భక్తి కథలు

హరివంశం - 78

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధుర వచ్చి వాళ్ళ రక్షణోపాయం నీవు వెంటనే పూనాలి.
ఇక మీ తండ్రిని కంసుడు నీ పట్ల వెక్కసంతో నిరంతరావమానం పాలు చేస్తున్నాడు. నిత్యం కారుకూతులు కూస్తున్నాడు, తనను విననురాని మాటలంటున్నాడు. కొలువు కూటానికి పిలిపించి రెచ్చిపోతున్నాడు. మీ ఇద్దరు అన్నదమ్ములు అసమాన బలశాలులు. అయినా వసుదేవుడు అవమాన భారాన్ని ఎంతో దిగమింగుతున్నాడు. మిమ్మల్ని ఇంతవరకు కన్నులారా ఆయన చూసుకోనైనా లేదు. ఎపుడు ఏ దుర్మార్గం తలపెడతాడో ఈ దుష్ట కంసుడని ఆయన అనుక్షణం భీతి చెందుతున్నాడు. మధుర వచ్చిన తరువాత అన్ని విషయాలు నీకే అర్థమవుతాయి. ఏంచేయాలో నీవే నిర్ణయించవచ్చు అని అక్రూరుడు చెప్పటంతో కంసుణ్ణి ఎంత త్వరగా వధించాలా అని ఆయనకు ఆత్రుత కలిగింది.
ఆ వేకువ జాముననే నందుడు మొదలైన గోప ప్రముఖులు కంసుడికి సమర్పించవలసిన కానుకలు, పాడి ఆవులు, ఎనుములు, కోడెలు, తదితర పశువుల మందలు, కప్పం ధనం తీసుకొని మధురానగరానికి ప్రయాణమైనాడు.
ఇంతలో తెల్లవారింది. చందమామ వెల వెలబోయాడు. చెట్టుమీద పువ్వులు తమంత తాము వాడి రాలిపోయినట్లుగా ఆకాశంలో చుక్కలు కనుమరుగైనాయి. వేకువ వైద్యుడు రాత్రి అంతా సొమ్మసిల్లి శోషపోయి తేరుకుంటున్న ప్రకృతికి ఉత్తేజకరమైన ఔషధం నూరుతున్నాడా అన్నట్లు తూర్పు దెస అనే కల్వంలో సింధూర రాగరంజితమైన వెలుగు తోచింది. కొండ కొమ్ములపైన మనోహర విన్యాసాలతో లేత ఎండ వ్యాపించింది. గోవర్థనం మీది సెలయేళ్ళ చల్లని గాలులు బృందావనాన్ని తాకుతున్నాయి. పని పాటలు చూసుకోవలసిన పల్లెవాసులు అపుడే నిద్ర లేస్తున్నారు. గోవులు రాత్రంతా సుఖంగా నిద్రపోయి లేచి ప్రశాంతంగా నెమరులు వేస్తున్నాయి. దూడలను తలచుకోగానే వాటి పొదుగులు బరువెక్కి నిండిపోయి అంబారవాలతో దూడల కోసం ఎదురుచూపులు చూస్తున్నాయి. ఏ ఇంట చూసినా పాలు పిదికే సంరంభం కనపడుతున్నది. గోపెమ్మలు చల్లలు చిలికే పని ప్రారంభమైంది. ఇట్లా చల్ల చిలుకుతో వాళ్ళు గోపాలకృష్ణుణ్ణి తలచుకుంటూ లలిత మనోజ్ఞ గీతికలాలపిస్తున్నారు. కాళింది మడుగులోని బెగ్గురు పక్షుల కోలాహల ధ్వనులు కృష్ణా! నీ ప్రయాణ శుభముహూర్తం ఆగమించిందని హెచ్చరికలు పలుకుతున్నట్లుగా విన్యసించాయి. జక్కవ పక్షులు సంతోషంతో కలకలారావాలు చేస్తున్నాయి. కంసదమనుణ్ణి దర్శించటానికి వేగిరిపడుతున్నాడా అన్నట్లు ప్రాచీ దిశలో భానుడుపైకి వచ్చాడు. వేదస్తుత్యమైన అరుణారుణ చరణ కమలుడు గోవుల వెంట తిరిగి వాటి పెండలను తన పాదాలకు చందన లేపంగా భావిస్తున్నాడు. ఇది ఎంత వింత సంగతి అనుకోగానే అక్రూరుడు భక్త్భివ వివశాత్మకుడైనాడు. సుప్రభాతాన ఆయనను దర్శించగానే! ‘దేవా! రథం సిద్ధంగా ఉంది’ అని నీల నీరద శ్యాముడికి వచ్చి విన్నవించాడు. అపుడు అన్నదమ్ములిద్దరూ ఆ రథం అధిరోహించారు. అక్రూరుడు సారధ్యం పూని బృందావనం నుంచి ఆ రథం కదిలిపోతుండగా వ్రజ భామినులు కృష్ణుణ్ణి వదలలేక విలపించారు. కొంతదూరం ఆ రథాన్ని వెంబడించారు. పద్మనాయనుణ్ణి చూడకుండా మనం బతకగలమా? అని శోకాతురలైనారు. ఎక్కడినుంచి వచ్చాడు ఈ అక్రూరుడు! అక్రూరుడట అక్రూరుడు, ఇంతకన్నా క్రూరుడు మరి ఎవ్వడుంటాడు? అని కన్నీరు కాల్వలు గట్టగా గోప వనితలు గోడు గోడున వాపోయారు! కృష్ణుడు లేని వ్రేపల్లె మాకు ఎందుకు?

ఇంకాఉంది

అక్కిరాజు రమాపతిరావు