భక్తి కథలు

హరివంశం - 18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దివోలోకాన్ని ఒక్క తావు తన్ననా అది కుయ్యోమంటుంది. పిడికిలి బిగించి కొట్టానా దిక్కులన్నీ పగుళ్ళు బారతాయి. ఒక్కసారి పెలుచన హుంకారం చేశానా! అగ్నికి కాళ్ళు చేతులాడవు. వాయువు స్తంభించిపోతాడు. సూర్య చంద్రులు చలన రహితులవుతారు. ఒకవేళ కొండలు పగిలిపోయినా, సముద్రాలు ఇంకిపోయినా, నా సిగపూవు వాడదు. నాకెటువంటి అపద రాదు. దీనికేంగాని, ఇంకొకటి చెపుతాను. కలహాశనుడు ఈ నారదుడు. కాలు గాలిన పిల్లిలా తిరగకపోతే ఈయనకు నిద్ర పట్టదు. కాళ్ళు నిలవవు. నోరు మూత పడదు. ఒట్టి తిరుగుబోతు. స్థిరంగా కూచోలేడు. ఆ రాజు దగ్గరకు, ఈ రాజు దగ్గరకు పోయి ఇదుగో నీకు ఈ అపాయం రాబోతున్నది. ఈ ఉపాయంతో గట్టెక్కగలవు అని ఉన్నవీ లేనివీ కల్పించి, చాడీలు చెప్పి అంతకుముందు పగలేనివారికి కూడా విరోధాలు తెచ్చిపెడతాడు. ప్రేలాపనలతో పొద్దుపుచ్చుకుంటాడు. గట్టి గుండె కలవారికైనా వెరపు కలిగే మాటలు చెప్పటం ఈయన కాలక్షేపం. ఇదొక వినోదం. ఇట్లా చేస్తేగాని ఈయన కండూతి తీరదు.
సరే ఈ సంగతి అలా ఉంచుదాం. ఇపుడు మనం చేయాల్సిందల్లా ఏమిటంటే ముందుగా మన అరిష్ట, ధేనుక, ప్రలంబ, కేశి, పూతన. కాశియ నాగులకు హెచ్చరికగా ఉండవలసిందని కబురు చేయాలి. నారదుడేమో యదుకులంవల్ల మనకు అపాయం కలగబోతున్నదనీ చెప్పాడు కాబట్టి మననెవరు కంటగించుకుంటున్నారో, తూలనాడుతున్నారో వాళ్ళను ఒక కంట కనిపెట్టి ఉండాలి, ఏ మాత్రం ఏమరకుండా! అంతేకాదు గర్భవతుల సమాచారం కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. వచ్చి నాకు చెప్పాలి. మీరేమీ ఖేదం చెందవద్దు. బాగా తిని త్రాగి ఇష్టోపభోగాలతో పొద్దులు పుచ్చండి. నా వాళ్ళకు భయం, గియం ఎందుకు? హాయిగా ఉండండి అని చెప్పి అంతఃపురంలో రహస్యాలోచన మందిరంలోకి వెళ్లాడు. అక్కడికి తన ఆప్తవర్గాన్ని పిలిపించుకున్నాడు. ఇదుగో వినండి. ఈ రోజు మొదలు మన దేవకి కదలికలన్నీ జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలి. ఇందుకోసం చాలామంది స్ర్తిలు దేవకికి తెలియకుండా రహస్యంగా ఆమె గూర్చి ముపొద్దులా ఆరా తీస్తూ వుండాలి. ఆమె నెల అశౌచం, శుద్ధి స్నానం, గర్భధారణకు అనువైన కాలం అన్నీ గూఢచర్యంగా తెలుసుకుంటూ ఉండాలి. గర్భవతి అయిన సూచనలు, తొలి నెలల ఆచూకీ, గర్భం ధరించటమంటూ జరిగితే ప్రసవం ఎపుడు సంభవించేదీ నాకు చెప్పాలి. తమ ఏలిక కోసం, తమ పోషకుడికోసం రేయనక, పగలనక, నిష్కపటంగా, ఏమరుపాటు ఎంత మాత్రం లేకుండా, అలసటను ఏ మాత్రం లెక్క చేయకుండా, ఈ పనిని నిర్వహింపచేయాలి. ఇట్లా ఈ పని కనిపెట్టి కొందరు స్ర్తిలు పని చేస్తున్నారని ఎవ్వరికీ తెలియకూడదు. ఈ పనికి కారణం ఎవ్వరూ ఊహించను కూడా లేకుండా ప్రవర్తించాలి.
మంత్రాలవల్ల, మందులవల్ల, అమానుషమైన చర్యలవల్ల అభిమతార్థం సాధించుకునే వాడికి దైవ సహాయం తప్పక ఉంటుంది. కడ ముట్టా పని నిర్వహించేవాడికి ఫలితం తప్పక కలుగుతుంది. ఇది తథ్యం అని వాళ్ళకు బోధించాడు కంసుడు. అయినా కంసుడి గుండె బెదరు తగ్గలేదు. విచారం పూర్తిగా విడిచిపెట్టలేదు. కాని దేవకీ దేవి గర్భం విధ్వంసం చేయటానికి సుస్థిర నిశ్చయం చేసుకున్నాడు.
ఇది ఇట్ల ఉండగా నారద మహర్షి ఎకాయెకి శ్రీమన్నారాయణుడి దగ్గరకు వెళ్లి తాను కంసుడి దగ్గరకు పోయి ఆ దుర్మార్గుడికి గుండె దడ పుట్టించిన సంగతి, ఆ కంసుడు అవలంభించబోయే పరమ నీచమైన ప్రతిక్రియ ఏమిటో వివరంగా విష్ణుమూర్తికి తెలిపాడు.

-- ఇంకాఉంది

- అక్కిరాజు రమాపతిరావు