రంగారెడ్డి

వౌలిక వసతులకు ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: స్వరాష్ట్రం.. స్వపరిపాలనలో హైదరాబాద్ నగరంలో వౌలిక వసతులను మెరుగుపరిచేందుకు, అవసరాలకు అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఎన్నో చర్యలు చేపట్టామని, ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా ఉందని మేయర్ బొంతు రామ్మోహన్ బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో వ్యాఖ్యానించారు. ఉదయం కౌన్సిల్ సర్యసభ్య సమావేశాన్ని ప్రారంభించినానంతరం ప్రారంభోపన్యాసం చేస్తూ కేవలం నాలుగేళ్ల స్వపరిపాలనలో నగరం అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ది సాధించిందని వివరించారు. మనం మారుదాం..మన నగరాన్ని స్వచ్చంగా మారుద్దాం..అనే లక్ష్యంతో జీహెచ్‌ఎంసీ గతంలో ఎన్నడూ లేని వినూత్నమైన ప్రణాళికలను సిద్ధం చేసిందన్నారు. ప్రభుత్వ, ప్రజాప్రతినిధుల సహకారం, క్షేత్ర స్థాయి సిబ్బంది సమష్టి కృషితో ఈ సంవత్సరం జీహెచ్‌ఎంసీకి ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డులను లభించాయని వివరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లో భాగంగా చెత్తను తడి, పొడిగా వేరు చేసేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించి జీహెచ్‌ఎంసీకి పారదర్శక సేవలు, మెరుగైన ఘన వ్యర్థాల నిర్వహణ, నిరుపేదలకు గూడు కల్పించే రెండు పడకల ఇళ్ల నిర్మాణం వంటి పనులకు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించిందని వివరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్ ఉత్తమ నగరంగా ఎంపిక కావటం నగర ప్రతి పౌరుడికి గర్వకారణం అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని సేవలను మెరుగుపర్చుకోవటంతో జీహెచ్‌ఎంసీకి ‘స్కోచ్’ అవార్డు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ సంవత్సరం నగరంలో వౌలిక సదుపాయాలను మెరుగుపరిచే అంశానికి ప్రత్యేక ప్రాధాన్యతినిస్తున్నట్లు, కొత్తగా రోడ్లు, బ్రిడ్జిలు, జంక్షన్లు, పార్కులు వంటివి ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేశామన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా నగరంలో రెండు లక్షల మంది నిరుపేద ముస్లింలకు ప్రభుత్వం తరపున దుస్తులను పంపిణీ చేయనున్నట్లు, నగరంలోని ఒక్కో మసీదుకు ఇఫ్తార్ విందు నిర్వహించి, 500 గిఫ్ట్ ప్యాకెట్లతో పాటు రూ.లక్ష ఆర్థిక సహాయం చేయనున్నట్లు తెలిపారు.
అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో గవర్నర్ బస
వికారాబాద్, మే 23: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం సాయంత్రం అనంతగిరికి చేరుకున్నారు. అనంతగిరిలోని పర్యాటక కేంద్రం హరిత రిసార్ట్స్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ కే.అరుణకుమారి, ఎస్పీ టీ.అన్నపూర్ణ ఘనస్వాగతం పలికారు. పోలీసుల నుంచి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. రిసార్ట్స్‌లో శుక్రవారం సాయంత్రం 5.30 గంటల వరకు గవర్నర్ దంపతులు బస చేయనున్నట్లు ఎస్పీ టీ.అన్నపూర్ణ తెలిపారు. గవర్నర్ రాక సందర్భంగా అనంతగిరి అడవి, పరిసరాలను పోలీసు భద్రతాదళాలు చుట్టుముట్టి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. నరసింహన్ రాకతో పర్యాటక కేంద్రం పరిసరాలతో పాటు శ్రీఅనంత పద్మనాభస్వామి దేవాలయం పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఆలయ పరిసరాలను అందంగా ముస్తాబుచేశారు. రిసార్ట్స్‌కు చేరుకున్న గవర్నర్‌ను శాసనసభ్యుడు బీ.సంజీవ రావు మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.

26న పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
హైదరాబాద్, మే 23: మహానగరానికి కృష్ణాజలాలను తరలించే ఫేజ్ 2, రింగ్ మెయిన్ 2లోని ఎల్లగుట్ట రిజర్వాయర్ నిర్మాణ పనుల్లో భాగంగా చేపట్టిన జంక్షన్ పనుల కారణంగా ఈనెల 26న నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు బుధవారం వెల్లడించారు. 26వ తేదీన ఉదయం ఆరు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల పాటు నీటి సరఫరా ఉండబోదని తెలిపారు. నాచారం, హబ్సిగూడ, చిలుకానగర్, ఎలుగుట్ట, రామంతాపూర్, హెచ్‌ఎంటీ నగర్, తార్నాక, లాలాపేట, సౌత్ సెంట్రల్ రైల్వే, మారెడ్‌పల్లి డివిజన్ మొత్తం, బౌడుప్పల్, బోయిగూడ, బీరప్పగూడ, రెజిమెంటల్ బజార్, మేకలమండి, నల్లగుట్ట, శ్రీనివాస్‌నగర్, అడ్డగుట్ట, మెట్టుగూడ, సీతాఫల్‌మండి, కంటోనె్మంట్ లైన్స్, ఏంఈఎస్, షీప్‌మండి, బౌద్దనగర్, హుస్సేన్‌నగర్ పంప్‌హౌజ్, ఆదయ్యనగర్ తదితర ప్రాంతాల్లో ఈ నెల 26వ తేదీన నీటి ఉండదనే విషయాన్ని గుర్తించి, వినియోగదారులు అంతకు ముందు జరిగే సరఫరాలో తమకు అవసరమైన నీటిని పట్టుకుని, నిల్వ చేసుకోవాలని జలమండలి అధికారులు సూచించారు.

అస్తవ్యస్తమైన డ్రైనేజీ.. వెదజల్లుతున్న కంపు
* అధికారులకు చూపించిన కాంగ్రెస్ నేతలు
ఉప్పల్, మే 23: జీహెచ్‌ఎంసీ ఉప్పల్ సర్కిల్‌లో పలు సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సర్కిల్ పరిధిలోని చిల్కానగర్, హబ్సిగూడ, రామంతాపూర్, ఉప్పల్ డివిజన్‌లో కాలనీవారీగా చెత్త, చెదారం, అస్తవ్యస్థమైన డ్రైనేజీ, ఏరులై పారుతున్న మురుగు నీరు, అడుగడుగునా గుంతలేనని బుధవారం బీరప్పగడ్డ, శ్రీనగర్ కాలనీలో పర్యటించిన డిప్యూటీ కమిషనర్ యాదగిరి రావు, ఏఎంహెచ్‌ఓ ఉమా గౌరీ, ఇంజనీరింగ్ అధికారులకు కాంగ్రెస్ నాయకులు రఘుపతి రెడ్డి, మల్లేష్ మొరపెట్టుకున్నారు.
వాటర్ పైపులైన్ల పేరుతో తవ్విన రోడ్లు గుంతలు పడి, కంకర తేలి, దుమ్ము, ధూళి వెదజల్లుతూ వచ్చిపోయే వాహనాలతో ట్రాఫిక్ జామై నిత్యం అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పై సమస్యలను అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చెవిటోని ముందు శంఖం ఊదినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని నిత్యం శంకుస్థాపనలు, అభివృద్ధి పనులపై ఫొటోలకు ఫోజులిస్తున్న ప్రజాప్రతినిధులు పైసమస్యలను ఏనాడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ ఇల్లు కడితే అక్కడ డబ్బులు వసూలు చేయడంలో చూపిస్తున్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని ఆరోపించారు. సమస్యలను యుద్ధప్రాదిపదికన పరిష్కరించగలమని డిప్యూటీ కమిషనర్ యాదగిరి రావు హామీ ఇచ్చారు.

అడ్డదారి బదిలీలు ఆపకుంటే ఉద్యమమే
టీయూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి విఠల్ హెచ్చరిక
వికారాబాద్, మే 23: అడ్డదారి బదిలీలు ఆపకుంటే ఉద్యమిస్తామని టీయూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఊరెళ్ళ విఠల్ హెచ్చరించారు. బుధవారం విడుదల చేసిన ప్రకటనలో సచివాలయం కేంద్రంగా ప్రభుత్వం అడ్డదారిలో బదిలీలకు తెరతీయడం శోచనీయమని చెప్పారు. ఒకేరోజు 45కు పైగా పైరవీలతో బదిలీల ఉత్తర్వులు విడుదల కావడం సరైనది కాదని పేర్కొన్నారు. పైరవీలు చేస్తే కఠినంగా శిక్షించాలని చెప్పిన ముఖ్యమంత్రి కార్యాలయం నుండే ఆదేశాలు వెలువడితే ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నించారు. కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేపట్టాల్సిన ప్రభుత్వమే ఉపాధ్యాయ హక్కులను కాలరాస్తూ పట్టణ ప్రాంతానికి దగ్గరగా అక్రమ మార్గంలో ఉత్తర్వులు జారీ చేయడంతో బదిలీల కోసం సంవత్సరాల తరబడి వేచి చూస్తున్న ఉపాధ్యాయులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని వాపోయారు. ప్రభుత్వం వెంటనే ఉత్తర్వులను రద్దు చేసి సాధారణ బదిలీల షెడ్యూల్‌ను త్వరగా విడుదల చేయాలని కోరారు.
వివాహాలకు హాజరైన టీపీసీసీ ఉపాధ్యక్షుడు గడ్డం ప్రసాద్‌కుమార్
టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్ బుధవారం పలు వివాహాలకు హాజరయ్యారు. మర్పల్లి మండలం సిరిపురం నివాసి ఎర్రోళ్ల నాగయ్య కుమారుడి రాజశేఖర్, మోమిన్‌పేట మండలం టేకులపల్లి గ్రామ నివాసి వెంకటయ్య కుమారుడు కుమార్ వివాహాలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.