నెల్లూరు

మెరుపు - నెల్లూరు : కిళ్లీ దొంగ కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమయం రాత్రి తొమ్మిది గంటలు...
జాతీయ రహదారిపై ఇన్నోవా కారు వేగంగా పోతోంది. అందులోని ఏసి గాలి చల్లగా ఒంటిని తాకుతోంది. కారులోని వారంతా ఒకరికొకరు మాట్లాడుకోవడం అయ్యాక కాస్సేపు వౌనం రాజ్యమేలింది. ఈ సమయంలో కాళ్లపై నీళ్లు పడుతున్న స్పర్శ రావడంతో మాధవరావు నీళ్లు ఎక్కడినుంచి వస్తున్నాయో తెలుసుకోడానికి ఎక్కువ సమయం పట్టలేదు. జేబులో చెయ్యిపెట్టుకుని చూసుకున్నాడు. జేబులో కిళ్లీ చేతికి తగిలింది. కిందటి రాత్రి భార్యకు ఇచ్చిన మాట గుర్తొంచ్చింది. బైటకు తీస్తే పరువుపోతుంది. జేబులోపలే ఉంటే ఆకులు నలిగి ఫ్యాంటు పాడవుతుందని భయం. ఏం చేయాలో తోచలేదు మాధవరావుకి. లోపలే దేవుడికి నమస్కరించుకున్నాడు. తొందరగా ఇంటికి చేరుకునేలా చేయి భగవంతుడా అని.
***
‘ఏమండీ... ఈరోజు మన పెళ్లిరోజండి అంది’ గోముగా శ్రావణి.
‘అయితే ఏంటట?’
‘అదికాదండి. నన్ను ఒంటరిగా వదిలేసి మీరు మీ స్నేహితుడి పెళ్లి రిసెప్షన్‌కు వెళ్తున్నారు. నన్నూ తీసుకెళ్లొచ్చుగా అంది.’
‘అదికాదే... నేను ఎక్కడికి వెళ్లినా నీ మనస్సులోనే ఉంటానుగా... నా మనస్సు నిండా నీ తలపులేగా... కొలీగ్స్‌తో వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే వారితో వెళ్తున్నాను. వచ్చేటప్పుడు మల్లెలు తెస్తాలే’ అన్నాడు మాధవరావు.
‘సరేలెండి’ అని సాగనంపింది మాధవరావును శ్రావణి.
మాధవరావు బయల్దేరాడే కాని మనసంతా ఇంటివైపే. శ్రావణికి ఏది ఇష్టం. ఆమెకు ఇష్టమైనది ఏదైనా ఇచ్చి సర్‌ప్రైజ్ చేద్దామనుకున్నాడు. కాని సమయం లేదు. ఓవైపు ఆఫీసుకు వెళ్లాలి. అక్కడినుంచి కొలీగ్ పెళ్లి రిసెప్షన్‌కు వెళ్లాలి. ఇంటికి చేరుకునే సరికి రాత్రి ఏ పదో అవుతుంది. ఏం చేయాలో తోచలేదు. అలా ఆలోచిస్తూండగా మాధవరావుగారూ అన్న పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు. ‘సార్ మనందరం గోపాలరావుగారి అబ్బాయి పెళ్లి రిసెప్షన్‌కు వెళ్లాలి’ అన్నారు.
‘అవునవును ఈరోజు అక్టోబర్ 30కదా. గుర్తుంది’ అన్నాడు నిజానికి ఆ రోజు తన పెళ్లిరోజున్న సంగతే గుర్తుంది మాధవరావుకు.
ఆఫీసుకు రాగానే అక్కడ మాధవరావు కోసం ఎదురుచూస్తున్న మిగతా స్ట్ఫా సభ్యులంతా తలో కారులో పెళ్లి మండపం వైపు దారితీశారు. కలిసి కొలీగ్ కుమారుడి పెళ్లి రిసెప్షన్‌కు నలుగురు హెడ్స్ కారులో బయల్దేరారు.
***
జడలా నల్లగా పొడవుగా ఉన్న ఎన్‌హెచ్‌పై కారు వేగంగా దూసుకుపోతోంది. ఎదురుగా వస్తున్న వాహనాల కారు లైట్లు మిరుమిట్లు గొలుపుతున్నా చాకచక్యంతో నడపడంతో మా వాహనం వేగంగా దూసుకుపోతోంది. అందులో ఉన్నవారు పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగా గమ్యం రానేవచ్చింది. కల్యాణమండపం ముందు కారు ఆగింది. నిర్వాహకులు స్వాగతం పలికారు. అందరూ లోనికి వెళ్లారు. బంధువులు, స్నేహితుల కుశల ప్రశ్నలు, కరచాలనాలు తర్వాత అందరూ నవ వధూవరులున్న వేదికపై వెళ్లారు. అక్షతలు చల్లి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత అందరూ భోజనాల వైపు నడిచారు. విందు.. పెళ్లి విందు. భలే పసందుగా ఉంది. అందరూ వంటకాలు బాగున్నాయని ఒకరికొకరు ముచ్చటించుకుంటూ సంతృప్తిగా భోంచేశారు. ఒక్కొక్కరూ ఐస్‌క్రీమ్ తిని కిళ్లీ ప్యాకెట్ తీసుకుని బయటకు వెళ్తున్నారు. ఆ వరుసలో మాధవరావు కూడా ఒకటి తీసుకున్నాడు. అందరూ చూస్తుండగా.. కాని చేతికి రెండు చిక్కాయి. ప్యాకెట్ విప్పి ఒకటి నోట్లో వేసుకున్నాడు. కాస్సేపటికి నోరు తెరచి చూసుకున్నాడు. నాలుక ఎర్రగా కన్పించింది మాధవరావుకు.
నాలుక ఎర్రగా పండితే మంచి భార్య వస్తుందని గతంలో ఎవరో అన్న మాటలు గుర్తొచ్చాయి. ఎవరికీ తెలియకుండా చేతిరుమాలు తీస్తున్నట్టు నటిస్తూ జేబులో చెయ్యిపెట్టి ఆ కిళ్లీ ప్యాకెట్‌ను జేబులో పెట్టి చాకచక్యంగా రుమాలు చేతిలోకితీసుకున్నాడు. అందరికీ వీడ్కోలు చెప్పి అందరూ కారులో బయల్దేరారు. మళ్లీ ఆఫీసు వద్ద కారు దిగి ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. మాధవరావు కూడా ఇంటికి చేరుకున్నాడు.
అప్పడు రాత్రి 11 గంటలైంది. ఎదురెళ్లి తలుపుతీసి కొంటెగా చూసింది శ్రావణి మాధవరావు వైపు చేతిలో ఏమైనా ఉన్నాయేమోనని. ఆ చూపులో భావం అర్ధమైంది మాధవరావుకి. తనకోసం మల్లెలు తెస్తానని చెప్పి చేతులూపుకుంటూ వచ్చేసరికి ఆమె బుంగమూతి పెట్టుకుని లోనికి నడిచింది. అతను ఆమెను అనుసరించాడు. కాస్సేపటికి పక్కమీద వాలి పెళ్లి రిసెప్షన్ విశేషాలు ఒక్కొక్కటీ చెప్తుండగా కిళ్లీ సంగతి గుర్తొంచింది. కొక్కేనికి తగిలించిన ఫ్యాంటు జేబులోనుంచి ఒక ప్యాకెట్ తీసి ‘నీ కోసం నీకోసం ... ’ అన్నాడు.
‘ఏం తెచ్చారో’ అని ఆత్రుతగా కళ్లు ఇంతలేసి చేసుకుని చూస్తున్న శ్రావణికి కిళ్లీ ప్యాకెట్ అందించాడు. అది వేసుకున్న శ్రావణి నాలుక చూసుకుంది. ఎర్రగా పండింది.
‘అందుకే నాకు మంచి మొగుడు వచ్చాడు’ అని అంది. ‘నగలతో కాదండి... మనస్సు అర్ధం చేసుకుంటేనే సంసారం పండుతుంది’ అన్న శ్రావణిని ఒడిలోకి తీసుకున్నాడు మాధవరావు.
- గౌతమి, 9347109377

స్పందన

అర్ధవంతంగా సాగిన గురజాడ కవితలు
తెలుగుజాతి గర్వించదగ్గ రచయిత గురజాడ అప్పారావు గారు. ఆయన్ను మళ్లీ గుర్తు చేసిన మెరుపు వారికి ధన్యవాదములు. ముందుగా గత వారం మెరుపులో ప్రచురించిన గోడలు మాట్లాడసాగాయి, అడుగుజాడ కవితలు బాగున్నాయి.
- అభిలాష, సాయి మనోహర్, నెల్లూరు

గోడలు మాట్లాడతాయి.. గొప్ప వర్ణన
గొప్ప గొప్ప వర్ణనలు, పోలికలు, భావాలు తెలుగుభాషకు సొబగులు. అలాగే గతవారం మెరుపులో గురజాడ పై వేదం వారు రాసిన కవిత గోడలు మాట్లాడతాయి నిజంగా అక్షరానికి అందమైన రూపాన్నిచ్చి పదాల మణిహార మాలికలా మమ్మల్ని ఆకట్టుకుంటుంది. నిజంగా ఈ కవితలో వాడిన వాక్య పదబంధాలతో గురజాడ వారికి అక్షర సత్కారం చేశారు రచయిత. అసలు విరచిత గ్రంథాల బీరువాల వెనుక గోడలు మాట్లాడమేమిటి.. ఎంత గొప్ప ప్రయోగం. గురజాడ వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంతగొప్ప కవితను మనకందించిన వేదం సూర్యప్రకాశం గారికి అభినందనలు.
- ఉలిచి సుబ్రహ్మణ్యం, కావలి
- సరోజిని దేవి, సంగీత శిక్షణాలయం,
నీలిమాటవర్స్ పక్కన, నెల్లూరు.

సంజీవని దొరుకుతుందా?
మెరుపులో ప్రచురించిన సంజీవని మాయ కథ సాగిన తీరు బాగుంది. కథలో నిజంగానే సంజీవని మొక్క తగిలి కనకయ్య కాలికి తగిన గాయం మానింది. కానీ అది మాయగానే చివరి వరకు మిగిలింది. కథ పూర్తయ్యేలోగానైనా శంకరయ్యకు సంజీవని మొక్కలు దొరుకుతాయోమోనని చూశాం. కానీ దొరకలేదు. శంకరయ్య బృందం సంజీవని మొక్క కోసం ఇప్పటికీ వెతుకుతున్నారు అని చెప్పారు. నిజంగా వెతుకుతూనే ఉన్నారా?
- గ్రంధి సుబ్బారావు, ఆత్మకూరు
- గాలి పుష్పలత, లాయర్‌పేట, ఒంగోలు

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

పుస్తక పరిచయం

పూలెందుకు సమ్మె చేస్తాయో తెలిసిన కవి ఏటూరి నాగేంద్ర

ప్రతులకు
ఏటూరి నాగేంద్రరావు
26-3-397, మొదటి అంతస్థు, జ్యోతినగర్ మొదటి లైన్, వేదాయపాళెం, నెల్లూరు - 524 004,
చరవాణి : 74166 65323

కావలి రైల్వేశాఖలో ఉద్యోగం ఆయన వృత్తి. కళారంగంతో నిరంతర సాన్నిహిత్యమూ - కవితా రంగంతో నిరంతర కరచాలనం ఆయన ప్రవృత్తి. నేటి తెలుగు కవితాకాశంలో వెలిగే కవితారల్లో ఒక కాంతి తారగా ప్రకాశిస్తున్న నాగేంద్రరావు గారు నెల్లూరు జిల్లాలోని అగ్రగణ్య కవుల్లో ఒకరు. నాటకరంగంతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉన్న కవిత్వపు కౌగిలిని వదలని ఏటూరి నాగేంద్రరావు గారు ఈపాటికే రేపటి గీతం, మనిషి వాసన అనే కవితా సంపుటాలను వెలువరించి ఆంధ్ర కవి లోకంలో గర్తింపూ, సహృదయ పాఠకుల మెప్పూ పొందారు. ఢమరుక్కులు అనే ఒక లఘు కవితా ప్రక్రియను ప్రయోగాత్మకంగా సృష్టించి విజయం సాధించారు. ఇదుగో ఇప్పుడు ‘‘పూవులు సమ్మె చేస్తాయి’’ అనే కవితా కదంబాన్ని తాజాగా వెలువరించి మన ముందుంచారు.
‘‘పూవుల సమ్మె చేస్తాయి’’ అనే శీర్షికే విరోధాభాసంగా వుంది గదూ. కరుణశ్రీ అన్నట్లు తమ ‘వెలలేని ముగ్ధ సుకుమార సుగంధ మకరంద మాధురీ జీవితమెల్ల’ మన కోసం త్యాగం చేసి ‘కృశించి నశించి’ పొయ్యేవి గదా పూలు. ఎవరు కోసుకుని దోసిట్లోకి తీసుకున్నా మధుర పరిమళాలను పంచేవి గదా పూలు. అవి సమ్మే చేయడమేమిటి అనే అనుమానం ఎవరికైనా కలగడం న్యాయమే. కానీ ఏంచేస్తాం. ఇవ్వాళ మనిషే తన మానవత్వానికి వీడ్కోలు చెప్పేశాడు గదా. ‘‘మనిషి తనం లోంచి ఆత్మీయత లోపించి అంగుష్ఠమాత్రుడై పొయ్యాడు గదా’’. ‘‘పలకరింతల చిరునవ్వు పూలు రాలిపోయి ఆకులు రాలిన చెట్టైపొయ్యాడు గదా’’ ‘‘అనుబంధాల జల ఇంకిపోయిన ఏరై పొయ్యాడు గదా’’. కలలు కూలిపోయిన శిధిలాల మధ్య ఆకాశాన్ని సంకుచితం చేసుకున్న పక్షి అయిపొయ్యాడు గదా... ఇంత దారుణంగా పతనమైపోయిన మనిషిని చూసి పూలు సమ్మె చేయకేం చేస్తాయి. పైన ఉటంకించిన పాదాలన్నీ ఈ కవితా సంపుటంలోని ‘మంచులా కరిగిపోయయిన మనిషి’ అనే కవితలోవి. మానవుని విశ్వాస ఘాతుకత్వానికి చలించిపోయి కవి రాల్చిన అక్షరాశ్రు బిందువుల సందోహం ఈ కవిత.
నిన్నటిదాకా మనం గొప్పవి అనుకొన్న విలువలన్నింటికి ఇప్పుడు వెలలే ఉన్నాయి గాని విలువల్లేవు. ఇది నాది, నా భారతీయత నాకిచ్చిన వారసత్వ సంపద అని చెప్పుకోదగిన సంస్కారమంతా పడమటి గాలి తాకిడికి కొట్టుకుపోయి మన సమాజం తన అస్తిత్వానే్న ఆవిరి చేసుకుంటున్నది. ‘‘నా ఆకాశం నిండా ఇప్పుడు కోటి పడగల నాగు కమ్ముకుంది’’ అని వాస్తవాన్ని సరిగ్గానే అవగాహన చేసుకున్నాడు నాగేంద్రరావు (కోటిపడగల నాగు)
ఈ దేశంలో ఎప్పుడైనా వృద్ధాశ్రమాలుండేవా. వయస్సు మళ్లిన తల్లిదండ్రులు అపార అనుభవంతో కుటుంబానికి మార్గనిర్దేశనం చేస్తూ అనురాగాన్ని అందిస్తుండేవారు కదా. ఇప్పుడొ.. ‘‘ ఇక మాట్లాడకండి.. అమ్మను మర్చిపోయిన వృద్ధాశ్రమ నిర్మాతలం మనం. అమ్మ నేర్పిన పలుకుబళ్లను సైతం పరాయికరణకు అంకితం చేశాం’’ అని కోప్పడుతున్నాడు అంటే కవైన వాడు కోప్పడడూ మరి (వృథా)
వందకోట్ల జనాభాకు అన్నంపెట్టి ‘‘ఖాళీ బొచ్చెతో ఎదురుచూస్తున్న’’ అన్నదాతను చూస్తూ, అతని ‘‘పొలాల్లో పల్లేర్లు పండటాన్ని’’ చూస్తూ ‘‘దేశపు వెనె్నముకలోకి ఆత్మహత్యల పిరికి మందును ఇంజక్ట్ చేస్తున్న దేశద్రోహాన్ని’’ చూస్తూ - ‘‘నేనిప్పుడు కలాన్ని మార్గనస్పర్శ చేయలేను. అక్షరాల పూలు వెదజల్లలేను. అయ్యా నన్ను క్షమించడం’’ అంటూ కన్నీళ్ల భాండమై ఆక్రోశించే ఈ కవి గుండె ఎంత సుకుమారమో అర్ధం కావడం లేదూ (మరణించిన వాక్యంతో).
అయితే ఈనాటి ఈ దుర్గతి దానంతటదే సమసిపోతుందా ఏ ప్రయత్నమూ లేకుండానే ‘‘కాలం వేసే కాటు ఎవర్నైనా గిరాటు వేయవచ్చు. కాలుష్యానికి చికిత్స చేయకపోతే అది భూగోళానే్న మింగేస్తుంది’’ అని హెచ్చరిస్తున్నాడు (రాచపుండు) ‘‘ ఎక్కడైనా బ్రతుకు యుద్ధమేనని, యద్ధం మాత్రమే మనిషిని బ్రతికిస్తుందనీ’’ ప్రకటిస్తున్నాడు ( ఎక్కడైనా బ్రతుకు యుద్ధమే).
అనూహ్యంగా మారిపోయిన ప్రాధమ్యాల నేపథ్యంలో తానూ కొట్టుకుపోతూ తన సహజత్వాన్ని కొంచెం కోల్పోతున్నాడు గాని, వస్తుతః మనిషి మంచివాడే. అతనికి స్వస్వరూప జ్ఞానాన్ని కలిగించి, అతనిలోని మళ్లీ మానవత్వాన్ని ఇంజెక్టు చెయ్యడం కవి కర్తవ్యం. ‘‘అనుకుంటాం గాని శిల కన్నా కఠినుడని - తాకితే తటాలున కరిగే మంచు ముద్ద మనిషి’’ ‘‘బొడ్డు పేగు విత్తుగా నాటినప్పటి నుండీ నేల మీద నడిచే చెట్టు గదా మనిషి’’ - అంటాడు ‘నడిచే చెట్టు’ అనే కవితలో. మనిషి మీద కోపం లేదు కవికి. అతను తన సంస్కారాన్ని కోల్పోతున్న తీరు మీదనే కోపం. అందుకనే ‘‘కౌగిలించుకున్న వేళ అణువణువులోనూ ప్రాణ వేడిని పంచగలిగినవాడే మనిషి’’ అంటూ మనిషిని పరిచయం చేస్తాడు (పరిచయాత్మ). నిజమే మనం నిరాకరించాల్సింది పాపాల్నే కాని పాపుల్ని కాదు గదా.
‘‘పూలు సమ్మె చేస్తాయి’’ అనే ఈ కవితా సంపుటిలో పైన తెలిపినవే గాక చాలా వైవిధ్యమైన కవితలున్నాయి. ‘పుష్పించడమే తెలిసిన పూలమొక్కకు వాడి రాలినా పరిమళం వీడదు. నిజంగా అమ్మలందరూ పిచ్చి తల్లులే’’ అంటాడు ‘ ఎదురుచూసే కళ్లు’ అనే కవితలో, బిడ్డ కోసం ఎదురెదుర్లు చూసే తల్లిని కళ్లక్కట్టిస్తూ. ‘నా బాడీలో ఎక్కడా ఖాళీ లేదు.. ఇప్పుడు నా దేహమంతా చెరుకుగడే’ అంటాడు సుగర్ వ్యాధిగ్రస్తుతను వివరిస్తూ (తీపి చెద)
ప్రపంచంలో చాలా ప్రాంతాలకు లేని అదృష్టం నెల్లూరుజిల్లాలోని ‘నేలపట్టు’కు ఉంది. ఉత్తర ధృవప్రాంతపు సైబీరియా నుంచో, దక్షిణపు ఆస్ట్రేలియా నుంచో అందాల రెక్కలు అల్లార్చుకుంటూ ఫ్లెమింగోలూ పెలికాను పక్షులూ వచ్చి తమ అందాలతో, తమ కిలకిల స్వరాలతో ఆ నేలపట్టును గొప్ప సౌందర్య సంగీతమయం చేస్తాయి. ‘‘ఆకాశానికీ సముద్రానికీ మధ్య ఇంద్ర ధనూ రంగవల్లికల ఆక్షేపణీయాత్ర’’గా వస్తాయట అవి. ‘‘మధూకల కంఠ పరస్పర నాద నినాదాల హోరు పంచరంగుల సింఫోని’’ అట. ‘‘బంజరు భూముల్లో మీ కోసం కోటి కళ్ల దీపాలతో నిరీక్షిస్తున్నాయి’’ - అంటూ వాటికి ఎంత హృద్యంగా ‘‘ ఆహ్వానగీతం’’ పలుకుతున్నాడో చూడండి.
‘నా మట్టిని ప్రేమించిన ప్రియ విహంగమా! నా రంగుల రామచిలకా! నా నల్లకాళ్ల కొంగా! నా ఎగరేసిన గాలిపటమా! నా లకుముకి పిట్టా! గాలికెరటాలకు సముద్ర తరంగాలకూ సంధి కుదురుస్తూ సామూహిక యాత్ర సాగిస్తున్న భారతీయ ఖగరాజమా! నా ఫ్లెమింగో! పెలికాన్ కళ్లలో సంతాన పరంపరల కలలను పొదిగిన రాణీ! అలివేణీ!! రా! నీకు స్వాగతం’’ అంటూ కవన పరవశమైపోతాడు - నాగేంద్రరావు అచ్చమైన కవి. భావుకుడైన మనస్వి.
ఈ సంపుటిలోని కవితలు చదవడం నిజంగా చక్కటి అనుభూతి. ఏటూరి నాగేంద్రరావుకు అభినందనలు తెలుపుతూ కవిత్వ ప్రియంభావుకులను ఈ కవనఝరిలో ఓలలాడడానికి ఆహ్వానిస్తున్నాను.

- సిహెచ్.వి.బృందావనరావు
భక్తవత్సలనగర్, నెల్లూరు
చరవాణి : 9963399189

మనోగీతికలు

తరులకిదే
నా వందనం
గాలినిస్తూ, నీడనిస్తూ
పరులకి సేవలందిస్తూ
జగతినంతటిని ఆక్రమిస్తూ
ప్రగతి పథానికి ముందు నిలిచిన
తరులకిదే నా వందనం

శాంతమూర్తులు, స్వార్థరహితులు
ప్రాణసఖులు, జ్ఞాన ప్రదాతలు
కాయనిచ్చి, గడువునిచ్చి
కష్ట సమయంలో నీడగ నిల్చిన
తరులకిదే నా వందనం

సురులకైనా, అసురులకైనా
సాధువులకైనా, దుర్మార్గులకైనా
భేద భావము చూపించక
క్షమా, ధైర్యములను పెంచి పోషించు
ధీరుని వలె నిరంతరం ఎదుగుతూ
ఎన్నో సంవత్సరాలుగ సేవలందించే
స్వయం సేవకులనంగు
తరువులకిదే నా వందనం

సభ్యతా, సంప్రదాయాలు
నాగరికతా, చరిత్రలకు
ఆచార వ్యవహారాలకు
పురాణాలు, బ్రాహ్మణికాలు
వేదాలు, వాదాలు
కులమతాల కుమ్ములాటలకు
మహాభారత సంగ్రామాలకైనా
పురుడు పోసిన పుణ్యమూర్తులగు
తరులకిదే నా వందనం

కవుల కలాల కవితలైనా
గాయకుల గళాల తీయనైనా
కోకిలమ్మల కమ్మని పాటలకైనా
కళాకారుల కళలకైనా
చిత్రకారుల కుంచెలకైనా
మహా రచయితల కధావస్తువులైనా
నవరసాలు పండించు నాటకమైనా
పలురకాల పాత్రల జీవమిచ్చు
తరులకిదే నా వందనం

ఎంతమంది దాతలున్నా
ఎంతమంది నేతలున్నా
ఎంతమంది హితులున్నా
మరి ఎంతమంది త్యాగశీలురున్నా
సత్యధర్మ అహింసామూర్తులు
అనునిత్యం సదా
బోధించే గురుతుల్యులు
తరువులకి తరువులే సాటి
అట్టి తరులకిదే నా వందనం
వేనవేలు శుభాభివందనం.

- లక్కరాజు శ్రీనివాసరావు,
అద్దంకి
చరవాణి : 9849166951

కలికాలం
ఇది ఎండాకాలమా కాదు
వానాకాలమా కాదు కాదు
చలికాలమా కానే కాదు
మరి ఇది ఎలాంటి కాలం?
ఋతువులు అన్ని మారిపోయిన కాలం
సుఖసంతోషాలు దూరమైన కాలం
ఇది జనాల కడుపు మండే కాలం
ప్రజల ఊపిరి తీసే కాలం
ముసలి ముతకను తీసుకుపోయేకాలం
ఏ వస్తువు కొనలేని కాలం
ధరలు నియంత్రణ లేని కాలం
అందరు అప్పులతో అల్లాడుతున్న కాలం
నిజాయితీ కూసంత లేని కాలం
ఏ ప్రభుత్వము పట్టించుకోని కాలం
ఏ సర్కారు వచ్చిన బతుకులు మారని కాలం
వస్తుందేమో చూడాలి
మంచికాలం
మంచి రోజులు వస్తాయో రావో చెప్పలేని కాలం
హాయిగా బతకాలి అందరూ
కలకాలం
జనం చూస్తూ ఉంటారా ఎల్లకాలం
అందుకే అన్నారు దీనిని కలికాలం
కలికాలం! కలికాలం! కలికాలం!

- వి నారాయణభట్, కావలి
చరవాణి : 9030130488

కాలేజీ లైఫ్
ఉదయించే సూర్యుని కిరణమేగా
కాలేజి ప్రయాణం
జీవితంలో మరెప్పుడూ రాదుగా
ఇంతటి మంచి తరుణం
భవిష్యత్‌కి పునాది వేయాల్సింది
ఇదే అసలైన సమయం
లక్ష్యాన్ని సాధించి తీరుతాం
అది ఎంతటిదైనా గగనం
సరదా ఐనా సంతోషమైనా
కాలేజీ లైఫేగా అది నిజం
అల్లర్లన్నీ పుట్టేది ఈ వయసులోనే
అసలైన విద్యార్థికి జననం
విద్య విలువైనదని తెలుసుకోవడమే
జగమెరిగిన జీవిత సత్యం
విజ్ఞానం పరిమితం కాకుండా చూడాలి
ప్రతి ఒక్కరికీ అనునిత్యం

- కె మురళీమోహన్‌రాజు
చరవాణి : 9866179385

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net