మెయన్ ఫీచర్

‘అఖండ’ ధ్యాసకు మళ్లీ ‘శ్వాస’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్య సుప్రభాత
కరములు శ్రుతి చేస్తున్నవి,
స్వజాతీయ జనజీవన
స్వరములు వినిపిస్తున్నవి,
తిరిగి తిరిగి జగతి కనులు
‘తూర్పు’వైపు చూస్తున్నవి,
అరుణ తరుణ కిరణమ్ములు
ధరణి చరిత వ్రాస్తున్నవి...
.. ‘అరుణిమ’ అనాదిగా భారత జాతీయ స్వభావం, ‘అరుణిమ’ లేదా కాషాయ వర్ణం త్యాగానికి ప్రతీక, ప్రగతికి పతాక. ఆకాశం ‘అరుణిమ’ను పులుముకొనడం వెలుగుల ప్రగతి ప్రస్థాన క్రమానికి శుభారంభం! ఇది విశ్వ వ్యవస్థలో నిహితమై ఉన్న నిరంతర శ్రమజీవన యోగం. అనాదిగా, అనంతంగా భూమి క్షణం ఆగకుండా శ్రమజీవన పరిభ్రమణాన్ని సాగిస్తోంది! ‘‘సాగిన శ్రమ సాధించిన భోగం సంస్కృతి యోగం..’’- ఇదీ భారతీయుల కర్మయోగం! యోగ దినోత్సవాన్ని ప్రపంచ సంప్రదాయంగా మార్చడం నరేంద్ర మోదీ ప్రధానమంత్రిత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సాధించిన వౌలిక విజయం. యోగం స్వచ్ఛతకు మాధ్యమం.. శారీరక, మానసిక, భౌతిక, బౌద్ధిక స్వచ్ఛత సనాతన హైందవ జాతీయ జన జీవనం.. ‘స్వచ్ఛత’ భంగపడడం అపవాదం! ఈ ‘అపవాదం’ శతాబ్దుల విదేశీయుల దురాక్రమణ ఫలితం! భౌతిక స్వచ్ఛతకు ‘అపవాదం’ కాలుష్యం, బౌద్ధిక స్వచ్ఛతకు అపవాదం- ఎక్సెప్షన్- అవినీతి! కాలుష్య రహితమైన నదీ నదాల స్వచ్ఛ్భారతం భౌతిక యోగం, అవినీతి అంటని పరిపాలన భౌద్ధిక యోగం.. ఇదీ అఖండ మండలాకారం! ఈ ‘అఖండ సమగ్రత’కు మరో ఆరంభం నరేంద్ర మోదీ మూడేళ్ల కర్మయోగం...
అఖండ భారతం ముక్కలు కావడం విదేశీయ దురాక్రమణ ఫలితంగా స్వజాతీయ సమగ్రతకు సంభవించిన ప్రధానమైన ‘అపవాదం’.. ‘‘అఖండ భారత ధ్యాస’’ మరోసారి అంకురించడం నరేంద్ర మోదీ పాలన ప్రారంభానికి సమాంతరంగా సంభవించిన మహా పరిణామం. భారత ప్రధాని పదవీ స్వీకార సమావేశానికి ‘దక్షిణ ఆసియా’గా చెలామణి అవుతున్న ప్రాంతంలోని దేశాల ప్రభుత్వాధినేతలు హాజరుకావడం ‘అఖండ భారత’ ధ్యాసను కలిగించిన మహా పరిణామం! ఈ ‘తథాకథిత’- సోకాల్డ్- దక్షిణ ఆసియా ఒకప్పటి అఖండ భారతదేశంలో భాగం, ఇప్పుడు చైనా దురాక్రమణకు గురి అయి ఉన్న ‘టిబెట్’ అన్న ‘త్రివిష్టపం’ కూడా రెండు వేల ఐదు వందల ఏళ్లకు పూర్వం ‘అఖండ భారతదేశం’లో భాగం. రెండు వేల ఐదు వందల ఏళ్లుగా స్వతంత్ర దేశంగా మనుగడ సాగించిన టిబెట్‌ను కలియుగం 5061వ సంవత్సరం - క్రీస్తుశకం 1959లో చైనా దురాక్రమించింది. అందువల్ల మూడేళ్ల క్రితం నరేంద్ర మోదీ ప్రధానమంత్రి బాధ్యతలను స్వీకరించిన సందర్భంగా జరిగిన ఉత్సవానికి ‘దక్షిణాసియా’ దేశాల ప్రభుత్వ అధినేతలు తరలిరావడం అఖండ భారత సాంస్కృతిక భౌగోళిక ధ్యాస పునరుద్ధరణకు దోహదకరం. అనివార్య పరిస్థితుల వల్ల బంగ్లాదేశ్ ప్రభుత్వ అధినేత రాలేకపోయినప్పటికీ ఆ దేశం ప్రతినిధి హాజరయ్యాడు. ఇలా దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య- ‘సార్క్’- దేశాల ప్రభుత్వాధినేతలను ఆహ్వానించడమే ఊహించని విధాన విప్లవం.. ‘ఇరుగుపొరుగు దేశాలకు ప్రాధాన్యం’- నైబర్స్ ఫస్ట్- అన్న వినూతన దౌత్యం అఖండ భారత సాంస్కృతిక ఏకత్వం ప్రాతిపదికగా రూపుదిద్దుకుంది. నేపాల్, భూటాన్, బర్మా, తూర్పు వంగ - బంగ్లాదేశ్- సింహళము- శ్రీలంక- మోలాద్వీపాలు- మాల్‌దీవులు- పాకిస్తాన్, గాంధార, యోన వంటి వాయువ్య రాజ్యాలు- అప్ఘానిస్తాన్- ఒకప్పుడు ‘సమీకృత భారత రాజ్యాంగ వ్యవస్థ’లో భాగమై ఉండేవి! పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ‘అఖండ భారత్’ నుంచి విడిపోయాయన్న ధ్యాస డెబ్భై ఏళ్లుగా చెరిగిపోలేదు, కానీ మిగిలిన దేశాలు అఖండ భారత్ నుంచి విడిపోయిన ‘్ధ్యస’ కూడా మనకు మిగలలేదు. ఈ ‘విస్తృత ధ్యాస’ మరోసారి అంకురించడానికి నరేంద్ర మోదీ ‘ఇరుగుపొరుగు’ను అహ్వానించడం దోహదం చేసింది!
పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ప్రచ్ఛన్న జిహాదీ బీభత్సకారుడు. 2013లో అతగాడు మళ్లీ ప్రధాని అయిన నాటినుంచి పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్సం ప్రేటేగడం మొదలైంది. నవాజ్ షరీఫ్ ‘మనుగడ’ ‘తాను కరుడుకట్టిన భారత వ్యతిరేకిన’ని ఎప్పటికప్పుడు నిరూపించుకొనడంపై ఆధారపడి ఉంది. భారత వ్యతిరేకత ఏ మాత్రం సడలినట్టు అనుమానం కలిగినప్పటికీ సైనిక దళాలవారు అతగాడిని అధికారం నుండి తొలగిస్తారు. అందువల్ల జిహాదీ బీభత్సకారులను ప్రభుత్వం ఉసిగొల్పే విధానం- స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజమ్- నవాజ్ షరీఫ్ పాలనలో ప్రభుత్వమే బీభత్స కృత్యాలను నిర్వహించే విధానం- స్టేట్ టెర్రరిజమ్-గా మారిపోయింది. 2013లో హేమరాజ్ అనే మన సైనికుణ్ని దొంగచాటుగా హత్యచేసిన పాకిస్తానీ సైనికులు ఆయన మృతదేహం నుండి తలను ఖండించి తమ దేశానికి తీసుకెళ్లి ‘విజయచిహ్నం’గా ప్రదర్శించారు. అప్పటి నుంచి నాలుగేళ్లుగా పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్సం కొనసాగుతోంది. అయినప్పటికీ 2014 మే 26న నవాజ్ షరీఫ్‌ను మన దేశానికి రప్పించడం మోదీ విప్లవ దౌత్యం..
‘‘చచ్చిన జాతి కాదు మరి
చావదు వేయి యుగాలకైన, వె
న్నిచ్చిన జాతికాదు, పడగెత్తు
విరోధిని పట్టి కౌగిటన్
గ్రుచ్చిన జాతిరా ఇది..’’
- అని మహాకవి కరుణశ్రీ మన జాతి గురించి వివరించి ఉన్నాడు! జిహాదీ ఉగ్రవాదం సాగిస్తుండిన ప్రభుత్వాధినేతను సైతం మన ప్రభుత్వం ప్రమాణ స్వీకార ఉత్సవానికి పిలిచింది! అలా వచ్చిన నవాజ్ షరీఫ్ తన స్వభావం మార్చుకోకపోవడం చారిత్రక పునరావృత్తి. 2014మే 26 తరువాత కూడా పాకిస్తాన్ సైనికులు మృతదేహాలను ఖండఖండాలుగా నరకడం, తలలను ఖండించడం వంటి బీభత్స పైశాచిక చర్యలను ఇప్పటివరకూ సాగిస్తూనే ఉన్నారు. ‘‘దక్షిణ ఆసియా దేశాల’’ ఉమ్మడి మైత్రికి ఈ పాకిస్తానీ బీభత్సం ఒక్కటే అపవాదం- ఎక్సెప్షన్! చైనా చంకనెక్కి మన దేశాన్ని వెక్కిరించిన నేపాల్ ప్రస్తుత ప్రధాని పుష్పల్ మల్‌దహల్ ప్రచండ కూడా మన దేశం పట్ల తమ దేశం ప్రజలచే గత యుగాల మైత్రిని పరిగణించవలసి వస్తోంది! దక్షిణ ఆసియా ఉపగ్రహ పథకంలో నేపాల్ చేరడం ఇందుకు నిదర్శనం! (ప్రచండ బుధవారం ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారట) పాకిస్తాన్ ఈ పథకాన్ని తిరస్కరించి మిగిలిన ‘సార్క్’ దేశాలన్నింటికీ దూరమైంది! ఇది కూడా అపవాదం! మిగిలిన ‘సార్క్’ దేశాలతో మన బంధం బలపడింది. ఉమ్మడి ఉపగ్రహం ‘అఖండ భారత స్ఫూర్తి’కి భూ సమాంతర కక్ష్యలో తిరుగుతున్న విజయ చిహ్నం! మే నెల ఐదవ తేదీన అఖండ భారత స్ఫూర్తి అంతరిక్షమంటింది.
క్రీస్తుశకం 1897 జనవరి 15వ తేదీన వివేకానంద స్వామి మాతృదేశానికి తిరిగివచ్చాడు. 1893 సెప్టెంబర్ పదకొండవ తేదీన అమెరికాలోని చికాగో నగరంలో ఆరంభమైన ‘సర్వమత సభ’లో వివేకానందుడు అఖండ భారత దేశానికి ప్రాతినిధ్యం వహించాడు! ఈ అఖండ భారతదేశం కొలంబో నుంచి కైలాసం వరకూ విస్తరించి ఉందన్న వాస్తవానికి వివేకానందుని ‘అమెరికా-ఐరోపా’ పర్యటన చారిత్రిక సాక్ష్యం! మహాకవి గుఱ్ఱం జాషువా దర్శించినట్టు ‘‘.. చక్కదనమున్ చిన్నారి లేబ్రాయమున్ మెరయన్ హైందవ వేద సారమును గంభీరోక్తుల్..’’ చికాగో నగరంపై పాశ్చాత్య సీమలపై కురిపించిన ‘మునిచంద్రుడు’ వివేకానందుడు. మూడున్నర ఏళ్లు భారత భూమికి దూరంగా గడిపిన వివేకానందుడు ‘కొలంబో’ ఓడరేవులో దిగగానే తల్లి ఒడిలోకి చాలాకాలం తరువాత చేరుకున్న చిన్ని శిశువువలె కేరింతలు కొట్టడం చరిత్ర! కొలంబో తీరంలోని మట్టిని ఒళ్లంతా పులుముకున్న వివేకానందుడు మాతృభూమిపై పొర్లాడు, దొర్లాడు, హర్షపూరిత హృదయంతో వర్షపూరిత నయన ద్వయంతో పరవశంతో పరుగులు తీశాడు. ఇదంతా మాతృదేశాన్ని మళ్లీ చూశానన్న ఆనందం! కొలంబో నగరం ‘సింహళం’లో ఉంది. ‘సింహళం’ భరతభూమిలో ఉండేది. అందుకే సింహళంలో అడుగుపెట్టిన ‘స్వామి’ భరతమాత పాదాలకు ప్రణమిల్లాడు. ‘సింహళం’ భారతదేశపు దక్షిణాగ్రం! ఒకప్పుడు ప్రధాన భారత భూభాగంలో కలిసి ఉండిన ‘సింహళం’, లక్షల ఏళ్ల ‘ప్రాదేశిక చలనం’- కాంటినెంటల్ డ్రిఫ్ట్- కారణంగా విడివడింది, యాభై కిలోమీటర్లు దక్షిణంగా జరిగింది! సింహళ ద్వీపాన్ని బ్రిటన్ దురాక్రమణకారులు ‘సిలోన్’గా మార్చారు, పేరు మార్చి భారత ఖండం నుంచి రాజకీయంగా విడగొట్టారు! బ్రిటన్ యుక్తి ‘సిలోన్’ స్వతంత్ర దేశంగా అవతరించడం అఖండ భారత సమగ్రతను భంగపరచిన చారిత్రిక విపరిణామం! ‘సిలోన్’ శ్రీలంకగా మారడం ఇటీవలి పరిణామం! సింహళ భాష సంస్కృత భాషకు రూపాంతరం, సింహళ అస్తిత్వం భారతీయ సాంస్కృతిక జాతీయ భూమికపై వికసించింది! అనాదిగా భారతీయుల సాంస్కృతిక స్ఫూర్తి కేంద్రాలన్నీ భారత సీమలలోనే నెలకొన్నాయి, సీమలకు వెలుపల లేవు. ‘శక్తిపీఠాల’లో ఒకటి సింహళంలో నెలకొనడం ఈ అనాది అఖండత్వానికి ఒక సాక్ష్యం.. ‘‘లంకాయాం శాంకరీదేవి!’’
మహాభారత యుద్ధం కలియుగ ఆరంభానికి ముప్ఫయి ఆరేళ్ళకు పూర్వం జరిగింది. కలియుగంలో ఇది ఐదు వేల నూట పంతొమ్మిదవ సంవత్సరం! మహాభారత యుద్ధంలో యదుకుల కృష్ణుడు పాండవుల పక్షం వహించాడు! కృష్ణుని సోదరుడు బలరాముడు పాండవుల పక్షాన కాని, కౌరవుల పక్షాన కానీ నిలువలేదు! తాటస్థ్యం వహించాడు! యుద్ధంలో పాల్గొనని మరో రాజప్రముఖుడు ఉన్నాడు. ఆయన పేరు రూపతి. రూపతి ఉత్తర దిశగా వెళ్లాడు. మానస సరోవరంలో మునిగాడు, కైలాస పర్వతం చుట్టూ పరిక్రమించాడు. అక్కడే తపస్సు చేశాడు! అది త్రివిష్టప ప్రాంతం! భారతీయుల స్ఫూర్తికేంద్రాలు భారతదేశం వెలుపల లేవు. కైలాసం, మానస సరోవరం భారతీయుల స్పూర్తి కేంద్రాలు, సనాతన చారిత్రక స్థలాలు.. త్రివిష్టపం ఆ రోజులలో అనేక వన రాజ్యాలుగా విడివడి ఉండేది! ఈ వన రాజ్యాల ప్రతినిధులు, ప్రభువులు, ప్రజలు ఏకగ్రీవంగా ‘రూపతి’ని తమ అధినాయకుడుగా ఎంచుకున్నారు! టిబెట్ అప్పటికే అఖండ భారతంలో భాగం. ‘రూపతి’ అధినేత కావడం ఈ వాస్తవానికి మరో ధ్రువీకరణ! త్రివిష్టప భాష సంస్కృత భాషకు రూపాంతరం. ఇది మరో ‘బోటీ’ భాష! దరదస్థాన్ నుంచి అరుణాచల్ వరకూ వివిధ రకాల ‘బోటీ’ భాషలను మాట్లాడుతున్నారు. టిబెట్ భాష సహా అన్ని ‘బోటీ’ భాషలకు మూల లిపి ‘శారద’.. ఈ శారద లిపి ‘బ్రాహ్మీ’ లిపి రూపాంతరం.. ‘బ్రాహ్మీ’ అఖండ భారత భాషలన్నింటికీ మూల లిపి..
‘సార్క్’ ఇలా ప్రాచీన అఖండ భారత స్వరూపానికి ఆధునిక దర్పణం! ‘ఇరుగు పొరుగు మైత్రి’ని పెంపొందిస్తున్న మోదీ ప్రభుత్వం ఇలా అఖండ భారత ధ్యాసను విస్తరింపచేస్తోంది!
‘క్షత ధరిత్రి’ చరితలోన
శిథిల శిశిరమంతరించి
సర్వ సమగ్రపు శోభల
ఆమని వికసిస్తున్నది!
‘వేకువ’ లేదని పలికిన
చీకటికిది చివరి క్షణం
అఖండ భరత ఖండ స్ఫూర్తి
విస్తరించె దినం దినం!! *

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 99510 38352