భక్తి కథలు

హరివంశం 35

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాలొలికే చెప్పులు తొడిగి, చలిది చిక్కాలు చేత పట్టి, చెన్నాకోలు తీసుకొని, చిరుత కూకట్ల చెలువంతో ఆలమందలను, దూడలను తోలుకొని పోతూ, వ్రేపల్లె పరిసర అడవి ప్రాంతాలలో, మైదానాలలో, పొలాలలో విహరించసాగారు.
తోడేళ్ళ బారిన దూడలను పడనీయకుండా పెద్దగా కేకలు వేస్తూ, చెట్లపైకి పాకి తేనెపట్లను తెచ్చి సావాసకాండ్రకు తేనెలు పంచుతూ, తెచ్చుకున్న చలిది బువ్వలు ఆరగిస్తూ ఆటలు, పాటలు, ఉరుకులు, పరుగులు చూపుతూ బాలక్రీడా వినోదాలు అనుభవిస్తూ పెరిగి పెద్దవారవుతూ ఉన్నారు బలరామకృష్ణులు.
ఇట్లా కొంతకాలం గడచిన తరువాత ఒక రోజు శ్రీకృష్ణుడు తన పట్ల మిక్కిలి అనురాగం చూపే బాలరాముడితో ఇట్లా మంతనాలాడాడు. ‘అన్నా! ఒక విషయం నీకు చెప్పాలనుకుంటున్నాను.
ఈ విషయం నీవు కూడా లెస్సగా విచారించు. మనం పుట్టి బుద్ధెరిగినప్పటినంచీ ఈ వ్రేపల్లెలోనే ఉన్నాము. మనం ఇంకా ఇక్కడే ఉండటం మనకు శ్రేయోదాయకం కాదు అని నాకనిపిస్తున్నది. మన పెద్దవాళ్ళు ఈ చోటు విడిచిపెట్టి పోవటానికి సులభంగా ఒప్పుకోరని నాకు తెలుసు. ఇక్కడే ఉండిపోవటం వాళ్ళకు ఇకముందు ఏమి ప్రయోజనకరం కాదు.
ఇదివరకు లాగా పచ్చి గడ్డి మన ఆలమందలకు లభించటంలేదు. వృక్షాలు కూడా బాగా పలచబడిపోయినాయి. ఎక్కడ చూసినా మందల మందల పశువుల మల మూత్రాలతో నీటి మడుగులు కలుషితమైనాయి. డొంకలు అడుగుపెట్టటానికి వీలు లేకుండా అయినాయి. పొదలు, మ్రాకులూ ఒట్టిపోయినాయి. పంట పొలాలు నిస్సారమైపోయినాయి. ఆకూ కూరా కాయా కసురు ఇదివరకటిలాగా లభించటంలేదు. గడ్డి గాదరా పొలాలో ఎక్కడా కనపడటంలేదు. చిట్టడవులు బీడువారిపోతున్నాయి. కూరా కాయా కట్టే కూడా గృహస్థు డబ్బు పెట్టి కొనుక్కోవలసిన దురవస్థ కలిగింది. కాబట్టి వ్రేపల్లె నుంచి మనం వేరే చోటికి మన ఉనికి మార్చుకోవటం అవసరం. ఇక్కడకు సమీపంలోనే బృందావనం వుంది కదా!
అది దేవతల నందన వనానికి సాటి వస్తుందంటే నమ్ము! అక్కడ గోవర్థనమనే పర్వతం ఉంది. ఆ పేరు దానికి అన్ని విధాలా సరియైనది.
నిజంగా అది గోవర్థనమే. అక్కడ ఉన్న భాండీరమనే వటవృక్షం వంటిది భూలోకంలోనే లేదు. దాని శాఖలు అనంతరం. అది కూడా గోవర్థనమంత అందమైనది. బహు విస్తారమైనది. ఇక ఆ అరణ్యం మధ్యలో కాళింది నది ఉంది. అది దేవలోకంలోని గంగానది వంటిది. ఇపుడు మనం ఉంటున్న ఈ వ్రేపల్లె వనం వట్టిపోయింది. ఇది ఇక మనం సుఖంగా కాలం గడపటానికి అనువైనది కాదు.
అయితే మన ముసలి, ముదుకవారు చాలా కాలం నుంచి ఇక్కడ ఉండటంవల్ల, ఇపుడు విడిచిపెట్టటానికి ఇష్టపడరు. ఈ ప్రదేశంతో వీళ్ళకు విడదీయరాని బంధం ఏర్పడింది. కాబట్టి ఒక విచిత్రం సృష్టిస్తాను చూడు. మాయోపాయం ఏదో చేయందే వీళ్ళిక్కడనుంచి కదలరు.
ఇట్లా అంటున్న కృష్ణుణ్ణి బలరాముడు చూస్తూండగానే కృష్ణుడి ఆపాదమస్తక శరీరం నుంచి భయంకరమైన తోడేళ్ళు గుంపులు గుంపులుగా పుట్టి అక్కడి అన్ని వైపులా వ్యాపించాయి. అవి పులులో, సింహాలో, పిశాచాలో అనేట్లు వెరపు గొలుపుతున్నాయి. ఇక ఆ మరుసటి రోజు నుంచి వ్రేపల్లెవాసులు గజగజ వణికిపోతూ ఇదేమి ప్రారబ్దం అని సంభ్రమ ఛాయ మనస్కులవుతూ వచ్చారు వ్రేపల్లెలో.

ఇంకాఉంది