మెయన్ ఫీచర్

మోదీజీ.. ‘నోట్’ దిస్ పాయంట్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధాని మోదీ హఠాత్తుగా ప్రకటించిన పెద్దనోట్ల రద్దు నిర్ణయం ప్రభావం దాదాపు అన్ని రంగాలనూ తాకింది. ఇపుడు జేబులో వెయ్యిరూపాయల నోటున్న వాడి కంటే వందరూపాయలున్న వాడే ధనవంతుడి కింద లెక్క. దేశ ఆర్థిక రంగాన్ని కుదిపేసేలా మోదీ ప్రకటన వెలువడిన రాత్రి- వెంటనే మెజారిటీ ప్రజలు స్వాగతించారు. నల్లధనంతోపాటు, నకిలీ కరెన్సీపై మోదీ చేసిన ‘సర్జికల్ స్ట్రైక్’గా దీన్ని అభివర్ణించారు. ఆ భావన మరుసటి రోజు ఉదయం వరకూ కొనసాగింది. కానీ, ఆ తర్వాత జనం అభిప్రాయంలో మార్పు వచ్చింది. ఎవరైతే మోదీ నిర్ణయాన్ని ‘్భష్’ అన్నారో వాళ్లే తమ జేబుల్లో వంద నోట్లు లేకపోవడంతో విమర్శలకు దిగారు. వారి అభిప్రాయం మారడానికి పెద్దగా సమయం పట్టలేదన్నమాట. అనుభవమైతే గానీ తత్వం బోధపడదు. పెద్దనోట్ల రద్దుపై ప్రజాభిప్రాయమూ అదే.
ఈ అంశంపై రచయితలు, మేధావుల సొంత అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకూడదు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికీ అనుభవంలో ఎదురయ్యే సమస్య. ఆకలితో అలమటిస్తుంటే- ‘్భరత్ వెలిగిపోతోంద’ని ప్రచారం చేసుకుంటున్నట్లు ఉంటుంది. నిరుపేద నుంచి కోటీశ్వరుడి వరకూ నిత్యం ఎదుర్కొనేదే ఆర్థిక సమస్య. పెద్దనోట్లపై వేటుతో మోదీకి ప్రచారమైతే వచ్చింది గానీ, అది ఎక్కువకాలం నిలవకపోవడం బట్టి, ఆయన నిర్ణయం సరైనదా? కాదా? అని అంచనా వేయవచ్చు. వంద, ఏభై నోట్లే కాదు.. ఈరోజుల్లో సామాన్యుడి వద్ద కూడా పెద్దనోట్లు ఉండడం విడ్డూరం కాదు. ఈ నేపథ్యంలో రాత్రికి రాత్రి పెద్దనోట్లను రద్దు చేస్తే, సగటు జీవి జీవనం ఎంత దుర్భరంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. నగదు తీసుకోవడంలో విధించిన షరతులు సామాన్యులను ఏ విధంగానూ మెప్పించలేకపోతున్నాయి. తన డబ్బును తాను తీసుకునేందుకూ సర్కారు దాష్టీకమేమిటన్నదే అందరి ఆగ్రహం. ఈ ‘ఆర్థిక ఎమర్జెన్సీ’ నుంచి సగటు జీవి బయటపడేందుకు ఎన్నాళ్లు పడుతుందో చెప్పడం కష్టం. హిందూపురం మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ ఒక దాబాలో భోజనం చేస్తుంటే, అక్కడ 500 నోటు ఇచ్చిన ఓ వ్యక్తితో-‘నీకు భోజనం లేదు’ అని దాబా యజమాని పొమ్మన్నాడు. దీంతో స్పందించిన ఘనీ ఆ హోటల్ వాళ్లకి చీవాట్లు పెట్టి ఆ వ్యక్తికి భోజనం పెట్టించారు. నోట్ల రద్దు నిర్ణయం మనిషి ఆకలిపైనా ఎంత దుష్ప్రభావం చూపిందో ఈ ఉదంతం చెబుతోంది. సంస్కరణలు ఆకలి తీర్చాలే తప్ప, కడుపుకాల్చకూడదు కదా?!
కాగా, పాకిస్తాన్‌లోని పెషావర్‌లో ముద్రిస్తున్న మన నకిలీ కరెన్సీ ఇండియాలోకి భారీగా దిగుమతయ్యేందుకు సిద్ధంగా ఉందని, ఇప్పటికే దాదాపు 70 కోట్ల రూపాయల నకిలీ కరెన్సీ సరిహద్దు దాటిందన్న వేగుల సమాచారం మేరకే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారట! నిర్ణయానికి కారణాలేమైనా- మొత్తానికి ఇపుడు నల్లకుబేరుల అక్రమ సంపాదనకు గండిపడుతుందన్న భావన ప్రజల్లో లేకపోలేదు. ఎపి సిఎం చంద్రబాబు పెద్దనోట్ల రద్దు విషయమై చాలాకాలంగా మాట్లాడుతూనే ఉన్నారు. చాలా లేఖలు ఆయన ప్రధానికి రాశారు. బాబు సూచనను మోదీ గౌరవించినట్లు అర్థం చేసుకోవచ్చు. 500, 1000 నోట్లు రద్దు చేసిన మోదీ- 2,000 నోటు తీసుకురావడంతో నల్లధనం నివారణ ఎలా సాధ్యమవుతుందో సామాన్యులకు బోధపడటం లేదు. కొత్తగా వచ్చిన 2,000 నోటు పెను ప్రమాదం కదా? అన్న వారి సందేహానికి జవాబు ఇచ్చేవారు లేరు. ఇంతోటి దానికి ఉన్నవాటిని రద్దు చేయటం ఎందుకన్నవి సామాన్యుల సందేహాలు! పాక్ నుంచి వచ్చే నకిలీ కరెన్సీ, లక్షల కోట్లలో పోగుపడిన బ్లాక్‌మనీకి చెక్ పెట్టేందుకే తప్ప, దీనివల్ల అదనంగా సాధించిన ప్రయోజనమేమీ లేదన్నది సగటు పౌరుడి మనోగతం. కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెప్పినట్లు- ఇది ‘పిచ్చి తుగ్లక్’ నిర్ణయం అని కాకుండా, సగటు పౌరుడు మనస్ఫూర్తిగా మెచ్చని నిర్ణయంగానే ప్రస్తుతానికి అనుకోవాలి. 100, 50 నోట్లను నెల రోజుల ముందుగా విస్తృతంగా చెలామణిలోకి తెచ్చి, ఈ నిర్ణయం తీసుకుని ఉంటే ప్రజల్లో ఇంత అసంతృప్తి వచ్చేది కాదేమో?!
* * *
ఇప్పటివరకూ ‘కామెడీ’గా సా గిన ‘పవర్‌స్టార్’ పవన్ కల్యాణ్ మూడవ ఎపిసోడ్‌లో కాస్త గాం భీర్యం కనిపించింది. అనంతపురం సభలో ఆయన ప్రసంగాన్ని నిశితంగా గమనిస్తే అది భవిష్యత్తులో తెదేపాకూ ఓ హెచ్చరిక సంకేతమే! ఇప్పటివరకూ మోదీ సర్కారు, వెంకయ్య నాయుడు, తెదేపా ఎంపీలను మాత్రమే టార్గెట్ చేసిన జనసేనాధిపతి ఈసారి నేరుగా తెదేపా పార్టీ, సర్కారు, చంద్రబాబు విధానాలను నిలదీశారు. ఇక పవన్ లక్ష్యం చంద్రబాబేనన్నది రాజకీయాలపై కనీస అవగాహన ఉన్న వారికెవరికైనా అర్థమవుతుంది. ‘చంద్రబాబుపై నాకు ఇంకా నమ్మకం ఉంద’న్న పవన్ సన్నాయి నొక్కుల అసలు వ్యూహం ఆలస్యంగానైనా బయటపడింది.
ఇప్పటివరకూ బాబు ప్రాయోజిత కార్యక్రమం లో భాగంగానే పవన్ సభలు పెట్టి కేంద్రాన్ని విమర్శిస్తున్నారన్న భావన అందరిలో ఉంది. అందరినీ చాకిరేవు పెట్టి బా బును విడిచిపెట్టడం వల్ల, వారిద్దరి మధ్య కృష్ణార్జుల సంబంధాలేమైనా ఉన్నాయా? అనే అనుమానాలు సహజంగానే చర్చకొచ్చాయి. ఇప్పుడు చంద్రబాబును సున్నితంగానైనా సూటిగా ప్రశ్నించడం మొదలుపెట్టారంటే, ఇక పవన్ దృష్టి బాబు పాలన మీద పడినట్లే గ్రహించని వాడు అమాయకుడు కిందే లెక్క. అంతా అనుకున్నట్లు పవన్ ఏమీ ఆవేశపరుడు కాదు. అన్నీ ఆలోచించే ఒక్కొక్క అస్త్రం సంధిస్తున్నారు.
ఎపిలో బిజెపికి సర్వాధ్యక్షుడయిన వెంకయ్యపై పవన్ చాలాకాలం నుంచీ విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. అనంత సభలోనూ అదే కనిపించింది. ఆ స్థాయిలో పవన్‌కు ‘నెల్లూరు నాయుడు’గారి మీద కోపమెందుకో..? ఈమధ్య కాలంలో నాయుడుగారి సన్మానాల సిరీస్ చాలా భక్తిప్రపత్తులతో జరుగుతోంది. కాకినాడలో ‘తెలుగు బిజెపి’మంత్రి స్వయంగా జనాలను పురమాయిస్తే, దానికి హాజరయిన వారిలో 70 శాతం తెదేపా తమ్ముళ్లయితే మిగిలిన వారు కాషాయదళాలు! ప్రత్యేక హోదా సాధించకుండా, ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించకుండా ఏం సాధించారని ఈ సన్మానాలంటూ పవన్ విసురుతున్న మాటలకు, కమలదళాల నోట ఇప్పటివరకూ ఎదురుపలుకు లేదు. పవన్ లక్ష్యం లేని మిస్సైల్ లాంటి వాడు. అది ఎప్పుడు ఎటు మళ్లుతుందో అంచనా వేయడం కష్టం. అది గురి తప్పుతుందా? లక్ష్యాన్ని సాధిస్తుందా? .. ఇప్పుడే చెప్పలేం.
అయితే, పవన్ ప్రస్తావించిన రెండు ప్రధాన అంశాలు చాలా ప్రమాదకరమైనవి. ఒకటి తెదేపాలో అవినీతి, రెండు ఏకీకృత అభివృద్ధి. మంత్రులు, ఎమ్మెల్యేలు అందినకాడికి దండుకునే పనిలో ఉండగా, చాలామంది నేతల వారసులు నియోజకవర్గాల దోపిడీకి దత్తత తీసుకున్నారన్నది బహిరంగ రహస్యమే. ప్రతి తండ్రీ ధృతరాష్ట్రుడే కాబట్టి, తమ వారసులపై వచ్చే విమర్శలను వారు అంత సులభంగా అంగీకరించరు. అంతా పిల్లల రాజ్యమైంది. రాష్ట్రంలో ఇప్పుడు ‘పై నుంచి కింది వరకూ’ ఇదే జరుగుతోంది. పదేళ్లపాటు కష్టంలో ఆలంబనగా నిలిచిన వారి త్యాగాలను మరిచి, మూలాలను విస్మరిస్తున్న కొత్త తరం నేతలు, వారసుల హద్దులేని తనానికి మూల్యం చెల్లించుకోవలసింది పార్టీనే!
వైసీపీ కూడా ఇలాంటి అవినీతినే ప్రస్తావిస్తుంటే, ఆ పార్టీ తెదేపాకు శత్రువు కాబట్టి అలా ఆరోపణలు చేస్తుందనుకోవచ్చు. మరి పవన్ అధికారపార్టీకి మిత్రుడే కదా? ఆయన కూడా అలాంటి ఆరోపణలే చేశారు! అంటే పవన్ తెదేపాపై ప్రజాభిప్రాయాన్ని గమనిస్తున్నారని అర్థమవుతోంది. కృష్ణా,గుంటూరు జిల్లాల్లోనే అభివృద్ధి జరుగుతోందని, మిగిలిన ప్రాంతాలపై బాబు సర్కారు శీతకనే్నశారని వైసీపీ చాలాకాలం నుంచీ విమర్శిస్తోంది. ఇప్పుడు పవన్ కూడా అదే మాట్లాడారు కదా? వీటికి సమాధానం చెప్పకుండా, మరుగుజ్జులను ముందు పెట్టి కేవలం జగన్ విమర్శలకే జవాబు చెప్పడమంటే రాజకీయ వ్యూహం లోపించినట్టే లెక్క. పవన్ ప్రస్తావించిన ఈ రెండు అంశాలపై జనం మనోగతం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇది పార్టీకి నష్టమా? లాభమా అంటే కచ్చితంగా నష్టమేనన్నది సీనియర్ల మనోగతం. *

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144