాడతాం’ అని మావోయిస్టులు చెబుతుంటారు. హింసను, విధ్వంసాన్ని సహించేది లేదని పాలకులు హెచ్చరిస్తుంటారు. అభివృద్ధి ఫలాలు తమకు ఎప్పుడు దక్కుతాయని ఆదివాసీలు ప్రశ్నిసుంటారు. దీనికి ముగింపు ఎక్కడ..?
*

- డా. జి.లచ్చయ్య సెల్: 94401 16162