భక్తి కథలు

హరివంశం 173

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడాయన శంకరుణ్ణి గూర్చి తపస్సు చేయటం, కైలాసాధీశుడు తనకు ప్రత్యక్షం కావటం గూర్చి పెద్దలకు చెప్పాడు. వాళ్ళు పౌండ్రుడు ద్వారకా నగరంపై దండెత్తి రావటం, ఆ చెనటిని పరాభవించి పంపటం ఆయనకు సంతోషంతో తెలియజేశారు. పౌండ్రుడి దుర్మార్గం విని స్వామికి ఆవేశం జనించింది. నేను లేకపోవటం చూసి వాడింతకు తెగించాడా? సరే! పనె్నండేళ్ళుగా నేను కడూ విరామం ననుభవిస్తున్నాను రాక్షస సంహారం చేయకుండా. తనంతు తానే వచ్చాడు వీడు, తన చావు తానే కోరితెచ్చుకుని. వధార్హుడైన ఈ పౌండ్రుణ్ణి నేను వధించకుండా విడిచిపెడతానా? అని పౌండ్రుడెక్కడ ఉన్నది, ఏమి సన్నాహాలు చేస్తున్నదీ తెలుసుకొని రావలసిందిగా వేగులను (గూఢచారులను) నియమించాడు. తరువాత సుపర్ణుడికి నేను స్మరించగానే రావలసిందని వీడ్కోలు చెప్పి పంపాడు.
ఇక కాశీ నగరంలో ఉన్న పౌండ్రుడికీ, అతడి కూటమిలో వున్న రాజులకూ కమలాక్షుడు ద్వారకా నగరం చేరాడన్న సంగతి తెలిసింది. అపుడు కాశీరాజు ప్రేరణతో వాళ్ళంతా కూడబలుకుకొని కృష్ణుడి దగ్గరకు ఒక దూతను పంపించారు. ఈ సందేశం పౌండ్రకుడు ఇట్లా కృష్ణుడికి తెలుపవలసిందిగా దూతకు చెప్పి పంపాడు. ‘నీవు పుట్టినప్పటినుంచీ పశుల కాపర్ల కుటుంబంలో పెరిగావు. గోవధ, స్ర్తివధ, బంధువధ వంటి పాతకాలకు వొడిగట్టావు. పోనీ, నీ పాపం నీకే చుట్టుకుంటుంది అని ఉపేక్ష చేదామనుకున్నాను. కాని నా పేరు, నా ఆయుధాలు నీవు ప్రదర్శించుకోవటం నాకు దుస్సహం. వాసుదేవుడనే పేరు ప్రతిష్ఠలు నాకు కాక ఇంకెవరికి వర్తించగలవు? నా మాట విను. నా ఆయుధాలు నీ ఆయుధాలు అని ఇక ఎంతమాత్రం చెప్పుకోవద్దు. నా పేరు కూడా నీకు తగదు. కాబట్టి వీటిని నీవు విడిచిపెట్టు. వినయంగా, భయభక్తులతో నన్ను ఆశ్రయించు. అపుడు నేనుశరణాగతుడని నీ జోలికిరాను.
దూత వచ్చి ఈ వాక్యాలు కృష్ణుడికి వినిపించగానే ఆయన వదనమంతా హాసధీథితులు అలముకొన్నాయి. సరే! నిన్ను ఎవరు పంపించారో వారికిట్లా చెప్పు. అవశ్యం మీ ఆజ్ఞను జవదాటను. తలదాలుస్తాను. తన ఆయుధాలను విడిచిపెట్టమని కోరాడు. కాబట్టి ఆ ఆయుధాలను అతడి మాటకి విడిచిపెడతాను. ఇక శరణువేడటం సంగతి చూసుకుందాం. పౌండ్రుడు ఇంకా అతడి సహాయులైన రాజులూ వింటుండగా ఆయన దర్శనం ఇపుడే చేస్తానని చెప్పు అని ఆ దూతను మర్యాదపూర్వకంగా వీడ్కొలిపాడు కృష్ణుడు.
ఇక పెద్దలందరి దగ్గరా అనుమతి పొంది పౌండ్రుడి మీద యుద్ధానికి బయలుదేరాడు. సుపర్ణుణ్ణి తలచుకోగానే వైనతేయుడాయన సమక్షానికి వచ్చాడు. సాత్యకి మొదలైన యదువీరులు ‘దేవా! ఈ పనికి మీరు పూనుకోవటం దేనికి? మమ్ములనెవరినైనా పంపితే ఈ కార్యం చక్కబెట్టుకొని రామా!’ అన్నారు. కాని ‘నేను ద్వారకా నగరంలో లేకుండా వెళ్లినప్పుడు మీరు ఎంతో దిగ్విజయంగా పగవాణ్ణి భంగపుచ్చారు. అది చాలు. ఇక నేను స్వయంగా శత్రువును పరిమార్చి వస్తాను’ అని ఆయన బయలుదేరాడు గరుడ స్కంధారూఢుడై.
ఇక అప్పుడు పౌండ్రుడు తన సహాయులై వచ్చిన రాజులతో కాశీరాజుతో సర్వసేనా పరివారుడై వారణాసీపుర బాహ్యంలో కృష్ణుణ్ణి ఎదుర్కోవటానికి సంసిద్ధుడై యుద్ధ వ్యూహాలు రచించుకున్నాడు. కృష్ణుడు తాను యుద్ధ సన్నద్ధుడై ఉన్నట్లు కాశీ నగరం వచ్చి పాంచజన్యం పూరించాడు. పౌండ్రుడి సేనా పరివారంలో కూడా భేరీ కాహళ, ఢక్కా నినాదాలు మారుమ్రోగాయి. పౌండ్రుడు శ్రీకృష్ణుడిపై కుప్ప తెప్పలుగా వివిధాయుధాలు ప్రయోగింపజేశాడు. తానూ ఆయనను బాణాలతో కప్పివేశాడు.

ఇంకా ఉంది