మెయన్ ఫీచర్

‘రెండు ముఖాల’ బీభత్స రూపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నకిలీ డబ్బు భౌతిక బీభత్సం. నల్లడబ్బు ఆర్థిక బీభత్సం! ఇరుగు పొరుగున ఉన్న ప్రత్యక్ష శత్రుదేశాలు, ప్రచ్ఛన్న శత్రుదేశాలు నకిలీ నోట్లను మన దేశంలోకి తరలిస్తున్నాయి! ఆయా దేశాలలోని ‘ముఠాలు’ ముద్రించిన మన ‘కరెన్సీ నోట్లు’ దొంగ నోట్లు, నకిలీ నోట్లు.. పాకిస్తాన్‌లో మన ‘కరెన్సీ నోట్ల’ను ముద్రించి ‘జిహాదీ’ ఉగ్రవాదులు వాటిని మనదేశంలోకి తరలించుకొని వస్తున్నారన్నది ధ్రువపడిన వాస్తవం! కానీ, చైనాలో సైతం ‘ముఠాలు’ భారతీయమైన కరెన్సీ నోట్లను ముద్రించి మన దేశంలోకి చేరవేస్తూ ఉండవచ్చు! ఇది ప్రస్తుతానికి ధ్రువపడని వాస్తవం. చైనా ఉసిగొల్పుతున్న ఉగ్రవాదులు కూడా మన దేశంలో బీభత్సకాండను సాగిస్తున్నారు. పాకిస్తాన్ ప్రేరిత ‘జిహాదీ’లలో పాకిస్తాన్‌లోనే పుట్టి పెరిగిన వారున్నారు. మన దేశంలో పుట్టిపెరిగిన వారూ ఉన్నారు. చైనా ప్రేరిత ‘మావోయిస్టులు’ మన దేశంలోనే పుట్టిపెరిగినవారు! అందువల్ల చైనా ప్రేరిత బీభత్సకారులకంటే పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులకు నకిలీ డబ్బు అవసరం ఎక్కువ! ఎందుకంటే ఇక్కడ పుట్టిపెరిగిన చైనా చంక బిడ్డలకు, పాకిస్తాన్ తొత్తులకు ఈ దేశంలోనే డబ్బు లభిస్తోంది. అది నల్లడబ్బు కావచ్చు, నకిలీ డబ్బు కావచ్చు, బలవంతంగా వసూలుచేసినది కావచ్చు, కొల్లగొట్టినది కావచ్చు! సీమాంతర బీభత్సకారులకు నకిలీ డబ్బును మోసుకొని రావడం అనివార్యం. వారు పాకిస్తానీ కరెన్సీ నోట్లను మోసుకొని వచ్చినట్టయితే వాటిని ఇక్కడ మార్చుకొనడం కొంత కష్టం. ‘మార్పిడి’ముఠాలకిచ్చి మన ‘కరెన్సీ’ని పాకిస్తానీలు పొందవచ్చు. కానీ ఈ ‘మార్పిడి’ ముఠాలైనా చివరికి ‘ఆధికారిక వినిమయ’ వ్యవస్థ- ఫారిన్ కరెన్సీ ఎక్స్‌ఛేంజ్ సిస్టమ్- ద్వారానే మన ‘కరెన్సీ నోట్ల’ను పొందాలి! ఇదంతా గొప్ప శ్రమతో కూడిన వ్యవహారం. పట్టుబడే అవకాశాలు హెచ్చు. ఈ పాకిస్తానీ కరెన్సీలను మొదట ‘డాలర్లు’గానో, ‘యూరో’లగానో మార్చుకొని మన దేశంలోకి తరలించుకొని రావచ్చు! దీనివల్ల పట్టుబడే ‘ప్రమాదం’ తక్కువయినప్పటికీ ఇది కూడ కష్ట్భూయిష్టమే! పాకిస్తానీ ఉగ్రవాదులకు ఇది మొదటి సమస్య, రెండవది పాకిస్తాన్‌లోని ‘జిహాదీ’ సమర్ధకులు, సౌదీ అరేబియా తదితర దేశాల సంపన్నులు ఈ బీభత్సకారులకు ఇస్తున్న ‘విరాళాలు’ మన దేశంలో వారు పెడుతున్న ఖర్చులకు సరిపడకపోవచ్చు! అందువల్ల శూన్యం నుండి సంపదను సృష్టించే ‘నకిలీ’ ప్రక్రియను పాకిస్తాన్ ప్రభుత్వమే నిర్వహిస్తోంది. దొంగనోట్లను ముద్రించి వాటిని ‘జిహాదీ’లకిచ్చి మన దేశంలోకి తోలుతోంది! అందువల్ల ‘నకిలీ’ డబ్బు, ‘నకిలీ నోట్లు’ మన ఆర్థిక వ్యవస్థలోకి కలసిపోతున్నాయి. మన దేశంలో కూడా నకిలీ నోట్లను ముద్రించిన ముఠాలు నిరంతరం పట్టుపడడం చరిత్ర. మహానగరాల శివారులలో నిర్భయంగా ‘నకిలీ నోట్ల’ ముద్రణ కేంద్రాలను నిర్వహించిన విద్రోహులు పట్టుబడినారు, కానీ పట్టుబడని ‘ముఠా’లు ఎనె్నన్నో ఉండవచ్చు...
పాకిస్తాన్ ప్రభుత్వం వారి దుశ్చర్యలు బయటపడినంత త్వరగా చైనా దుశ్చర్యలు బయటపడడం లేదు. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పేరుపెట్టి విమర్శించినట్టుగా మన ప్రభుత్వాలు, ప్రచార మాధ్యమాలు చైనాను పేరుపెట్టడం లేదు. ఎందుకన్నది వేఱుకథ.. కానీ, చైనీయ నేరస్థులు మన దేశంలో వివిధ అక్రమాలు సాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎఱ్ఱగంధపుకట్టెలను దొంగరవాణా చేస్తున్న విదేశీయులలో అత్యధికులు చైనావారన్నది బహిరంగ రహస్యం. ఈ రక్తచందన వృక్షాల హత్యలు ఆగకపోవడానికి చైనాలో ఈ కలపకు పెరిగిన గిరాకీ ఒక ప్రధాన కారణం. పట్టుబడిన కలపను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేలం వేయిస్తోంది. ఈ వేలంలో కూడా చైనా వాణిజ్య సంస్థలు భారీగా ఎఱ్ఱచందనం కలపను కొంటున్నాయి. అయినప్పటికీ దొంగతనంగా ఎఱ్ఱగంధం చెక్కలను తరలించుకొని పోవడం చైనా మానడం లేదు! ఈ ప్రక్రియలో నల్లడబ్బు, నకిలీ డబ్బు విస్తరిస్తోంది! మన దేశం నుండి పులుల శరీర భాగాలను, ఆఫ్రికా నుండి ఏనుగు దంతాలను చైనా ప్రభుత్వ ప్రేరిత ఆర్థిక బీభత్సకారులు రహస్యంగా తరలించుకొని పోవడం నడుస్తున్న చరిత్ర! 2014 నవంబర్‌లో చైనా అధ్యక్షుడు ఝీజింగ్ పింగ్ టాంజానియా నుండి స్వదేశానికి తిరిగి వెళ్లిన సందర్భంగా, ఆయన బృందంలోని అధికారులు అనేక పెట్టెలలో ఏనుగు దంతాలను నింపి రహస్యంగా విమానాలకెక్కించి తీసుకుని వెళ్లారన్న ఆరోపణలు అంతర్జాతీయంగా ప్రచారమయ్యాయి. ఏనుగుల సంరక్షణ పట్ల తమకు గల నిష్ఠను నిరూపించుకొనడానికై గత మే నెలలో కెన్యా ప్రభుత్వం ఒకేచోట వందలాది టన్నుల ‘దంతాల’ను రాశులుగా పోసి నిప్పుపెట్టి దగ్ధం చేసింది. ఈ దంతాలన్నీ విదేశీయులు అక్రమంగా హత్యచేసిన ఏనుగులవేనట! ఈ విదేశీయులలో అధికులు చైనావారు! కానీ, ఆఫ్రికా దేశాలు ‘చైనా’ను పేరుపెట్టి నిందించలేకపోయాయి! ఇప్పుడు మన ప్రభుత్వం ‘నకిలీ డబ్బు’కు నిప్పుపెట్టగలిగింది! అయినప్పటికీ చైనాను నిలదీయలేక పోతోంది, పేరుపెట్టి నేరారోపణ చేయడం లేదు!!
నల్లడబ్బు పెరిగిపోతుండడానికి ప్రధాన కారణం వాణిజ్య ‘ప్రపంచీకరణ’. సంపన్న దేశాలు ప్రవర్ధమాన దేశాలను, బడుగు దేశాలను దోపిడీ చేయడానికి వీలుగా వ్యవస్థీకృతమైన వాణిజ్య మాధ్యమం పేరు ‘ప్రపంచీకరణ!’ సంపన్న దేశాల ప్రయోజనం ఏమిటన్నది సంపన్న దేశాలకు తెలుసు. సంపన్న దేశాల ప్రయోజనం ఏమిటన్న అవగాహనను మన దేశం వంటి ప్రవర్ధమాన దేశాలకు, బడుగు దేశాలకు కలిగించడమే ప్రపంచీకరణ! ఈ అవగాహన పెంపొందడం మన దేశపు అధిక విధానాలు అమెరికాకు, ఐరోపాకు, లాభం చేకూర్చడానికి దోహదం చేస్తున్నాయి. ఈ మొత్తం ప్రక్రియ ఫలితంగా మన దేశపు స్థూల జాతీయ ఆదాయం వాటా మొత్తం ప్రపంచ స్థూల ఆదాయంలో క్రమంగా తగ్గుతోంది! ఇలా తగ్గడానికి ఏకైక కారణం మన దేశపు ఆదాయం మొత్తం లెక్కలకు ఎక్కడం లేదు! విదేశాల నుండి వ్యాపించిన ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ మన దేశంలోని రాజకీయవేత్తలకు, దళారీలకు, అధికారులకు చెల్లిస్తున్న ‘లంచాలు’ నల్లడబ్బు రూపంలో నిక్షిప్తం కావడం ఒక వైపరీత్యం! ఇలా ‘లంచాల’ ప్రాతిపదికగా కుదిరిన ‘లాలూచీ’ ఫలితంగా ‘బహుళ జాతీయ సంస్థలు’ తమ వ్యయాన్ని అయిన దానికంటే అధికంగా చూపిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా అసలు వ్యయానికి, అధికారికంగా వాణిజ్య సంస్థలు ప్రకటించిన ఖర్చులకు మధ్యగల ‘తేడా’ నల్లడబ్బు రూపంలో నిక్షిప్తవౌతోంది! మన దేశంలో ఉన్నంతవరకు ఇది నల్లడబ్బు! ఫలితంగా మన స్థూల జాతీయ ఆదాయం- గ్రాస్ డొమిస్టిక్ ప్రాడక్ట్- జిడిపి- పరిమాణం ఉన్నదానికంటే తక్కువగా కనిపిస్తోంది! గత ఏడాది మన స్థూల జాతీయ ఆదాయం- జిడిపి- విలువ కోటి నలబయి ఏడు లక్షల కోట్ల రూపాయలని ‘అంతర్జాతీయ ద్రవ్యనిధి’ వారు తేల్చారు. గత ఏడాది ప్రపంచ స్థూల జాతీయ ఆదాయం నలబయి తొమ్మిది కోట్ల కోట్లు రూపాయలని అంతర్జాతీయ ద్రవ్యనిధి - ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్- ఐఎమ్‌ఎఫ్- వారు వెల్లడించారు. అంటే మన ‘జిడిపి’ వాటా మొత్తం ‘జిడిపి’లో మూడు శాతం కంటే తక్కువ! 1994లో ‘వాణిజ్యం, సుంకాల సాధారణ ఒప్పందం’- జనరల్ అగ్రిమెంట్ ఫర్ ట్రేడ్ అండ్ టారీఫ్- గాట్- ప్రపంచ వాణిజ్య సంస్థగా రూపాంతరం చెందింది. ఇదీ ప్రపంచీకరణకు నేపథ్యం. ఈ ప్రపంచీకరణ వ్యవస్థీకృతమయ్యేనాటికి ఈ మన ‘జిడిపి’ వాటా నాలుగున్నర శాతం కంటే ఎక్కువ. ‘నల్లడబ్బు’ నిక్షిప్తం అయినందువల్ల ఏర్పడిన వైపరీత్యం ఇది.
‘వాల్‌మార్ట్’ అనే అమెరికా సంస్థ మన దేశంలో చిల్లర వ్యాపార రంగంలోకి 2012 అక్టోబర్‌లో చొరబడింది. ఇలా చొరబడడానికి వీలుగా మన దేశంలోని ప్రముఖులకు, దళారీలకు, అధికార, అనధికారులకు ఆ సంస్థవారు భారీగా లంచాలను ఇచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు నిజమని అమెరికా కాంగ్రెస్ ఉభయ సభల ‘సంయుక్త సంఘం’ వారు ఆ తరువాత నిర్ధారించారు. ఈ లంచాల విలువ పనె్నండు వేల కోట్ల రూపాయలని ప్రచారమైంది. ‘కాదు, పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు మాత్రమేనని’ తరువాత నిగ్గుతేలినట్టు కూడా ప్రచారమైంది! ఎంతయినప్పటికీ ‘వాల్‌మార్ట్’ వంటి సంస్థలు చెల్లించిన లంచాలు నల్లడబ్బు రూపంలో మాత్రమే మన ఆర్థిక వ్యవస్థలోకి చొరబడినాయి! ఇలా లంచాలు చెల్లించడం ‘ప్రచారపు ఖర్చు’గా ‘బహుళ జాతీయ సంస్థలు’- మల్టీనేషనల్ కంపెనీస్- నమోదు చేస్తున్నాయి. అంటే ఇలా పెట్టిన ఖర్చును ‘తెల్లడబ్బు’గా భావించి ఆయా సంపన్న దేశాల వారు ఈ ఖర్చును పన్నునుంచి మినహాయిస్తున్నారు కూడ! అనేకానేక ప్రచార వ్యయం రూపంలో వందల వేల కోట్ల రూపాయలను ప్రవర్ధమాన దేశాలలో ఈ ‘బహుళజాతి సంస్థలు’ వెచ్చించడానికి ఆయా సంపన్న దేశాల ప్రభుత్వాలు అనుమతినిస్తున్నాయి. ఫలితంగా సంపన్న దేశాలు ‘ప్రచార వ్యయం’ - తెల్లడబ్బు-గా చిత్రీకరిస్తున్న సొమ్ము నిజానికి ప్రవర్ధమాన దేశాలలో ‘లంచం’- నల్లడబ్బుగా మారింది! అందువల్ల ‘వాల్‌మార్ట్’ను అమెరికా ప్రభుత్వం శిక్షించలేదు, అలాగే ‘తాత్రా’ దళారీలను బ్రిటన్ కానీ, ‘అగస్టా వెస్ట్‌లాండ్’ను ఇటలీ ప్రభుత్వం కానీ మన దేశంలోని ప్రముఖులకు ‘లంచం’ ఇచ్చిన నేరానికి శిక్షించడం లేదు! ‘తాత్రా’ సంస్థ మన సైన్యానికి వేలాది ట్రక్కులను అమ్మింది. ‘అగస్టా’ సంస్థ మనకు గగన శకటాలను అమ్మడానికి యత్నించింది!! పెద్దనోట్ల రద్దువల్ల నల్లడబ్బు నిర్మూలన జరగడం ఖాయం. కానీ, ఇది తాత్కాలికం! ‘నల్లడబ్బు’ ఉత్పత్తికి ప్రధాన మాధ్యమం ‘ప్రపంచీకరణ’ పేరుతో చొరబడుతున్న ‘బహుళజాతీయ వాణిజ్యసంస్థలు’! లంచాల రూపంలో ఉత్పత్తిఅయిన నల్లధనం ‘నోట్ల’ రూపంలో ఉండడం తాత్కాలికం! ఆ తరువాత ‘స్థిరాస్థి’గా మారుతోంది! ‘చరాస్థి’గా రూపొందింది! దశాబ్దులుగా ఈ కథ నడిచింది! నల్లధనం వెలికితీతకు మరిన్ని చర్యలు అవసరమంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలలో ఇలా స్థిరాస్థుల రూపంలోను, చరాస్థుల రూపంలోను ఉన్న ‘నల్లతనం’ కనిపిస్తోంది! కానీ ప్రపంచీకరణ కబంధ బంధం మాట..?

-హెబ్బార్ నాగేశ్వరరావు 2013hebbar@gmail.com