మెయన్ ఫీచర్

సంస్కారాన్ని ‘సంకరం’ చేస్తున్నదెవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శకలాన్ని సకలంగా భావించడం సృష్టిగత వాస్తవ స్థితికి విరుద్ధం, సమాజ స్థితి స్వభావానికి విరుద్ధం. శకలానికి ‘సకలం’లో సంబంధం లేదని భావించడం కూడ సహజ స్థితికి విపరీతం. ‘శకలం’- ‘సకలం’లో నిహితమై ఉంది. అసంఖ్యాక శకలాల సమష్టి సకలం.. పాశ్చాత్యుల భావజాలం మన నెత్తికెక్కిన తరువాత ఇదంతా తలకిందులైపోయింది. నడచిపోతున్న కథ ఇది! రాజకీయం ఒక ‘శకలం’ మాత్రమే! ‘క్రీడ’ మరో శకలం, ‘చలనచిత్ర పారవశ్యం’ మరో శకలం.. ఇలా మతం, భాష, కులం, గూడెం, ప్రాంతం, సంప్రదాయం, ఆచారం, ఆహారం, ఆహార్యం- ఇవన్నీ ఒక సమాజంలోని శకలాలు- ముక్కలు-! ఒక్క శకలం సమాజం కాదు! సకలం సంస్కృతి.. సంస్కృతి సమాజపు సమష్టి స్వభావం, సమగ్ర స్వరూపం. మతాదులు, రాజకీయాదులు సంస్కృతిలో భాగం. ఈ సంస్కృతి ప్రాతిపదికగా అనాదిగా మన దేశంలో జాతీయత వికసించింది! కాని సకలాన్ని వదలిపెట్టి శకలాన్ని సకలంగా భావించే జన సముదాయాలు.. జాతి చీలిపోతుండడం నడచిపోతున్న కథ.. కొంతమంది రాజకీయాలను తప్ప మరో విషయాన్ని చర్చించడం లేదు. బస్సులలో, రైళ్లలో, వీధుల కూడళ్లలో, పెళ్ళిళ్ల సమావేశాలలో,ప్రభాతకాలపు నడకలలో వీరి ‘నడత’ మొత్తం రాజకీయ చర్చా వేదిక.. మరో గుంపునకు సినిమాలు, నటులు,నటీమణులు జీవన సర్వస్వం.. ‘్ఫలానా నటికి పాప పుట్టిందట, అచ్చం వాళ్లమ్మలాగే ఉందట..’ దృశ్యమాధ్యమ స్రవంతుల- టెలివిజన్ ఛానెల్స్-లోని కార్యక్రమాలలో సగటున డెబ్బయి ఐదు శాతం చలనచిత్ర పారవశ్యాన్ని పంచిపెడుతున్నాయి. ‘శకలం’ సకలంగా భ్రాంతి గొలుపుతోంది, వాణిజ్య ‘ప్రపంచీకరణ’ వ్యవస్థ ఫలితం ఇది! ‘‘షో ఇవ్వడం..’’ చలనచిత్ర శకల సకలీకృత జీవనులకు సుపరిచితమైన పదజాలం! ఒక రచయిత ఒక దృశ్యమాధ్యమ స్రవంతిలో అటల్ బిహారీ వాజపేయి గురించి ప్రసంగించాడు! మరుసటి రోజున ఈ కార్యక్రమం గురించి ప్రశంసించడానికి ఆయన మేనల్లుడు ‘్ఫన్’ చేశాడు! ‘మామయ్యా.. నిన్న నువ్వు టీవీలో ఇచ్చిన ‘షో..’ చాలా బాగుంది!’ అని చెప్పాడు. సినీ ప్రపంచపు ‘షో’ వాజపేయిని ఆవహించింది! అన్నమాచార్య పాటను సైతం ఈ ‘అభినయం’ ఆవహించడం సరికొత్త పరిణామం!
కలియుగం నలబయి ఆరవ శతాబ్దిలో జీవించి తెలుగు పాటను అజరామరం చేసిన వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుడు. అసంఖ్యాక శకలాల సమాహారమైన సకలం సనాతన సంస్కృతి లేదా భారతీయ సంస్కృతి లేదా హైందవ సంస్కృతి! సంస్కృతి ఒక స్వభావం, ఒక జాతీయ స్వభావం. సాహిత్యం ఈ సంస్కృతి ప్రస్ఫుటించడానికి మాధ్యమమైన స్వరూపం! అక్షరాలుగా స్వరాలుగా రాగాలుగా గీతాలుగా సాహిత్యం ఆవిష్కృతం అవుతోంది, సంగీతంగా ప్రవహిస్తోంది! మరో విలక్షణ సాహిత్య ‘స్వరూపాన్ని’ సమకూర్చడం ద్వారా స్వభావాన్ని మళ్లీ మళ్లీ ప్రస్ఫుటింపచేసిన సంస్కృతి ప్రవర్ధకుడు తాళ్లపాక అన్నమాచార్యుడు! భారత భారతీ స్వరూపుడు, భరతమాత వరాల బిడ్డడు.. శ్రీ వేంకటేశ్వర భక్తిస్రవంతి- ఎస్‌విబిసి- దృశ్య మాధ్యమం వారు అన్నమయ్య తెలుగు పాటలను, సంస్కృత గీతాలను మళ్లీ పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. ‘అధికస్య అధికం బలం’..
శ్రీ వేంకటేశ్వర భక్తి స్రవంతిలో ‘అన్నమయ్య పాటకు పట్ట్భాషేకం’ ప్రసారం కావడం మొదలైనప్పుడు కొంతమంది వీక్షకులు ప్రధానంగా గృహిణులు- ‘వీళ్లందరూ సినిమా పాటల ‘షో’లలో పాడేవాళ్లు, అన్నమయ్య పాటలు కూడా వీళ్లే పాడేస్తారా?’ అని ఆశ్చర్యం ప్రకటించారు. ఎందుకు పాడకూడదు? అందరూ అన్నీ పాడవచ్చు! కానీ అన్నమయ్య పాటలను క్రీస్తుశకం 1980వ దశకం నుండి అంతకు పూర్వం నుండి పాడి ప్రచారం చేసినవారు సినిమా ప్రముఖులు కాదు! అందుకని అన్నమాచార్య గీతాలను ఇప్పుడు ‘అభినయం’ ఆవహించిందన్నది నిరాకరింపజాలని నిజం. ఎమ్‌ఎస్ సుబ్బులక్ష్మి పాడారు, నేదునూరి కృష్ణమూర్తి గానం చేశారు. శోభారాజు, బాలకృష్ణప్రసాద్ అన్నమయ్య గేయాలకు సజీవ విగ్రహాల వలె అలరారుతున్నారు. అన్నమయ్య పాటలను రాగిరేకుల నుండి విముక్తం చేసి జనం నాలుకలలోకి ఎక్కించిన ప్రాతఃస్మరణీయులు రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ, వేటూరి ప్రభాకరశాస్ర్తీ వంటివారు సినిమా ప్రముఖులు కాదు! తరువాత తరువాత పాడిన వారిలో సైతం కొందరు గొప్పగా పాడారు, కొందరు పదాలను సరిగా పలకలేకపోయారు! ఏమయినప్పటికీ ‘చెఱకునకు వంక పోతేమి? చెడునె తీపు?’’ అని శేషప్పకవి అన్నట్టుగా అలా పాడి ప్రచారం చేసిన వారి భక్తి గొప్పది! వీరెవ్వరూ సినీ ప్రముఖులు కాదు. సినిమాలలో ప్రసిద్ధి పొందిన ఎస్.జానకి, వాణీ జయరామ్, పి.సుశీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం వంటివారు కూడ అన్నమాచార్య పాటలు పాడారు. అందువల్ల ‘పట్ట్భాషేకం’లో వీళ్లందరూ పాడడం తప్పుకాదు, మరింత గొప్ప! కానీ గాయనీ గాయకులను- వారు ఆలపిస్తున్నప్పుడు- భక్తి పారవశ్యం సహజంగా ఆవహిస్తే బాగుంటుంది! కొందరు గాయనీ గాయకులు - భక్తిని అభినయిస్తున్నారు.. అరమోడ్పు కన్నులతో! అన్నమయ్య పాటను ‘సినిమా’ ఆవహించడం అంటే ఇదీ!!
ఇలా చలనచిత్ర అభినయం ఆవహించి చిన్నపిల్లలు ఇదే ‘పట్ట్భాషేకం’ కార్యక్రమంలో అత్యంత సహజంగా అద్భుతంగా పాడుతున్నారు, అజరామర అనుభూతిని సృష్టిస్తున్నారు. ‘శ్రీ వేంకటేశ్వర భక్తి స్రవంతి’లో అన్నమయ్య పాటకు పట్ట్భాషేకాన్ని వీక్షిస్తున్న వారిలో అత్యధికులు కేవలం చివరిలో ఈ బాలబాలికలు ఆలపిస్తున్న పాట కోసమే కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. ఈ ‘బుడుతల’ను అభినయం ఆవహించడం లేదు. అందువల్ల వారి గానంలో సహజత్వం సభలను తీరుతోంది! మరీ ఇద్దరు బాలలు- వీరిద్దరూ అన్నదమ్ములేమో- ముందు వరసలో చూడముచ్చటగా దృశ్యమానమవుతున్నారు. సినిమాలలో, నాటకాలలో భక్తుల పాత్రధారులు భక్తిని అభినయించాలి! కానీ ‘పట్ట్భాషేకం’ సినిమా కాదు, సహజమైన గానసభ. ఇక్కడ భక్తిని అభినయించడం ఎందుకు? ఎందుకంటే ‘శకలం’ సకలాన్ని దిగమింగుతోంది!
‘అన్నమయ్య పాటకు పట్ట్భాషేకం’ కార్యక్రమంలో వచ్చి కూర్చుంటున్న విశిష్ట అతిథులలో కొందరు విచిత్రమైన సలహాలను ఇచ్చిపోతున్నారు. నిర్వాహకులు సమకూర్చుతున్న రాగాలలో ఇమడకపోతే అన్నమయ్య పాటలోని కొన్ని పదాలను, కొన్ని అక్షరాలను తొలగించవచ్చునన్నది వీరి నిర్ధారణ! ఇలా తొలగించడానికి వీరికి అన్నమాచార్యుడు అధికారం ఇచ్చాడా? చాలా నిర్లక్ష్యంగా, తేలికగా కొన్ని ‘అక్షరాల’ను ‘పదాల’ను అన్నమయ్య గీతాల నుంచి తొలగించి తమ ‘రాగాల’లో ‘బాణీల’లో ఆ పాటలను ఇముడ్చుకోవచ్చునట! ఆ పాటకు తగిన రాగాన్ని సమకూర్చాలి, లేని రాగంలో ఇమడలేదని పాటలోని అక్షరాలను తీసివేయడం చలనచిత్ర ప్రభావం. పూర్వం కవి వ్రాసిన గీతానికి అనుగుణమైన రాగాన్ని ఎంచుకొని సంగీత దర్శకుడు స్వరపరిచేవాడట! ఇప్పుడు సినిమాలలో ముందుగానే పిచ్చి రాగాలను, చెత్త రాగాలను, పైశాచిక రాగాలను, కుప్పిగంతుల రాగాలను నిర్ధారించి, ఆ విచిత్రమైన చట్రంలో ఇమిడే విధంగా పాటలను వ్రాయిస్తున్నారట! ఛందస్సు, యతిప్రాస గణాది నియమాల వల్ల కవికి భావ వ్యక్తీకరణలో ఆటంకం కలుగుతోందని దశాబ్దులుగా కొందరు భాషాద్రోహులు, నకిలీ సాహిత్యవేత్తలు ‘ఊదర’గొడుతున్నారు. అలాంటప్పుడు సినీ గేయ రచయితలకు ఈ ‘రాగాల చట్రం’ భావ వ్యక్తీకరణకు అవరోధం కాదు! కాదట.. కానీ, ఈ చలనచిత్ర ‘రాగాల రోగాన్ని’ అన్నమయ్య పాటలకు ఎందుకు అంటించాలని విశిష్ట అతిథులు కొందరు ఎందుకని ఉవ్విళ్లూరుతున్నారు? సినిమా ప్రభావం జీవన రీతిని దిగమింగుతోంది!
నన్నయ భట్టారకుడు పంతొమ్మిది సంస్కృత భాషా అక్షరాలను తీసుకొని వచ్చి వాటితో తెలుగు భాషను ‘సంకరం’ చేశాడట! ‘పట్ట్భాషేకం’లో విశిష్ట అతిథి స్థానాన్ని అలంకరించిన పరుచూరి గోపాలకృష్ణ అనే చలనచిత్ర ప్రముఖుడు ఈ ‘సాంకర్యాన్ని’ ఆవిష్కరించి వెళ్లాడు! సంస్కృత భాషలోని అక్షరాలు తెలుగులో చేరడం వల్ల తెలుగు భాష సంకరమైపోయిందట! తెలుగును మనం ప్రేమిస్తున్నాము. కానీ సంస్కృత భాషను ద్వేషించడం తెలుగు సరస్వతికి ఆనందం కలిగించదు! పాలను చక్కెరతో సంకరం చేస్తున్నామా? సంపన్నం చేస్తున్నామా?? అన్ని భారతీయ భాషలకు జన్మనిచ్చిన వౌలిక భాష సంస్కృత భాష! ఈ దేశంలోని అన్ని భాషలు మాత్రమే కాదు తెలుగు తమిళం కన్నడం మరాఠీ మలయాళం, సింహళ భాషలు సహా- దేశం వెలుపల ఉన్న అనేక భాషలు కూడ సంస్కృత భాషకు రూపాంతరాలు! ఇది సనాతన- శాశ్వత- సత్యం! ‘జనని సమస్త భాషలకు సంస్కృత భాష ధరాతలంబుననన్..’ అన్నది విశ్వాసం కాదు, భాషా పరిణామక్రమాన్ని నిర్దేశించిన వాస్తవం! అందువల్ల తెలుగు భాష లేదా ఆంధ్ర భాష సంస్కృత భాష నుండి రూపాంతరం చెందిందన్నది సహజమైన చరిత్ర. సూర్యుని వెలుతురును చూడలేని గుడ్ల గూబలవలె బ్రిటన్ దురాక్రమణదారులు ఈ భాషా వాస్తవాన్ని చూడలేదు. అందువల్ల ‘ద్రవిడ’ భాషలు సంస్కృత భాష నుండి పుట్టలేదని బిషప్ కాల్డ్‌వెల్ వంటి భారత వ్యతిరేకులు సిద్ధాంతీకరించిపోయారు. అతార్కికమైన ఈ బ్రిటన్ జాతీయుల భాషా సిద్ధాంతాన్ని వారసత్వంగా గ్రహించినవారు మాత్రమే తెలుగును సంస్కృత భాష సంకరం చేసిందని దశాబ్దులుగా వాపోతున్నారు! కానీ పరుచూరి గోపాలకృష్ణ వంటి తార్కికుడు, మేధావి, భాషావేత్త, రచయిత కూడ ఇలా నన్నయ సంస్కృత అక్షరాలతో తెలుగును ‘సంకరం’ చేశాడనడమే విస్మయకరం! సంస్కృత భాష లేనిది భారతీయ సంస్కృతి లేదు, దేశ భాషలు లేవు, ప్రాంతీయ భాషా సాహిత్యం లేదు! తాళ్లపాక అన్నమాచార్యుడు గొప్ప సంస్కృత కవి కూడా..
ఆకాశంలోని గంగకు మందాకిని అని పేరు. మందాకినీ వియద్గంగా-! భూమికి దిగిన తరువాత అలకనందగా, భాగీరథిగా, హుగ్లీగా పేర్లు తెచ్చుకున్నది ఒకటే గంగానది. అందువల్ల ‘పంతొమ్మిది’ అక్షరాలు కలవక పూర్వం, కలిసిన తరువాత కూడ భాష ఒకటే! తెలుగు, ఆంధ్ర భాషలు పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు కాదు! బాల వ్యాకరణము సంజ్ఞా పరిచ్ఛేదములో- ‘... సంస్కృత సమంబులను కూడి తెలుగున వ్యవహరింపబడు..’ అని ఉన్నది. అంతేకాని ఈ ‘పంతొమ్మిది’ అక్షరాలు చేరిన తరువాత ‘తెలుగు’ ఆంధ్రమైందని చిన్నయ సూరి చెప్పలేదు! పరుచూరి గోపాలకృష్ణ ‘కనిపెట్టాడు!’. సంస్కృతం నుండి ఈ అక్షరాలను నన్నయ క్రీస్తుశకం పదకొండవ శతాబ్దిలో తెలుగులో చేర్చాడనడం వక్రీకరణకు పరాకాష్ఠ. నన్నయకు పూర్వమే ఈ ‘అక్షరాలు’ శతాబ్దులుగా చేరి తెలుగును ‘సుసంపన్నం’ చేశాయి, ‘సంకరం’ చేయలేదు! ‘సంకరం’ చేశాడని ప్రయోగించడం సంస్కారమా? పరుచూరి వారు ఇలా సంస్కృత భాషకు, తెలుగు భాషకు మధ్య ‘వైరుధ్యాన్ని’ ఆవిష్కరించిన వెంటనే ‘అన్నమయ్య పాటకు పట్ట్భాషేకం’ కార్యక్రమంలోని ఒక గాయకుడు ‘నందకధర! నందగోపనందన!’ అన్న సంస్కృత గీతాన్ని మధురాతి మధురంగా ఆలపించాడు!! *

-హెబ్బార్ నాగేశ్వరరావు 013hebbar@gmail.com