భక్తి కథలు

హరివంశం - 3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమస్త వీరత్వమే పురుషాకారం ధరించిట్లైంది అతడి ఉత్సాహమూ, ఉద్రేకమూ ఉప్పొంగి. ఆ మహారాక్షసుడి గర్వ సంరంభానికి పట్టపగ్గాలు లేకుండాపోయినాయి. ప్రళయకాలాగ్నిలా మండిపడ్డాడు. తన వైరులను తలచుకొని ఆ దనుజుడు, యముడిలా హుంకరించాడు. ఇతఃపూర్వమెన్నడూ ఆ రక్కసుడు రిపులతో కలహించి ఓటమి పాలు కాలేదు. ఆగ్రహించాడా కళ్ళనుంచి నిప్పులు రాలుస్తాడు అతడు.
పసుపు కావి వర్ణపు పెద్ద మీసాలూ, కారు నల్లటి శరీర దీప్తులూ, లావైన పెద్ద మెడా ఆ రాక్షసుడి రూపురేఖలు. చాలా వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి వరాలు పొందాడు కాలనేమి. కాబట్టి రాక్షసుల ఓటమిని సహించలేకపోయినాడు. దానితో రాక్షస నాయకులందరినీ ఊరడించి, అభయమిచ్చి సర్వసేనా సన్నద్ధుడై దేవతలపై యుద్ధం ప్రకటించాడు. దేవతలు కూడా మళ్లీ ఇంద్రుణ్ణి తమ నాయకుడిగా చేసుకొని రాక్షసులతో యుద్ధం చేశారు. మహాఘోర యుద్ధమే జరిగింది రెండు పక్షాలమధ్య. ఏనుగులు, గుర్రాలు, రథాలు, అసంఖ్యాకంగా రణభూమిలో శకల శకలాలై సైనికుడెవరూ అడుగుపెట్టలేని స్థితి దాపురించింది. తారకాసురుడు, విరోచనుడు విజృంభించారు. అట్లానే దేవతల పక్షంలో అగ్ని, యముడు, వరుణుడు శత్రువులను మార్కొన్నారు. రక్తపుటేరులు యుద్ధ్భూమిలో ప్రవహించాయి. కాలనేమి నూరు శిరస్సులతో, నూరు బాహువులతో ఆకాశమంత ఎత్తు ఎదిగి, ఐరావతా రూఢుడైన ఇంద్రుడితో తలపడ్డాడు. ఇంద్రుణ్ణి వేళాకోళం చేశాడు. ‘నా గదతో నీ తల ముక్క చెక్కలు చేసి ఇవాల్టినుంచి నేనే త్రిదశేంద్రుణ్ణి అవుతాను. ముల్లోకాలను పాలిస్తాను’ అని అట్టహాసంగా ఇంద్రుడిపై విజృంభించాడు కాలనేమి. ఇంద్రుడప్పుడు కాలనేమిపై వజ్రాయుధం ప్రయోగించాడు. అయితే ఆవజ్రాయుధం రాక్షసుడి వక్షస్థలం తాకి దాని పదును వమ్మైపోయింది. అది వికలమై మళ్ళీ ఇంద్రుడి చేతికే చేరింది. కుల పర్వతాలను కూడా ముక్కలు చేసే శక్తి కల వజ్రాయుధం ఇట్లా పనికిరాకుండా పోయిందే అని ఇంద్రుడు భీతి చెందాడు. వణికిపోయినాడు. ఇంతలో భయంకరమైన గదతో వచ్చి ఐరావతం కుంభస్థలం వ్రయ్యలు చేసి మరో దెబ్బ ఇంద్రుడి వక్షస్థలంపై కొట్టడు కాలనేమి. ఏనుగుతో పాటు ఇంద్రుడు కూడా నేలకూలాడు. యుద్ధంలోంచి పారిపోయాడు. ఏనుగు కూడా కొన ఊపిరితో జలధారలన్నీ ఎండిపోయిన పెద్ద కొండలాగా కదలక మెదలక ఊర్పులు పుచ్చుతూ చేతనరహితంగా ఉండిపోయింది. ఈ ఉత్సాహంతో వరుణుణ్ణి ఎదుర్కొని పాశాన్ని ఊడలాగి, బాణాలతో వరుణుడి శరీరం వ్రయ్యలయేట్లు చేశాడు కాలనేమి. తరువాత కుబేరుణ్ణి పరాభవించి అతడి కిన్నర పరివారాన్నీ, ధనరాశులనూ దోచుకున్నాడు. యముణ్ణి కింద పడిపోయేట్లు కొట్టాడు. ఆయన వాహనమైన దున్నపోతు కొమ్ములు పట్టుకొని నేలపై పడగొట్టి ఈడ్చాడు. యముడి కాలదండాన్ని బెండులాగా చేశాడు. ‘పిరికివాళ్ళ ప్రాణాలు తీస్తావు కాని ఇపుడేమైంది నీ సత్తా’ అని ముఖంమీద చప్పట్లు చరచి మృత్యుదేవతను పరిహసించాడు. ఈ విధంగా దిక్పాలకులందరినీ చావగొట్టి, పారిపోయేట్లు చేసి వాళ్ళ వాళ్ళ పదవులు అధికారాలు తన వాళ్ళకు కట్టబెట్టాడు. తారాగణం మధ్య దాక్కున్న చంద్రుణ్ణి స్థానభ్రష్టుణ్ణి చేశాడు. త్రిలోక పూజ్యుడైన అగ్నిని అవమానించాడు. వాయుదేవుణ్ణి తూలనాడాడు. వాళ్ళ వాళ్ళ అధికారాలన్నీ శక్తులన్నీ తన అధీనం చేసుకొన్నాడు. ఈ విధంగా స్వర్గలోకాన్ని, తక్కిన లోకాలనూ స్వాయత్తం చేసుకొన్నా డు. అప్సరసలు, గంధర్వులు కాలనేమికి ఊడిగం చేశారు. దేవతలు చెల్లాచెదరై తలదాచుకున్నారు.
- ఇంకా ఉంది

-అక్కిరాజు రమాపతిరావు