ఎడిట్ పేజీ

త్రిపుర సంబరాల్లో మోదీకి బాబు షాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత పాతికేళ్లుగా సీపీఎంకు కంచుకోటగా ఉన్న త్రిపురలో అఖండ విజయం సాధించిన భాజపా దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకొన్నది. ‘ప్రజా నాయకుడి’గా పేరొంది సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న మాణిక్ సర్కార్ ప్రభుత్వాన్ని భాజపా కూల్చివేయడం ఘన విజయమని చెప్పుకోవాలి. గత అసెంబ్లీ ఎన్నికలలో ఒకచోట తప్ప అన్ని చోట్లా డిపాజిట్లు కోల్పోయి, ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెల్చుకోలేని త్రిపురలో మూడింట రెండు వంతుల ఆధిక్యతతో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలగడం ఘనమైన అంశమే. బిజెపి-సిపిఎంల మధ్య ఓట్ల తేడా 0.3 శాతమే అయినప్పటికీ, ఎన్నికలలో అంతిమంగా ఎవరెన్ని సీట్లు పొందారన్నది మాత్రమే ప్రధాన అంశం కాగలదు. త్రిపురతోపాటు నాగాలాండ్‌లో కూడా భాజపా అధికారంలోకి రావడం, కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలను మాత్రమే గెల్చుకున్న మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన కాంగ్రెస్‌ను అధికారంలో కొనసాగించకుండా ప్రభుత్వం ఏర్పాటులో కీలకపాత్ర వహించడం గమనిస్తే దేశంలో ఇప్పుడు బిజెపికి ఎదురే లేదనే అభిప్రాయం నెలకొన్నది. ఇప్పుడు 22 రాష్ట్రాలు బిజెపి పాలనలో ఉన్నట్లయింది. అయితే, ఈ సంబరాలు ఎంతోకాలం నిలబడలేదు. ‘సంపూర్ణ అధికారం’ దిశలో ఉన్నప్పుడు హుందాతనం, బాధ్యతాయుత ప్రవర్తన పెరగాలి. ఆ విధంగా కాకుండా అహంకారం ప్రవేశిస్తే ఆత్మహత్యా సదృశం కాగలదు.
త్రిపురలో భాజపా గెలవగానే మూడు రాష్ట్రాలలో నాలుగు విగ్రహాలు ధ్వంసం కావడం, విగ్రహాల కూల్చివేతను సమర్థిస్తూ త్రిపుర గవర్నర్ ‘ట్వీట్’ చేయడం విస్మయకరం. అదేమంటే వామపక్షాలు జరిపిన హింసాయుత చర్యలను ఆయన గుర్తు చేస్తున్నారు. విదేశీయుడైన లెనిన్ విగ్రహాలను మనదేశంలో కూల్చివేస్తే అంతగా బాధపడాలా? అంటూ బిజెపిలో కీలక పదవులలో ఉన్నవారే ప్రశ్నలు లేవదీశారు. ఇటువంటి అహంకార ధోరణి పార్టీకి, ప్రభుత్వానికి ప్రమాదకారి కాగలదని గ్రహించడానికి ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాలకు 48 గంటల సమయం పట్టింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇదే సమయంలో ఎన్డీయేలో ఎంపీల సంఖ్య దృష్ట్యా మూడో అతి పెద్ద పార్టీ అయిన తెలుగుదేశం కేంద్ర మంత్రివర్గం నుండి వైదొలగడం- 2019 ఎన్నికలలో బిజెపి అవకాశాలను ప్రశ్నార్థకం చేస్తుందని చెప్పవలసిందే. ఇప్పుడు బిజెపికి విజయ బావుటాలు ఎగురవేస్తున్న మొత్తం ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న లోక్‌సభ స్థానాలతో సమానంగా 25 సీట్లు ఏపీలో ఉండటం గమనార్హం. ఏపీలో టిడిపికి 15 మంది, భాజపాకు ఇద్దరు లోక్‌సభ సభ్యులున్నారు. టిడిపి తమతో బంధం తెంచుకుంటే వైసిపి చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నదని బిజెపి నాయకులు మొన్నటి వరకూ భరోసాతో ఉంటూ వచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీతోనే చేతులు కలుపుతానని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేయడం ఒక విధంగా బిజెపికి అశనిపాతమే! ఈ పరిస్థితులలో వైసిపి క్రమంగా కాంగ్రెస్‌కు సన్నిహితంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఏపీలో బిజెపి ఒంటరిగా పోటీ చేయవలసి వస్తుంది. ప్రత్యేక హోదా అంశం రాష్ట్ర ప్రజలలో తీవ్రమైన ఆవేశాలను, భావోద్వేగాలను రగిలించడంతో ఇప్పుడున్న పరిస్థితులలో బిజెపి ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీట్లో కూడా విజయం సాధించే అవకాశం ఉండదు.
ఎన్‌డిఏలో భాగస్వామిగా ఉన్న శివసేన పార్టీ 2019 ఎన్నికలలో బిజెపితో కలిసి పోటీచేసే ప్రసక్తే లేదని గతంలోనే ప్రకటించింది. మరో మిత్రపక్షం అకాలీదళ్ కూడా బిజెపి వ్యవహారం పట్ల అంత సంతృప్తికరంగా లేదు. బిహార్‌లో తిరిగి బిజెపితో చేతులు కలిపిన తర్వాత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బలహీనుడవుతున్నట్లు కనబడుతున్నది. మాజీ ముఖ్యమంత్రి జితన్‌కుమార్ మాంఝి ఈ మధ్యనే ఎన్డీయే నుండి వైదొలిగి ప్రతిపక్ష ఆర్జేడీతో చేతులు కలిపారు. బిజెపి అధికారంలో ఉన్న రాజస్థాన్‌లో ఆ పార్టీ బలహీన పడినట్లు ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడి చేస్తున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానాలో కూడా పరిస్థితులు బిజెపికి ప్రతికూలంగా మారుతున్నాయి. ఇటువంటి పరిస్థితులు సహజంగానే కాంగ్రెస్‌కు కోలుకొనే అవకాశాలు కల్పిస్తాయి. ఉత్తరప్రదేశ్‌లో రెండు లోక్‌సభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలలో ఎస్పీ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్న బిఎస్పీ అధినేత్రి మాయావతి రాజ్యసభ, శాసనమండలి ఎన్నికలలో సైతం ఇతర ప్రతిపక్షాలతో అవగాహనకు వస్తున్నారు. ఈ అవగాహన బిహార్‌లో వలే ‘మహాకూటమి’ ఏర్పాటుకు దారితీస్తే బిజెపి గడ్డుకాలం ఎదుర్కొనక తప్పదు.
సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ప్రధాని మోదీ ప్రజాకర్షణకు తట్టుకోగల నాయకుడు గానీ, పార్టీగాని దేశంలో మరొకటి లేదనే అభిప్రాయం బలంగా ఉంటూ వచ్చింది. రాహుల్ కాం గ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టడానికి రెండేళ్లకు పైగా తాత్సారం చే శారు. అయితే గుజరాత్ ఎన్నికలలో బిజెపి బలం తగ్గడంతో పరిస్థితులు నాటకీయంగా మా రుతున్నాయి. బిజెపి నేతలు కూడా మోదీ ప్రజాకర్షణపై ఆధారపడలేక పోతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు డిమాండ్ పెరుగుతున్నది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించలేక పోవడం, వ్యవసాయరంగంలో సంక్షోభాన్ని ఎదుర్కోలేక పోవడం, ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచలేకపోవడం వంటివి మోదీ పట్ల ఆకర్షణ తగ్గుముఖం పట్టడానికి ప్రధాన అంశాలని చెప్పవచ్చు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొనే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వార్షిక బడ్జెట్‌ను రూపొందించినా ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేక పోతున్నట్లు నెల రోజులుగా దేశంలో జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు టోపీ పెట్టిన ఆర్థిక నేరస్థులు దొరలుగా దేశం విడిచి వెళ్లిపోతూ ఉండడం, వారికి ప్రభుత్వంలోని పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తూ ఉండడంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతున్నది. నాలుగేళ్ల క్రితం నాటి యుపిఎ ప్రభుత్వంపై నిందలు మోపుతూ కాలం గడపలేమని బిజెపి నేతలు గ్రహించాలి. కార్తీ చిదంబరంను అరెస్టు చేయడంలో చూపిన శ్రద్ధ- బిజెపి నేతలపై వస్తున్న ఆరోపణల విషయంలో కనీసం విచారణకు కూడా సిద్ధం కాకపోవడం ద్వంద్వ ప్రమాణాలను సూచిస్తోంది. తెలుగు దేశంతో బిజెపి బంధం తెగిపోవడానికి ‘రాజకీయ యాజమాన్యం’ చేయగల సమర్ధత బిజెపి నాయకత్వంలో లోపించడమే అని భావించక తప్పదు. రాజకీయ నిర్ణయాలు తీసుకోవలసిన చోట- అధికారంలో ఉన్నవారికి భజన చేస్తూ పబ్బం గడుపుకునే అధికారులకు ప్రాధాన్యత ఇస్తూ ఉండడం కారణంగా మోదీ ప్రభుత్వం ప్రజలలో అవహేళనకు గురవుతున్నది. ఉదాహరణకు ఏపీకి ‘ప్రత్యేక హోదా’ విషయమే తీసుకోండి. రాష్ట్ర విభజన బిల్లు సందర్భంగా ఈ అంశాన్ని లేవనెత్తింది అప్పటి బిజెపి నాయకులైన వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ మాత్రమే. ‘హోదా’ వల్ల మొత్తం ప్రజానీకానికి ఎంతో మేలు జరుగుతుందనే ‘దురభిప్రాయం’ కల్పించారు. అందుకు ‘వీరోచితంగా’ పోరాడామని నాడు ప్రచారం చేసుకున్నారు. వారి వత్తిడి మేరకే నాటి ప్రధాని డా.మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇవ్వడమే కాకుండా కేంద్ర మంత్రివర్గం చేత ఆమోదింపజేసి, తగు చర్యలు తీసుకోమని ప్రణాళికా సంఘాన్ని ఆదేశించారు కూడా.
తాము అధికారంలోకి వస్తే ఐదేళ్లు కాదు పదేళ్లపాటు ఏపీకి ‘ప్రత్యేక హోదా’ కల్పిస్తామని వాగ్దానం చేసిన బిజెపి తీరా అధికారంలోకి వచ్చాక- గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరచకుండా నీరు గార్చింది. సరిగ్గా 18 నెలల క్రితం 14వ ఆర్థిక కమిషన్ సిఫార్సు మేరకు ‘ప్రత్యేక హోదా’ ఇవ్వలేక పోతున్నామని, అంతకన్నా మెరుగైన ‘ప్రత్యేక ప్యాకేజి’ ఇస్తున్నామని అర్ధరాత్రి వేళ జైట్లీ ప్రకటించారు. అయినా ఆ తరువాత ఆ దిశలో ఒక్కడుగు కూడా ముందుకు వేయకపోవడంతో సహజంగానే ఏపీ ప్రజలలో తీవ్ర అశాంతికి దారితీసింది. ప్రత్యేక హోదా ఇవ్వవద్దని తాము ఎటువంటి సిఫార్సులు చేయలేదని స్వయంగా ఆ కమిషన్ చైర్మన్ వై.వేణుగోపాల్‌రెడ్డి పలుసార్లు చెప్పినా నిస్సిగ్గుగా అవే అబద్ధాలని ఇంకా ఆడుతున్నారు. ఈ విషయమై రాజకీయ ప్రసంగాలు చేయకుండా, నిర్దిష్టంగా కొన్ని చర్యలు తీసుకోబోతున్నట్లు జైట్లీ ప్రకటించి ఉంటే పరిస్థితులు కొంతమేరకు అదుపులోకి వచ్చేవి. చివరకు బిజెపి నాయకులు కలిసినా ‘నేను చేయవలసింది అంతా చేశా.. ఇంకా కావాలంటే అమిత్‌షా నుండి ఉత్తరం తీసుకురండి’ అంటూ అహంకార స్వరంతో ఆయన సమాధానమివ్వడం సున్నితమైన రాజకీయ అంశాలపట్ల ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యధోరణిని వెల్లడి చేస్తుంది.
మరోవంక ‘ప్రత్యేక హోదా’పై ప్రజలలో భావోద్వేగాలు రగిలించడానికి దాదాపు అన్ని రాజకీయ పక్షాలూ సిద్ధపడుతున్నాయి. దాని వల్లన సమకూరే ప్రయోజనం ఏమిటనే అంశంపై ఎవ్వరికీ అవగాహన ఉన్నట్లు కనిపించదు. అటువంటి హోదా లభించిన పలు రాష్ట్రాలు దాని వల్ల చెప్పుకోదగిన అభివృద్ధి సాధించడం లేదని ఒక వంక చెప్పుకొంటూ తిరిగి అదే కావాలని అనడం ఏమిటి? ప్రస్తుతం కేంద్రం సమకూరుస్తున్న 60 శాతం నిధులకు బదులు, హోదా ఉంటే 90 శాతం సమకూర్చుతుందని, హోదా లేకపోయినా ఆ మేరకు ఆర్థిక సహాయం అందిస్తామని జైట్లీ చెబుతున్నారు. ఆ మాట విని హోదా వద్దు, ప్యాకేజీ ముద్దు అనే ధోరణిని చంద్రబాబు కూడా ప్రదర్శించారు. అయితే ఇప్పుడు పరిశ్రమలకు రాయితీల మాట ఏమిటనే ప్రశ్న లేవదీస్తున్నారు. వాటికి రాయితీలు ఇస్తే యువతకు లక్షలాది ఉద్యోగాలు వస్తాయని వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వంటి వారు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేవారికి పన్నులు, విద్యుత్ చార్జీలలో భారీ రాయితీలు లభిస్తాయి. కానీ అటువంటి పరిశ్రమల వల్లన స్థానికులకు చెప్పుకోదగిన ఉపాధి అవకాశాలు లభించవు. ఒక అంచనా ప్రకారం లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి పెడితే కేవలం మూడు వేల మందికి మాత్రమే ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దీనికి బదులు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి మరిన్ని నిధులు కోరినా, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల అభివృద్ధికి మరిన్ని రాయితీలు కోరినా రాష్ట్రం ఎక్కువగా ప్రయోజనం పొంది ఉండేది.
ప్రతిపక్ష ఎంపీలు రాజీనామాలు చేయరులే అనుకొంటున్న సమయంలో ఏప్రిల్ 6న రాజీనామాలు చేస్తున్నట్లు జగన్ ప్రకటించడంతో ఆత్మరక్షణలో పడిన టిడిపి అధినేత చంద్రబాబు కేంద్ర బడ్జెట్‌లో కొన్ని ప్రత్యేక కేటాయింపులు సాధించుకోవడం ద్వారా ప్రజలకు ముఖం చూపవచ్చులే అనుకున్నారు. అయితే ఈ విషయంలో జైట్లీ ఎటువంటి ‘రాజకీయ విజ్ఞత’ను ప్రదర్శించకపోవడంతో ఆత్మరక్షణలో పడిన టిడిపికి బంధం తెంచుకోవడం మినహా మరోమార్గం లేకపోయింది. ఇంతగా ఆందోళన జరుగుతున్నా ప్రధాని మోదీ అసలు పట్టించుకొనక పోవడం, సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోక పోవడం గమనిస్తే రాజకీయ చొరవకు బదులు వెనుకడుగు వేస్తూ బిజెపి తీవ్రంగా నష్టపోతున్నట్లు స్పష్టం అవుతున్నది.
చర్చలకు టిడిపి ప్రతినిధి వర్గాన్ని ఢిల్లీకి ఆహ్వానించిన బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా ఆ భేటీకి మొఖం చాటేసి, జైట్లీకి అప్పచెప్పడం ద్వారా టిడిపిని వదిలించుకోవడం కోసం బిజెపి సైతం ఎదురు చూస్తున్నదా? అనే అనుమానం కలుగుతున్నది. త్రిపుర విజయం తర్వాత పశ్చిమబెంగాల్, ఒడిశా, కేరళలో కూడా విజయం సాధిస్తే బిజెపికి స్వర్ణయుగమే కాగలదని అమిత్ షా పేర్కొనడం గమనార్హం. అంటే బిజెపి ప్రాధాన్యతలలో రెండు తెలుగు రాష్ట్రాలు లేవు. ఇక్కడ సమీప భవిష్యత్తులో అధికారంలోకి రాగలమనే నమ్మకం భాజపాకు లేదు. అందుకనే ఈ రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే అంశాల పట్ల మొదటి నుండి మోదీ ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోంది.
విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడంలో జరుగుతున్న జాప్యం ఈ అంశాన్ని వెల్లడి చేస్తున్నది. ఒడిశాలో అధికారంలోకి రావడం కోసం ఆరాట పడుతున్న బిజెపి రైల్వే జోన్ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఉద్దేశ పూర్వకంగానే నిర్లక్ష్యం వహిస్తున్నది. పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల పునరావాసం కోసం రూ.30 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టవలసి ఉండగా ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా కేటాయించకుండా, సుమారు రూ.5000 కోట్లు నిర్మాణం కోసం ఇచ్చామని జైట్లీ గొప్పలు చెప్పుకోవడం విస్మయం కలిగిస్తున్నది. చంద్రబాబు, అరుణ్ జైట్లీ- ఇద్దరూ వాస్తవాలను మరుగున పరచి, రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నిర్లక్ష్య ధోరణులను అనుసరిస్తున్నట్లు చెప్పక తప్పదు.

- చలసాని నరేంద్ర సెల్ : 98495 69050