భక్తి కథలు

హరివంశం - 81

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీవు తీసుకొనిపోతున్న వాటిలో చాలా సుందరమైనవి కొన్ని మాకివ్వకూడదా?’ అని అడిగాడు ఆ రాచకొలువరిని శ్రీకృష్ణుడు. ఆ మాటలకు ఆ రాచ రజకుడు ముఖం నిండా కోపం పులుముకున్నాడు. వాళ్ళను ఛీత్కరించాడు. ‘మీరు చూడబోతే ఒడ్డి మడ్డివాళ్ళూ, జడ్డివాళ్ళులాగా కనపడుతున్నారు. పల్లెటూరి వాలకంతో పశువుల కాపరుల వేషాలు మీవి. మీకు కంస మహారాజు ధరించే వస్త్రాలు కావాలా? పోండి పోండి నన్ను అటకాయించారా అంటే మళ్ళా మీరు ప్రాణాలతో ఉండలేరు అని రామకృష్ణులను దురుసుగా తోసివేశాడు.
కృష్ణుడప్పుడు ఆ రజకుణ్ణి కొట్టి విగతజీవుణ్ణి చేసి ఆ వస్త్రాల మూటను లాక్కున్నాడు. ఈ వార్త తెలిసి ఆ రజకుడి ఇంటివాళ్ళు వచ్చి అక్కడ గోలు గోలన మొత్తుకున్నారు. కృష్ణుడప్పుడా దుస్తుల మూట విప్పి అందులో ప్రశస్తమైన వినీల వర్ణపు తళతళలతో మెరసేవి తీసి బలరాముడికిచ్చాడు. తాను కనకాంబరపు పట్టు పుట్టాలు తీసుకున్నాడు. తక్కినవి తనను వెన్నంటి వస్తున్న మధురానగర యువకులకు పంచి పెట్టాడు.
అక్కడ నుంచి ఆ అన్నదమ్ములు ఇంకాస్త ముందుకు పోగా దారినంతా సుగంధ బంధురం చేస్తూ రాచనగరుకు పూలమాలలు తీసుకొని పోతున్న మాలాకారుణ్ణి చూశారు. అప్పుడు కృష్ణుడు ‘ఏమోయ్! మేము కూడా రాచనగరుకే వెళుతున్నాం. మాకీ అందమైన పుష్పమాలలు ఇస్తావా? అలంకరించుకుంటాం! అని అడిగాడు. ఆ మాలాకారుడి పేరు గుణకుడు.
అతడు రామకృష్ణులను చూసి అద్భుత ప్రమోదమానసుడైనాడు. వాళ్ళు తన పూలమాలలు ధరిస్తే తన పుణ్యం ఇంతా అంతా కాదు అని మురిసిపోయినాడు. వినయంతో కరగిపోతూ ‘స్వామీ! మీకు కావలసినవన్నీ మీరు స్వీకరించండి’ అని దోసిలొగ్గి వారికా పూలమాలలు సమర్పించాడు. కృష్ణుడు వాటిని ముందుగా కొన్నిటిని బలరాముడికిచ్చాడు. తరువాత తాను కొన్నిటిని వక్షస్థలంలో ధరించాడు. సిగలో కొన్ని చుట్టుకున్నాడు. కొన్ని తన వెంట వస్తున్న మధురాపుర పౌరులకు బహూకరించాడు.
మాలాకారుడు చకితనేత్రుడై అనురాగ ప్రపూర్ణుడైన కృష్ణుడికి నమస్కరించాడు. కృష్ణుడప్పుడు గుణకుణ్ణి అనుగ్రహిస్తూ ‘నీ వంశం తామర తంపరగా వృద్ధి పొందుతుంది. నీవు సకల సుఖ సౌఖ్యాలతో జీవిస్తావు. తరతరాల నీ సిరి తరగదు’ అని కటాక్ష వీక్షణ రోచులతో మెచ్చుకున్నాడు. గుణకుడు ఆ మాటలకు పరవశించాడు.
తనకప్పుడు దైవ సాక్షాత్కారం లభించినంతగా పొంగిపోయినాడు. అన్నదమ్ములిద్దరూ ఇట్లా సురభిళ పుష్పమాలాలంకృతులై ఇంకొంచెం ముందుకు సాగారు. అప్పుడు వాళ్ళకు చుట్టుపక్కల అంతా ఘుమఘుమలు వ్యాపింపచేస్తున్న అంగరాగ చందన కలపం బంగారు కలశంలో తీసుకొని వెళుతున్న ఒక గూని భామ కన్పించింది. ఆ యువతి ఎంతో పొట్టిగా ఉంది. వెన్ను గూని పొడుచుకొని వచ్చింది.
ఆ గూని ఒరుపుకు కొంచెం ముందుకు వంగి నడుస్తున్నది ఆ కుబ్జ. ఆ కుబ్జను అడ్డగించి దరహాసిత వదనుడై ఈ కలపం ఎంత బాగుందో! ఎంత సువాసనాభరితంగా ఉన్న దో! అన్నాడు కృష్ణుడు.
అప్పుడా కుబ్జ బిత్తర చూపులతో ‘నా దారిన నన్ను పోనివ్వండి స్వామీ! ఇప్పుడు కంస మహారాజు మజ్జనమాడే సమయం ఇది. నేను కలపం తీసుకొని వచ్చి ఇచ్చినదాకా ఆయన స్నానం మాట తలపెట్టడు. ఈ నగరంలో మరెవరు చందన కలపం తీసుకొని వెళ్లి ఇచ్చినా ఆయన పసందు చేయడు. నా కోసమే కనిపెట్టుకొని ఉంటాడు.
ఇంకాఉంది

- అక్కిరాజు రమాపతిరావు